కలియుగ రాజవంశాల, కల్క్యావతార సూచన, కాలవర్తన క్రమం
శ్రీ మహాభాగవత కథ-87
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
శ్రీ శుక యోగీంద్రుడు
పరీక్షిన్మహారాజుకు శ్రీకృష్ణుడు వైకుంఠపదాన్ని అలంకరించేంతవరకు ఆయన అవతార కథలను
వివరంగా చెప్పాడు. కలియుగం రాబోతున్నందున ఇక ముందు జరగబోయే పరిణామాలన్నీ కూడా
చెప్పమని అడిగాడు పరీక్షిత్తు శుకుడిని. ప్రారబ్ధ కర్మాధీనాలైన కార్యగతుల విపరీత
పరిణామాలను చెప్పడం ఎవరికీ సాధ్యం కాదని,
తాను తన దర్శన శక్తితో సమీక్షించి, రానున్న కాలపు పోకడలను కొంతమేరకు
వివరిస్తానని చెప్పసాగాడు శుకుడు. కలియుగంలో రాజుల ప్రవర్తన తీరెలా వుంటుందో తెలియ
చేశాడు. గతంలో మగధరాజు బృహద్రథుడి వంశం పురంజయుడి దాకా వేయి సంవత్సరాలు కొనసాగిన
సంగతికి కొనసాగింపుగా ఇతర వంశాల గురించి చెప్పాడు.
శిశునాగ వంశంలో పురంజయుడి
మంత్రి శునకుడు రాజును హత్య చేసి రాజ్యపాలన చేపట్టుతాడు. ఆయన వంశంలో మొత్తం
పదిహేనుమంది జన్మించి శైశునాగులుగా ప్రసిద్ధికెక్కి, కలియుగంలో 360 సంవత్సరాలు భూమండలాన్ని పాలిస్తారు. ఆ
వంశక్రమంలో చివరివాడైన మహానందికి నందరాజు పుట్టిన తరువాత ఆయన కాలంలో సుక్షత్రియ
వంశం అంతరిస్తుంది. మొత్తం మీద వీరంతా కలిసి మరో నూరు సంవత్సరాలు పాలిస్తారు. ఆ
తరువాత నవనందులు రాజ్యానికి వస్తారు. నవనందులను చాణక్యుడు నిర్మూలిస్తాడు. అప్పుడు
మౌర్యులు రాజ్యానికి వస్తారు. మౌర్య చంద్రగుప్తుడు మగధ దేశాధిపతి అవుతాడు. మౌర్య
వంశానికి చెందిన పదిమంది భూమిని 330 సంవత్సరాలు పాలిస్తారు. ఆ తరువాత శుంగ వంశీయుల
పాలన మొదలవుతుంది.
శుంగరాజుల అధికారం 112
సంవత్సరాలు సాగుతుంది. ఆ తరువాత గుణహీనులైన కణ్వుల పాలన 345 సంవత్సరాలు సాగుతుంది. కణ్వవంశంలోని సుశర్ముడనే రాజును అతడి సేవకుడు
వృషలుడు అనే ఆంధ్ర జాతీయుడు వధించి అధర్మ మార్గంలో రాజ్యపాలన చేస్తాడు. అతడి
వంశీయులు 456 సంవత్సరాలు భూమిని పాలిస్తారు. ఆ తరువాత ఏడుగురు ఆభీర వంశపు రాజులు,
పదిమంది గర్ధబులు, పదహారు మంది కంక వంశీయులు
పాలిస్తారు. ఆ తరువాత యవనులు ఎనిమిది మంది, బర్బరులు
(తురుష్క జాతీయులు) పద్నాలుగురు, గురుండులు పదమూడు మంది, మౌన వంశీయులు పదకొండు మంది, 65 మంది అభీరాదులు, 1099 సంవత్సరాలు పాలిస్తారు. ఇలా సాగుతుంది రాజ్యపాలన.
