ఆంధ్రవాల్మీకి
వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
నిద్రిస్తున్న రావణుడిని, ఆయన భార్యలను చూసిన హనుమ
వనం
జ్వాలానరసింహారావు
సూర్యదినపత్రిక
(11-09-2017)
ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ-చింతిస్తూ, సీతాన్వేషణ కొనసాగిస్తాడు
హనుమంతుడు. అలా వెళ్తున్న అతడికి రావణుడి శయ్య కనిపిస్తుంది.
చిత్రమైన దాని ఆసనాలు స్ఫటికాలతో, బంగరు
వైడూర్యాలతో, దంతాలతో చేయబడ్డాయి. చంద్రబింబాన్ని
మరిపిస్తున్న ఆ శయ్య వెడల్పాటి పరుపులతో, పట్టుదిండ్లతో,
పూలమాలలతో అలంకరించబడి ప్రకాశిస్తోంది. మీద
తెల్లని గొడుగుతో, బంగరు చెక్కడాలతో, సూర్యకాంతిని
పోలిన అశోక పుష్ప పంక్తులతో అలరారుతుందది. అన్నివైపులా
విసనకర్రలతో విసిరే ఆడబొమ్మలున్న ఆ శయ్య మేకపిల్ల చర్మంపై పరిచి వుంది. అగరు-సాంబ్రాణి ధూపాల గుబాళింపులతో ఆస్వాద
యోగ్యంగావుంది. ఆ ప్రదేశంలో ఇంద్రుడి పానుపును మించిన
రావణుడి మంచాన్ని తిలకించి ఆశ్చర్య పోతాడు హనుమంతుడు.
వర్షాకాల మేఘంలాంటి నల్లటి
దేహవర్చస్సుతో, కాంతులీనుతున్న తేట తేట కుండలాలతో, ఎర్రటి పెద్ద కళ్లతో, సంధ్యారాగం, మెరుపు మేఘాల్లా పులుముకున్న ఎర్రటి గంధంతో, ప్రకాశిస్తున్న దివ్యాభరణాలతో, సుందరాంగుడై,
కోరిన రూపాన్ని ధరించగల శక్తిగలవాడై, అసుర
స్త్రీలకు ప్రియుడై, సర్వాలంకార శోభితంగా గడచిన రాత్రి
సయ్యాటల అలసటతో కనిపిస్తున్న రావణాసురుడు ఆ పెద్ద పానుపుమీద నిద్రపోతుండడం
గమనిస్తాడు హనుమంతుడు. వెండి అంచు వస్త్రాలను ధరించి,
ఏనుగులాగ బుసలు కొడ్తూ, మత్తుగా త్రాగి
నిదురిస్తూ, పొడుగాటి చేతుల్తో మందర పర్వతంలా తన రాక్షసులకు
రక్షణ కలిగిస్తూ, యుధ్ధంలో కఠినాత్ముడన్న పేరుతెచ్చుకున్న
రావణుడిని సమీపిస్తున్న హనుమంతుడు, దయ్యాన్ని చూసిన
అనుభూతిని పొందాడు. అయ్యో! ఈపాపాత్ముడి
దగ్గరకెందుకొచ్చానా అని బాధపడ్డాడు కాసేపు. వెంటనే ఆపానుపు
దిగి మరో అరుగువైపుకు పోయి ఆ కుచ్చితుడిని చూసాడు. మత్తగజ
ప్రవాహంలాగా శ్లాఘ్యమై వున్న ఆపానుపును మరోమారు చూసాడు. దానిపై
నిద్రిస్తున్న రావణాసురుడి చేతులనూ చూస్తాడు మళ్లీ.
హనుమంతుడు చూసిన
ఆ రాక్షసుడి రెండు చేతులు: విస్తార పరాక్రమంతో పొందిన
కీర్తితో కూడి, బంగరు భుజకీర్తులు, రత్నాభరణాలతో
అలంకరించబడి వున్నాయి. ఇంంద్ర ధ్వజంతో సమానమై, ఇంద్రుడి వాహనమైన ఐరావతంతో తలపడినప్పుడు దాని కొమ్ముల పోట్లతో కాయలు కాచి వున్నాయి. వజ్రాయుధపు దెబ్బలను సహించే శక్తి కలిగి వుండి కూడా విష్ణుచక్రముతో
గాయపడినందువల్ల బలంతో సమమైన మూపులపై ఆ గుర్తులు కనిపిస్తున్నాయి. నిర్మలమైన లక్షణాలు కలిగిన గోళ్లు, బొటనవేళ్లుండి,
గుదియలను పొలి, ఏనుగుతొండాల్లా అందమై, ఐదుపడగల పామును పోలి వున్నాయి. పానుపై ఆవరించి
పడివుండి, కుందేటి నెత్తురులాంటి ఎర్రని గంధం పూయబడి,
స్త్రీలచే కౌగలించుకొనబడి, మంచి గంధపు
వాసనకలిగి, యక్ష, పన్నగ, దేవతల, అసుర, గంధర్వ సమూహాలను
ఏడ్పించి, మందర పర్వత శిఖరాల మధ్యలో నిదురించిన కోపపు పాములా
భయపెట్టేవిగా వున్నాయి.
