Saturday, January 26, 2019

ప్రియాంక ఆగమనం నెహ్రూ-గాంధీ వారసత్వం కొనసాగింపే:వనం జ్వాలా నరసింహారావు


ప్రియాంక ఆగమనం నెహ్రూ-గాంధీ వారసత్వం కొనసాగింపే!
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (25-01-2019)
వారసత్వ రాజకీయాల కొన సాగింపుకు మరో మారు రంగం సిద్ధమౌతోంది. అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా వున్న సోనియా తనయుడు, నెహ్రూ-గాంధీ కుటుంబ వారసత్వ పరంపరలో ఐదోతరంవాడైన రాహుల్ గాంధీ, పార్టీలోకి తన చెల్లెలును ఒక బాధ్యతాయుతమైన పదవిలోకి తీసుకున్నారు. ప్రధానకార్యదర్శి పదవిని ఆమెకు కట్టబెట్టాడు...అదీ...ఎక్కడో అమెరికాలో వున్న ఆమెను ఒప్పించి మరి అప్పగించాడు. ఇలా ఆమెకు పదవి ఇచ్చారో, లేదో, కాని ఆమెకు మరింత కీలక బాధ్యతలు, నిర్ణయాత్మకమైన బాధ్యతలు అప్పగించాలని ఆ పార్టీ సీనియర్ నేతలు క్యూ కట్టుకుని మరీ డిమాండు చేస్తున్నారు. వారిలో కొందరు నేతలు మరొక్క అడుగు ముందుకు వేసి, 2019 ఎన్నికలలో ఆమెను  ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని అన్నా ఆశ్చర్యం లేదు.

ఏదేమైనా నెహ్రూ-గాంధీ వారసత్వాన్ని పదిలంగా వుంచే ప్రయత్నాలు కొనసాగుతూనే వున్నాయి. 'రావాలి... రావాలి...రావాలి...' అని అందరూ ఆహ్వానిస్తుంటే ఎందుకు రాకూడదని అనుకున్నదేమో ఏమో కాని, వచ్చేస్తున్నానంటూ బదులు పలకనే పలికింది ప్రియాంక. పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించడానికి తాను సిద్ధం అని ఆమె అన్నట్లే లెక్క. 1999 లో ఏ విధంగానైతే, పార్టీ అవసరాల దృష్ట్యా సోనియా గాంధీకి మొదలు సభ్యత్వం, ఆ తరువాత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కట్టబెట్టారో, అదే తరహాలో, ఆమె వారసుడిగా మొదలు రాహుల్ గాంధీ ఎంపిక, ఇప్పుడు ప్రియాంక గాంధీ ఎంపిక జరిగందనాలి.  నెహ్రూ-గాంధీ వారసత్వ రాజకీయాలు భారత దేశానికి కొత్తేమీ కాదు.

రాజకీయాలలో వారసత్వంగా ఎదగ గలిగిన వారు అనేకమంది వున్నారు. దానికి కారణాలు అనేకం. ఎన్.టీ రామారావు లాంటి వారు పటేల్-పట్వారీ వ్యవస్థనైతే రద్దు చేయగలిగారు కాని, వారసత్వంగా ఎదుగుతున్న రాజకీయ పటేల్-పట్వారీలను ఆపు చేయలేకపోయారు.ఇదేదో ఒకరిద్దరి విషయంలోనో-లేక కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి విషయంలోనో జరుగుతే ఆశ్చర్యపడాల్నేమో కాని, భారత దేశ రాజకీయాల్లో సర్వ సాధారణ విషయమై పోయి, ప్రజాస్వామ్యానికే పెను సవాలుగా మారుతుంటే ఆశ్చర్యపడక తప్పదు. రాజకీయాల్లో కీలకమైన పదవులను పొంది, ఉన్నత స్థాయికి చేరుకున్న వారి బంధుగణం అతి పిన్న వయసులోనే, రాజకీయ ప్రవేశం చేసి, చకచకా ఎదగడం సంప్రదాయంగా మారుతోంది. 

