జనస్థాన వృత్తాంతం మారీచుడికి చెప్పి సహాయం
కోరిన రావణుడు
శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-44
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (20-01-2018)
దేహాన్ని
గగుర్పాటు కలిగించే భయోత్పాదకములైన శూర్ఫనఖ మాటలు విన్న రావణుడు, మంత్రులతో
ఆలోచించి, కార్యం ఎలా
చేయాలో నిర్ణయించుకొని, వాళ్లను పొమ్మని పంపి, ఎలా
ముందుకుపోవాలో ఆలోచన చేశాడు. రాముడు చేసిన రెండు పనులకు-శూర్ఫనఖను విరూపను చేయడం, ఖరాదులను
చంపడం-ప్రతీకారం తీసుకోకుండా వూరికే వుంటే, తనను
పౌరుషహీనుడని, బలహీనుడని, లోకులు
దేవతలు నవ్వుతారనీ, మానవంతుడికి మరణం కంటే అపకీర్తి చెడ్డదనీ అనుకుంటాడు.
(రావణుడిలా
అనుకుంటాడు: “ప్రాణం పోగొట్టుకొనైనా మానం రక్షించుకోవాలి. కాబట్టి వూరుకోవడం
మానహానికరం. అపకీర్తికరం. ప్రతీకారం చేయాలంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? బహిరంగంగా
యుద్ధానికి పోవాలా? అలా చేస్తే...పదనాలు వేలమంది మహాబలశాలులను ఒక్కడే కాళ్లమీద
నిలబడి మూడు గడియల్లో చంపాడే? అలాంటివాడు సామాన్యుడు కాడే? ఇలాంటి
వాడిని యుద్ధంలో నేనే జయిస్తానని నమ్మకం ఏంటి? కాబట్టి ఇది
అపాయం. వంచన చేసి సీతను అపహరించి తెస్తే....ఎక్కడో వున్న వాళ్లను ఇంటిమీదకు నేనే
తెచ్చినట్లు అవుతుంది. వారిక్కడికి వస్తే వూరికే పోరు. మరో విధంగా ఆలోచిస్తే,
రామలక్ష్మణులు నా గురించి తెలుసుకొనడం, తెలిసినా సముద్రాన్ని
దాటడం, లంకకు రావడం, యుద్ధంలో
గెలవడం, ఇరువురు
మనుష్యులకు అసంభవం. ఒకలా వేళ అలా కాకపోతే, భార్యను
కోల్పోయిన బాధతో, అవమానంతో, చావనే చస్తే మరీ మంచిది. సీతను వశపర్చుకుంటే
నాకే భయం లేదు. ఆ విషయం వాళ్లకు తెలియగానే చస్తారు).
ఇలా
నిశ్చయించుకొని, మనస్సు దృడం
చేసుకొని, గుర్రాలుండే
చోటుకు పోయి, రహస్యంగా
రథాన్ని సిద్ధం చేసి తీసుకొని రమ్మని సారతికి చెప్తే వాడలాగే చేశాడు. ఆయన అనుకున్న
విధంగా పోగలిగే ఆ రథం మీద, పది తలల, ఇరవై చేతుల
రావణుడు, ఆకాశ
మార్గంలో మేఘంలాగా పోయాడు. మార్గమధ్యంలో అనేకానేక సుందర స్థలాలను, వృక్షాలను, మునులను, పక్షులను, అప్సరసలను, గంధర్వులను, దేవతలను, పుణ్యలోకాలను
జయించినవారిని, ఔషధులను, అగరు చెట్లను, వనాలను
చూసాడు. అందమైన ప్రకాశించే ధనధాన్య సమృద్ధికల సుందరమైన సముద్ర తీరాన్ని చూశాడు. ఆ
ప్రదేశంలో మేఘాలతో సమానమైన, నూరామడల పొడవుకల, కొమ్మలున్న
పెద్ద మర్రిచెట్టును చూశాడు. పూర్వం గరుత్మంతుడు స్వర్గానికి పోతూ, తనకు ఆహారంగా
గజకచ్చపాలను తన గోళ్లలో ఇరికించుకుని తటాలున ఆ మర్రిచెట్టు కొమ్మమీద వాలగా, ఆ భారాన్ని
సహించలేక, కొమ్మ
విరిగింది. ఆ కొమ్మను పట్టుకొని వాలఖిల్యాదులు ఆ సమయంలో తపస్సు చేస్తున్నారు.
