ప్రతిష్టాత్మకం తెలంగాణ సాగునీటి
ప్రాజెక్టుల నిర్మాణం
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక
(11-01-2018)
ఉమ్మడి
అంధ్రప్రదేశ్ ప్రభుత్వ పుణ్యమా అని, రాష్ట్రం
ఏర్పడేనాటికి తెలంగాణలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని, కరువుని,
వలసలను నివారించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఒక కోటి ఎకరాలకు
పైగా సాగునీటి సౌకర్యం కల్పించాలని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని ప్రభుత్వం
లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా పెండింగ్ లో వున్న సాగునీటి ప్రాజెక్టులను
పూర్తి చేసుకోవడం,
వాటిలో కొన్నింటిని
తెలంగాణ అవసరాలకనుగుణంగా రీ-ఇంజనీరింగ్ చేసుకొని పూర్తి చేసుకోవడం, అప్పటి
ప్రభుత్వాలు ఆమోదించి అసంపూర్తిగా మిగిల్చిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసి
నిర్దేశిత ఆయకట్టుకు సాగునీతితో పాటు అవసరాలకనుగుణంగా తాగునీరు అందించడం, గత ప్రభుత్వాల
నిర్లక్ష్యంతో శిథిలమైపోయిన పాత సాగునీటి ప్రాజెక్టులను ఆధునీకీకరించి పూర్తి
ఆయకట్టుకు సాగునీరు అందించడం, తెలంగాణాకు అనాదిగా జీవనాధారంగా ఉన్న గొలుసుకట్టు
చెరువులను పునరుద్దరించి తెలంగాణా గ్రామీణ ఆర్ధిక , సామాజిక ,
సాంస్కృతిక వికాసానికి దోహదం చేయడం జరుగుతున్నది. ఈ
లక్ష్యాల సాధనలో భాగంగా తెలంగాణలో ప్రారంభించి వదిలేసిన 23 భారీ ప్రాజెక్టులని,
13 మధ్యతరహా ప్రాజెక్టులని పూర్తిచేయడానికి ప్రభుత్వం అత్యంత
ప్రాధాన్యతనిచ్చింది. ప్రతిష్టాత్మకంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం
కొనసాగుతున్నది.
కోటి ఎకరాల సాగు
లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన జల సంకల్పం రాష్ట్రంలోని అనేక సాగునీటి
ప్రాజెక్టులకు ప్రాణం పోసింది. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు ఈరోజు దేశానికే మార్గ
నిర్ధేశనం చేస్తున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణానికి, మిషన్ కాకతీయ పనుల కోసం ప్రభుత్వం ఏటా 25 వేల కోట్ల రూపాయల చొప్పున కేటాయించి వ్యయం చేయడం
జరుగుతున్నది. దేశ చరిత్రలో నభూతో అనే విధంగా ఇంత పెద్ద మొత్తంలో సాగునీటి కోసం
ఖర్చు చేస్తున్న రాష్ట్రం మరోటి లేదు. బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి కూడా రుణాలు పొంది, త్వరితగతిన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తున్నది.
నదుల్లో మన వాటా మన
ప్రజలకు పూర్తిగా ఉపయోగపడేలా సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్ కు ముఖ్యమంత్రి
కేసీఆర్ ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. రాష్ట్ర విభజనకు ముందు నదీ జలాల్లో మన వాటా
ప్రకారం మనం నీళ్లు వాడుకోలేకపోయాం. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ వాటా 1,250 టిఎంసీలు. మరో 150 టిఎంసీలకు పైగా మిగులు జలాల్లో తెలంగాణ వాటా ఉంది. కానీ, ఈ నీటిని వాడుకోవడానికి కావాల్సిన ప్రాజెక్టుల నిర్మాణం
కాలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ ని
చేపట్టింది. కోటి ఎకరాలను సాగునీరు అందించడానికి సరైన ప్రణాళికలు రూపొందించింది.
నీరు పుష్కలంగా లభ్యమయ్యే ప్రాణహిత, ఇంద్రావతి నదుల నీళ్లను ఒడిసిపట్టుకుని పంట పొలాలకు
అందివ్వాలన్నదే ప్రాజెక్టుల రీ-డిజైన్ లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన
వ్యాప్కోస్ ద్వారా ప్రభుత్వం కూలంకశంగా
సర్వే చేయించింది. లైడార్ సర్వేలు చేయించి, సరైన ప్రణాళికలతో ప్రాజెక్టులు కట్టాలని నిర్ణయించింది
ప్రభుత్వం. దక్షిణ తెలంగాణకు పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాల ద్వారా, ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లివ్వాలని
ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటు ప్రాణహిత ప్రాజెక్టు, చనాకా కోరాట ప్రాజెక్టుల
ద్వారా ఆదిలాబాద్ జిల్లాకు, సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకు సాగునీరు
అందిస్తారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తున్నారు.
