Monday, January 7, 2019

రావణుడిని నిందించిన శూర్పనఖ .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-42 : వనం జ్వాలా నరసింహారావు


రావణుడిని నిందించిన శూర్పనఖ
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-42
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (06-01-2019)
         రావణుడిని నిందిస్తూ శూర్పనఖ ఇంకా ఇలా అంది. “ఇంత వయసు వచ్చినా అవివేకం పోలేదు నీకు. వివేకం రాలేదు. ఏమేమి తెలుసుకోవాలో అది నీకు తెలియదు. ఇలాంటివాడివి రాజై ఎలా బాగుపడుతావు? తనకు స్వంత వేగులవాళ్ళు లేకుండా, ఇతరులు ఏర్పాటుచేసిన వేగులవాళ్ళ మాటలు నమ్మి ప్రవర్తించేవాడు, కోశాగారానికి ఇతరులకు పెత్తనమిచ్చేవాడు, ఇతరులు చెప్పిన నీతులు అనుసరించేవాడు, వాడెంత గొప్పవాడైనా పామరుడితో సమానమే. దూరదేశాల్లో జరిగే సంగతులు వేగులవాళ్ళ ద్వారా తెలుసుకుంటే, అది తన సమక్షంలోనే చూసినట్లు వుంటుంది. కాబట్టే రాజుకు దీర్ఘ చక్షువు అని పేరు. నీకు వేగులు లేరు కాబట్టి నీకా పేరులేదు...నీకా చూపూ లేదు. ఇలా నువ్వుండంవల్లే, నీ మంత్రుల గుంపు సేవిస్తుంటే వారి మాటలు వింటూ వుండడం వల్లే, అలా సుఖానికి అలవాటు పడడం వల్లే, నీ జనస్థానంలో నీ బంధువులందరూ చచ్చిన వార్త నీకెలా తెలుస్తుంది? ఖరదూషణాది బంధువులతో సహా పద్నాలుగువేల మంది రాక్షసులను రామచంద్రమూర్తి ఒక్కడే తన విల్లు బలంతో యుద్ధభూమిలో నాశనం చేశాడు. నీ తమ్ములను, బంధువులను, అందరినీ ఒక్కడు కూడా లేకుండా చంపాడు. నీకు విరోధులై, నీ కీడు కోరే రాక్షసులకు ఇక రావణుడి భయం లేదు. తాను రక్షిస్తానని చెప్పాడు. దండకారణ్యంలో నీ వాళ్ల భయం లేకుండా చేశాడు. ఇవన్నీ అతిబలవంతుడైన రామచంద్రుడు ఒక్కడే చేశాడు”.

         “నువ్వు లోభివి కాబట్టి వేగులవాళ్ళకు జీతాలు ఇవ్వవు కనుక వారంతా జరిగే విషయాలు నీకు తక్షణమే చెప్పారు. నువ్వేమో ఇతరులకు స్వాధీనపడి స్వతంత్రశక్తిలేక, ఆ మంత్రి, ఈ మంత్రి చెప్పినట్లు వింటున్నావు. రాగల కీడు తెలుసుకోలేక పోతున్నావు. నీ దేశంలోనే భయం కలగడం నీకింతవరకూ తెలియదు కదా? రావణా నిన్నేమనాలి? కష్టానికి తగ్గట్లు సేవకులకు జీతాలివ్వవు. ఇలాంటి క్రూరుడికి, మదం పట్టినవాడికి, పొగరుబోతుకు, ద్రోహికి ఆపదలు కలిగినప్పుడు సేవకుల్లో ఒక్కడైనా సహాయం చేయడానికి ముందుకు రాడు. కారణం లేకుండా కోప్పడే రాజును, ఇతరులు భయపడేట్లు ప్రవర్తించే రాజును, గర్వంతో తనను తానే పొగడుకునే రాజును, వాడి బంధువులు, వాడి సేవకులే చంపుతారు. తన తప్పులు తెలుసుకుంటూ చక్కటి ఆలోచనతో పనులు చక్కదిద్దకుండా వుండే రాజుకు ఐశ్వర్యమంతా నాశనమై పోయి, వాడు సన్నగడ్డితో సమానమై దుఃఖపడుతుంటే, వాడిని అందరూ అలక్ష్యంగా చూస్తారు కాని, అయ్యో పాపం! వాడికి ఇలాంటి గతి పట్టిందే అని ఒక్కరైనా బాధపడరు.


