సీతాదేవి కనిపించక విచారపడిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి
వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం
జ్వాలానరసింహారావు
సూర్యదినపత్రిక
(25-09-2017)
ఆ అంతఃపురం మధ్యలో తీగలతో ఏర్పాటుచేసిన ఇండ్లలోనూ, చిత్రాలతో అలంకరించబడిన ఇండ్లలోనూ ఎంత వెతికినా సీత కనపడలేదు.
ఆమె కనపడనందున ఒకవేళ మరణించిందేమోనని అనుకుంటాడు. పాతివ్రత్య రక్షణకు పూనుకుని, సత్పురుషులతో
స్తుతించబడే సుగుణోపేత సీతామాత ఆత్మహత్య చేసుకోక పోయుండవచ్చునేమో కాని, క్రూరుడైన రావణుడు చంపాడేమోనని అనుకుంటాడు. కాకపోతే
కామాసక్తుడై తెచ్చిన వాడు నయానో, భయానో, కోరిక తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు కాని, హింసించి
వుండడనుకుంటాడు. ఒకవేళ భయంకర-వికార
దేహాలు, ముఖాలు, కన్నులు వున్న రాక్షస
స్త్రీలకు భయపడి సీతాదేవి ప్రాణాలు వదిలిపెట్టిందేమో...ఏంచేయాలిప్పుడని ఆలోచనలో
పడ్తాడు హనుమంతుడు. చెప్పిన పౌరుష వాక్యాలను నెరవేర్చలేక,
సీతను చూడలేక సుగ్రీవుడు పెట్టిన గడువు దాటినతర్వాత, ఆయన్ను చూడడం ఏ ధర్మాన్ననుసరించి చేయాలని భయపడ్తాడు. ఒకవేళ వెళ్లినా బలవంతుడైన అతడు తన ఆజ్ఞను మీరినందుకు తనను దండించక
మానుతాడా? అని తలపోస్తాడు.
"అంతఃపురంలో
చూసాను.... రావణాసురుడి స్త్రీలందరి మధ్యలో చూసాను. అయినా
ఎక్కడా సీతాదేవి కనిపించలేదు. చేయాల్సిన కృషి అంతా చేసానే!
శ్రమ వ్యర్ధమైందికదా!" అని అనుకుంటాడు
హనుమంతుడు. వానరుల ఎదుట పౌరుషాలు పలికినందుకు; "హనుమంతా...ఏంచేసొచ్చావు? సీతను తెస్తానంటివే?
తెచ్చావా?" అని అడిగితే జవాబేమివ్వాలి?
వెతికాను, కానరాలేదు, పోయినవాడిని
పోయినట్లే తిరిగొచ్చాను అని చెప్పనా? అలా ఎలా చెప్పేది?
చెప్తే మంచిగుండదు. ఇలా అనుకున్న హనుమంతుడు,
ఇక్కడే వున్డి వెతుక్కుంటూపోతే, హనుమంతుడు
రావణుడి చేతిలో చచ్చిపోయాడేమోననుకోవచ్చు నని తలుస్తాడు. అలా
అనుకుని మిగిలిన వానరులు తామూ బ్రతికుండి ప్రయోజనం లేదనుకుని ప్రాయోపవేశం చేయడానికి
నిశ్చయించుకోవచ్చుననుకుంటాడు. ఇక్కడుండకూడదు, మరలిపోవాల్సిందే అనుకుంటాడు. పోతే నాడు పొగిడిన,
శ్లాఘించిన జాంబవంతుడు,అంగదుడు, ఇతర వానర ముఖ్యులు "ఛీ" అంటారేమోనని కూడా భయపడ్తాడు.
తానిక్కడ ఊరకనే
ఉండరాదనీ....వ్యర్ధుడై పోనూకూడదనీ.....అధైర్యపడకూడదనీ....కార్యం ఎట్లాగైనా
సాధించాలనీ.......సకల కార్యాలను నెరవేర్చే ఉత్సాహాన్ని ఆశ్రయించి మళ్లీ
ప్రయత్నించాలనీ నిశ్చయించుకుంటాడు హనుమంతుడు. రావణాసురుడు
రక్షించే అన్నిప్రదేశాలు: పానగృహాలు, చిత్రగృహాలు,
తోటలు, కేళిశాలలు, సందులు,
గొందులు, వీధులు, విమానాలు,
ఇవీ,అవీ,అన్నీ
విడిచిపెట్టకుండా గాలించాలనీ ఆలోచిస్తాడు. అనుకున్నదే
తడువుగా వెతకడం ప్రారంభించాడు. నేలమాళిగలలో, నాలుగు వీధులు కలిసే ప్రదేశాలలోని మందిరాలలో, రావణుడింటి
దగ్గరున్న ఆటపట్టులలో, ఇలా పోయినచోటికే పోయి, ఎక్కినమెట్టే ఎక్కి, దిగినమెట్టే దిగి వెతుకుతాడు.
