సెప్టెంబర్ 5, 2017 న
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా
గురువుల పాదముద్రలు!
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక (05-09-2017)
మూడేళ్ల
వయసున్నప్పుడు నా చదువు ప్రారంభమైంది. మొదట, మాకు సమీప బంధువైన వనం ఎర్ర శేషయ్య గారి “కానీక”
(ఖాణ్ గీ) బడి లో చేర్పించారు నన్ను.
ఉదయాన్నే బడికి పంపేవారు. ఆ బడిలోనే శేషయ్య మాస్టారు “ఓనమాలు”, “వంట్లు”, “ఎక్కాలు”, “కూడికలు-తీసివేతలు”, “తెలుగు వారాలు”, “తెలుగు మాసాలు”,
“తెలుగు సంవత్సరాలు” లాంటివి నేర్పారు. నక్షత్రాలు,
రాశులు, రుతువులు కూడా
నేర్పించారు.
చాలావరకు కంఠస్థం చేయించేవారు. “పెద్ద బాల శిక్ష”
లోని వివిధాంశాలను, “విశ్వక్సేనుడు”, “జంబీర బీజం”,
“మందార దామం” లాంటి కఠిన పదాలను ఎలా
పలకాలో నేర్చేవారు శేషయ్య గారు. శేషయ్య గారి మొదటి భార్య
కుమారుడు, హిందీ మాస్టారు వనం రాందాస్ రావు దగ్గర ఒకటి-రెండు హిందీ ముక్కలు కూడా నేర్చుకున్నట్లు గుర్తు.
ఖాన్గీ బడి తరువాత స్థానికంగా మా గ్రామంలో
వున్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు నాన్న. ఆ పాఠశాల అప్పట్లో వూళ్లోని కొఠాయి
దగ్గర ఒక పూరి పాకలో వుండేది. ఆ తరువాత గ్రామంలో
కొత్త పాఠశాల భవనం తయారైంది. నేను ఆ
పాఠశాలలో చేరినప్పుడు అక్కడ మొదట్లో ఒకే ఉపాధ్యాయుడు పని చేసేవారు. ఆయన పేరు కేశిరాజు సత్యనారాయణ రావు. కొద్ది కాలానికి దత్తయ్య చేరారు. సత్యనారాయణ రావుని "పాత పంతులు గారు" అని, దత్తయ్యని "కొత్త పంతులు గారు" అని మా గ్రామంలో చిన్నా-పెద్దా అందరూ సంబోధించే వారు. కొంతకాలానికి మరో ఉపాధ్యాయుడు కృష్ణమూర్తి చేరారు. మరి కొంతకాలానికి తెలుగు మాస్టారు అయ్యదేవర రామచంద్రరావు
కూడా చేరారు. దత్తయ్య సారు, అయ్యదేవర రామచంద్రరావు సారు
నేను హైస్కూల్ లో చదివేటప్పుడు అక్కడ కూడా వున్నారు. ఐదో తరగతి వరకు ఆ పాఠశాలలోనే
చదువుకుని, తరువాత అక్కడ పై తరగతులు ఇంకా ప్రారంభించనందున
ఖమ్మం పట్టణంలో రికాబ్-బజార్ పాఠశాలలో చేరాను. అక్కడే ఆరవ తరగతి నుంచి హెచ్.ఎస్.సీ వరకు ఆరు సంవత్సరాల పాటు చదువుకున్నాను.
రికాబ్-బజార్ పాఠశాల విషయాలు సినిమా రీళ్లలాగా
గుర్తుకు వస్తుంటాయి అప్పుడప్పుడూ. మాకు చరిత్ర-భూగోళం సబ్జెక్ట్ బోధించే కొండలరావు సార్ చాలా
స్ట్రిక్ట్. ఈనాడు చెప్పిన పాఠాన్ని మర్నాడు అప్ప చెప్పమనేవాడు. చెప్పని విద్యార్థులను తీవ్రంగా దండించేవాడు. చేయిపై
"పేను బెత్తం"
తో కొట్టడంతో సహా, ఒక్కోసారి "కోదండం" కూడా వేయించేవాడు. ఆయన మనసు మాత్రం కడు మెత్తన.