గోదావరి, ప్రాణహిత, పెన్ గంగ నదులపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం
కూడా సహకరిస్తున్నది. 2016 మార్చి 8న మహారాష్ట్రతో
అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక అవగాహన కుదుర్చుకుని
వచ్చారు. రెండు రాష్ట్రాల్లోని ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై
వచ్చే సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునేందుకు అంగీకారం కుదిరింది.
ఫలితంగా ఉమ్మడి అంతర్ రాష్ట్రీయ బోర్డు ఏర్పాటయింది. గోదావరిపై మేడిగడ్డ, ప్రాణహితపై తమ్మిడిహట్టి, పెన్ గంగపై రాజాపేట, చనఖా- కొరాటా, పింపరాడ్ బ్యారేజీల నిర్మిణానికి మార్గం సుగమం అయింది. గోదావరి నదిపై మూడు బ్యారేజీల నిర్మాణానికి
తెలంగాణ,
మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య జరిగిన తాజా ఒప్పందాలతో గోదావరిలో హక్కుగా ఉన్న 954 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం లభించింది.
తెలంగాణ రైతులకు
జీవధారగా మారే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 235 టీఎంసీల నీళ్లు అందుబాటులోకి వస్తాయి. గోదావరి నది నుంచి 90 రోజులపాటు రోజూ రెండు టీఎంసీల నీరు చొప్పున 195 టీఎంసీల నీటిని మళ్లించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ
ప్రాజెక్టు నీటితో రాష్ట్రంలో 40 లక్షల ఎకరాలకు పైగా సాగునీరందనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
రాత్రింబవళ్లూ యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. బ్యారేజీ, రిజర్వాయర్ నిర్మాణానికంటే ముందే పంపుహౌజ్‌లు నిర్మించి, గోదావరి జలాలను ఎత్తిపోయడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఒకవైపు పంపుహౌజ్‌లు, బ్యారేజీల స్థలాల పరిశీలనపై కసరత్తు చేయడంతో పాటు మరో వైపు
పంపులు,
మోటర్ల తయారీ నిర్ణీత సమయంలోనే పూర్తయ్యేలా చర్యలు
తీసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 80 వేల ఎకరాల భూమిని సేకరించగా, ఇందులో 7,828 ఎకరాల అటవీభూమి ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 20 లిఫ్టులను నిర్మిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన 12 బ్లాకుల్లో 1531 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వలు,
203 కిలోమీటర్ల మేర సొరంగాల పనులు
రాత్రింబవళ్లూ సాగుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు 4 వేల మందికి పైగా కార్మికులు నిరంతరం షిఫ్టుల వారీగా
పనిచేస్తున్నారు.
ఖమ్మం జిల్లా
ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం రోళ్లపాడు గ్రామం వద్ద శ్రీ
సీతారామ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం
జిల్లాలోని మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం డివిజన్లు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి, ఖమ్మం డివిజన్లలోని అటవీప్రాంతాలలో సీతారామ ప్రాజెక్టులో
భాగంగా కాల్వలు, సొరంగ
మార్గాలు,
విద్యుత్ లైన్ల ఏర్పాటుకు అటవీ సంరక్షణ చట్టం కింద
అనుమతులనిచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం 11 నెలల రికార్డు సమయంలో
పూర్తి చేసిన సాగునీటి పథకం, భక్త రామదాసు పథకం. ఖమ్మం జిల్లా పాలేరులో
భక్త రామదాసు ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భూసేకరణలో జాప్యం
జరగకుండా చర్యలు చేపట్టారు. పైపులైన్లు, పంప్‌హౌజ్, అప్రోచ్ ఛానల్, సబ్‌స్టేషన్ల
నిర్మాణాన్ని సమాంతరంగా చేపట్టారు. సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని కేవలం 100 రోజుల్లోనే పూర్తి చేశారు. మంత్రులు, అధికారులు, ఇంజినీర్లు, వర్కింగ్
ఏజెన్సీలు సమన్వయంతో పనిచేసి కేవలం 11 నెలల కాలంలోనే పథకాన్ని పూర్తి చేసి దేశ చరిత్రలో రికార్డు
సృష్టించారు. నిర్దేశించుకున్న లక్ష్యాని కంటే 2 నెలల ముందుగానే ప్రాజెక్టు పూర్తి చేశారు. 2017 జనవరి 23వ తేదీన ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. భక్త రామదాసు పేరిట
నిర్మించిన ఈ ప్రాజెక్టును 2017 జనవరి 31న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ పథకం ద్వారా
తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్, మహబూబాబాద్
జిల్లా డోర్నకల్ మండలాలకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 60 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు వరప్రదాయని పాలమూరు–రంగారెడ్డి
ఎత్తిపోతల పథకం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
రూ. 35 వేల
కోట్ల వ్యయంతో నిర్మించనున్నఈ పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. పాలమూరు
ప్రాజెక్ట్ పూర్తయితే మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 1100 గ్రామాలకు, హైదరాబాద్ కు తాగునీరు అందుతుంది. ఐదు దశల్లో నీటిని
ఎత్తిపోసి సాగు, తాగు
అవసరాలు తీర్చేలా ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. మొదటి దశ ఎత్తిపోతలతో నార్లాపూర్
జలాశయానికి , అక్కడి
నుంచి రెండో దశలో ఏదుల రిజర్వాయర్ కు ఆరున్నర టీఎంసీల నీటిని మళ్లిస్తారు.
