Friday, September 8, 2017

మీరు తెలుగుల రాయకుండ్రి... విశ్వనాథకు కాలోజీ సూచన :వనం జ్వాలా నరసింహారావు

సెప్టెంబర్ 9, 2017 న కాళోజీ 103 వ జయంతి సందర్భంగా 
మీరు తెలుగుల రాయకుండ్రి...
విశ్వనాథకు కాలోజీ సూచన
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక (09-09-2017)

స్వర్గీయ కాళోజీ నారాయణరావు గారి ఆత్మకథ "ఇదీ నా గొడవ" ను నేను గత పది-పదిహేను సంవత్సరాలలో అనేక సార్లు చదివాను. అందులో ఆయన చెప్పిన ప్రతి అంశమూ, పది మంది తెలుసుకోవాల్సిందే! అసలా పుస్తకం ఇప్పుడు దొరుకుతుందో? లేదో? తెలియదు. మొన్నీ మధ్య  ఒక టెలివిజన్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, కాళోజీని అతి దగ్గరగా ఎరిగిన ఒక పెద్ద మనిషి, తనకా పుస్తకం చదవాలని ఎన్నేళ్లగానో వున్నప్పటికీ, ఆ పుస్తకం లభ్యం కానందున వీలుపడలేదని అన్నాడు. అప్పుడనిపించింది...ఎందుకు అందులోని విషయాలను కనీసం కొన్నైనా, పంచుకోకూడదని. అందుకే ఇది.. ఆసక్తి గల వారికి ఇదొక అవకాశం. ఆ పుస్తకంలోని కొన్ని విషయాలు...ఒక్కొక్కటే...

కాలోజీకి తన గురువుగారు గార్లపాటి రాఘవరెడ్డి అంటే అమితమైన గౌరవం. ఆయన ఎలా తనను తీర్చిదిద్దిందీ, ఎలా తన కవితలను సరిచేసింది, బడి పలుకుల భాష అంటే ఏంటీ, పలుకు బళ్ల భాష అంటే ఏంటీ, గురువుగారి మీద విశ్వనాథ సత్యనారాయణ గారికి కలిగిన సదభిప్రాయం విషయం, విశ్వనాథ సత్యనారాయణ  ద్వంద్వ ప్రవృత్తి గురించి కూడా సవివరంగా చెప్పారు ఆత్మకథలో. అలాగే ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారిని తెలుగులో రాయడం మానుకోమని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కూడా వివరించారు.

"కవిత్వం విషయంలో నాకే సందేహం వచ్చినా ఆయనకి (గురువుగారు రాఘవరెడ్డి) చూపించి, సరి చేయించుకోవడం అలవాటు. యతి ప్రాసలు సరి చూడడం, మాట లేమైనా మార్చడం మాత్రమే ఆయన పని. నా ఐడియా, అభిప్రాయం మారకుండా చూసెటోడు. ఏది రాసినా గాని ’ఇదేంది? ఈ అభిప్రాయం బాగా లేదు’ అని ఎన్నడూ అనకపోయేటిది. భాషా శాస్త్రవేత్తలు ఏమంటారొకానీ, నా అభిప్రాయంలో ఈ యతి ప్రాసలు సామెతల్లో పుట్టినయ్. ప్రతి సామెతలోనూ యతో, ప్రాసో, అంత్యప్రాసో వుండడం వల్ల చప్పున మాటలు స్ఫురణకు వచ్చి జ్ఞాపకం పెట్టుకోడానికి వీలు. అయితే ఛందస్సు ఎక్కడ నుంచి వచ్చింది? దీన్ని శాస్త్రంగా తర్వాత రాసిన వాండ్లుండవచ్చు. భాష విషయంలో నాకింకో అభిప్రాయం వున్నది. (నా అభిప్రాయాన్ని శాస్త్రం ఒప్పుకుంటుందా లేదా అనే గొడవలో నేను పడదలుచుకోలేదు). భాష రెండు విధాలు - ఒకటి బడి పలుకుల భాష, మరొకటి పలుకు బళ్ల భాష. బడి పలుకుల భాష అంటే గ్రాంథిక భాషే - కావ్యాల్లో, గ్రంధాల్లో వాడిన మాటలు తీసుకోవడం, ఆవిధంగానే మాట్లాడ్డం, అట్నే రాయడం. అయితే పాత పుస్తకాల్లో పలుకు బళ్ల భాష లేదా? అంటే తక్కువే ననిపిస్తుంది. ఎందుకంటే ఈ మహానుభావులు సంస్కృత కావ్యాలు, తెలుగు కావ్యాలు చదువుకుని, అట్నే రాసిన వాండ్లు. వీరి కవిత్వాన్ని చూస్తే వీండ్లు పలుకు బళ్ల విషయంలో అంత పట్టింపుతోని వున్నట్టు లేదు. ఎంత పెద్ద వాళ్లయిన గానీ ’ఎంత గొట్టు పదం వేసినం? ఎంత క్లిష్ట సంస్కృత సమాసం వాడిన?’ అనే చూసిన్రు. నాది పలుకు బళ్ల భాష. బడి పలుకుల భాష కాదు. ఎట్టంటే అది నేను చదువుకోలేదు. నేను పంతుళ్ల దగ్గర ఆ భాషయినా, దానికి సంబంధించిన వ్యాకరణమైనా చదువుకోలేదు. అందువలన నాది పలుకు బళ్ల భాష.....మా గురువుగారు బతికి వుండగా నేను రాసిన వాటికీ, ఆయన చనిపోయినంక రాసిన వాటికీ బేధం వున్నది.....ఒక వేళ ఒక మాత తప్పు పడినా దానిని మార్చుకునేటిది లేదు. ఆ చెప్పే మహానుభావుడు లేడాయె......అయితే రాఘవరెడ్డి గారుంటే, ఇటువంటి తప్పు జరక్కకపోయేది.....అయ్యగారు - గార్లపాటి రాఘవరెడ్డి గారు నేను తప్పు చేసినా తన శిష్యుడిని ఎక్కడా సమర్థించలేదు".