రాజ్ పుట్స్ గురించి పాఠం చెప్తూ, వాళ్లు తమ మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టేవారని అనేవారు. మరో మాస్టారు
తెలుగు బోధించే డి. సీతారామయ్య మాస్టారు. ఆయన అహర్నిశలూ పచ్చి పోకచెక్కలు తింటుండేవారు. ఆయనను అందరూ "పోకచెక్కల
పరంధామయ్య"
అని పిలిచేవారు. ఆయనే మాతో నాటకాలు వేయించే వారు.
వాటిల్లో ఒకటి నాకింకా గుర్తుంది. అది, "గయోపాఖ్యానం" అనే పౌరాణిక
నాటకం. అందులో నేను నేను
అర్జునుడి పాత్ర పోషించాను.
మరో మాస్టారు రాజయ్య గారు. ఆయన హిందీ బోధించేవాడు. ఒక్కోసారి చరిత్ర-భూగోళం కూడా చెప్పేవాడు. ఆయన ప్రతిరోజు ఒకే రకమైన లాల్చీ, ధోవతి ధరించేవాడు. ఆయనకు ఒకే డ్రెస్ వుందా అన్న అనుమానం వచ్చేది. మరో హిందీ మాస్టారు చిన్ని రామారావు గారు చక్కగా
బోధించేవారు. ఇక రసూల్ సార్ సంగతి సరే సరి. ఆయన బోధించని సబ్జెక్ట్ లేదు. ఆయన చదువుకుంది కేవలం హెచ్.ఎస్.సీ వరకు మాత్రమే. ఎప్పుడూ షేర్వాణి ధరించేవాడు. లెక్కలు బోధిస్తుంటే అరటి పండు వలిచి నోట్లో
పెట్టినట్లుండేది. ఆయనే మా ఇంగ్లీష్ సార్ కూడా. ఇక సైన్స్ మాస్టారు వీరభద్రం సార్ కు ఎప్పుడూ ముక్కుమీద
కోపమే. ఆయన నవ్వగా చూడాలని మాకుండేది. ఆ కోరిక ఒకే ఒక్కసారి ఎలాగో నెరవేరింది. అందరిలోకి తెలివైన సార్ వెంకటరామిరెడ్డి గారు. ఆయన ఎంతో సరళంగా లెక్కల క్లాస్ తీసుకునేవాడు. కాకపోతే బూతు మాటలు ఆయన సొంతం. అందరిలోకి చక్కగా ఆంగ్లాన్ని మాతృభాషంత సులభంగా బోధించిన మాస్టారు డి. వెంకటేశ్వర్లు సార్. కాంజుగేషన్ ఆఫ్ ద వర్బ్ బ్రహ్మాండంగా చెప్పేవాడు. బహుశా ఇవ్వాళ నేను అంతో-ఇంతో మంచిగా ఇంగ్లీషులో రాయడానికి కారణం ఆయనే!
హెచ్.ఎస్.సీ పరీక్షల్లో హయ్యర్ సెకండ్ క్లాస్ లో పాసవడమే
కాకుండా లెక్కల్లో, సైన్స్
సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించాను. ఎం.పీ.సీ (లెక్కలు, భౌతిక
శాస్త్రం, రసాయన శాస్త్రం) గ్రూపు తీసుకుని ఖమ్మం ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాలలో ప్రీ-యూనివర్సిటీ (పి.యు.సి) కోర్సులో చేరాను.