కలియుగంలో క్రమక్రమంగా దేశం
అంతా అధర్మం తాండవిస్తుంది. పాపవర్తనులు భూపాలకులవుతారు. రాజులు అధర్మపరులై
అనాచారాన్ని వ్యాప్తికి తెస్తారు. దీని ఫలితంగా నానాటికీ సత్యం, శౌచం, దయ, దానం మొదలైన ధర్మాలన్నీ అడుగంటి పోతుంటే ఆశ్చర్యంగా వుంటుంది. డబ్బున్న
వారెవరైనా భూమిని పాలించవచ్చనే రోజులు వస్తాయి. బలవంతుడిదే రాజ్యం. ప్రజలు
ద్రవ్యహీనులవుతారు. శరీరారోగ్యం క్షీణిస్తుంది. వర్ణ ధర్మాలను, ఆశ్రమ ధర్మాలను కూలదోసి ధర్మభ్రష్టలై సంచరిస్తారు ప్రజలు. రోగాలను హరించే
ఓషధీలతలకు జీవశక్తి లోపించి, వాటితో తయారయ్యే ఔషధాల గుణం అతి
స్వల్పంగా వుంటుంది. పండే పంటలలో సారం, సమృద్ధి వుండదు.
ఇలా లోకంలో ధర్మం పూర్తిగా
అడుగంటినప్పుడు, ముకుందుడు, తనను ఆరాధించే భక్తుల కోసం, దుష్ట శిక్షణ, శిష్ట
రక్షణ కోసం, శంబల అనే గ్రామంలో విష్ణుయశుడు అనే
బ్రాహ్మణుడికి కుమారుడిగా కల్కి రూపంలో అవతరిస్తాడు. సమస్త దేవతా సమూహం ఎదురు
చూస్తుంటే, దేవదత్తమనే మహాశ్వాసాన్ని అధిరోహించి, శిష్టాచార విహీనులైన వారిని తన ఖడ్గంతో ఖండఖండాలుగా నరికి వేస్తాడు.
అప్పుడు ధరణీ మండలం శాంతి సౌఖ్యాలతో వెలుగొందుతుంది. మానవులు విష్ణు ధ్యానం చేస్తూ, శ్రీమన్నారాయణుడి మీద భక్తి తత్పరులై వుంటారు. సకల జనులు
కృతార్థులవుతారు. విశ్వమంతా కృతయుగపు ధర్మం తిరిగి నెలకొంటుంది.
ఈ విషయాలను చెప్పిన శ్రీ
శుక మహర్షి, పరీక్షిత్తు కోరిక ప్రకారం కాల
స్వరూపుడైన భగవానుడి ఉనికి వర్ణించడానికి ప్రాతిపదికైన కాలవర్తన క్రమాన్ని, చంద్ర, సూర్య గ్రహాలూ సంచరించే మార్గాల వివరాలను
చెప్పాడు.
ఆకాశంలోని సప్తర్షి మండలంలో
ఒక్కొక్క మనువు పరిపాలనా కాలంలో అక్కడుండే ఋషులు ఏడుగురూ మారుతుంటారు. వైవస్వత
మన్వంతరంలో బ్రహ్మ మానస పుత్రులైన మరీచి,
అంగిరసుడు, పులస్త్యుడు, వశిష్ఠుడు,
పులహుడు, అత్రి, క్రతువు సప్తర్షులు.
తూర్పున మొనతేలి వున్న బండి ఆకారంలో సప్తర్షి మండలం కనిపిస్తుంది. అందులో
అగ్రస్థానంలో మరీచి, ఆయనకు పడమట దిక్కున అరుంధతీ సమేతుడైన
వశిష్ఠుడు, అక్కడి నుండి పశ్చిమాన కొంచెం పైన అంగిరసుడు,
ఇంకా పడమట చతురస్రాకారంగా అమరిన నాలుగు తారలలో ఈశాన్యాన అత్రి, ఆయనకు దక్షిణాన పులస్త్యుడు, పశ్చిమాన పులహుడు, ఉత్తరాన క్రతువు వున్నారు. ఈ సప్తర్షి మండలం ఉదయించినప్పుడు మున్ముందుగా
రెండు తారలు కనబడతాయి. ఆ రెంటి నట్టనడుమ ఒక నక్షత్రం కనిపిస్తుంది. ఇది కనిపించిన
వంద సంవత్సరాలకు శ్రీకృష్ణావతారం పరిసమాప్తి జరిగింది. శ్రీకృష్ణుడు భూమ్మీద
వున్నంత కాలం కలి ప్రవేశించ లేదు.
మఖ నక్షత్రంలో సప్తర్షులు
ప్రవేశించేనాటికి కలి ప్రవేశం జరిగి పన్నెండు వందల సంవత్సరాలు అవుతోంది.