అసలు ప్రజాస్వామ్యమే వారసత్వంగా మారుతున్నదా?ఔననక తప్పదు. నెహ్రూ-గాంధీ కుటుంబం జాతీయ స్థాయిలో(మంచికో-చెడుకో) ఈ ప్రక్రియకు బీజాలు నాటితే, దేశవ్యాప్తంగా వాటి మొక్కలు పెరిగి, భారీ వట వృక్షాలుగా వూడలు పెంచి, పెకలించడానికి సాధ్యపడని స్థితికి చేరుకుంది. "వారసత్వం జన్మ హక్కు" అని వాదించే స్థాయికి చేరుకుంది. సుమారు తొంబై సంవత్సరాల క్రితం బ్రిటీష్ ఇండియాలో, న్యూఢిల్లీ నుంచి "సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ"కి ఆ కుటుంబం మొదటి తరం నాయకుడు మోతీలాల్ నెహ్రూ ఎన్నికైన తర్వాత, ఆ కుటుంబానికి సంబంధించిన దాదాపు అందరూ చట్ట సభల్లో అడుగు పెట్టారు. కాకపోతే, అందులో పలువురు వారి-వారి సామర్థ్యాన్ని బట్టే ఆ పదవులకు చేరుకుని వుండవచ్చు. కుటుంబ నేపధ్యం తప్పక ఉపయోగపడిందనాలి.

ఒక తరం నుంచి మరో తరానికి రాజకీయాధికారం బదిలీ అవుతోందిలా. వారసత్వ రాజకీయాలు-కుటుంబ రాజకీయాలు దేశ భవిష్యత్ ను శాసించే దిశగా కదులుతున్నాయి. రాచరిక వ్యవస్థకు సంబంధించిన రాజకీయాలకు అలవాటు బడిన భారతీయులకు, అనాదిగా, రాజులు-మహారాజులు-చక్రవర్తులు తమ తమ కొడుకులను-కూతుళ్లను తమ తదనంతరం సింహాసనం అధిష్టింప చేసేందుకు పన్నే వ్యూహాల గురించిన కథలను విన్నారు. ప్రజాస్వామ్య మౌలిక సిద్ధాంతాలను ఇంకా సరిగ్గా అవగాహన చేసుకోలేని అమాయక భారతీయులు, బహుశా వర్తమాన రాజకీయాలలోనూ, వారసత్వంగా, తమ సంతానం నాయకత్వం చేపట్టడంలో తప్పులేదని భావిస్తుండవచ్చు. అలా మొదటి తరం నాయకులు తమ వారసులుగా సంతానాన్ని తేవడంలో అ నైతికం లేదనే వారి భావన కావచ్చు. అందుకే, స్థానిక సంస్థల నుంచి, ప్రధాన మంత్రి స్థాయి వరకు, వంశ పారంపర్యంగా కొన్ని కుటుంబాలకు చెందిన వారికే రాజకీయాధికారం లభిస్తోంది. 


ఒక్క సారి అధికారంలోకి రావడంతోనే, తమ సర్వ శక్తులను ఒడ్డి, బయట వారెవరినీ రాకుండా, తమ వారినే తమ వారసులుగా చేసే ప్రజాస్వామ్య రాచరిక వ్యవస్థ వేళ్లూనుకోసాగింది. దీని పర్యవసానం ఏంటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. దీనికి అడ్డు కట్ట వేయడం సాధ్యమేనా? భారత దేశంలోని రాజకీయ పార్టీలన్నీ, అవినీతిని ఉత్పత్తిచేసే, వంశపారంపర్య కుటుంబ వ్యవస్థలు. వీటిని పెంచి పోషించే వ్యక్తులు, తమ కుటుంబీకులను తప్ప, వెలుపల వారిని,తమ గుప్పిట్లో వుంచుకున్న పార్టీలోకి అడుగుబెట్టనివ్వరు. లోపలున్న వారి గొంతు నొక్కేసి, అసమ్మతి రాగాన్ని వినిపించకుండా జాగ్రత్త పడతారు. ఫలితంగా అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోవడం,ధన బలం-కండ బలం-కుల, మత బలం ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. ప్రజ్ఞా పాటవాలు-శక్తి సామర్థ్యాలున్న సాటి-తోటి పౌరులు, సమాజానికి ఎంతో సేవ చేయాలని వున్నా, దానికి కావాల్సిన రాజకీయ కుటుంబ నేపధ్యం లేకపోవడంతో, ఎన్నికల్లో పోటీ చేయలేక పోవడం, చేసినా, గెలిచి చట్ట సభల్లో ప్రవేశించలేక పోవడం కష్టమై పోతోంది. ఈ పరిస్థితి ఇలా కొనసాగితే, భారత ప్రజాస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం లేనిది గాను-ప్రజల సాధికారత కొరవడేదిగాను కావడం తథ్యం. ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల సారధ్యంలో ఆయా రాజకీయ నాయకుల కుటుంబ పాలన కొనసాగి, "ప్రజాస్వామ్య సంస్థానాలు" ఆవిర్భవించే ప్రమాదం పొంచి వుంది.