ఆ మూడు సబ్జెక్టులే కాకుండా, ఇంగ్లీష్, తెలుగు, జనరల్ స్టడీస్ సబ్జెక్టులు కూడా వుండేవి అప్పట్లో. లెక్కలు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం సబ్జెక్టులను ఐచ్చికం (ఆప్షనల్) అని, మిగతా
వాటిని కంపల్‌సరీ అని పిలిచే వాళ్లం. ఇంగ్లీష్, తెలుగు, జనరల్ స్టడీస్ అన్ని గ్రూపులకు అంటే-ఎం.పీ.సీ, బై పీసీ (జీవ శాస్త్రం, భౌతిక-రసాయన
శాస్త్రాలు), కామర్స్ (ఎకనామిక్స్, కామర్స్, అకౌంటింగ్), సివిక్స్ (చరిత్ర, భూగోళం, సాంఘికం)-కలిపి చెప్పేవారు. భౌతిక, రసాయన
శాస్త్రాల క్లాసులు ఎం.పీ.సీ, బై పీసీ గ్రూపులకు కలిపి తీసుకునేవారు. లెక్కల క్లాస్ ప్రత్యేకంగా ఎం.పీ.సీ గ్రూపుకు మాత్రమే వుండేది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ ప్రోజ్, పోయెట్రీ, గ్రామర్
విభాగాలుగా వుండేవి. సత్యనాధం లెక్చరర్, సుబ్బారావు ట్యూటర్ (లెక్చరర్ కంటే ఒక గ్రేడ్ తక్కువ) మాకు ఇంగ్లీష్ చాలా
చక్కగా బోధించేవారు. వారు
చెప్పిన వాటిలో ఇంకా నాకు గుర్తున్నవి.... "ఆన్ ఫర్ గెట్టింగ్", "ఆన్ సీయింగ్ పీపుల్ ఆఫ్", "ఆన్ అదర్ పీపుల్ జాబ్స్" లాంటివి చాలా ఆసక్తికరంగా వుండేవి. అలానే విలియం వర్డ్స్ వర్త్, షేక్స్ పియర్ పోయెట్రీ కూడా ఆకట్టుకునేది.
తెలుగును ఎం. హనుమంతరావు సార్ చెప్పేవారు. ఆయన బోధించిన మనుచరిత్రలోని ఒక పద్యం ఇంకా గుర్తుంది. "అటజనికాంచె భూమిసురు డంబరచుంబి, శిర స్సర జ్ఝరీ పటల, ముహుర్ముహు ర్లుఠ, దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల, పరిఫుల్ల కలాప కలాపిజాలమున్, కటకచరత్ కరేణు కర కంపిత సాలము శీతశైలమున్". ఇక జనరల్ స్టడీస్ క్లాసులను జగన్మోహన రావు, వై. వి. రెడ్డి ఎంతో ఆహ్లాదకరంగా తీసుకునేవారు. వర్తమాన సంఘటనలను పాఠ్యాంశాలకు అనుసంధానం చేసి ఆసక్తికరంగా
చెప్పేవారు. ఎన్. వి. సాంబశివరావు సార్ లెక్కల సబ్జెక్ట్ అరటిపండు
వలిచి నోట్లో పెట్టినట్టు బోధించేవారు. భౌతిక శాస్త్రం సబ్జెక్ట్ ఎ. విస్సన్న పంతులు, రసాయన శాస్త్రం ఆదిశేషా రెడ్డి బోధించేవారు. భౌతిక శాస్త్రానికి చక్రపాణి, రసాయన శాస్త్రానికి సి. ఆంజనేయులు డిమాన్ స్ట్రేటర్లుగా ప్రయోగశాలల్లో బోధించడానికి
వుండేవారు. పీయుసీ థర్డ్ క్లాస్ లో పాసయ్యాను. అదే ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరంలో ఎం.పీ.సీ గ్రూప్ తీసుకుని చేరాను.
డిగ్రీలో ఇంగ్లీష్ పాఠ్యాంశాలను కె. వై. ఎల్. నరసింహారావు, వరదరాజన్, జడ్డి, సత్యనాధం బోధించేవారు. తెలుగు ఎం. హనుమంతరావు, యడవల్లి ఆదినారాయణ చెప్పేవారు. నాకు గుర్తున్నంతవరకు "ఆంధ్ర మహాభారతోపన్యాసాలు" సబ్జెక్ట్ గా వుండేది తెలుగులో. బమ్మెర పోతన నాటకం కూడా వుండేది. జనరల్ స్టడీస్ సబ్జెక్టును జగన్మోహన్ రావు, వై. వి. రెడ్డి, సుబ్రహ్మణ్యం
చెప్పేవారు. భౌతిక శాస్త్రం ఎమ్మెస్ ఆచారి, ఎ. విస్సన్న పంతులు బోధించేవారు. లెక్కలు కె. కోదండరాం రావు, రసాయన శాస్త్రాన్ని జి. వి. నరసింహారావు (ఆర్గానిక్), ఆదిశేషా
రెడ్డి (ఇన్ ఆర్గానిక్) చెప్పేవారు. డిమాన్ స్తేటర్లుగా చక్రపాణి, ఆంజనేయులు డిగ్రీలో కూడా వుండేవారు.