సప్తర్షులు ఒక్కో నక్షత్రంలో వంద సంవత్సరాలు వుంటారు. సప్తర్షి మండలం
పూర్వాషాడలోకి ప్రవేశించినప్పుడు కలిపురుషుడు రెచ్చిపోతాడు. కలి ప్రవేశించి ఎన్నో
వేల దివ్య సంవత్సరాలు గతించిన తరువాత, కలి నాలుగో పాదం చివరి రోజుల్లో తిరిగి
కృతయుగ ధర్మం మొదలవుతుంది.
ఈ విషయాలను చెప్పి శుక
మహర్షి యుగాలను, ఆయా యుగ ధర్మాలను, వాటి పరిణామాలను చెప్పాడు పరీక్షిత్తుకు. యుగాలు నాలుగు: కృత, త్రేతా, ద్వాపర, కలి.
ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగ ధర్మం వుంటుంది. ధర్మానికి సత్యం, దయ, తపస్సు, దానం అని నాలుగు
పాదాలు. కృత యుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది. త్రేతాయుగంలో మూడు
పాదాలుంటాయి. ద్వాపర యుగం వచ్చేనాటికి రెండు పాదాల తేజస్సు తరిగి
ప్రవర్తిల్లుతుంది. ఇక కలియుగంలో అధర్మ శక్తులు పెరిగిపోయి ధర్మం మరింత
క్షీణిస్తుంది. జనులు అన్యాయాలు చేస్తారు. అసూయ, పిసినారి
తనం పెరిగిపోతాయి. ప్రజలు అసత్యవాదులవుతారు. ధర్మం ఒంటి పాదం మీద నడుస్తుంది.
అందువల్ల కలియుగంలో కనీసం ఒకటి రెండు గంటలైనా నారాయణ నామస్మరణ చేయాలి.
కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలు నాలుగూ కలిసి ఒక చతుర్యుగం. అలాంటి వేయి బ్రహ్మకు ఒక పగలు
(దీన్నే ఒక కల్పం అంటారు). మరో వేయి ఒక రాత్రి. అదే ఆయనకు విరామ సమయం. రాత్రీ-పగలూ
కలిసి బ్రహ్మకు ఒక దివసం. అలాంటి 360 దివసాలు బ్రహ్మకు ఒక సంవత్సరం. ఒక్కొక్క
బ్రహ్మకు నూరు సంవత్సరాలు ఆయుఃప్రమాణం. ఆ కాలాన్నే ద్విపరార్థం అంటారు. ఒక్కొక్క
ద్విపరార్థం జరగ్గానే సర్వ ప్రళయం జరుగుతుంది. అప్పుడు సృష్టి కర్త వుండడు. సృష్టి
జరగదు. దాన్నే ప్రాకృతిక ప్రళయం అంటారు. ప్రతి కల్పాంతంలో బ్రహ్మ నిద్ర కొరకు
ఏర్పడిన ప్రళయాన్ని నైమిత్తిక ప్రళయం అంటారు. బ్రహ్మకు అవసాన కాలం
సమీపించినప్పుడు, ప్రాకృతిక ప్రళయం జరిగే ముందు, వంద
సంవత్సరాలు భూమ్మీద వర్షాలు పడవు. అంతా క్షామమే. జీవజాలం నశిస్తుంది.
ఇది జరిగిన తరువాత, సూర్యుడు సృష్టి సమస్తాన్నీ దహించి
వేస్తాడు. అప్పుడు సంకర్షణుడనే ఆదిశేషుడి ముఖాల నుండి కాలాగ్ని వెలువడి, అన్ని దిక్కులకూ వ్యాపిస్తుంది. నూరు సంవత్సరాలు ప్రళయ వాయువులు విరామం
లేకుండా మహావేగంగా వీస్తాయి. వాన చినుకు వుండదు. నూరేళ్లపాటు 12 మంది ఆదిత్యుల
తీవ్ర కిరణాలు తాండవం చేస్తాయి. ఆ తరువాత నూరేళ్లు ప్రళయాగ్ని దహించి వేస్తుంది. ఆ
తరువాత నూరేళ్లు మబ్బులు కమ్మి నీటి ధారలతో బ్రహ్మాండమంతా జలంతో నిండిపోతుంది.
పృథ్వి తన రూపాన్ని కోల్పోయి జలంలో కలిసిపోతుంది. ఇక పృథ్వీపదార్ధం వుండదు. స్వరూప
నాశం చెందిన జలం తేజస్సులో విలీనమైపోతుంది. దరిమిలా ప్రకృతి సత్త్వాది గుణాలను
తనలోకి విలీనం చేసుకుంటుంది. అప్పుడు ప్రకృతికి అవయవాలు,
పరిణామాలు వుండవు. ఆది, అంతం వుండవు. రూపాలు వుండవు.
