పరిరక్షించుకోవలసిన శాస్త్రం.. జ్యోతిష్యం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (27-09-2017)
సెప్టెంబర్
9, 10 తేదీలలో హైదరాబాద్ లలితా కళాతోరణం, రవీంద్రభారతిలలో సాంప్రదాయబద్ధంగా, ఇంతవరకు ఎప్పుడు, ఎక్కడా కనీ-వినీ
ఎరుగని విధంగా, దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక సౌజన్యంతో, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ
పరిషత్ ఆర్ధిక సహాయంతో, తెలంగాణ రాష్ట్ర జ్యోతిష్య మహాసభలు వైభవంగా జరిగాయి.
మొదటిరోజు ప్రారంభ కార్యక్రమానికి
మదుసూదనానంద సరస్వతీ స్వామి, వ్రతధర రామానుజ జీయర్ స్వామి, దర్శనం శర్మ, యాయవరం చంద్రశేఖర్ శర్మ సిద్ధాంతితో సహా పలువురు
ప్రముఖులు పాల్గొన్నారు. నేను కూడా రెండు రోజులు సభల్లో పాల్గొన్నాను. సూర్య,
చంద్రుల సాక్షిగా జ్యోతిశ్శాస్త్రం, ఇతర శాస్త్రాల
కన్నా వివాదం లేకుండా సఫలమైంది, కాబట్టి, సనాతన
జ్యోతశ్శాస్త్రాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత సమాజం మీద వుంది. తెలంగాణ
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో వున్న అనుభవజ్ఞులైన సిద్ధాంతులను, పంచాంగకర్తలను,
జ్యోతిష పండితులను ఒకే వేదికపైకి తీసుకురావలన్నది మహా సభల ప్రధాన ఉద్దేశం.
జ్యోతిశ్శాస్త్రం
ప్రధానంగా రెండు భాగాలు. ఒకటి గణిత భాగమైతే,
రెండవది ఫలితభాగం. గణితభాగాన్ని
‘‘సిద్ధాంతం’’ అంటారు. ఫలితభాగాన్ని
‘‘జాతకం’’ అంటారు. అందుకే మొదటి రోజు
సిధ్ధాంత సదస్సును, రెండవరోజు జాతక సదస్సును నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఒక్కో
సదస్సులో 12 ప్రధానాంశాలను ఎంపిక చేసి, ఒక్కో అంశం మీద ప్రసంగ పత్రం సమర్పించారు.
‘‘వేదాంగ
జ్యోతిష్య శాస్త్ర వైభవం’’ గూర్చి గుడి ఉమా మహేశ్వర శర్మ సిద్ధాంతి ప్రసంగిస్తూ, శిక్షా, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషం, నిరుక్తం, కల్పం అనే
ఆరు వేదాంగాలలో రజ్యోతిశ్శాస్త్రం అత్యంత ప్రధానమైంది అని అన్నారు. వేదకాలం
నుండి నేటి వరకు జ్యోతిశ్శాస్త్రం కాలానుగుణమైను మార్పులతో, సమన్వయ సాధనతో, ధర్మపరిరక్షణకై వర్ధిల్లుతుందనీ, సమాజానికి
అనుక్షణం జ్యోతిశ్శాస్త్రం మార్గదర్శనం
చేస్తుందనీ చెప్పారు. ఆకెళ్ల జయకృష్ణ శర్మసిధ్ధాంతి ‘సూర్య సిద్ధాంత ప్రాశస్త్యం’
పై ప్రసంగిస్తూ, అదొక అపౌరుషేయ సిధ్ధాంత గ్రంథమనీ, ఈ శాస్త్రం పూర్వం సూర్యునిచే
చెప్పబడిందనీ, ప్రస్తుతం మనం ఉపయోగించే పంచాంగాలన్నీ ఈ విధానాన్నే అనుసరిస్తున్నాయనీ
అన్నారు. ‘పంచాంగ ప్రామాణికత-ప్రయోజనం’ అనే అంశంపై బ్రహ్మభట్ల శ్రీరామ శర్మ
సిధ్దాంతి మాట్లాడుతూ, పంచాంగం లేకుండా నిత్య జీవితం కొనసాగించలేమనీ, ధర్మాచరణకు
పంచాంగం అత్యంతావశ్యకమైందనీ, తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాలతో
కాలాధీనులైన కర్మ సాధకులకు పంచాంగం ప్రసిద్ది చెందిందనీ తెలిపారు. ‘ముహూర్త నిర్ణయ
రహస్యం’ అనే అంశంపై శ్రీ అయినవోలు అనంత మల్లయ్య సిద్ధాంతి, ‘దేశకాల పరిస్థితులు –
పంచాంగ ప్రభావం’ అనే అంశంపై ఎదునోజు నరసింహాచార్య సిద్ధాంతి ప్రసంగించారు. కాలానుగుణ
మార్పులకనుగుణంగా, ధర్మమార్గాన్ని వీడకుండా దేశకాల పరిస్థితులను దృష్టిలో వుంచుకొని
సిద్ధాంతులు పంచాంగాలనందిస్తున్నారని అన్నారు.
‘పండుగల
నిర్ణయ సమీక్ష–పరిశీలన’ అంశంపై గాడిచర్ల నాగేశ్వరశర్మ సిద్ధాంతి ప్రసంగించారు. నిత్య
జీవితంలో పండుగులు – వ్రతాలు భక్తి శ్రద్ధలతో ఆచరించడం అనాదిగా వస్తున్న ఆచారమనీ, గత
కొన్నేళ్లుగా పంచంగాలలో పండుగలపై విభేదాలు రావడం, సమాజాన్ని ఇబ్బందులకు గురి చేయుట
జరిగిందనీ, తెలంగాణ రాష్ట్ర జ్యోతిష్య మహా సభల ద్వారా వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించిందనీ
అన్నారాయన. రాష్ట్రంలోని సిద్ధాంతులందరూ ఒక వేదికపై నిర్ణయాలు తీసుకున్నందున భవిష్యత్తు పండుగల్లో
విభేదాలు వచ్చే అవకాశాలు లేవు. ‘వర్ష
సూచనలు–పంచాంగ ఆవశ్యకత’ పై ఓరుగంటి మనోహర శర్మ సిద్ధాంతి ప్రసంగ పత్రం
సమర్పించారు. బోర్పట్ల రాఘవేంద్రాచార్య
సిద్ధాంతి ‘వస్తు ధరల నిర్ణయ విశ్లేషణ’ అనే అంశంపై, చికిలి లక్ష్మీ వేంకటేశ్వర
శర్మ సిద్ధాంతి ‘మౌఢ్య నిర్ణయ వ్యత్యాసం’ అనే అంశంపై వివరించారు. ‘వార దుర్మూహూర్త – రాహుకాల
ప్రభావం’ అనే అంశంపై శ్రీ పెండ్యాల హనుమంతరావు ప్రసంగించారు. ప్రస్తుత సమాజంలో
సిధ్ధాంతుల పాత్రపై యాయవరం దయాకర శర్మ సిద్ధాంతి వివరించారు.
మొదటి రోజు సాయంత్రం యువ సిద్ధాంతుల
సమ్మేళనం జరిగింది. సుమారు 25 మంది యువ సిద్ధాంతులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో
అనుభవజ్ఞులైన సిద్ధాంతులు వీరికి భవిష్యత్తు మార్గనిర్దేశం చేసారు. తదుపరి
సిద్ధాంతులందరితో ‘తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య’ సహకారంతో ‘విద్వత్సభ’
జరిగింది. ఇందులో పలువురు సిద్ధాంతులు, అర్చకులు, పురోహితులు, జ్యోతిష్యపండితులు
పాల్గొన్నారు. వివిధ బ్రాహ్మణ సంఘ నాయకులు, కార్యదర్శులు కూడా పాల్గొన్నారు. రాబోవు
శ్రీ విళంబి నామ సంవత్సర పండుగలు-వ్రతాల నిర్ణయాన్ని అందరి సమక్షంలో అంగీకరించారు.
ఆ జాబితాను నిర్వాహకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు
అందచేశారు. ఇదే జాబితాను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందని సీఎం వారికి హామీ
ఇచ్చారు.
రెండవ
రోజు ప్రారంభ కార్యక్రమంలో గోవిందానంద సరస్వతీ స్వామి, అష్టకాల నరసింహరామశర్మ
అవధాని, సాగి కమలాకర శర్మ, యం.వెంకటరమణ శర్మ, దివ్యజ్ఞాన సిద్ధాంతి తదితరులు
పాల్గొన్నారు. ప్రతీ జిల్లాలో, ప్రతీ మండలంలో ఒక సిద్ధాంతిని నియమించాలనీ, ప్రభుత్వానికి
కూడా ఒక ఆస్థాన సిద్ధాంతి అవసరమని దివ్యజ్ఞాన సిద్ధాంతి సూచించారు.
జ్యోతిశ్యాస్త్రానికి ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయం వుండాలని కూడా ఆయన అన్నారు. ఆనాటి
జాతక సదస్సులో మొదటి అంశమైన ‘ఆధునిక కాలంలో జ్యోతిష ప్రభావం’ పై మాడ్గుల శశిభూషణ
శర్మ సోమయాజి సంస్కృతంలో ప్రసంగించారు. ఆధునిక
కాలంలో అందరికీ జ్యోతిశ్శాస్త్రంపై విశ్వాసం పెరిగిందనీ, గణితం చేయడానికి
ప్రస్తుతం శ్రమ లేకుండా, కంప్యూటర్ వుపయోగించుకోవచ్చనీ, కాని ఫల నిర్ణయానికి మాత్రం
అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితుల అవసరం వుందనీ సోమయాజి తన ప్రసంగంలో పేర్కొన్నారు. ‘నేటి
సమాజంలో జ్యోతిష్యుల కర్తవ్యం’ అనే రెండవ అంశంపై తిరుక్కోవెల జితేంద్ర ప్రసాద్ ప్రసంగిస్తూ,
జ్యోతిష్యులు సమాజాన్ని భయబ్రాంతులకు గురిచేయడం శాస్త్ర సమ్మతంకాదనీ, ధర్మ
పరిరక్షణకు వారు కృషి చేయాల్సిన అవసరం వుందనీ అన్నారు.
‘వివాహంలో రాశికూట ఆవశ్యకత’ పై ప్రసంగించిన
గంగవరం నారాయణ శర్మ, సమాజంలో రాశికూటాలపై క్షుణ్ణంగా అవగాహన వుండాలనీ, దోషాలను
విశ్వసించినపుడు, శాస్త్రంలో తెలిపిన పరిహారాలను కూడా విశ్వసించాలనీ, సమాజం మేలు కోసమే
శాస్త్రం ఆవిర్భవించిందని నొక్కి వక్కాణించారు. ‘గోచార ప్రాముఖ్యత-రాశీ ఫలాల
విశిష్టత’ అనే అంశంపై గౌరిభట్ల సుబ్రహ్మణ్య శర్మ వివరించారు. పంచాంగాలలో తెలిపే
గోచార రాశి ఫలితాలు సూచనగానే స్వీకరించాలి తప్ప, ఖచ్చితంగా జరిగి తీరుతుందనడానికి
వీలులేదన్నారాయన. ‘ప్రస్తుత కాలంలో గ్రహాల ప్రభావం’ అనే అంశంపై జాలా సోమనాథ శాస్త్రి
ప్రసంగిస్తూ, మనం వుపయోగిస్తున్న ప్రపంచంలోని అన్ని వస్తువులు, వాతావరణంపై గ్రహాల
ప్రభావమే మూల కారణం అనీ, మన శాస్త్రాలను మనమే పాశ్చాత్యులకంటే మెరుగ్గా, క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం వుందనీ అన్నారు.
మేళ్లూరి వేంకటేశ్వర శర్మ, కారకత్వాలు, కాలానుగుణ సమన్వయం అనే అంశాన్ని వివరిస్తూ,
ప్రతి గ్రహానికి ఒక ప్రధాన కారకత్వంతో పాటు మిగతా అనేక కారకత్వాలున్నాయంటూ, వీటన్నింటిని
కూలంకశంగా తెలుసుకున్నప్పుడే జ్యోతిష పండితులు జాతకం చెప్పగలుగుతారన్నారు.