ఖమ్మంలో బిఎస్సీ డిగ్రీ మొదటి ఏడాది చదువు
పూర్తి చేసుకున్న తరువాత, మిగతా రెండేళ్లు హైదరాబాద్ న్యూసైన్స్ కాలేజీలో
పూర్తిచేసాను. ఆ కళాశాలను జులై 17, 1956 న, నూతన విద్యా సమితి యాజమాన్యం కింద, సి. సుదర్శన్, జి.ఎస్. మెల్కోటే స్థాపించారు. ఆ కాలేజీలో అత్యంత నైపుణ్యం కల మేధావులైన
విద్యావేత్తలెందరో పని చేసేవారు. న్యూ సైన్స్ కాలేజీ,
బీ ఎస్సీ (ఎం.పీ.సీ) క్లాస్‍లో 150
మందికి పైగా విద్యార్థులుండే వారు. ఎప్పుడూ,
సందడిగా, సరదాగా, గలగలా పారే సెలయేరులా వుండేది మా క్లాస్. లెక్చరర్ల విషయానికొస్తే, బహుశా, అంత నైపుణ్యం కల
అధ్యాపకులు, మరే కాలేజీలోను వుండరంటే అతిశయోక్తి కాదేమో! తెలుగు బోధించడానికి ఇద్దరుండేవారు. ఒకరి పేరు "మంజు శ్రీ"...మరొకరి పేరు "అరిపిరాల విశ్వం".
మంజుశ్రీ అసలు పేరు డాక్టర్ అక్కిరాజు రమాపతి రావు.
మాకు తెలుగు పాఠ్య పుస్తకంగా "ఆంధ్ర మహాభారతోపన్యాసాలు", నాన్-డిటేల్‍గా "పురుషోత్తముడు", నాటకంగా "హాలికుడు"
వుండేవి. ఆంధ్ర మహాభారతోపన్యాసాలు
లో, ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్న సందర్భంలో ఆయనను ఆక్షేపిస్తూ శిశుపాలుడు పద్య
రూపంలో అన్న "అవనీ నాధు లనేకు లుండగ...”
అన్న పదాలు ఇప్పటికీ
గుర్తుండే విధంగా బోధించారు.
ఇంగ్లీష్ లెక్చరర్లుగా షమీం మేడం, వి. వి. చారి,
వుండేవారు. మరో ఇద్దరి పేర్లు...వై. ఆర్. అయ్యంగార్, కుమారి శ్యామల. పాఠ్య పుస్తకంవాచకంగా ఇ.ఎఫ్. డాడ్ సంపాదకీయంలోని వ్యాసాల సంకలనం వుండేది. ఎ. జి. గార్డినర్ రాసిన వ్యాసం ఒకటుంది. ఇ. ఎం. ఫార్ స్టర్ రాసిన "పాసేజ్ టు ఇండియా"
నాన్-డిటేల్ గా వుండేది. ఇంగ్లీష్ పోయెట్రీలో కొన్ని పాఠాలు ఇప్పటికీ గుర్తుండడానికి కారణం సార్లు
చెప్పిన విధానమే! జనరల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ను నాందేడ్కర్, సుబ్రహ్మణ్యం
సార్లు చెప్పేవారు.
చాలా ఇంటరెస్టింగ్ గా వుండేదా క్లాస్.