శిఖరాలతో కూడిన
మందర పర్వతాన్ని పోలి, ఒకపక్కకు ఒరిగి నిద్రపోతున్న రావణుడి
నోటినుండి, మామిడి, పున్నాగం, పొగడలతో తయారుచేసిన సారాయి వాసనలు ఇంటి నిండా వ్యాపించాయప్పుడు. ముత్యాల బంగారు కిరీటం, చెవిపోగులు ధరించిన
రావణాసురుడు ప్రకాశిస్తున్న ముఖవర్చస్సుతో పాములాగా బుస కొట్తున్నాడు. అతడి రొమ్ము ఎర్రటి గంధపు పూతతో, అందమైన హారాలతో,
వెడల్పుగా కనిపిస్తోంది. ఒకప్రక్క వేలుకు
అందమైన తెల్లటి పట్టు వస్త్రం చుట్టుకొనివుంది. వెలలేని
బంగారు అంచు వస్త్రాలు కట్టుకున్నాడు. మినుముల రాశిలా,
గంగ మధ్యలో నిద్రపోయి మైమరిచిన ఏనుగులా వున్నాడు.
కమ్మలతో,
వాడిపోని పూదండలతో, పున్నమి చంద్రుడి
నవ్వుముఖంతో రావణుడి కాళ్లదగ్గర నిద్రిస్తున్న, వాడి
స్త్రీలను నిర్మలమైన మనస్సుతో చూసాడు
ఆంజనేయుడు. మనోహరమైన ఆభరణాలు ధరించి, వీణ
వాయించడంలో, నృత్యం చేయడంలో నేర్పుకలిగినవారిలా కనిపించే
స్త్రీలను పతి తొడలపై పరుండగా చూసాడు. అలా పడుకున్నవారి
చెవులకున్న వైడూర్య కుండలాలను, బంగరు భుజకీర్తులను, చంద్రుడినే పరిహసిస్తున్న ముఖాలను, సౌందర్యంతో
తళుక్కుమంటున్న కమ్మలను చూసిన హనుమంతుడికి, ఆ సన్నివేశం
నక్షత్ర సమూహాలతో నిండిన ఆకాశాన్ని తలపించింది. ఆ విధంగా
"హాలారతి కేళీగతి లీలారతి" తేలి వున్నారు ఆ లీలావతులు. బాగా మత్తుగా మద్యం సేవించి,
నాట్యాలు చేసి, భర్తతో రతిక్రీడలాడి, అలసి-సొలసి, వళ్లు తెలీకుండా
అక్కడ పడిపోయి నిద్రపోతున్నారు రావణుడి భార్యలందరూ.
నాట్యంలో సమర్ధత కలదైవున్న
ఒకామె, నిద్రిస్తున్నపుడు కూడా హయగ్రీవాభినయంతోనే
కనిపిస్తున్నది (నిదురించకముందు ఆ అభినయం చేసుండాలి). మరో అందగత్తె, వికసించిన తామరతీగ పడవకు
చుట్టుకున్నట్లు, తన లేతచేతులతో వీణను కౌగలించుకుని
పడుకున్నది. తుడుమును చంకలో బిడ్డలాగుంచుకుని సంతోషంగా
నిదిరిస్తున్నది ఇంకొకతె. వేరొక ఆమె, తప్పెటను
గట్టిగా పట్టుకుని నిదిరిస్తుంటే, దేశాంతరం పోయి చాలాకాలం
తర్వాత ఇంటికి వచ్చిన భర్తను కౌగలించుకుని పడుకున్న దానిలా వుంది. కామాతిశయంతో, పిల్లన గ్రోవిని పట్టుకున్న ఒకామె, ప్రియుడిలింగాన్నే చేతులోపెట్టుకుని
నిద్రిస్తున్న అనుభూతిని పొందుతున్నది. కామ మదంతో ఒక కామిని
ప్రియుడి రహస్సును గ్రహించినట్లు ప్రేమాతిశయంతో వేణుని చేత పట్టుకుని
నిదిరిస్తున్నది. నృత్యంలో నేర్పున్న ఒకతి మగడిపక్కన
పడుకున్న అనుభూతితో, వీణను కౌగలించుకుని నిద్రిస్తున్నది.
