శ్రీరాముడి బలపరాక్రమాలు రావణుడికి చెప్పిన
మారీచుడు
శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-45
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (27-01-2019)
మారీచుడు
రావణుడితో భయపడుతూ ఇలా అంటాడు: “రావణా! లోకంలో,
స్వార్థలాభంతో వినడానికి ఇంపైన ఇచ్చకాయల మాటలు చెప్పేవారు చాలా సులువుగా
దొరుకుతారు. అలాంటివారిని వెతికి తెచ్చుకోవాల్సిన శ్రమ అవసరంలేదు. ఆపత్కాలంలో కూడా
వినడానికి కటువైన, ప్రియంకాకున్నా హితంగా, భవిష్యత్ లో
మేలు చేసే మాటలు చెప్పేవారు-వినేవారు దొరకడం దుర్లభం. ఒకవేళ ఎదుటివారి మేలుకోరి
చెప్పేవాడు దొరికినా, వినేవాడు దొరకడు. కాబట్టి నేను చెప్పబోయే మాటలు వినడానికి
అప్రియమైనా, రాబోయే
రోజుల్లో మేలుచేస్తాయి కనుక వాటిని ఉపేక్షించవద్దు. రావణా! రామచంద్రుడితో విరోధం
వద్దని మొన్ననే నేను చెప్పాను. సరే అని అంగీకరించి పోయావు. ఇంతలో మనస్సు
మార్చుకొని మళ్లీ వచ్చావు. ఇలాంటి చపలచిత్తుడు నేనేం చెప్పినా ఎలా వినగలడు? లాభపడగలడు? అయినా నీ
మేలు కోరేవాడిని కాబట్టి నీకు లాభం చేకూరే మాటలనే చెప్తా”.
“నీకు
లోకంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో వెంటవెంట తెలియచేసే వేగులవాళ్ళు లేరు.
అందువల్ల, గొప్ప
పరాక్రమవంతుడు, సుగుణ
సంపత్తితో అధికుడు, వరుణుడితో, ఇంద్రుడితో బలంలో సమానుడైన రాముడి
వృత్తాంతాన్ని నీవెరుగవు. నువ్వు రామచంద్రుడికి కోపం కలిగించే పనులు చేయొద్దు.
ఆయనకే కోపం వస్తే లోకంలో రాక్షస జాతి అనేది పేరుకుకూడా వుండదు. లోకంలో సాధారణంగా
ప్రాణులు నేలమీద పది ప్రాణాలు విడుస్తారు. నీకు అంత అవకాశం కూడా ఇవ్వకుండా,
నిలుచున్నవాడి ప్రాణాలు నిలిచి వుండగానే తీయడానికి సీతాదేవి పుట్టిందో?ఏమో? నీ గతి
ఎలాగైతే అలాగే కావచ్చు. చేసేవాడివి అనుభవిస్తావు. ఆమె పేరుతో నాకేం కీడు కలగకుండా
చూడు. కామమే శీలంగాకల నువ్వు రాజైనందువల్ల లంకాపురం కష్టాల పాలు కాకుండా వుంటుందా? ఎట్లాగూ
అవుతుంది. మనసుకు ఏదిష్టమైతే అదే చేసే నీలాంటివారి బంధువులందరూ నాశనమై పోరా? నీ లాంటి
చెడు బుద్ధికలవాడు, కఠినస్వభావం కలవాడు, పాపపు
ఆలోచనలు కలవాడు, ప్రభువై
చెప్పినా తెలుసుకోలేనివాడు, స్వాపస్వాపరాథం వల్ల తాను చెడడమే కాకుండా
రాజ్యంలోని ప్రజలందరినీ చెరుస్తాడు”.
“రావణా!
రామచంద్రమూర్తిలో నువ్వు ఆరోపించిన దోషాలు ఒక్కటైనా లేవు. ఆయన నీచ క్షత్రియుడు
కాదు. కుత్సిత స్వభావం కలవాడు కానే కాదు. లోభి కాడు. ధర్మగుణ సమూహం లేనివాడు కాదు.
తీక్ష్ణుడు కాదు. భూతాలకు సహితం కీడు చేయడయ్యా...చేయడు. తండ్రి కోపంతో పొమ్మంటే
అడవికి రాలేదు...స్వయంగా ఆయనే పితృ వాక్య పాలన కోసం వచ్చాడు. నీకెవరు అలా చెప్పారో
కాని అవన్నీ అసత్యాలే. రామచంద్రమూర్తి కఠినచిత్తుడు కాదు. విద్యలేనివాడు కాదు.
ఇతరుల ఇష్టప్రకారం మసలుకుంటాడు. ఇది నిజం. ఎందుకు లేనివి కల్పించి వున్నవి
తారుమారుగ చెప్తావు నాయనా? ఇక రామచంద్రమూర్తిని గురించి వాస్తవం చెప్తా
విను. రామచంద్రమూర్తి ఆకారంగొన్న గొప్ప ధర్మం. యుద్ధంలో పరాజయం లేనివాడు. సత్యమైన
శౌర్యం కలవాడు. మోసపు యుద్ధాలు ఆయన చేయడు. దేవతలకు ఇంద్రుడు ఎలాగో, సమస్త జగాలకు
ఆయన ఆవిధంగా ప్రభువు. మంచి మనస్సు కలవాడు. సూర్యుడి కాంతిని అపహరించే విధంగా
రాముడి నుండి సీతను వేరు చేద్దామని చూస్తున్నావా? ఇది నీకు
సాధ్యమా?
