Wednesday, January 16, 2019

తెలంగాణ ప్ర‌గ‌తిని చూపిన జ్వాలా వ్యాసాలు : నియోగి (ఆంధ్రప్రభ-జనవరి 14, 2019)


తెలంగాణ ప్ర‌గ‌తిని చూపిన జ్వాలా వ్యాసాలు
నియోగి (ఆంధ్రప్రభ-జనవరి 14, 2019)

వనం జ్వాలా నరసింహారావు ఈ పేరు సుపరిచితమైనది. ఆయన రచయితగా ఇంగ్లీషు, తెలుగు భాషల్లో అనేక గ్రంథాలను అందించారు. ఆయన రచనలు అందరికీ ఎంతో ఉపయోగకరమైనవి. నిత్య అధ్యయన శీలి ఆయన. జ్వాలా నరసింహారావు ఏది రాసినా ఒక పరిశోధనతో, సునిశిత పరిశీలనతో రాస్తారు. హైదరాబాద్‌, చెన్నై, గోవా, ఎసింక్రోనస్‌ హిస్టరీ, స్క్రాప్‌ బుక్‌, యాన్‌ ఎజెండా ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఏపి, గవర్నెస్‌ విత్‌ డిఫరెన్స్‌ వంటి ఇంగ్లీషు గ్రంథాలను, తిలక్‌ జ్ఞాపకాలు, అనుభవాలే అధ్యాయాలుగా, సుందరకాండ మందార మకరందం, బాలకాండ మందార మక రందం, అయోధ్యకాండ మందార మకరందం, ధర్మధ్వజం వంటి తెలుగు గ్రంథా లను అందించి ప్రతిభ చాటుకున్నారాయన. జ్వాలా నరసింహారావు ప్రతిభను గుర్తించి నాటి ముఖ్యమంత్రి డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి తన వద్ద పౌరసంబంధాల అధికారిగా నియమించుకున్నారు. మళ్లి 25 సంవత్సరాల తర్వాత నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సీ.పీ.ఆర్వోగా జ్వాలా నరసింహారావును తీసుకున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల పరిపాలనా తీరును, వారు ప్రవేశపెట్టిన పథకాలను, వాటి అమలుకు వారు చూపిన శ్రద్ధను అతి దగ్గరగా గమనించే అవకాశం ఆయనకు కలి గింది. ముఖ్యంగా కే.సి.ఆర్‌. పరిపాలనకు సంబంధించి, ఆయన సాధించిన విజయా లను గురించి ఒక రచయితగా ఆయన అత్యంత శ్రద్ధతో ఇదీ సుపరిపాలన (51 నెలల కేసిఆర్‌ ప్రభుత్వం) పేరుతో ఒక గ్రంథాన్ని వెలువరించారు.

కేసిఆర్‌ పరిపాలన ప్రారంభించిన నాటి నుండి 2018 సెప్టెంబర్‌ వరకు జ్వాలా నరసింహారావు వివిధ పత్రికల్లో రాసిన వందకు పై చిలుకు వ్యాసాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ప్రతి వ్యాసంలోనూ కే.సి.ఆర్‌ చేపట్టిన ఒక్కో అంశాన్ని విపులంగా చర్చిం చారు. అయితే ఆయన ఈ వ్యాసాల్లో భజన చేసినట్లుగాక ఒక శాస్త్రీయ అవగాహనతో విపులంగా చర్చిస్తూ కే.సి.ఆర్‌ పాలనను సమర్థించారు. సుపరిపాలన ఎలా ఉండాలో తెలియజేశారు. ఈ గ్రంథం ద్వారా మనకు తెలియని అనేకాంశాలు తెలుసుకోవచ్చు. ఒక పరిణతి చెందిన రచయితగా ఆయన అందించిన ప్రతి వ్యాసమూ మనల్ని ఆలో చింపజేస్తుంది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాసాలు రాయా లంటే ఒకవిధంగా కత్తిమీద సాములాంటిదే. ఏమాత్రం అజాగ్రత్తగా రాసినా అది ఎటు పోతుందో తెలియదు. అతి జాగ్రత్తగా, పూర్తి అవగాహనతో పాలనలో కే.సి.ఆర్‌ మార్క్‌ను బలంగా ఈ వ్యాసాలలో నరసింహారావు చూపించటంలో వందకు వందశాతం సఫలీకృతమయ్యారని ఘంటాపథంగా చెప్పవచ్చు.

