Monday, January 14, 2019

రావణుడికి శ్రీరాముడిని, సీతను వర్ణించి చెప్పిన శూర్పనఖ .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-43 : వనం జ్వాలా నరసింహారావు


రావణుడికి శ్రీరాముడిని, సీతను వర్ణించి చెప్పిన శూర్పనఖ
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-43
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (13-01-2018)
         ఈ విధంగా సిగ్గు, బిడియం, భయం లేకుండా శూర్పనఖ చెప్పిన తన దోషాల గురించి ధనగర్వం, సేనాబలగర్వం కలవాడైనందున, ఎంతమాత్రం విచారపడక, తనను ఎవ్వడు ఏంచేయగలడన్న మదాంధుడై, తన చెల్లెలు చెప్పిన విషయం గురించి ఆలోచన చేశాడు. కోపంతో కళ్లెర్ర చేసి, తనను నిష్టూరాలు ఆడే చుప్పనాతితో, “చెల్లెలా! అక్కడి వృత్తాంతమంతా వివరంగా చెప్పు. రాముడనే వాడేవాడు ఎవడు? వాడెట్టి పరాక్రమవంతుడు? దేవతా రూపమా? మనుష్య రూపమా? ఎలాంటి స్వరూపం కలవాడు? ఎందుకు దండకారణ్యానికి వచ్చాడు? ఖరాది రాక్షసులను ఏ ఆయుధాలతో చంపాడు? విల్లు, బాణాలతోనా? లేక ఏదైనా నూతన ఆయుదాలతోనా?” అని అడగ్గా శూర్పనఖ రామచరిత్ర చెప్పడం మొదలుపెట్టింది ఇలా.

         (రాముడు ఎలాంటి పరాక్రమం కలవాడు, ఏ ఆయుధం కలవాడు, మనుష్యుడా? దేవతా? అని రావణుడు తనకు కావాల్సిన విషయాల గురించి ప్రశ్నిస్తే, శూర్పనఖ కామంతో వున్న వ్యక్తీ కాబట్టి, రాముడి ఆకారం మరిచిపోదామన్నా మరువలేక, కళ్ళకు కట్టినట్లు వుండడం వల్ల, ఆయన ఆకార సౌందర్య వర్ణనతో జవాబిచ్చింది.)

         “దీర్ఘమైన భుజాలతో, విశాలమైన కళ్ళతో, నారచీరెలు, జింక చర్మం వస్త్రాలుగా ధరించి, మన్మథుడిలాగా సుందరంగా వుండే దశరథకుమారుడు ఆయన. పేరు రాముడు. భయంకరమైన శౌర్యం కలవాడాయన. భయంకరమైన విల్లు వుంది ఆయన దగ్గర. దాంతో పుట్టలోనుండి పాములు బయటికి వచ్చే విధంగా బాణాలను చిమ్ముతాడు. ఖరుడు, దూషణుడు, పద్నాలుగువేల మంది రాక్షసులను సరిగ్గా మూడు గడియల్లో కాళ్లమీద నిలిచి, ఒంటరిగా బాణాలతో నాశనం చేసాడు. దండకారణ్యంలో వున్న మునులకు ఇక నుండి వాళ్లు రాక్షసులకు భయపడాల్సిన పనిలేదని అభయ హస్తం ఇచ్చాడు. అంతా చస్తే నేనెలా బతికి బయటకు వచ్చానంటావేమో? నేనక్కడ లేకుండా విని చెప్తున్నానేమో అని అనుమానం వద్దు. నేనా గుంపులోనే వున్నాను. కాని, నేను ఆడదాన్నైనందున స్త్రీహత్యా దోషం కలగవచ్చని గొప్ప మనస్సుతో నన్ను చంపకుండా వదిలాడు. ఇంకొకడైతే పద్నాలుగు వేలమందిని తెచ్చింది ఇదే అని నన్ను కూడా చంపేవాడే. ఎంతమంది వచ్చినా తననేమీ చేయలేరని ఆయన ధైర్యం. ఆ విధంగా ఆయన చేతికి చిక్కినా పోపొమ్మని విడవడం వల్ల బతికాను. ఆ రాముడికి లక్ష్మణుడు అనే తమ్ముడున్నాడు. అన్నకు అన్నిటా సమానుడు. అన్నను భక్తితో సేవిస్తాడు. కోపిష్టి. యుద్ధంలో అజేయుడు. సాధువర్తనం కలవాడు. రాముడికి కుడిభుజం, బహిప్రాణం లక్ష్మణుడు”.


         “రాముడికి ఇష్టమైన భార్య సీతాదేవి. ఆమె అందమైన గమనం కలది. సమస్త సద్గుణాలతో గొప్ప కీర్తిని సంపాదించింది. ఆమె తోడలు అరటి స్తంబాల్లా వుంటాయి. ఆమె ముక్కు సంపెంగ పువ్వులాగా వుంటుంది. సౌందర్యానికి వునికిపట్టైన ఆమె వెన్నెల్లాంటి చిరునవ్వు కలది. షోడశ కళాపూర్ణుడైన చంద్రుడి లాంటి ముఖం కలదామెకు. పతికి హితం చేయాలనే కోరిక వుందామెకు. మంచి బంగారు వన్నె కలది. తలనిండా నల్లటి వెంట్రుకలున్నాయామెకు. నీతిలోని స్థిరాంశమేదో అదే ఆమె. సింహం నడుం లాంటి సన్నటి నడుం వుందామెకు. రెండో లక్ష్మి లాగా వనదేవతగా వెలుగుతున్నది. దేవతా స్త్రీలను, కిన్నర స్త్రీలను, గంధర్వ స్త్రీలను చూసా కాని ఇలాంటి స్త్రీని చూడలేదు. యక్ష స్త్రీలను, కింపురుష స్త్రీలను, దైత్య స్త్రీలను, చూసాను కాని రామచంద్రుడి భార్యలాంటి, కళ్లకు ఆనందం కలిగించే కలువపూల లాంటి కళ్లున్న దాన్ని ముల్లోకాలలో ఎక్కడా చూడలేదు. ఇలాంటి ఆమె మరొకరున్నారని కూడా వినలేదు. ఇంతకంటే ఎక్కువగా ఏమి చెప్పాలి?

         “సీత ఎవరికి భార్యో, ఎవరిని ఆమె సంతోషంగా కౌగలించుకుంటుందో, ఆ పురుషుడు మూడులోకాలలో ఇంద్రుడి కంటే గొప్పవాడై పేరుతెచ్చుకుంటాడు. చక్కటి సౌందర్యం, నడవడి కలిగి స్త్రీలలో శ్రేష్టురాలైన ఈ సీత నీకు తగిన భార్య. ఆమెకు నువ్వు తగిన భర్తవి. ఇద్దరినీ పోల్చి చూసి ఆ సీతను తెచ్చి నీకివ్వాలని భావించి నేనక్కడికి పోయాను. ముక్కును పోగొట్టుకున్నాను. మగవారికి తెలియకుండా సీతాదేవిని ఎత్తుకొచ్చి నీకిద్దామనుకున్నాను. దానికోసం చుట్టుపక్కల తిరుగుతూ సీతదగ్గరికి పోయాను. నా ఆలోచన తెలుసుకున్న లక్ష్మణుడు నేను మొత్తుకుంటున్నా వినకుండా, నన్ను పట్టుకొని నా ముక్కు, చెవులు మొదలంటా కోశాడు. నువ్వే స్వయంగా పోయి ఆ సొగసుగత్తెను కళ్లారా చూస్తే, మన్మథుడికి దాసుడవై ఆ క్షణంలోనే ఆమె కావాలని పట్టుబట్టుతావు.”

         “ప్రేమతో నువ్వు జానకిని భార్యగా చేసుకోవాలంటే అది సాధించడానికి కుడికాలు ముందు పెట్టి తక్షణం బయల్దేరు. ఇప్పుడే దండకారణ్యంలో సీత వున్న చోటుకు పో. రామలక్ష్మణులను యుద్ధంలో చంపు. మగడు చచ్చి దిక్కులేక వున్న సీతను తీసుకొచ్చి నీ ఇష్ట ప్రకారం సుఖపడు. రాముడి చేతిలో 
చనిపోయిన ఖరుడు మొదలైన రాక్షస సమూహంలో ఒక్కడిమీదైనా నీకు కొంచెం ప్రేమున్నా రాముడిని, వాడికి సహాయం చేసినవాడిని చంపిరా. ఇది నీకు అంగీకారమైతేనే ధైర్యంతో వెళ్లు. నా మాటలు నీకు మంచిగా అనిపిస్తే, శీఘ్రంగా ఆలశ్యం చేయకుండా సందేహం వదిలి మల్లెపూవులాంటి సీతను తీసుకొని రా. రావణా! నేను చెప్పానని నా మీద నింద వేయవద్దు. నాకు తోచింది నేను చెప్పాను. ఎదుటివారి బలం గురించి కూడా చెప్పాను. నీబలం ఎంతో ఆలోచించి, అంతకంటే ఎక్కువ బలం వుందనుకుంటే బలవంతంగా సీతను తీసుకురా. నీ కొరకై దండకలో దిక్కులేని వారిలాగా చచ్చిపోయిన ఖరాది రాక్షసుల మీద కృతజ్ఞతతో వాళ్లకు కలిగిన అకాల మరణం ఆలోచించి దానికి ఎలా బదులివ్వాలో అదే చేయి”.

No comments:

Post a Comment