వాళ్లు తమ తపస్సు విఘ్నమైందని తనను శపిస్తారని భయపడ్డ గరుత్మంతుడు, ఆ కొమ్మను
ముక్కుతో పట్టుకొని త్వరగా పోయాడు. పోతూ, మాంసాన్ని
భుజించి, మునులను
క్షమించమని ప్రార్థించాడు. వాళ్ళు పోయిన తరువాత బోయపల్లెను నాశనం చేశాడు. ఆ
సంతోషంతో రెండింతల బలంతో ఆకాశానికి ఎగిరి, ఇనుప కమ్ముల
కిటికీలు పగలగొట్టి, రాల్చి, మణులతో నిండిన ఇంద్రుడి ఇంట్లోకి పోయి, గరుత్మంతుడు
అమృతాన్ని హరించాడు. అలాంటి గరుత్మంతుడి గుర్తుకల, సుభద్రమనే
పేరున్న మర్రి చెట్టును కూడా చూసి, రావణాసురుడు సముద్రాన్ని దాటాడు.
ఆ వనంలో ఒక
ప్రదేశంలో, నిర్మలమైన
స్థలంలో, మితాహారుడై, చలించని
ఇంద్రియ నిగ్రహంతో, జింక చర్మం ధరించి, జడలతో, నారవస్త్రాలు
కట్టుకుని తపస్సు చేస్తున్న మారీచుడి దగ్గరకు పోయాడు రావణుడు. మారీచుడు అతడిని తగు
విధంగా మర్యాదలు చేశాడు. మళ్లీ ఎందుకు వచ్చావని అడిగాడు రావణుడిని మారీచుడు.
మారీచుడి
ప్రశ్నకు జవాబుగా అనునయంగా ఇలా చెప్పాడు రావణుడు. “తండ్రీ! విశదంగా, వివరంగా
చెప్తా విను. ఆర్తుడనై వచ్చాను. మహాత్మా! నా ఆర్తి పోగొట్టడానికి నువ్వు తప్ప నాకు
వేరే గతి లేదు. నిశాచరశ్రేష్టుడా! నా ఆజ్ఞ మేరకు నా తమ్ములు ఖరుడు, దూషణుడు, ముద్దుల
చెల్లి శూర్ఫనఖ, అతి శూరుడైన
త్రిశిరుడు, పద్నాలుగు
వేలమంది రాక్షసులు జనస్థానంలో వుంటూ, ధర్మాత్ములైన వారిని
బాధలు పెట్టడం నీకు తెలిసిన విషయమే. వారంతా రాముడి మీద కోపంతో ఆయనమీదికి
యుద్ధానికి పోగా, అతడు వారందరినీ ఒంటికాలిమీద నిలబడి చంపాడు. అంతే కాకుండా
మునులంతా దండకారణ్యంలో భయం లేకుండా తిరగొచ్చని చెప్పాడు. తండ్రి వెళ్ళగొట్టితే
భార్యతో అడవుల్లో దుఃఖించే నీచ క్షత్రియుడు, కుచ్చితపు
నడవడి కలవాడు, కోప గుణం
కలవాడు, ఇంద్రియ జయం
లేనివాడు, కరుణా
శూన్యుడు, జీవకోటికి
కీడు చేయాలన్న ఆశ కలవాడు, ధర్మాన్ని వదిలినవాడు, వివేకం
లేనివాడు, రాముడు నాతో
విరోధం లేకున్నా నిష్కారణంగా నా చెల్లెలి ముక్కు-చెవులు బలగర్వంతో కోశాడు”.
