నాగుల చవితి, ధర్మాంగద చరిత్ర, పాముపాట
వనం జ్వాలా నరసింహారావు
మనతెలంగాణ దినపత్రిక
(17-11-2020)
నాగుల చవితి సందర్భంగా పాము పుట్టలో నాగుపాము
వుంటుందన్న నమ్మకంతో, అది తాగుతుందన్న భావనతో చాలామంది, ముఖ్యంగా
మహిళలు పాలుపోయడం అనాదిగా వస్తున్న ఆచారం. దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ
చవితిని నాగులచవితి అని అంటారు. మన పూర్వీకులు చెట్టును,
పుట్టను, గుట్టను, రాతిని, ఆమాటకొస్తే
సమస్త ప్రాణికోటిని ఆరాధించడం మనకు నేర్పారు. ఇది మన భారతీయ సంస్కృతీ సాంప్రదాయం.
బహుశా అందులో భాగంగానే నాగుపామును కూడా ఒక దేవతగా పూజించే ఆచారం అనాదిగా వచ్చి
వుంటుంది. నాగుపాముకు పుట్టలో పాలుపోసిన తరువాత అంతా కలిసి ఒక ఇంట్లో కూర్చుని
పాడుకునేదే పాముపాట. దాన్నే ధర్మాంగద చరిత్ర అని కూడా అంటారు. పాముపాట చదవడానికి
పూర్వరంగంలో, దేవతా ప్రార్థన,
కవిస్తుతి, శ్రీరామమూర్తి ప్రార్థన లాంటివి చేస్తారు. ఆరోజున
ఉపవాసం వుంటారు. మర్నాడు నాగ పంచమి రోజున ఆహారం తీసుకుంటారు సాధారణంగా.
ఇక కథ విషయానికొస్తే.....ఒకానొక రోజుల్లో
అప్పటి కాశ్మీర దేశంలోని కనకాపురంలో సంగీత, సాహిత్య, సరస విద్యల్లో ఆరితేరి, వేదాలను అలవోకగా వల్లించగల
బ్రాహ్మణులు అనేకమంది వుండేవారు. అలాగే రకరకాల వృత్తులవారు కూడా అక్కడ వుండేవారు.
ఆ దేశం అప్పుడు ధనధాన్యాదులతో అలరారుతుండేది. ఆ దేశం రాజు పేరు ధర్మాంగదుడు.
ధరణిలో ప్రఖ్యాతికన్నవాడు. ఆ రాజు భార్య పేరు అర్మిలీ దేవి. వారిద్దరూ ఆదర్శ
దంపతులు. సకలభాగ్యాలున్న ఆ దంపతులకు సంతానం లేదనే చింత బాధిస్తుండేది. పుత్రులు
లేకుంటే పుణ్యం లేదని, సుతుడు లేకుంటే గతులు లేవని
తానిప్పుడు ఏంచేయాలని ఆ ధర్మాంగదుడు ఒకనాడు తన మంత్రుల సలహా అడిగాడు. దైవ ప్రార్థన
చేయమని వారంతా సూచించారు. సంతానం కొరకు ఆయన అలాగే వారు చెప్పినట్లు చేయడంతో, దైవయోగాన ఆయన భార్య అర్మిలి గర్భం దాల్చింది. రాజుగారికి అ ఆవిషయం తెలిసి
సంతోషమయింది. గర్భిణీగా వున్న స్త్రీలకు చేయాల్సిన వేడుకలన్నీ ఆమెకు చేశారు
భందుమిత్రులు.
ఇదిలా వుండగా గర్భం దాల్చిన
అర్మిలీదేవి నెలలు నిండగానే రెండు నాల్కలతో నిండు పడగను కలిగి, చిర్రుబుర్రుమనే శేషుడు (పాము) పుట్టాడు. ఈ విషయాన్ని
చెలికత్తెల ద్వారా తెలుసుకున్న ధర్మాంగదుడు మూర్ఛపోయాడు. తరువాత తెప్పరిల్లి, ఏంచేయాలని మంత్రులను అడిగాడు. కొడుకు పుట్టాడని నగరంలో చాటిద్దాం అని, లేకపోతే, మనం చులకనైపోతామని వారు చెప్పారు. పుత్రుడు పుట్టినందుకు దానాలు
కూడా చేద్దామన్నారు. అర్మిలీదేవికి కూడా ఆ సలహా నచ్చింది ఆ క్షణాన. తన పాముకొడుక్కు
మామూలుగానే సపర్యలు చేయాలని చెప్పింది చెలికత్తెలకు. ఒక పెట్టె తెప్పించి అందులో
దాన్ని వుంచి, పాలు పోసి పెంచసాగారు. ధర్మాంగదుడికి నిజంగా
కొడుకే పుట్టాడని భావించిన పొరుగు రాజులు ఆయనతో వియ్యమందాలని నిర్ణయించుకున్నారు.