రామచంద్రమూర్తి వల్ల ఆమె రక్షించబడుతున్నది. రాముడి నుండి వేరు చేస్తే రక్షకుడు
లేనందువల్ల నువ్వు చెప్పినట్లు వింటుందని అనుకుంటున్నావు. ఆమె తన పాతివ్రత్యంతో
తనను తానూ కాపాడుకుంటున్నది. తన రక్షాభారం ఇతరుల మీద వేయలేదు. కాబట్టి నువ్వు
అపహరించినా ఆమె నీకు లోబడుతుందని భావించకు. తమను తాము కాపాడుకోలేని వారేకదా
పరరక్షణ కోరేది? కాబట్టి నీ
ఉద్దేశం కొనసాగదు”.
“సీతాదేవిని
నువ్వు అపహరించాలని చూస్తున్నావు. ఆమె సమీపంలోకి నువ్వు పోగలిగితే కదా....నువ్వు
ఆమెను అపహరించడం? ఆమెను రాముడనే అగ్నిహోత్రం చుట్టుకొని రక్షిస్తున్నది. ఆ
అగ్ని ఎలాంటిదంటావా? దానికి బాణాలే జ్వాలలు. దూరంగా వుండగానే దహిస్తాయి. ఇక
దగ్గరికి పోయి బతికేదెలా? ఆ అగ్నిని ప్రజ్వలించేది ధనస్సు. ఇలాంటి అగ్ని
నివురు కప్పి వున్నదని అనుకుంటున్నావేమో? అది భగ-భగ మండుతూనే
వుంది. ఇలాంటి అగ్నిలో మిడుతలాగా పోయి ఎందుకు చావాలనుకుంటున్నావు? తండ్రీ!
విల్లనే మండుతున్న నోరు కలవాడిని, గొప్ప అస్త్రం అనే శిఖలు కలవాడిని, సీతను నువ్వు
అపహరించాలనుకున్నందున కోప్పడ్డవాడిని, ప్రకాశించే పాశం
ధరించినవాడిని,
శత్రుసమూహాలను సంహరించే వాడిని, సీతాపతి అనే యముడిని సమీపించడానికి, సుఖం, రాచకార్యం, ప్రాణాలు
అన్నీ వదిలి,
నాయనా
ఎందుకు పోతావు?”
“జనకాత్మజ
సంబంధమున రాముం డప్రమేయ పురుతేజుం డయ్యెను....సీతాదేవి సంబంధమున చేసి రాముడు
ఛేదింపరాని గొప్ప తేజం కలవాడయ్యాడు. అలాంటి రాముడి విల్లు రక్షిస్తుంటే సీతను
తేవడం నీకు సాధ్యమా? సింహం రొమ్ములాంటి విశాల వక్షస్థలం కలవాడు, పురుష శ్రేష్టుడైన
శ్రీరాముడి భార్యను, సత్యశీల సంపన్నను, పాపచరిత్ర
లేనిదాన్ని సమీపించవద్దు. నీ మేలుకోరి చెప్తున్నాను. రావణా! నువ్వు రాక్షస
సింహుడివి. ఆయన నరసింహుడు. హిరణ్యకశిపుడు అంతటివాడు నరసింహుడి బారినపడి ఏమయ్యాడో
తెల్సుకదా? అలాంటివాడు
రక్షించే దాన్ని, కొంచెమైనా పాపం అనేది లేనిదాన్ని నువ్వు సమీపించవద్దు.
నువ్వు రాముడికి కోపం వచ్చినా చెడుతావు....సీతకు కోపం వచ్చినా చెడుతావు. ఇక, ఇరువురికీ
కోపం వస్తే నీ గతేంటి? ఆలోచించి ఆ వైపుకు వెళ్లు”.
“సీతంటే
ఏమనుకుంటున్నావు? రామచంద్రమూర్తి ఆమెను తన ప్రాణం కంటే ప్రియమైనదిగానూ, హితమైనదిగానూ,
రక్షిస్తున్నాడు. అలాంటి సీతను నువ్వు అజ్ఞానివై, వలచి,
గ్రహించాలనుకోవడం కార్చిచ్చు నెత్తిన పెట్టుకోవడమే. నీ ప్రయత్నం నీకు మరణాంతకం
అవుతుందే కాని మానదు. అలా పోకపోతే నీకు క్షేమం కలుగుతుంది. వారంతట వారు నీమీదకు
రారు. కాబట్టి నీకా భయం లేదు. రాక్షసరాజా! రామచంద్రమూర్తితో విరోధిస్తే నీ కోరికలు, రాజ్య భోగాలు, సుఖాలు, ప్రాణం, వీటిలో
ఒక్కటైనా మిగలదు. కాబట్టి నీకింకా కొంతకాలం సుఖపడాలనుకుంటే,
రామచంద్రమూర్తి మనస్సు నొచ్చుకునే పనేమీ చేయొద్దు. నిన్ను నేను ప్రార్థిస్తున్నాను.
నువ్వు లంకకు వెళ్లిపో. అక్కడ నీ మేలుకోరే విభీషణుడులాంటివారిని రహస్యంగా కాకుండా
నిండు సభలో చూడు. నువ్వు అనుకున్న పనిలో గుణమెంతో వాళ్లు చెప్తే విను. దాంట్లో ఏది
బలమో, ఏది దుర్బలమో, నీ బలమెంతో, రాముడి
బలమెంతో నిశ్చయం చేసుకో. ఆ తరువాత ఇది మనకు మేలనీ, ఇది మనకు
కీడనీ తేల్చుకుని ముందుకుపో. నాకు తోచింది నేను చెప్పాను. రామచంద్రుడిని నువ్వు
యుద్ధరంగంలో సమీపించవద్దు. నా మాట విను. నీకు మేలు కలుగుతుంది”.
No comments:
Post a Comment