          ఈ ప్రమాదానికి, వారసత్వ సంస్కృతికి కారకులెవరంటే,జవాబుగా కాంగ్రెస్ పార్టీ అని ఎవరైనా వెంటనే చెప్తారు. తండ్రి మోతీలాల్ నుంచి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని వారసత్వంగా పొందిన జవహర్లాల్ నెహ్రూ, వ్యూహాత్మకంగా-పకడ్బందీగా కుటుంబ వారసత్వ పాలనకు, ఆయన ప్రధానిగా వున్న కాలంలోనే పునాదులు వేశారు. కూతురు ఇందిర ప్రధాని కావాలని నెహ్రూ భావించారు. ఆయన కోరిక నెరవేరింది. ఇందిరా గాంధీ కూడా తండ్రి-తాత బాటలోనే పయనించింది. మొదట సంజయ్ గాంధీని,తర్వాత రాజీవ్ గాంధీని తెర పైకి తెచ్చింది తన వారసుడిగా. ఎమర్జెన్సీ ముందర, తర్వాత సంజయ్ గాంధీ ప్రభావం ఇందిరపై బాగా పనిచేసింది. విమాన ప్రమాదంలో సంజయ్ దుర్మరణం తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే. 

సంజయ్ వస్తాడనుకున్న స్థానాన్ని రాజీవ్, ఇందిర మరణం తర్వాత భర్తీ చేశాడు. ఆ తర్వాత, మకుటం లేని మహారాణిగా, సోనియా వారసత్వం స్వీకరించారు. ఇక ముందుంది రాహుల్, ప్రియాంకాగాంధీల పర్వం. ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగింది కాదా? ఏమో! రాచరికంలో లేని వారసత్వం ప్రజాస్వామ్యంలో సుసాధ్యం చేసిన ఘనత మనదే! ప్రజాస్వామ్యాన్ని మించిన పాలనా విధానం లేనే లేదు. అధికారంలో తమ వాళ్ళే వుండిపోవాలన్న కాంక్షతో, కొందరు వ్యక్తులు "ప్రజాస్వామ్యాన్ని" "వారసత్వ స్వామ్యం" గా మలిచేశారు. ప్రజాస్వామ్యాన్ని-రాజకీయ వ్యవస్థను గేలి చేసి, హాస్యాస్పదం చేశారు. ప్రపంచంలో మనను చిన్న చూపు చూసే పరిస్థితి కలిగించారు. ఈ పాపంలో అన్ని రాజకీయ పార్టీలకు-నాయకులకు అంతో, ఇంతో భాగం వుంది. వారసత్వంగా ఎదిగిన-ఎదుగుతున్న వారిలో ఏ కొద్ది మందో తప్ప, చాలా మంది అలా ఎదగడానికి కేవలం రాజకీయ-కుటుంబ నేపధ్యమే కారణం అనక తప్పదు. ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయిందీ కారణాన.

2 comments:

  1. వనంవారు, "వారసత్వ రాజకీయాల కొన సాగింపుకు మరో మారు రంగం సిద్ధమౌతోంది." అని మొదలుపెట్టారు. మరి కేటీఆర్ గారు మాత్రం కేసీఆర్ గారి వారసత్వం కాదా రాజకీయాల్లో? అంతా ఒకతాను ముక్కలేనండీ.

    ReplyDelete
    Replies
    1. వనంవారూ, మీరు ముక్తాయింపుగా అన్న మాటలు " ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయిందీ కారణాన" అన్నవి శ్రీమాన్ కేటీఆర్ గారికి కూడా వర్తిస్తాయి కదా నిస్సందేహంగా? కొంపదీసి వారికి మాత్రం మినహాయింపు ఇస్తున్నారా ప్రత్యేకంగా?

      Delete