“లోకంలో దేనికీ పనికిరానివైనా ఏదో ఒక సమయంలో పనికొస్తాయేమో కాని, రాజుగా వుండి రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడు గవ్వకైనా కొరగాడు. రాజుగా వుండి భ్రష్టుడైన వాడు ఎంత గొప్పగా బతికినా, కొరకాని వాడే. ఇవన్నీ తెలుసుకొని పరులు తనకు చేసిన మేలు మరవకుండా, ధర్మస్వభావుడైన రాజు దీర్ఘకాలం సంపదతో సుఖపడతాడు. దుర్మార్గులు తామెంత అధర్మంగా వున్నా, పరులకు హితోపదేశం చేసేటప్పుడు ధర్మాన్నే చెప్తారు. దోషుల మీద కోపం, సాదువులమీద దయ కనబరుస్తూ నీతిమార్గంలో నడిచే రాజును సర్వసేవకులు భయభక్తులతో కొలుస్తారు. అవివేకీ నీలో ఎంత వెతికి చూసినా రాజులకుండాల్సిన గుణాలు ఒక్కటైనా లేవు. ఆకాలంలో పడ్డ పిడుగులాగా దండకారణ్యంలో నువ్వు కాపుగా వుంచిన వారంతా యుద్ధంలో చావడం వేగులు లేనందున నీకు తెలియదు. సుఖంలో మునిగి నిన్ను చంపనున్న శత్రువులను ఉపేక్షిస్తున్నావు. అన్నీ మనకనుకూలమైన దేశాలే అనుకుంటున్నావు. అన్ని కాలాలు మనకు అనుకూలమైనవే అనుకుంటున్నావు. కానీ, భిన్న దేశాలలో, భిన్న కాలాలో జరిగే విషయాలు కామలోలుడవైన నువ్వు తెలుసుకోలేక పోతున్నావు. ఎవరిలో ఎక్కడ ఏ మంచి కలదో, ఏ చెడ్డకలదో తెలుసుకునే శక్తి నీకు లేదు. కాబట్టి, ఓ రాక్షసరాజా! శీఘ్రకాలంలోనే నీ సంపదను పోగొట్టుకుంటావు.

(తన వికార స్వరూపంతో, నిండు కొలువులో రాజు మంత్రులతో వున్న సమయంలో, ఒక ఆడది, రాజు చెల్లెలు, అంతఃపురంలో వుండాల్సింది, బజారు మనిషిలాగా ఇంతమంది లోకి వచ్చి, ఎవరికేమి కోపం వస్తుందో అని ఏమాత్రం ఆలోచించకుండా, మాట్లాడినపుదే శూర్పనఖ సిగ్గు, బిడియం విడిచిందని స్పష్టమైంది. ఇంతవరకు శూర్పనఖ తన పరాభవ కారణం కానీ, పరాభవించిన వాడి పేరుకానీ చెప్పలేదు. ఎందుకు? ఆ విషయం ముందే చెప్తే, ఆమెను అవమానించిన కారణాన తనను దూషిస్తున్నదని అభిప్రాయ పడతాడేమో! అలాంటి అభిప్రాయం కలిగితే, తాను చెప్పినట్లు చేయకపోవచ్చేమో అన్న అనుమానం. చేయకపోతే రాముడిని పరాభావించాలన్న తన కోరిక తీరదు కదా! దశరథుడి విషయంలో కైక ఎలాంటి ఉపాయం చేసిందో అలాగే శూర్పనఖ కూడా ఇక్కడ చేసింది. అక్కడ కామం...ఇక్కడ కోపం).

No comments:

Post a Comment