గుణాత్మక మార్పునకు సర్వం
సన్నద్ధం
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(04-01-2018)
సుమారు పది నెలల క్రితం భారత
దేశంలో గుణాత్మక మార్పుకు పిలుపిచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్
రావు ఆ దిశగా సర్వం సన్నద్ధం చేయడానికి తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రాష్ట్ర
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎన్నికల వాగ్దానాల అమలుకు శ్రీకారం
చుట్టిన కేసీఆర్, ఆ తరువాతి ప్రాధాన్యతా క్రమంలో దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు
కొరకు అడుగులు వేశారు. అందులో భాగంగా ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని వారి-వారి
రాజధానుల్లో కలిశారు. బీజేపీ, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్
ఏర్పాటుకుమార్గం సుగమం చేయడానికి వారిద్దరితో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఫెడరల్
ఫ్రంట్ ఏర్పాటు దిశగా వారి మద్దతు పొందిన కేసీఆర్ తమ సమావేశాలు ఫలప్రదమైనట్లు
సంకేతాలిచ్చారు. కేవలం రాజకీయరంగ ప్రముఖులనే కాకుండా ఆర్ధిక, సామాజిక రంగ
నిపుణులను కూడా కేసీఆర్ కలుస్తున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి
కాని-దాని సారధ్యంలోని ఎన్డీఏకు కాని, కాంగ్రెస్ పార్టీకి
కాని-దాని సారధ్యంలోని యూపీఏకి కాని పార్లమెంటులో మెజారిటీ స్థానాలు లభించే
అవకాశాలు మృగ్యమవుతున్న పరిస్థితుల్లో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత
ఉందనాలి. కాకపోతే, ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్
గురించి తనకేం తెలియదని ఒక వార్తా సంస్థకు అమాయకంగా చెప్పిన మోడీ ఆంతర్యం ఆయనకే
అర్థం కావాలి.
కేసీఆర్
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, భవిష్యత్ లో ఒకవైపు దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు
తేవడంతో పాటు మరోవైపు కేంద్ర-రాష్ట్ర సంబంధాలలో ఒక నూతనాధ్యాయానికి
నాందిపలకడానికి కూడా దోహదపడుతుందనాలి. ముఖ్యమంత్రి
చంద్రశేఖర రావు కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో పలుసందర్భాలలో వెలిబుచ్చిన అభిప్రాయాలు యావద్భారత
దేశం దృష్టిని ఆకర్షించడంతో పాటు, జాతీయ స్థాయిలో విస్తృత స్థాయి చర్చకు దారితీసే అవకాశాలులేకపోలేదు. కేంద్రప్రభుత్వం సమస్త అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకోకుండా,
రాష్ట్రాలకు వికేంద్రీకరించి, సుపరిపాలనకు మార్గం సుగమం
చేయాల్సిన తరుణం కూడా ఆసన్నమైంది.
ఇదిలా వుండగా, ఆద్యతన భవిష్యత్ లో, రెండు-మూడు నెలల్లో, లోక్ సభకు, ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఏం జరగబోతుందో ఇప్పుడిప్పుడే ఊహించడం
కొంత సాహసమే అయినప్పటికీ, ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నవనేది తధ్యమే అనాలి.
పరిస్థితి తప్పకుండా మారుతుంది. మోడీ మళ్లీ అధికారంలోకి రావడం అంత తేలికైన విషయం
కాకపోవచ్చుకూడా! అందులో సందేహం లేదు. ఒకవైపు ఇటీవల మూడు రాష్ట్రాలలో బీజేపీ ఓటమి,
మరోవైపు సంగ్ పరివార్ చూపు మోడీ నుండి గడ్కరీవైపు మారిందన్న వార్తలు బీజేపీ ఓటమికి
దారితీయవచ్చు.
రాబోయే ఎన్నికల అనంతరం,
ప్రాంతీయ పార్టీల సారధ్యంలో-అండదండలతో, ఎన్డీయేతర-యూపీయేతర సంకీర్ణ ప్రభుత్వం రావడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం వున్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కాని, యూపీఏ
భాగస్వామ్య పక్షాలు కాని ఎన్నికలయ్యేంతవరకు బీజేపీతో, కాంగ్రెస్
తో కలిసి వున్నా, ఆ తరువాత స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే
అవకాశాలున్నాయి. ఎప్పటికీ అటు కాంగ్రెస్ వారినో, లేదా
బీజేపీ వారినో ఎందుకు ప్రధాని చేయాలి? తమలోనే ఒకరు
కాకూడదా అనే అభిప్రాయానికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పటి
నుంచే కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ, బిజెపి సారధ్యంలోని
ఎన్డీయే, మూడో, నాలుగో
ఫ్రంటులు రాబోయే ఎన్నికల కోసం ఎవరి వ్యూహంలో వారున్నారు. కాంగ్రెస్ పార్టీని-యుపిఎని వీడిన అలనాటి
మిత్ర పక్షాలు కాని, ఇంకా కలిసి వున్న ఇతర చిన్న-చితకా పార్టీలు కాని రాబోయే లోక్ సభ ఎన్నికలలో ఉమ్మడిగా కాంగ్రెస్
పార్టీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా వున్నట్లు కనిపించడం లేదు. అదే పరిస్థితి బీజేపీది కూడా. కాంగ్రెస్, బీజేపీ
పార్టీలు కూడా అవి తమతో కలిసి ఎన్నికల ముందు అవగాహన కుదుర్చుకుని పోటీ చేసే కంటే, అవి వేరుగా పోటీ చేసి, వీలై నన్ని
స్థానాలు గెల్చుకుని, ఎన్నికల అనంతరం సంకీర్ణంగా
ఏర్పడితే మంచిదన్న ఆలోచనలో వుంది.