ప్రాకారాలలో, ఇంటింటి మధ్యనున్న వీధుల్లో,
అరుగుల్లో, దిగుడుబావుల్లో, సరస్సు తీరాలలో నానారూపాల రాక్షస స్త్రీలు కనిపించారేకాని సీత జాడ లేదు.
విద్యాధర స్త్రీల మధ్యనూలేదు. భోగినీస్త్రీలు,
అందగత్తెలలోనూ లేదు. నాగకన్యలందూ సీత
కనిపించలేదు. రావణుడికి అనుకూలురైన స్త్రీల మధ్య, ప్రతికూలురైన స్త్రీల మధ్య ఎంత వెతికినా సీత కానరాక పోవటంతో శోకం, దుఃఖం, సంబ్రమం కలసిన మనస్సుతో తాను పరాక్రమించి
సముద్రం దాటడం వ్యర్ధమై పోతున్నదేనని దిగులు పడ్డాడు హనుమంతుడు.
అక్కడినుండి ప్రాకారం మీదకు
చేరిన హనుమంతుడు సీతాదేవిని చూడలేకపోయినందుకు చింతించసాగాడు. మనస్సు కలతచెందింది మరోమారు. లంకలోని
చెరువులు, గుంటలు, సరస్సులు, నదులు, వంకలు, వాగులు, కొండలు, డొంకలు, సమస్త
ప్రదేశాలలో వెతికినా వ్యర్ధమయింది కదా అని వ్యాకులపడ్తాడు.తర్వాత
ఇలా ఆలోచిస్తాడు:
"సీతను
చూడలేకపోయాను. సీత రావణుడింట వున్నదని ఎంతోనమ్మకంతో చెప్పాడే
సంపాతి! అయినా ఆమె ఇక్కడ కనపడలేదాయె! ఏంచేయాలి?
సంపాతి అసత్యమాడడే? దానివలన అతడికి కలిగే
లాభమేంటి? కాబట్టి ఇక్కడే ఎక్కడో సీత వుండేవుండి తీరాలి.
ఎందున్నదో? రావణాసురుడికి వశపడినందున వాడామెను
వీరందరిలో కలపక మరెక్కడైనా వుంచాడా?ఛీ, ఎందుకిలాంటి తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి? ఆమె
జనకరాజు కూతురు....మిధిలలో పుట్టింది.....శ్రీరాముడి భార్య.....విదేహ సంబంధమున్నది......భూమిలో పుట్టింది.....పేరు సీత...అలాంటిది కామవశురాలై దుష్టుడు, జాతివల్ల నీచుడు, దనుజుడు, క్రూరుడు,
మనుష్యులను తినేవాడైన రావణుడిని ఎట్లా కామిస్తుంది? అట్టి విపరీతం ఎప్పటికీవుండదు"
"సీతాదేవి
ఇందులేదు-అందులేదు. పోనీ రావణుడు
అపహరించుకుని ఎత్తుకొస్తున్న సమయంలో, అబల అయిన సీత నడితోవలో
పడిపోయివుండవచ్చా? అలాకాకపోతే ఆకాశమార్గాన తన్నెత్తుకుని
రావణుడు పోతున్న సమయంలో, క్రిందున్న సముద్రాన్ని చూసి,
పరవశించి, వశంతప్పి, దాంట్లో
పడిపోయిందా? వాడి వేగానికి ధైర్యం కోల్పోయి, వణకుతూ ఆకాశంలోనే తనువు చాలించిందా? శ్రీరామచంద్రుడిని,
పున్నమినాటి చంద్రుడినే తిరస్కరించేరీతి ముఖాన్ని, తామరపూలరేకుల్లాంటి ఆయన కళ్లను స్మరిస్తూ ప్రాణం విడిచిందా? రావణుడే భక్షించాడా? రావణస్త్రీలు చంపారా? చంపి తిన్నారా? రామా! లక్ష్మణా!
అంటూ ఏడుస్తూ మరణించిందా? ఇలా పరిపరి విధాలుగా
అనుకుంటాడు.
రామపత్ని సీత రావణాసురుడి
వశంకావడం కల్లనీ, అందువల్ల, వాడే
ఎక్కడైనా సీతను దాచైనా వుంచి వుండాలి, లేదా, పతివ్రత కనుక వశపడక సముద్రంలో పడి మరణించైనా వుండాలి అనుకుంటాడు. భార్యపై ప్రేమ వున్న రాముడికి తాను ఏమనిచెప్పాలని మధనపడ్తాడు హనుమంతుడు.
No comments:
Post a Comment