దీని ద్వారా హైదరాబాద్‌ పూర్వ చరిత్ర, ఉద్యమ నేపథ్యాలు, వర్తమాన చరిత్ర, హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న దశను కూడా మనం తెలుసుకోగ లుగుతాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి దిశగా ఎలా శరవేగంగా పరుగులు పెడుతుందో ఈ వ్యాసాల ద్వారా సంపూర్ణంగా అవగాహన చేసుకోవచ్చు. కే.సి.ఆర్‌ దార్శనికత ఎలాంటిదో కూడా ఈగ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. కే.సి.ఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేసే దిశగా సాగించిన ప్రయాణం గురించి రెండు వ్యాసాలు ఈ గ్రంథం మొదట్లో కనిపిస్తాయి. దూరదృష్టి అనేది తెలంగాణ సి.ఎం. కున్న అత్యంత ముఖ్య లక్షణాల్లో ఒకటి. ఇచ్చిన మాటకు ఆయన కట్టుబడతారు. చెప్పింది తప్పకుండా చేస్తారు. ఆయన ప్రారంభించిన ప్రతీ పథకంలోనూ, చేసిన ప్రతి వాగ్దానంలోనూ దీన్ని మనం చూడవచ్చునంటారు జ్వాలావారు ''నవ్య తెలంగాణ పథనిర్దేశకుడు కే.సి.ఆర్‌ అన్న వ్యాసంలో. ఓటుకు నోటు కుంభ కోణంలో తమ పార్టీ శాసనసభ్యుడు ఒకరిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని, అరెస్టు చేసి, ఇంటరాగేషన్‌ చేసిన నేపథ్యంలో, తాను అరెస్టు అవుతాననే భయంతో చంద్రబాబు నాయుడు ఏపి పోలీసులతో రక్షణ ఏర్పాటు చేసుకున్న విషయాన్ని ''సెక్షన్‌ 8 అవినీతికి రక్షణా?'' అన్న వ్యాసంలో కూలకుషంగా చర్చించా రాయన.

ఏడాది పాలనలో బంగారు తెలంగాణకు బలమైన పునాది వేసిన నేపథ్యాన్ని ఒక వ్యాసంలో చర్చించారాయన. కే.సి.ఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందరెందరో దేశవిదేశాలకు చెందిన వారు ఆయన్ను కలుసుకుని అభినందించారు. తమ వంతు కృషిని అందిస్తామని కే.సి.ఆర్‌ తెలియజేశారు. ఇలాంటి విషయాలు ఈ గ్రంథంలో దొరుకుతాయి. గోదావరి పుష్క రాల సందర్భంలో కే.సి.ఆర్‌ చేసిన ఏర్పాట్ల గురించి, పుష్కరాల ప్రాచీనత గురించి, దాని ప్రాముఖ్యత గురించి జ్వాలావారు ఒక వ్యాసంలో చర్చించారు. తెలంగాణ హరితహారం గురించి ఒక వ్యాసంలో చూడ వచ్చు. ఇది కే.సి.ఆర్‌ చేపట్టిన మరో ప్రజాయజ్ఞంగా ఆయన వర్ణించారొక వ్యాసంలో.

''రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గవర్నరుకు, రాష్ట్రపతికి పాదాభి వందనం చేయడాన్ని వక్రీకరించి భాష్యం చెప్పిన సామాజిక శాస్త్రవేత్త కంచ ఐలయ్య ఇలా రాయడం (ఆంధ్రజ్యోతి ఎడిట్‌ పేజి 5-7-2015) మాట్లాడటం కొత్తేమీ కాదు. తన వ్యాసాలలో, పుస్తకాలలో అనునిత్యం బ్రాహ్మణ్యాన్ని, బ్రాహ్మణులను 'బాపనోడు' అనే పదాలతో కించపరిచే వ్యాఖ్యలు చేయడం, అది తప్పని చెప్పినవారితో వాగ్వా దానికి దిగడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. హిందూ మతాన్ని అర్థంపర్థం లేని వ్యాఖ్యలతో విమర్శించడం కూడా ఆయనకు నిత్యకృత్యం అంటూ భారతీయ సంస్కృతిలో పెద్దలకు, జ్ఞానవంతులకు, దైవత్వాలకు ఇచ్చే గౌరవం పాదవందనం అంటూ వివరిస్తారు ''ఒక సామాజిక వేత్త అర్థరాహిత్యం'' అనే వ్యాసంలో జ్వాలా నరసింహారావు. ''విశ్వ నగరంగా భాగ్యనగరం అన్న'' వ్యాసంలో హైదరాబాద్‌ గత చరిత్రను తెలియజేస్తా రాయన.