          "విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక సారి మా ఇంట వున్నప్పటి సంగతి. ఆయన మంచం మీద పడుకుని వున్నరు. ముందటి సోఫాలో నేను కూచుని మాట్టాడుతున్న. ఇంతలో రాఘవరెడ్డి గారు వచ్చిన్రు. నేను పరిచయం చేసిన - మా గురువు గారు, సంస్కృతం వచ్చును, తెలుగులో కవిత్వం రాస్తరు . విశ్వనాథ అట్నే పడుకుని ’రెడ్డి గారూ, ఏవన్నా రెండు పద్యాలు వినిపించండి’ అన్నడు. ఆయన నోటికి వేనవేల పద్యాలు వచ్చేటివి - తనవీ, వేరే వాళ్లవీ కూడా. మంచి పద్యం లక్షణం - అది వినగానే జ్ఞాపకం వుండి పోవాలె - అదే మంచి పద్యానికి గీటు రాయి అనెటోడాయన. తన వేణుగోపాల శతకంలోంచి ఒక పద్యం వినిపించిండు. వింటున్న విశ్వనాథ లేచి కూచున్నడు. రెండో పద్యం విని మంచం దిగిండు. సోఫాలో వున్న మాదగ్గరకి వచ్చి, రాఘవరెడ్డి గారి పక్కన కూచుని, రెండు చేతులూ పట్టుకున్నడు - సంతోషంతో కన్నీళ్లు! విశ్వనాథ ఎంతో ఆనందపడ్డడు. ఆయన వానమామలై వరదాచార్యుల వారి ’మణిమాల’ కావ్యానికి పీఠిక రాస్తూ, ’ఈ సారి వరంగల్ పోయి వచ్చినప్పుడు రాఘవరెడ్డి గారనే మంచి కవి పరిచయం కావడం, కాళోజీ గారి ఆతిధ్యం మర్చిపోలేని విషయాలు’ అన్నడు. విశ్వనాథ విచిత్రమైన వ్యక్తి. ప్రైవేటుగా మాట్లాడుతున్నప్పుడు ఎవరి కవిత్వమైనా బాగుంటే మెచ్చుకునెటోడు. ప్రభావితుడయెటోడు. మంచి రసికుడనిపించేటిది. మరి వేదిక ఎక్కినప్పుడు ఏమయ్యేదో ఏమిటో, తానే తప్ప ప్రపంచంల కవిలేడన్నట్టు విచిత్రంగ మాట్టాడెటోడు. ఈ బేధం అంచనాకి అందదు.....వానమామలై ’మణిమాల’ కు పీఠిక రాసినప్పుడు విశ్వనాథ ’తెలంగాణాకు చెందిన కవులలో ఇతను ప్రసిద్ధుడు’ అని రాసిండు. అంటే తెలంగాణా కవులు వేరూ, ఆంధ్ర కవులూ వేరూ అన్న మాట. వాళ్ల స్టాండర్డ్ వేరు, వీళ్ల స్టాండర్డ్ వేరన్న మాట. అదీ విశ్వనాథ లాంటి పెద్దల దృష్టి!.....విశ్వనాథ స్ప్లిట్ - Split- పర్సనాలిటీ (ద్వంద్వ ప్రవృత్తి) మన అంచనాకి తట్టనిది అని మాత్రం తేల్చుకున్న సుమా!"

విశ్వనాథ సత్యనారాయణ గారితో కాళోజీ చెప్పిన మాట... "మీరు తెలుగుల రాసింది నా బోటి వాండ్లకు కూడా తెలివకపోయె. తెలుగుల రాయడం వల్ల తెలుగు రాని ప్రాంతం వాండ్లకి మీ ప్రతిభ తెల్వడం లేదు. కాబట్టి దయచేసి మీరు తెలుగు రాయడం మానుకుని సంస్కృతంలోనె రాస్తె సంస్కృతం తెల్సిన వాండ్లకి మీ ప్రతిభ బోధపడుతుంది. మీ స్థాయీ వాండ్ల కర్థమవుతుంది. మీరు తెలుగులో రాయడమెందుకు? మీ భాష అర్థం కాక మేం బాధపడడమెందుకు? ’నీకేం తెలుస్తుందిలే’ అని మీరనడమెందుకు? సంస్కృతంలో రాయండి". (విశ్వనాథ ప్రతిభ ఉత్తరాది వారికి తెలిసేటందుకు వీలుగా వారి "వేయి పడగలు" ని నాటి ప్రధాని పి. వి. నరసింహారావు "సహస్ర ఫణి" పేరుతో హిందీలోకి అనువదించిండు).

{తూర్పు మల్లారెడ్డి, ఎబికె. ప్రసాద్, వాసుదేవరావు (ఉదయంలో ఉన్నప్పుడు), స్మైల్, మరికొందరు కాళోజీ అభిమానులు రికార్డు చేసిన కాసెట్ల ఆధారంగా ("మనిషి కథ" పేరుతో ముందుమాట రాసింది వరవరరావు) వెలువడిన కాళోజీ ఆత్మకథ "ఇదీ నా గొడవ" నుంచి సేకరణ-జ్వాలా}


No comments:

Post a Comment