ఆప్షనల్ సబ్జెక్టులైన లెక్కలు, భౌతిక,
రసాయన శాస్త్రాలు చెప్పే లెక్చరర్లు ఆయా విషయాలను అత్యంత
ఆసక్తికరంగా బోధించే వారు. లెక్కల సబ్జెక్టులో ఒకటి "బీజ గణితం", రెండోది "రేఖా గణితం", మూడోది "త్రికోణమితి". బీజ గణితాన్ని షఫీ ఉల్ హక్, రేఖా గణితాన్ని భాస్కర రావు, త్రికోణమితిని డాక్టర్ కుప్పుస్వామి బోధించేవారు. భౌతిక శాస్త్రాన్ని హరి లక్ష్మీపతి,
ప్రభాకర్ బోధించేవారు. డిమాన్ స్త్రేటర్ గా ఎస్వీవీపి మూర్తి మాతో ప్రయోగశాలలో ప్రాక్టికల్స్
చేయించేవారు. రసాయనశాస్త్రం థియరీలో మూడు భాగాలుండేవి. ఆర్గానిక్, "ఇన్-ఆర్గానిక్", "ఫిజికల్" అనే ఆ
మూడింటిని ముగ్గురు లెక్చరర్లు బోధించేవారు. ప్రయోగాలను రఘురాం చేయించేవారు. వై. సత్యనారాయణ
మూర్తి ఆర్గానిక్ సబ్జెక్ట్ చెప్పేవారు. ఆయన గీసిన బెంజీన్ రింగ్ ఇప్పటికీ కళ్లల్లో
మెదులుతున్నది. ఇన్-ఆర్గానిక్ సబ్జెక్ట్ ప్రిన్సిపాల్ సుదర్శన్ చెప్పేవారు. ఫిజికల్
కేమిస్త్రీని కూడా వైఎసేన్ బోధించేవారు. రెండు-మూడు ప్రయత్నాల తరువాత మార్చ్ 1968 లో
లెక్కలు, భౌతిక శాస్త్రం, సెప్టెంబర్ 1968 లొ రసాయన శాస్త్రం కంపార్ట్ మెంటల్ గా డిగ్రీ
పాసయ్యా.
1969-71 మధ్యకాలంలో నాగ పూర్ విశ్వవిద్యాలయంలో
ఎంఏ (పబ్లిక్ అడ్మినిస్త్రేషన్) లో చేరాను. రెండేళ్ల కోర్సులో జీవితానుభవం అంతా
నేర్చుకున్నాం. తెలుగువాడైన వైఎస్ఎన్ మూర్తి ఆ విభాగానికి హెడ్. తన అమోఘమైన
ప్రతిభతో క్లాసు జరిగిన గంట సేపు వర్తమాన సామాజిక-రాజకీయ-ఆర్ధిక అంశాలతో
ముడిపెట్టుతూ ప్రధానమైన పబ్లిక్ అడ్మినిస్త్రేషన్ సబ్జెక్ట్ పాఠం చెప్పేవాడు. మరో
ఆచార్యుడు ఎన్జీఎస్ కిని. ఆయనకు ఆయనే సాటి. పొలిటికల్ సోషాలజీ ఆయన బోధించే వాడు.
దవే అనే ఒకాయన స్థానికి స్వపరిపాలన గురించి చెప్పేవాడు. మరో సబ్జెక్ట్ దేశపాండే చెప్పేవాడు.
ఎంఏ చదివిన తరువాత, పాసైన కొద్దిరోజులకే
ఉద్యోగంలో చేరినప్పటికీ, ఒక రెండేళ్ల తరువాత బాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ లో చేరాను
1973-74 మధ్య కాలంలో. ఎఎఎన్ రాజు, వేణుగోపాల్, ఇనాందార్, డోరతీ ఐజాక్, ఏకె దాస్
గుప్తా ఒక్కో సబ్జెక్ట్ మీద ఒక్కొకరు బోధించే వారు.
అలా ఖాన్గీ బడి (కేజీ) బడి నుంచి,
విశ్వవిద్యాలయం (పీజీ) వరకూ ఇంత మంది ఉపాధ్యాయులు-గురువులు చెప్పిన చదువులే నాలాగా
ఎందరికో శ్రీరామ రక్షలాగా వున్నాయి. ఉపాధ్యాయ దినోత్సవం నాడు పాఠం చెప్పిన ప్రతి
పంతులునూ జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిందే!
No comments:
Post a Comment