ఈ నేపధ్యంలో, జాతీయ రాజకీయాలకు తన అవసరం కావాల్సి వస్తే
దాన్ని గొప్ప గౌరవంగా భావిస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కొన్నాళ్ళ క్రితం ప్రకటించడం విశేషంగా పరిగణించాలి. దేశానికి ఒక కొత్త
దిశానిర్దేశం అవసరమనీ, దేశ ప్రజలు ప్రబలమైన మార్పు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఏడు
దశాబ్దాల కాంగ్రెస్-బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. ఒకానొక సందర్భంలో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ జాతీయ రాజకీయాలపై తన స్పందనను
వ్యక్తపరిచారు. కాంగ్రెస్,
బీజేపీ దొందూ దొందేనని దుయ్యబట్టారు. రెండుపార్టీలు మార్చిమార్చి
దేశాన్ని పరిపాలిస్తున్నా పథకాల పేర్ల మార్పిడి తప్ప ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఒరిగిందేమీలేదని ఆగ్రహం తెలియపర్చారు. ప్రత్యామ్నాయ
రాజకీయ సంఘటన గురించి ప్రస్తావిస్తూ, దేశ రాజకీయాలలో
గుణాత్మక మార్పు రావాల్సిన ఆవశ్యకత గురించి జాతీయ స్థాయిలో సంప్రదింపులు
జరుపుతున్నానని చెప్పారు. ఆవిర్భవించిన అనతికాలంలోనే అధికారం అందుకున్న రాజకీయ
శక్తుల చరిత్ర గురించి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పటికే ఈ దిశగా ఆలోచనలు
కొనసాగుతున్నాయని తానూ జాతీయస్థాయికి వెళ్లాల్సి వస్తే బాజాప్తా పోతామని
కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేసారు.
“దేశంకోసం పనిచేసే
హక్కు మాకు లేదా?”
అని సీఎం ప్రశ్నించారు. మీడియాతో జరిపిన సుదీర్ఘ సంభాషణలో ఆయన
దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఆవశ్యకత గురించి పదేపదే నొక్కిచెప్పారు. ప్రబలమైన
ఆవశ్యకత ఉన్నప్పుడు ఎలాంటి మార్పులు వచ్చాయో చరిత్ర చెప్తున్నదని సీఎం కేసీఆర్
అన్నారు. జనతా పార్టీ పుట్టడం…ఎన్నికల్లో స్వీప్ చేయడం రోజుల్లో జరిగింది.
ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ కొద్ది నెలల్లోనే స్వీప్ చేసింది. ఇక టీఆర్‌ఎస్
పుట్టిన కొద్ది రోజుల్లోనే పంచాయతీ ఎన్నికల్లో స్వీప్ చేసింది. ఎక్కడ ఎప్పుడు ఏం
జరుగుతుందో.. ఎలా ప్రారంభమవుతుందో చెప్పలేం. కానీ సమయం నిర్ణయిస్తుంది. పనిమాత్రం
ఆగదు అని పేర్కొన్నారు.
దేశంలో రాజకీయ
పరివర్తన తీసుకురావడానికి తనవంతు కృషిచేస్తానని, మార్పు విషయంలో
నాయకత్వం వహించాల్సి వస్తే తప్పక ఆలోచిస్తానని స్పష్టంచేశారు. “బీజేపీ, కాంగ్రెస్ రెండూ దొందూదొందే. దేశంలో గుణాత్మకమైన మార్పు రావడం లేదు.
రావాల్సిన అక్కర ఉన్నది. చాలా సీరియస్‌గా దేశంలో ఏదో ఒకటి జరుగాల్సి ఉంది. 70
ఏండ్ల నుంచి దేశం ఇదే మూసలో పోవాల్సిన అవసరం లేదు. దేశ రాజకీయాల్లో అనేక విషయాల్లో
ప్రబలమైన మార్పు రావాలి. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరముంది.
ప్రజలు దానికోసం ఎదురుచూస్తున్నరు. విసిగిపోయారు. 70 సంవత్సరాలు గడిచిపోయినయి.