జాగ్రదవస్థ వుండదు.
ఆ నిర్మలమైన స్థితిలో అది
ఊహకందనిదిగా అవుతుంది. దాన్ని ‘మూలభూతం పద మామనన్తి’ అంటారు. అన్నిటికీ మూలమైన
కైవల్యపదం అది. ఇక ప్రళయాలు నాలుగు విధాలు. నిత్యం, నైమిత్తికం, ప్రాకృతికం, అత్యంతికం. భగవానుడు కాలస్వరూపుడు. అనంతమైన కాలప్రవాహంలో ఆది నుండి
నారాయణుడు ధరించిన మూర్తులనూ, ఆయన లీలా విశేషాలనూ, కథలనూ, సమగ్రంగా బ్రహ్మరుద్రాదులతో సహా ఎవరూ
వర్ణించలేరు.
ఇలా చెప్పి శుకుడు, అంతుచిక్కని సంసారమనే మహాసముద్రాన్ని
దాటాలంటే శ్రీహరి కథ అనే నావ తప్ప వేరొక సాధనం లేదంటాడు. తక్షకుడు కరుస్తాడు, చనిపోతానన్న భయాన్ని వదిలి శ్రీకృష్ణపరమాత్మను ధ్యానం చేసుకొమ్మని
చెప్తాడు. పరమాత్మను ఆత్మగతం చేసుకుని శ్రీ వాసుదేవుడి విరాడ్రూపాన్ని భావన చేయడం
వల్ల విశేష ఫలితం వుంటుందని అంటాడు. కాటువేయబోయే తక్షకుడు,
మృత్యుముఖంలో వున్న పరీక్షిత్తు, ఇద్దరినీ నడిపిస్తున్న
సూత్రధారి శ్రీ వాసుదేవుడు ఒక్కడే అని, ఆయన మహిమను
వర్ణించమని పరీక్షిత్తుకు చెప్పాడు శుకుడు. తన కర్తవ్యం ముగిసిందని అక్కడి నుండి
బయల్దేరిపోయాడు శుకుడు.
శృంగి మంత్రపూర్వకంగా
నియోగించిన తక్షకుడు, బ్రాహ్మణ వేషంలో పరీక్షిత్తును చంపడానికి బయల్దేరి వచ్చాడు.
పరీక్షిన్మహారాజు దగ్గరలో వున్న వాళ్ల చేతిలో పండు పెట్టి వెళ్లిపోయాడు. వాళ్ళు ఆ
పండును రాజుకిచ్చారు. పరీక్షిత్తు ఆ పండును రుచి చూసేసరికి దానిలో నుండి ఒక పురుగు
రూపంలో తక్షకుడు బయటపడి సర్పాకృతిని ధరించి,
రాజును కాటు వేశాడు. పరీక్షిత్తు ఆ విషాగ్ని వల్ల అక్కడికక్కడే చనిపోయాడు.
ఈ వృత్తాంతమంతా విన్న ఆయన
కొడుకు జనమేజయుడు సర్పజాతిని నాశనం చెయ్యడానికి సర్పయాగానికి పూనుకున్నాడు.
యాగాగ్నిలో వేలకొద్దీ పాములు వచ్చి పడిపోయి మరణించాయి. ఎదురు చూస్తున్న తక్షకుడు
రాలేదు. అతడు ఇంద్రుడి దగ్గర ఆశ్రయం పొందాడని తెలుసుకుని, జనమేజయుడు, ‘సహేంద్రతక్షకాయానుబ్రూహి’ (ఇంద్రుడితో సహా తక్షకుడిని రప్పించండి) అనే మంత్రాన్ని ప్రయోగించాడు.
తక్షకుడితో సహా ఇంద్రుడు కిందికి జారారు. అప్పుడు అంగిరసుడి వంశంలో జన్మించిన బృహస్పతి
అనే ఆచార్యుడు అక్కడికి వచ్చి సర్పయాగం మానమని జనమేజయుడిని ప్రార్థించాడు. ఆ
ఆచార్యుడి ఉపదేశానుసారం సర్పయాగాన్ని మాని, నగరంలోకి పోయాడు
జనమేజయుడు.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment