ఆంధ్రవాల్మీకి
వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
సీతాదేవిని చూశానని భ్రమపడిన హనుమంతుడు
వనం
జ్వాలానరసింహారావు
సూర్య
దినపత్రిక (18-09-2017)
"అబ్బ ఇప్పటికి చూసాకదా సీతాదేవిని" అని అనుకుంటాడు కొంతసేపు హనుమంతుడు. కుదుటపడ్డ ఆయన
మనస్సు, ఈమెట్లా శ్రీరాముడి భార్య సీతాదేవవుతుందని
తర్కించుకుంటుంది. "సీత పతివ్రత కదా! భర్తలేని సమయంలో నిద్రిస్తుందా? ఆహారం తీసుకుంటుందా?
సంతోషిస్తుందా? ఆభరణాలు ధరిస్తుందా? కనీసం మంచి నీళ్లయినా రుచిస్తాయా?" ఇవన్నీ
చేస్తున్న ఈస్త్రీ సీతాదేవి అయ్యే అవకాశం లేనే లేదని నిర్ణయానికొస్తాడు. ఇంకా అనుకుంటాడు: "సీతాదేవి రామచంద్రమూర్తిని
తప్ప ఇంద్రుడినైనా కన్నెత్తి చూస్తుందా? ఇక ఈ రాక్షసుడిని
గురించి చెప్పటమెందుకు? ఉత్తమోత్తమ వస్తువు లభించినవారు అధమ
వస్తువునాశిస్తారా? కాబట్టి ఈమె సీత కాద"ని నిశ్చయించుకుని, మండోదరిని దాటి ఆవలికిపోయి,
మద్యం సేవించే పానశాలలో సీతను వెతకడం ప్రారంభిస్తాడు.
ఆటలాడి, పాటలుపాడి అలసిపోయిన, మద్యంతాగి వళ్లు
మర్చిపోయిన వారు; మద్దెల, మృదంగం,
పీటలను తలదిండుగా పెట్టుకున్న వారు; కంబళ్లు,
తివాచీలు పర్చుకుని పడుకున్న వారు; నిర్మల
రత్నాభరణాలతో అలంకరించుకున్న వారు; దేశకాల ఉచిత జ్జానం కలవారైన
స్త్రీలూ చుట్టూ వుండగా, "బాహ్య-అభ్యంతర
రతుల"తో, అలసి నిద్రించే
రావణుడిని చూసాడు ఆ దారిలో హనుమంతుడు. (రతి రెండు విధాలు:
బాహ్యమని - అభ్యంతరమని.
ముద్దిడడం, కౌగలించుకోవడం, నఖదంతక్షతాదికాలవం
లాంటివి బాహ్యమైనవి. నానాబంధకల్పిత - సాక్షాత్సురతమ్
అభ్యంతరమంటారు. బాహ్యంగా, ఆలింగనంతో
రతిని ఆరంభించాలి అని రతిరహస్యం)
ఆవుల మందలో (ఆంబోతు) ఎద్దులా, ఆడ ఏనుగుల గుంపులో మగ ఏనుగులా స్త్రీపరివారంలో వున్న
రావణాసురుడిని చూసి, దాటిపోయి, మనోహర
వస్తువులతో నిండిన మద్యపాన గృహప్రదేశాన్ని చేరబోయాడు హనుమంతుడు. ఆ ప్రదేశంలో
దున్నపోతుల, జింకల, పందుల మాంసాలు,
కుప్పలు-తెప్పలుగా పడివున్నాయి. మీగడ పెరుగుతో సౌవర్చ లవణాన్ని
కలిపి తయారుచేసిన కోళ్ల, నెమళ్ల, పందుల,
ఖడ్గమృగాల, ఏదుల, లేళ్ల, కక్కెరల, చకోరాల
మాంసాలున్న పాత్రలు సగభాగం ఖాళీ అయిపోయాయి. ఇంకా నానావిధాలయిన
ఆహారపదార్ధాలున్నాయి. అక్కడే తెగిపోయి పడిన హారాలను, అందెలను,
రకరకాల ఆభరణాలను, పానపాత్రలందుంచిన ఫలాలను
హనుమంతుడు చూసాడు.
అందంతో అతిశయిస్తున్న, కొత్త బంగారు రత్నాలతో తయారైన శయ్యలు, ఆసనాలు అక్కడక్కడా పడి వున్నాయి. వాటి కాంతితో ఆ గృహం
నిప్పులేకున్నా కాలుతున్నదేంటా? అన్నట్లుంది. పాకశాస్త్రంలో
రాటుతేలిన వంటవారు వండిన రుచిగల మాంసాలతో, పూలతో, చక్కెరతో, ద్రాక్ష, ఇప్పపువ్వులతో
తయారై, త్రాగడానికి సిధ్ధంగా వున్న సారాయిని చూసాడు. వెండి,
బంగారం, వెండి స్ఫటికాల పాత్రల్లోని రుచిగల
పానీయాలను చూసాడు హనుమంతుడు. కొన్నిపాత్రల్లో సారాయి సగమే అయిపోయింది.
కొన్నింటిలోది పూర్తిగా అయిపోయింది. కొన్ని నిండుగా వున్నాయి. భక్ష్యాలు తిన్నవి
కొన్ని, కొరికినవి కొన్ని, కుప్పలుగా
పడేసినవి కొన్ని, కనిపించాయి హనుమంతుడికి.
పగిలిన
గిన్నెలు, దొర్లుతున్న కుండలు, నేలమీద
పడ్డ నీళ్లు, దండలు, నానా రకాల పండ్లు,
నిద్రలో ఒకరినొకరు గట్టిగా కౌగలించుకుని పడుకున్న సుందరీమణులు,
ఒకదాని చీరెను మరొకతె రొమ్ముపై కప్పుకుని పడుకున్న స్త్రీలు అక్కడి
మరికొన్ని దృశ్యాలు. అందగత్తెలు వంటిపై ధరించిన సొగసైన దండలు, చీరెలు, నిట్టూర్పులతో కొంచెం-కొంచెం కదిలి, పిల్లగాలుల సుఖాన్ని గుర్తుచేసింది. గంధం, పూదండల-సారాయి
రసాల-నలుగు పిండ్ల-ధూపాల వాసనలు వ్యాపించాయక్కడ. వివిధ వర్ణాల స్త్రీలు రతికేళిలో
అలసి తామరతీగల్లా నిద్రపోతున్నారక్కడ.
రావణుడి అంతఃపురమంతా వివరంగా
గాలించినప్పటికీ, సీతాదేవి రూపం, ఆమె
వున్న స్థలం జాడ ఏ మాత్రం తెలవకపోవటంతో చింతించాడు హనుమంతుడు. అక్కడ నిదురిస్తున్న స్త్రీలలో పైటలు తొలగినవారిని, చీరలు
తొలగిన వారిని, ఇతరులను చూసి, ధర్మ
విరుధ్ధమైన కార్యం చేసినట్లు బాధపడ్డాడు. "ధర్మలోపం కరిశ్యతి అని
వాల్మీకమ్". పరస్త్రీలపై తన దృష్టి పారదనీ, అట్లాంటప్పుడు, మేడల్లో వళ్లుమరిచి నిద్రిస్తున్న
స్త్రీలను, కపటవిధంగా ఎందుకు చూసానా అని విచారిస్తాడు.
నిద్రిస్తున్న స్త్రీలను, అందునా పరస్త్రీలను,
వారిలోనూ ఒళ్లెరుగక చీరలు తొలగివున్న స్త్రీలను చూడరాదనే ధర్మానికి,
విరుధ్ధంగా వ్యవహరించానే అని చింతిస్తాడు.
మేల్కొని తిరుగుతున్నప్పుడే
ఇతరుల భార్యల మోకాలు పైభాగం చూడకూడదు. చూస్తే
పాపకార్యం. అట్లాంటప్పుడు నిద్రలో పరవశమై వళ్లు తెలియకుండా
వున్న పరస్త్రీలను చూసి పాపం చేసాననుకుంటాడు. ఇట్లా
ఆలోచిస్తున్న హనుమంతుడి మనసుకు, తాను చేసిందిన్ది తప్పా-ఒప్పా అని నిశ్చయించి తీర్మానించగల సామర్ధ్యం-బుధ్ధి
మళ్లీ కలిగింది. అప్పుడనుకుంటాడు: "రావణాసురుడి స్త్రీలనందరినీ చూసాను. చూస్తే వచ్చిన
హాని ఏంటి? నాబుధ్ధి కొంచెమైనా చలించలేదే! పాప-పుణ్య కార్యాల్లో ఇంద్రియ వ్యాపారం జరిపేదే
మనస్సు. చూసినంత మాత్రాన, విన్నంత
మాత్రాన, పుణ్యంకాని, పాపం కాని రాదు. మనస్సు పాపపు బుధ్ధి కలదైతే ప్రత్యక్షంగా చూసినా-చూడకున్నా
పాపం వస్తుంది. పుణ్యదృష్టి కలదైతే పుణ్యమే కలుగుతుంది.
ఏ అభిలాశ లేకున్నవారికి ఏదీరాదు. కావున
మనోవ్యాపారం ప్రధానం కానీ, ఇంద్రియ వ్యాపారం కాదు. నామనసులో అభిలాశ అనేది లేనేలేదు. నేను వీరిని
కామాసక్తితో చూడలేదు. చూసిన కారణంవల్ల కామం కలగలేదు. ఇకనాకేమీ భయం లేదు"
ఇలా
విచారించే బదులు ఇంకోచోట వెతుకుతాననుకుంటాడు. ఆడది
ఆడవారి మధ్యలో వుండక ఎక్కడుంటుందని నిష్కాముడనై, కర్తవ్యం
నెరవేర్చాలి అనుకుంటాడు మరల. "నిష్కల్మశమైన మనస్సుతో
అంతఃపురమంతా మిక్కిలి శ్రధ్ధతో వెతికాను-సీతాదేవి ఎక్కడా
కానరాలేదు కదా" అనుకుని, పానశాలను విడిచి, అంతఃపురంలో వెతకసాగాడు మళ్లీ.
No comments:
Post a Comment