తమ కోరికను ఉత్తరాల ద్వారా ధర్మాంగదుడికి తెలియచేయగానే ఆయన సిగ్గుపడ్డాడు బయటికి
చెప్పుకోలేక. వారికి ఏమని జవాబు రాయాలో అర్థం కాలేదు రాజుకు. ఒక అందమైన అమ్మాయిని
చూసి పాముకు పెళ్లి చేయాలని సలాహా ఇచ్చారు మంత్రులు.
పెళ్లికూతురును చూడడానికి
బ్రాహ్మణులను పంపాలని నిర్ణయం జరిగింది. తక్షణమే పురోహితులను పిలిచారు. దేశదేశాలు
తిరిగి, ఒక చక్కటి అమ్మాయిని వెతికి, ఆమె జాతకం పరిశీలించి, ఆయుర్దాయం చూసి, అయిదవతనం చూసి, తల్లిదండ్రుల నేపధ్యం విచారించి రమ్మని వారిని పురమాయించాడు రాజు
ధర్మాంగదుడు. వారు ఆయన ఆజ్ఞానుసారం అంగ, వంగ, కళింగ, బంగాళ, నేపాల లాంటి దేశదేశాలు తిరిగారు. ఎక్కడా వారికి అనుకూలమైన
అమ్మాయి కనిపించలేదు. రాజుకు ఈ విషయం ఎలా చెప్పాలి అని వారు మధనపడుతుండగా దారిలో
వారికొక బ్రాహ్మణుడు కలిసి, సౌరాష్ట్ర దేశంలో మాణిక్యపురం
పాలించే రత్నాంగుడు అనే రాజుకు త్రైలోక్య సుందరి అనే కూతురుంది అక్కడికి వెళ్లమని
సలహా ఇచ్చాడు. వారలాగే అక్కడికి వెళ్లి రాజు రత్నాంగుడిని కలిసి తాము వచ్చిన పని
చెప్పి అమ్మాయిని చూపించమని అడిగారు. ఆయన ఆ అమ్మాయిని సభకు రప్పించి చూపించాడు.
ఆమెను చూడగానే ఆ బ్రాహ్మణులు, ధర్మాంగదుడి కొడుక్కు, రత్నాంగుడి కూతురు సరిగ్గా సరిపోతుందని నిర్ణయించారు. జాతకాన్ని కూడా
చూసి సంతోషించారు. రత్నాంగదుడి కూతురును తమరాజు కొడుక్కు ఇవ్వమని అడిగారు.
రత్నాంగరాజు తన పురోహితులను
కనకాపురానికి పంపాడు. రాజు కొడుకును చూసి రమ్మన్నాడు. ఎవరిని చూపించాలని
ధర్మాంగదుడు మధనపడ్డాడు. అప్పుడొక మంత్రి తన కొడుకును చూపిస్తానన్నాడు. రత్నాంగ
రాజు పంపిన బ్రాహ్మణులకు మంత్రి తన రాజుకు చెప్పినట్లే తన కొడుక్కు ముస్తాబు చేసి
చూపించాడు. ఆ బాలుడి హస్తరేఖలు చూసి ఆ బ్రాహ్మణులు సంతృప్తి చెందారు. ధర్మాంగదుడి
వంశంలో ఒక ఆచారం వున్నదనీ, ఆయన కొడుకును అంటే పెళ్లికొడుకును
పరదేశానికి పంపరనీ, కత్తికి బాసికం కట్టి తరలి వస్తారనీ, కత్తికి, కాంతకి పెళ్లి జరగాలనీ ఆయన మంత్రులు రత్నాంగుడి బ్రాహ్మణులకు
చెప్పారు. వారా విషయాన్ని తమ రాజుకు చెప్పి ఒప్పించారు. పెళ్ళికి తిథి, వార నక్షత్రాలు నిర్ణయించారు. ఇద్దరు రాజులు పెళ్లిపత్రికలు
రాసుకున్నారు. పెళ్లిప్రయత్నాలలో వున్నారు. శుభలేఖలు రాసుకున్నారు. మంత్రి తన
నేర్పంతా చూపించి కోడలిని తీసుకురావాలని ధర్మాంగదుడు అన్నాడు.