‘పరాశర హోరాశాస్త్ర పరిశీలన’ అనే అంశంపై సూరన్నగారి
ప్రతిభ, ‘జాతక ఫల విశ్లేషణా విధానం’ అనే అంశంపై రాయప్రోలు ఆదినారాయణ, ‘జ్యోతిషుల
లక్షణాలు -యోగ్యతలు’ అనే అంశంపై చేత్రోజు సత్యనారాయణ శాస్త్రి, ‘ధర్మ పరిరక్షణలో జ్యోతిష్యుల పాత్ర’ అనే అంశంపై ఉమాపతి
బాలాంజనేయశర్మ, ప్రసంగించారు. శాస్త్రాన్ని
అభ్యసించడం ఒక ఎత్తైతే, అనుభవాన్ని సంపాదించడం మరొక ఎత్తనీ, శాస్త్రజ్ఞానంలో కూడా అనుభవ జ్ఞానం చాలా ముఖ్యం
అనీ, అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులు ఈ కాలంలో లభించడం చాలా కష్టం అనీ, వేదానికి ధర్మం మూలమైతే, ధర్మానికి జ్యోతిశ్శాస్త్రమే
మూలం అనీ, జ్యోతిశ్శాస్త్రం ద్వారా ధర్మ బుద్ధి కలుగుతుందనీ, అందుకే
జ్యోతిష్యున్ని ఈశ్వరునిగా భావించాలనీ అన్నారు.
సమాజంలో,
ధర్మ పరిరక్షణలో జ్యోతిష్యుల పాత్ర అత్యంత కీలకమైంది. శాస్త్రం, అనుభవం ఎంత వున్నా ఆచరణ చాలా
ముఖ్యం. ధర్మాచరణలోని జ్యోతిష్యులనే సమాజం
గౌరవిస్తుంది. ధర్మపరిరక్షణ అంటే వేదికలపై
ఉపన్యసించడం గాదు. ధర్మాన్ని ఆచరించడమే
ధర్మ పరిరక్షణ అవుతుందని వీరంతా అన్నారు.
సాగి
కమలాకర శర్మ నిర్వహించిన ‘నవగ్రహ అనుగ్రహం’ అనే జ్యోతిష్య రూపకం ద్వారా సమాజానికి
కొన్ని జ్యోతిష్య సందేశాలు అందించే ప్రయత్నం జరిగింది. అందులో ప్రధానమైంది, అనుభజ్ఞులైన జ్యోతిష పండితులనే సంప్రదించాలనే
విషయం. శాస్త్రోక్త దోష పరిహారాల వల్ల
తప్పకుండా ఫలితం లభిస్తుందని ఉదాహరణగా బుధ దోష పరిహారానికి 100 మొక్కలు నాటి హరిత
హారంలో పాల్గొనాలని జ్యోతిషుడు సూచించాడు.
ఇది అందరికి ఆమోదయోగ్యమైంది అని అనగానే, సభలోని వారంతా హర్షధ్వానాలు
తెలిపారు.
‘సర్వేజనా
స్సుఖినోభవంతు’ అని అనడం కాదు, ఆచరణలో చూపించాలి. బ్రాహ్మాణోత్తములంతా సర్వ సమాజ శ్రేయస్సును
కోరుతారు. అట్టి బ్రాహ్మాణోత్తములలో పంచాంగ కర్తలైన సిద్ధాంతులు, సమాజ శ్రేయస్సుతో
పాటు బ్రాహ్మణోత్తములకు మార్గదర్శిగా వుంటారు.
సమాజంలో అత్యంత కీలక
పాత్ర పోషిస్తున్న సిద్ధాంతులను కాపాడుకోవాల్సిన బాధ్యత, బ్రాహ్మాణోత్తములందరితో
పాటు సమాజానికీ, ప్రభుత్వానికీ వుంది. పరోక్ష పాత్రలో వున్న సిద్ధాంతులను గుర్తించడం
మంచిది. ఈ సభల ద్వారా కొంత చైతన్యం కలిగించే ప్రయత్నం చేసిన నిర్వాహకులను
మనస్పూర్తిగా అభినందించాలి. ఈ మహాసభల యొక్క పూర్తి ప్రసంగ వివరాలను ఒక గ్రంథ
రూపంలో తీసుకువస్తే సమాజానికి ఎంతగానో ఉపయోగ పడ్తుంది.
No comments:
Post a Comment