''అనర్హత విషయంలో నిర్ణయాధికారం పూర్తిగా సభాపతిదే. పదవ షెడ్యూల్‌ కింద పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి, సభాపతి ఎటువంటి నిర్ణయమైనా, న్యాయస్థానాల తీర్పు పరిధిలోకి రావు. పదవ షెడ్యూల్‌ నిబంధనలను అమలు పరిచే విషయంలో తదనుగుణమైన విధి, విధానాలను రూపొందించుకునే అధికారం సభాపతికి ఉంది అంటూ వివరిస్తారు జ్వాలా నరసింహారావు ఒక వ్యాసం లో. ప్రజల భాగస్వామ్యంతో గ్రామజ్యోతి, నాటిరోజుల్లో గ్రామీణ జన జీవనం, వ్యయంలేని వ్యవసాయం కావాలి, అందరికీ విద్య దిశగా అడుగులు వంటి వ్యాసాలు ఆలోచింపదగినవిగా ఈ గ్రంథంలో ఉన్నాయి. ముఖ్యమంత్రి చైనా పర్య టనకు సంబంధించిన విశేషాలతో కూడిన వ్యాసమొకటి ఈ గ్రంథంలో లభి స్తుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తలపెట్టిన ''ఆయుత చండీయాగం'' పై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శి స్తారు జ్వాలా ఒక వ్యాసం లో.


క్రీమీలేయర్‌, భావన, చరిత్ర అన్న వ్యాసం లో బీ.సీ.రిజర్వేషన్ల అమలు ప్రక్రియకు సంబంధించిన అంశాలను లోతుగా చర్చించారాయన. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించిన విషయా లను సంపూర్ణంగా రెండు వ్యాసాల్లో జ్వాలా చర్చించారు. ఖమ్మం జిల్లా సాగునీటి అవసరాలకు సంబంధించిన ప్రాజెక్టుల రూపకల్పన గురించి, అలాగే ఖమ్మం జిల్లా చరిత్ర గురించి సవివరంగా వివరించారు ''అధునాతన పట్టణం ఖమ్మం'' అనే వ్యాసంలో నరసింహా రావు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ భూములకు సంబంధిం చిన పూర్వ చరిత్రను ఈ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. కే.సీఆర్‌ ప్రభుత్వం బ్రాహ్మణులకు అందిస్తున్న ఆసరా గురించి ఒక వ్యాసంలో ఆయన వివరించారు. సంక్షేమానికి వారూవీరూ అనే తార తమ్యం చూపించ కుండా, పేదవారెవరైనా సరే, ఆదుకోవాల్సిందే అన్న దృక్పథంతో సరికొత్త సామ్యవాద భావనతో, బ్రాహ్మణుల సంక్షేమానికి నిధిని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుగారు అభినందనీయులు''అంటారాయన ఒక వ్యాసంలో.

తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించ డానికి కేసిఆర్‌ చేస్తున్న కృషిని సంపూర్ణంగా వివరించారాయన ఒక వ్యాసంలో. అలాగే కే.సి.ఆర్‌ 3-13-2016న శాసనసభలో సాగునీటి ప్రాజెక్టుల గురించి చేసిన ప్రసంగపాఠం ఈ గ్రంథంలో లభిస్తుంది. గవర్నరు ప్రసంగంపై గొడవ అనుచితం అనే వ్యాసాన్ని కొత్త జిల్లాల ఏర్పాటు గురించిన వ్యాసాన్ని ఇందులో చూడవచ్చు. అలాగే జిల్లాల గత చరిత్ర కూడా ఇందులో లభిస్తుంది. ''సంక్షేమ రాష్ట్రం అంటే ఇది!'' అన్న వ్యాసంలో కే.సి.ఆర్‌ ప్రవేశపెట్టిన అనేక పథకాల గురించి వివరిస్తారు జ్వాలా. భూపరిపాలనలో సంస్కరణలు, పర్యావరణం కన్నా అభివృద్ధే మిన్న, నిర్వాసితులపై రాద్ధాంతం వద్దు!: బహుళ ప్రయోజనకారి...మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌. అంతరాష్ట్ర జల ఒప్పం దాలలో నూతన ఒరవడి, అన్యాయానికి సజీవ సాక్ష్యం నాగార్జున సాగర్‌, బ్రాహ్మణ సంక్షేమం..ఈశ్వరుడికి సంతోషం, నాటి నగదు రహిత లావాదేవీలు, మొక్కులు ప్రభుత్వ పక్షానే...తప్పేంటీ?, అభివృద్ధి కోసమే అప్పులు, తెలుగు మహాసభలు! అప్పుడు, ఇప్పుడూ వంటి వ్యాసాలు ఈ గ్రంథంలో లభిస్తాయి. ఈ వ్యాసాలలోనూ ఆయా అంశాలపై ఆలోచనాత్మకంగా జ్వాలా చర్చించారు.