తక్కువ సమయం కాదు. చాలా సుదీర్ఘ సమయం. అందుకే మార్పుకు శ్రీకారం చుట్టబడుతుంది. ఒక
ఆరు సంవత్సరాల తక్కువ సమయాన్ని మినహాయిస్తే, మిగిలిన 64
సంవత్సరాలు పూర్తిగా కాంగ్రెస్ లేదా బీజేపీ పాలించాయి. జాతికి వాళ్లు ఏం సమాధానం
చెప్తారని నేను సీరియస్‌గా డిమాండ్ చేస్తున్న. 70 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో
తాగేందుకు నీళ్లు లేవు. ఇది నిజం కాదా? అబద్ధమా? ఎన్ని రోజులు ఈ స్టోరీలు వింటం? దేశ
రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాల్సి ఉంది. వందశాతం దేశంలో గుణాత్మక మార్పు
రావాలనే దానికి నేను కట్టుబడి ఉన్న. దేశంలో ఓ ప్రశ్న వినిపిస్తున్నది. కాంగ్రెస్
పోయింది...బీజేపీ వచ్చింది. కానీ ఏం మార్పు తెచ్చింది? ఏం
జరిగింది? పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నరు”.
“అధికారంలోకి
ఎవరొచ్చినా, పథకాల పేరు మార్పు మాత్రమే జరుగుతది. జాతీయ రాజకీయాలకు కేసీఆర్
అవసరమైతే.. దేశం కోసం పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తాను. దేశానికి ఒక కొత్త
దిశానిర్దేశం అవసరం. దేశ ప్రజలు పరివర్తన కోరుకుంటున్నారు. అందుకు వారిని
సిద్ధంచేయాలి. గుణాత్మకమైన మార్పురావాలి. అన్ని రంగాల ప్రజలను ఆదుకోవాలి. దేశ
రాజకీయాల్లో మార్పురావాలి. అది గుణాత్మకంగా ఉండాలి. ఇవి అందరి మనసులో ఉంది. ఎక్కడ
ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలా ప్రారంభమవుతుందో చెప్పలేం.
కానీ సమయం నిర్ణయిస్తుంది. పని మాత్రం ఆగదు. జాతీయ రాజకీయాల గురించి ఇప్పటికే
ఆలోచనలు కూడా ప్రారంభమయ్యాయి. మాట్లాడేవారు మాట్లాడుతున్నారు”.
“ప్రస్తుత రాజకీయ
వ్యవస్థ దారుణంగా విఫలమైంది. దేశ రాజకీయాల్లో ప్రబలమైన మార్పు రావాల్సిన అవసరం
ఉంది. ఇందుకు ప్రజల ఆలోచనల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో
గుణాత్మక మార్పుల కోసం ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడుతున్నా. భారత రాజకీయ
పరివర్తనలో మార్పు తీసుకరావడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. మార్పు విషయంలో
నాయకత్వం వహించాల్సి వస్తే తప్పక ఆలోచిస్తా. జాతీయ రాజకీయాలకు నాయకత్వం వహించే
అవకాశం వస్తే తెలంగాణవాదులంతా గర్వపడాలి. భగవంతుడి ఆశీస్సులు ఉంటే దేశ రాజకీయాల్లో
ప్రబలమైన మార్పు తీసుకొచ్చేందుకు కృషిచేస్తా. త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుంది”.
ఆ కృషిలో భాగం రానున్న లోక్ సభ
ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలదే పైచేయి కానుంది. ఎన్నికల అనంతరం యుపిఎ, ఎన్డీఏలు తమదైన
శైలిలో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తాయి. అవి ఫలించే అవకాశాలు ఏ మాత్రం లేవు. ప్రాంతీయ పార్టీలలో ప్రస్తుతం చాలా వరకు, యుపిఎ, ఎన్డీఏ లలో ఏదో ఒక దాంట్లో
భాగస్వాములుగా వున్న పార్టీలే. ఇవన్నీ ఫెడరల్
ఫ్రంట్లో భాగాస్వాములయ్యే అవకాశాలున్నాయి. అన్నీ కలిసి సుమారు 250 కి పైగా స్థానాలు గెల్చుకునే అవకాశం కూడా వుంది. ఇదే జరుగుతే జాతీయ పార్టీల
పరిస్థితి డోలాయమానంలో పడినట్లే! అందుకే రాబోయే ది ప్రాంతీయ పార్టీల సంకీర్ణ కేంద్ర ప్రభుత్వం. అందులో టీఅరేస్ పాత్ర కీలకం
కానుంది. ఆ దిశగా కేసీఆర్ తన మాటలకు అనుగుణంగా దేశ రాజకీయాల్లో గుణాత్మక
మార్పు తేవడానికి సర్వం సన్నద్ధం చేస్తున్నారు. మార్పు తధ్యం.
No comments:
Post a Comment