రాముడు ఇలాంటివాడు
కాబట్టే,
దేవతాస్త్రీతో సమానమైన సౌందర్యం కల అతడి భార్య జానకిని తీసుకురావడానికి తాను
శీఘ్రంగా పోతున్నాననీ, మారీచుడు తనకు తోడుగా రావాలనీ, తన తమ్ములు, మారీచుడు, తనకు సహాయంగా
వుంటే యుద్ధంలో దేవతలనైనా గడ్డిపోచలాగా చూస్తాననీ, ఇది తన
నిశ్చయం అనీ, అంటాడు
రావణుడు మారీచుడితో. “ఇది నా అభిప్రాయం కాబట్టి నువ్వు నాకు సహాయపడు. శౌర్యంలో, బలంలో, మంచి ఉపాయం
చేయడంలో నీకు సమానమైన వారు లేరు. యుద్ధంలో నువ్వు పన్నని మాయలు లేవు. నువ్వు
ఇలాంటివాడివని తెలిసేకదా నిన్ను చూడడానికి ఇంతదూరం వచ్చాను. నువ్వేం సహాయం
చేయగలనంటావా? నువ్వు
చేయాల్సిన పని చెప్తా విను. బంగారు వన్నె విచిత్రపు చుక్కలు కల జింకవై, రాముడు, సీత వున్నా
చోటుకు పోయి ఆ ప్రదేశంలో సంచరించు. నిన్ను పట్టుకోవడానికి సీత, రామలక్ష్మణులను
పంపుతుంది. అప్పుడు నేను ఒంటరిగా వున్న జానకిని (రాహువు చంద్రకాంతిని హరించినట్లు)
అపహరిస్తాను”. అని అంటాడు రావణుడు.
(రాహువు
చంద్రకాంతిని హరించినట్లు అనడమంటే, రాహువు ఏ విధంగానైతే కొంచెం కాలం లోకానికి
కాంతి కానరాకుండా చేస్తాడో, అలాగే, రావణుడు
కొంతకాలమే సీత లోకానికి కానరాకుండా చేయగలడని భావం. రాహువు చంద్ర బింబాన్ని ఏమీ
చేయలేనట్లు రావణుడు కూడా సీతను ఏమీ చేయజాలడని భావం. లోకంలోని చీకటి చంద్రకాంతి
తగులగానే దాని స్వరూపం లేకుండా పోతుంది. అలాగే సీత సాన్నిధ్యం దొరికనివారు తమ
అజ్ఞానం పోగొట్టుకుని, బాగుపడతారు. రావణుడు సీత సాన్నిధ్యం లభించినా తన
అజ్ఞానాన్ని పోగొట్టుకో లేకపోతాడని భావన).
మారీచుడితో
ఇంకా ఇలా అంటాడు రావణుడు: “భార్య లేకపోవడంతో కృశించి, దుఃఖించే
రామచంద్రుడిని వధించి సుఖంగా, నిర్విచారంగా వుంటాను. మా తండ్రీ! ఈ మాత్రం
సహాయం చేయి”.
రావణుడు
చెప్పిన రాముడి వృత్తాంతాన్ని ఆసాంతం విన్న మారీచుడు,
రామచంద్రమూర్తి శౌర్యం తెలిసనవాడైనందున, తన ప్రాణానికే ముప్పు
వచ్చిందికదా! అని గుండెలు ఝల్లన భయపడ్డాడు. నిశ్చేష్టుడయ్యాడు. తెప్పరిల్లి, వణకుతూ, నోట
తడిలేకపోవడంతో పెదవులు నాకుతూ, ధైర్యం చెడి శవంతో సమానమై పోయి, రావణుడిని
చూస్తూ భయంతో, రెండు చేతులూ
జోడించి, తనకు
క్షేమకరమైన విధంగా ఇలా అంటాడు.
No comments:
Post a Comment