మూడోదశలో వట్టెం ప్రాజెక్టుకు, అక్కడి నుంచి గ్రావిటీతో కరివెన జలాశయానికి
నీటిని పంపేలా ఇంజనీర్లు డిజైన్ చేశారు. నాలుగో దశలో 5 లక్షల 42 వేల ఎకరాలకు సాగునీటితోపాటు హైదరాబాద్ కు తాగునీరు అందించనున్నారు. ఐదో దశలో
ఉదండాపూర్ జలాశయం నుంచి నీటిని మళ్లించి
లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ నింపుతారు. దీంతో 4 లక్షల 13వేల ఎకరాలకు సాగునీరందుతుంది.
ఎన్నో ఏళ్లుగా
ఫ్లోరైడ్ తో బాధపడుతున్న నల్లగొండ జిల్లా ప్రజల కోసం డిండి ప్రాజెక్టు చేపట్టాలని
ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 3.41 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో 2 జిల్లాలకు ప్రయోజనం చేకూరనుంది. ఉమ్మడి రాష్ట్రంలో మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, స్వరాష్ట్రంలో మూడేండ్లలోనే కార్యరూపం దాల్చింది. తెలంగాణలో
కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. మన
రాష్ట్రానికున్న నీటి కేటాయింపులకు అనుగుణంగా కాళేశ్వరం, పాలమూరు, డిండి, శ్రీ
సీతారామ ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన నిర్మించడానికి ప్రభుత్వం అహర్నిశలూ కృషి
చేస్తున్నది. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉండి నత్తనడకన నడుస్తున్న ప్రాజెక్టుల పనులను
ప్రభుత్వం వేగవంతం చేసి, నిధులు
కేటాయించింది.
రాష్ట్రంలో
నిర్మిస్తున్న నీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా
బాధ్యతలు స్వీకరించిన తక్షణమే కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం, ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన పథకంలో భాగంగా చేపట్టిన నిర్మాణాలపై కూలంకశంగా చర్చించారు.
అధికారులకు తగు సూచనలు చేశారు. కాళేశ్వరం పనుల్లో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో
సహించేది లేదని ఆయన హెచ్చరించారు. పనులను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రాజెక్టు
పరిధిలోని బ్యారేజిలు,
పంపుహౌజుల నిర్మాణ ప్రాంతాలను సందర్శించారు సీఎం.
రిటైర్డ్ చీఫ్
ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రిటైర్డు ఇంజనీర్ల బృందం
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు,
పంపుహౌజుల నిర్మాణ పనులను పరిశీలించింది. ముఖ్యమంత్రి
సందర్సన అనంతరం, కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజిలు, పంపుహౌజుల నిర్మాణాలన్నీ మార్చి చివరి నాటికే పూర్తి చేయాలని ఆయన ఇరిగేషన్
అధికారులను,
వర్క్ ఏజెన్సీలను ఆదేశించారు. గోదావరిలో కాపర్ డ్యామ్
ఏర్పాటు చేసుకుని ఏప్రిల్ నెలలో ట్రయల్ రన్ నిర్వహించాలని చెప్పారు. ఈ
వర్షాకాంలోనే గోదావరి నీటిని మిడ్ మానేరు
వరకు ఎత్తిపోసేలా ప్రణాళిక వేసుకుని, అమలు చేయాలని
సూచించారు. రైతులు సాగునీటి కోసం ఎన్నో
ఆశలతో ఎదురుచూస్తున్నారని,
వారి ఆకాంక్షలకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలని అధికారులకు సూచించారు.
మేడిగడ్డ,
అన్నారం, సుందిళ్ల బ్యారెజ్ ల
నిర్మాణంతో పాటు పంపుహౌస్ ల నిర్మాణం పనులు, మోటార్ల ఏర్పాటు పనులన్ని
సమాంతరంగా పూర్తి కావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మార్చి 31 వరకు ప్రధానమైన పనులన్ని పూర్తిచేసి ఏప్రిల్, మే నేలల్లో ఇతర సమస్యలన్నింటిని పరిష్కరించుకుని ఎట్టి పరిస్థితుల్లోను జూన్
లో సాగునీరు అందించడానికి సిద్ధం కావాలని సీఎం సూచించారు.
No comments:
Post a Comment