బంగరు కాంతి, మృదుత్వం కలిగి మనోహరంగా,
బలంగా అవయవాలున్న ఒకామె మృదంగాన్ని ఒత్తుకుని పడుకునుంది. మద్దెల వాయిస్తూ,అలసిపోయి దాన్నే చంకలో వుంచుకుని
నిద్రిస్తున్నది ఒకామె. ముందు బిడ్డ, వెనుక
వయసు మగడు (యువ వల్లభుడు) వున్న
అనుభూతితో, ముందొక ఢక్కా, వెనుకొక
ఢక్కా పెట్టుకుని నిద్రిస్తున్నదో ప్రమద. వళ్లెరుగని
మరోస్త్రీ, మృదువైన తన చేతులనే ఆడంబరంగా కౌగలించుకుని
నిద్రలో మునిగింది. రావణుడికి నీళ్లు పోసే పనిమనిషి, నీటి పాత్రను నిద్రమత్తులో నేలమీద పడేసి ఆనీటిలోనే పడుకుని చూడటానికి
పెక్కురంగుల పూదండలా వుంది. తన "కుచాల"ను సంతోషంగా పట్టుకుని, నిదురిస్తున్నది ఆడతుమ్మెద
లాంటి జుట్టున్న వేరొక కుంభస్తని. శరత్కాల చంద్రుడి లాంటి
ముఖమున్న ఓ స్త్రీ, "సింహమధ్య"ను గట్టిగా మోహంతో పట్టుకుని పరున్నది. రకరకాల
వాద్యాలను పట్టుకుని మరెందరో నిదురిస్తున్నారు. రాగల వైధవ్య
చిహ్నాలేమో నన్నట్లు, సొమ్ములూడిపోయి, చీరలు
తొలగిపోయి, ముఖం పై పైటకొంగేసుకుని నిద్రిస్తున్నారెందరో.
ఆ అశుభ దృశ్యాలన్నీ రాబోయే క్లేశాలకు సంకేతాలను ఇస్తున్నట్లున్నాయి.
వీరాంజనేయుడు ఇలా
నిద్రిస్తున్న స్త్రీలందరినీ చూసుకుంటూ పోయి-పోయి,
ఓ ప్రత్యేకమైన స్థలంలో, ఏకాంతంగా నిద్రిస్తున్న
ముగ్ధ మనోహర సౌందర్యాతిశయంకల, మరో స్త్రీని గమనిస్తాడు.
(వీరుడనగా ఇంద్రియ జయం కలవాడని అర్ధం. ఇందరు
సుందరీమణులను ఏకాంతంగా చూసినప్పటికీ, ఆయన మనస్సు చలించ లేదని
భావం). ఇక ఇప్పుడు కనిపించిన స్త్రీ పట్టపు దేవికనుక,
ఈమూకలో కలవక వేరే ఒంటరిగా నిద్రిస్తోంది. మంచి
ముత్యాల హారాలు వక్షసీమన వేలాడుతుంటే, మాణిక్యాల కాంతులతో
ప్రకాశించే అలంకారాలు చేసుకుని వెలుగొందుతూ, బంగారు చాయ,
పచ్చటి దేహం కలిగి, మదించిన ఆడుజింక కళ్లలాంటి
కళ్లున్న, మనోహర సౌందర్యరాశి, పట్టపురాణి
మండోదరిని అక్కడి పడకటింట్లో నిదిరిస్తుండగా చూసాడు హనుమంతుడు.
ఆమె ముగ్ధమోహనాకృతిని చూసిన
హనుమంతుడు, "సీతను చూసితి-చూసితి"నని సంతోషంతో భుజాలు తట్టుకున్నాడు. తోకను
ముద్దిడుకుంటాడు. గెంతులేస్తాడు. సంతోషంతో
స్తంభాలెక్కి దూకుతాడు. సంగీత విద్వాంసుడైన హనుమంతుడు మెల్లగా పాడుతాడు, తన
స్వభావ సిధ్ధమైన కపిత్వంతో. వాస్తవానికి సీతాదేవిని
చూసినప్పుడు హనుమంతుడు ఈచేష్టలేవీ చేయలేదు. ఎందుకంటే,
తన కష్టమంతా ఫలించింది కదా నన్న సంతోషంతో పొంగిపోయాడు.
No comments:
Post a Comment