సంక్షిప్త రామాయణం సమాప్తం
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-30
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (09-11-2020)
రామాయణ పఠనంవల్ల ఇహపర లోకాల్లో
సౌఖ్యంకలిగే విషయాన్ని నారదుడు చెప్తాడీవిధంగా: "రామాయణం పరిశుద్ధంగా
చదివేవారికి,
వినేవారికి మూడు విధాలైన సమస్త పాపాలు హరించి పోయి, ఏమాత్రం ఆలస్యం లేకుండా మోక్ష ఫలం కలుగుతుంది. అంతశక్తి దీనికుండటానికి కారణం, ఇది వేద స్వరూపమై,
వేదార్థాన్నే బోధిస్తుంది కాబట్టి. అంతేకాదు, సంసార సాగరాన్ని తరింపచేస్తుంది కూడా. ఇది వినేవారు-చదివేవారు, అంతమాత్రాన సన్యాసులు కానవసరం లేదు. ఆయుస్సు పెరిగి, కొడుకులు-కూతుళ్లతో,
మనుమలు-ఇష్ట బంధువులతో అనుభవించి, మరణించిన తర్వాత మోక్షాన్ని-బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. పరిమితి
చెప్పనలవికాని మహత్త్వమున్న యీ రామాయణ గ్రంథాన్ని శాస్త్ర ప్రకారం చదివినా, ఇతరులు చదవగా విన్నా,
అర్థ విచారం చేసినా, బ్రాహ్మణుడికి వేద
వేదాంగాలు అధ్యయనం చేస్తే ఎలాంటి ఫలం కలుగుతుందో అలాంటిదే కలుగుతుంది.
క్షత్రియుడికి సర్వాధిపత్యం కలుగుతుంది. వైశ్యుడికి వ్యాపార లాభం కలుగుతుంది.
శూద్రుడికి అపారమైన గొప్పతనం లభిస్తుంది. కాబట్టి నాలుగువర్ణాలవారు, స్త్రీ-పురుషులు,
దీన్ని చదవాలి-వినాలి. విషయ చింతన చేయాలి. వినేవారుంటే
చదివి వినిపించాలి. చదివేవారుంటే వినాలి. ఈ రెండూ జరగని కాలముంటే, విన్నదానిని-కన్నదానిని, విశేషంగా మననం చేయాలి.
ఏదోవిధంగా మనస్సు దీనిపై నిలపాలి".
(ఇక్కడితో సంక్షిప్త రామాయణం సమాప్తం. దీనిని బాల రామాయణం అని కూడా అంటారు. ఇదే
సంస్కృతంలో ప్రధమ సర్గ. ఈ సర్గ మొదటి శ్లోకంలో, మొదటి అక్షరం
"త" కారం తో మొదలవుతుంది. ఇది గాయత్రి మంత్రంలోని మొదటి అక్షరం. కడపటి
శ్లోకంలోని కడపటి అక్షరం "యాత్". గాయత్రి మంత్రం లోని కడపటి అక్షరమూ
ఇదే. గాయత్రిలోని ఆద్యంతక్షరాలు చెప్పడంతో ఈ సర్గ గాయత్రి సంపుటితమని
తెలుస్తున్నది. ఈ నియమం ప్రకారమే వాల్మీకి వేయి గ్రంథాలకు మొదట ఒక్కొక్క గాయత్రి
అక్షరాన్ని వుంచడంతో 24,000 గ్రంథమయింది. 24,000 గ్రంథమంటే 24,000 శ్లోకాలని అర్థంకాదు. 32 అక్షరాల సముదాయానికి
గ్రంథమని పేరు. "గ్రంథోధనే వాక్సందర్భే ద్వాత్రింశ ద్వర్లసంహతౌ" అన్న
శ్లోకంలో ఇది విశదమవుతుంది.
ఒక శ్లోకంలో 32 అక్షరాల కంటే ఎక్కువ వుంటే, 32 అక్షరాలు మాత్రమే
గ్రంథంగా భావించాలి. ప్రధమ సర్గలో ఆద్యంతక్షరాల మధ్యభాగంలో, తక్కిన అక్షరాలుండవచ్చేమోనన్న సందేహంతో, వాసుదాసుగారు, ఆ దిశగా శోధించినా కానరాలేదు. ఈ విషయాన్ని తెలియచేస్తూ ఆయన, ఎరిగిన విజ్ఞులు ఎవరైనా వుంటే, మరింత వివరంగా దీనికి
సంబంధించిన అంశాలను వెల్లడిచేస్తే, వారికి సవినయంగా
నమస్కరిస్తానని,
తన అంధ్ర వాల్మీకి రామాయణంలోని బాల కాండ మందరంలో రాసారు.
ఒకవేళ తక్కిన అక్షరాలు కనిపించకపోయినా లోపంలేదనీ, ఆద్యంతాక్షరాలు గ్రహించడంతో సర్వం గ్రహించినట్లేనని అంటారు వాసుదాసుగారు.
ఏదేమైనా శ్రీమద్రామాయణం "గాయత్రి సంపుటితం" అనడం నిర్వివాదాంశం. యతిని
అనుసరించే,
ఆంధ్ర వాల్మీకి రామాయణంలోని కడపటి శబ్దం "అరయన్"
య కారంతో ముగించబడింది. తెలుగులో "త్" శబ్దం కడపట రాకూడదు-దానికి
ముందున్న "య" కారాన్నిగ్రహించాలి).
No comments:
Post a Comment