రుణమాఫీ నుంచి పెట్టుబడిదాకా, సంక్షేమానికి ప్రాధాన్యం, దేశానికి ఆదర్శం. రాహుల్‌జీ, ఇవీ నిజాలు వంటి వ్యాసాలు ఈ గ్రంథంలో లభిస్తాయి. క్రైస్తవ సోదరులు విశ్వసించే ఏసు ప్రభువును ''గుడ్‌షెపర్డ్‌''గా ఆరాధిస్తుంటారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇన్ని వెసులుబాట్ల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే.సి.ఆర్‌ను యాదవులు, కురుములు సమిష్టిగా తమ పాలిట ''గుడ్‌షెపర్డ్‌''గా కీర్తిస్తారు అనటంలో అతిశయోక్తి లేదంటారు జ్వాలా, యాదవులకు, కురుమలకు గొర్రెల పంపిణీ గురించి వివరించిన వ్యాసంలో. కొత్త భూసంస్కరణలకు నాంది, సమస్యలు లేని వ్యవస్థ కే.సి.ఆర్‌ ఆకాంక్ష, పీవి పుణ్యమే చిన్న కమతాలు, పాదనమస్కారం భారతీయ సంస్కారం, ఆర్థికంలో అగ్రగామి, ప్రపంచ తెలుగు మహాసభలకు చెందిన మూడు వ్యాసాలు ఈ గ్రంథంలో లభిస్తాయి. సుస్థిరత కోసమే చెరికలు, ప్రాంతీయ పార్టీలదే హవా, నిరంతర విద్యుత్‌ గురించి ఇందులో పూర్తి వివరాలు లభిస్తాయి.

నా కుటుంబం అంటేనే తెలంగాణ, ప్రతి తెలంగాణ వ్యక్తి నా కుటుంబంలోని వ్యక్తే'' అంటారు ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కే.సి.ఆర్‌. ఆ ఇంటర్వ్యూ పూర్తిగా ఈ గ్రంథంలో లభిస్తుంది. తెలంగాణ రాష్ట్రశాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం ద్వారా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు శాసన సభ్యుల సభ్యత్వం రద్దు చేసిన అంశంపై ఒక వ్యాసంలో జ్వాలా చర్చించారు. ''నాలుగేళ్ల నవ నవ్యపాలన'' అనే పేరుతో ఆరుభాగాలుగా ఉన్న సుదీర్ఘ వ్యాసంలో ఆయన అనేక విషయాలను చర్చిం చారు. శాసనసభలో జరిగినట్లుగా, న్యాయస్థానంలో ఎవరైనా న్యాయమూర్తి మీదకు ఏదైనా వస్తువును విసిరేస్తే తత్పరిణామం ఏవిధంగా ఉండేది? అని ప్రశ్నిస్తూనే జ్వాలా గవర్నర్‌ పైకి మైకులు విసిరేసిన కాంగ్రెస్‌ శాసనసభ్యుల బహిష్కరణ కన్నా మరీ ఎక్కువ శిక్షపడేది. అందువల్ల నియంత్రణలు, సమతుల్యతలపై జాతీయస్థాయి చర్చ అవసరమంటారు ఒక వ్యాసంలో. అభివృద్ధిలో తెలంగాణ నమూనా, దేశానికి ఉత్తేజ పూరిత నూతన మార్గదర్శకత్వం కావాలి, కొంగరకలాన్‌ నుంచి కేసిఆర్‌ విస్పష్ట సందేశం,ఆపద్ధర్మం కాదు..ధర్మబద్దమే, మానిఫెస్టోలతో తస్మాత్‌ జాగ్రత్త, అతిగా మాట్లాడిన అమిత్‌షా, ఎన్నికల వేళ రాజకీయ విచిత్రాలు..వ్యూహమే విజయ సోపానం, ఓటు నమోదు బాధ్యత ఓటరుదే, పథకాల అమలు విశ్వసనీయతే తెరాసకు శ్రీరామరక్ష వంటి వ్యాసాలలో అనేక విషయాలను జ్వాలా నరసింహారావు వివరిం చారు. చివరన ప్రభుత్వ ప్రగతి నివేదిక ఇచ్చారు. కే.సి.ఆర్‌ అధికారం చేపట్టిన నాటి నుండి ప్రభుత్వ రద్దు చేసేంతవరకు సాధించిన ప్రగతి నాసాంతం ఇచ్చారాయన. ఏది ఏమైనా ఒక సంపూర్ణ అవగాహనతో కే.సి.ఆర్‌ ప్రభుత్వం చేసిన ప్రతి పనిని, నిర్ణ యాలను, సాధించిన విజయాలను సంపూర్ణంగా ఈ గ్రంథంలోని వ్యాసాలలో జ్వాలానరసింహారావు వివరించారు. 

No comments:

Post a Comment