ధర్మాంగదరాజు అనుకున్న ముహూర్తానికి
పాముకు బదులుగా కత్తిని తరలించాడు. మాణిక్యపురంలోని స్త్రీలంతా పెళ్లికొడుకును
చూద్దామని వచ్చారు. చివరకు వారికి కత్తి తప్ప ఇంకేమీ కనబడలేదు. ఇదేం వింత అని
వారంతా ఒకరి ముఖాలు ఇంకొకరు చూసుకున్నారు. అంగరంగ వైభోగంగా పెళ్లి తతంగం జరిగింది.
కత్తినే పెళ్లి పీటలమీద వుంచారు. పెళ్లికూతురుతో ఆ కత్తికే తలంబ్రాలు పోయించారు.
ఐదురోజుల పెళ్లి జరిగింది. నాగవల్లి కూడా జరిగింది. ఐదురోజుల తరువాత ధర్మాంగదుడు
తిరుగు ప్రయాణమయ్యాడు. రత్నాంగుడు తన రాజసానికి అనుగుణంగా తన కూతురు త్రైలోక్య
సుందరితో పాటు అనేక రకాల బహుమానాలు ఇచ్చాడు మగ పెళ్లివారికి. అత్తగారింట్లో ఎలా
మెసలుకోవాలో అనేకరకాలుగా చెప్పి పంపించారు కూతురును రత్నాంగుడి దంపతులు. ఆ అమ్మాయి
కూడా అత్తగారింట్లో అలాగే వుంది. మంచి పేరు తెచ్చుకుంది. చివరకు తన భర్త పాము అన్న
విషయం తెలుసుకుంది. ధర్మాంగదుడిని నిలదీసింది.
కోడలికి నచ్చచెప్పే ప్రయత్నం చేసాడు
ధర్మాంగదుడు. ఇదంతా తమ కర్మఫలం అన్నాడు. భర్తలేకపోతే తన గతేంటి అని అడుగుతుంది
సుందరి. ఇలా ఎలా జరిగింది అని అడుగుతుంది. తన భర్త నాగారాజుతో కలిసి
దివ్యతిరుపతులన్నీ తిరిగి వస్తానని అంటుంది. నూటొక్క తిరుపతులు సూటిగా తిరుగుతానంటుంది.
ఒక పెట్టెలో పామునుంచి తీర్థయాత్రలకు బయల్దేరుతుంది. తనకు ఏ ఆభరణాలు వద్దని
రుద్రాక్షలు కావాలని అంటూ బైరాగి వేషాన్ని ధరిస్తుంది త్రైలోక్య సుందరి. అందరి
దగ్గర సెలవు తీసుకుని తీర్థయాత్రలకు బయల్దేరింది. తీర్థయాత్రలో భాగంగా దేశదేశాలలో
వున్న గుళ్లు, గోపురాలు, ఆశ్రమాలు, నదులూ, పుణ్య తీర్థాలూ....ఇలా అనేక ప్రదేశాలకు భర్త నాగరాజును తీసుకుని పోతుంది.
చివరకు నైమిశారణ్యం చేరుతుంది. అక్కడ దైవ ఘటనవల్ల కొందరు మునులు ఆమెకు
తారసిల్లారు. మాండవ్య, కౌశిక,
కౌండిన్య, మౌద్గల, గాంగేయ, కపిలుడు, కౌశికుడు, వాసిష్ట, ఆత్రేయ, వాల్మీకి, జమదగ్ని మొదలైన మునులను ఆమె దర్శించింది.
తనకు పతిదానం ఇప్పించమని వారిని వేడుకుంది. తాను తిరిగిన ప్రదేశాల వివరాలు
చెప్పింది.
మునులప్పుడు కరుణతో సుందరితో ఇలా
అన్నారు. “దివ్యదృష్టితో అంతా చూశాం. నీ పతిసంగతి నీకు చెప్తాం. పూర్వజన్మలో యితడు
పుడమికి రాజు. ఏడు దీవులను ఏకచ్చత్రాదిపత్యంగా ఎదురు లేకుండా పాలించేవాడు.
కొంతకాలం తరువాత యితడు బ్రాహ్మణ భూములను పండనివ్వకుండా పడావు పెట్టించాడు. ఆ పాపఫలం
ఇప్పుడు అనుభవిస్తున్నాడు. నీ పుణ్యఫలాన ఇతడెలాగైనా మళ్లీ రాజవుతాడు. సృష్టిలో మీ
దంపతులు సుఖంగా వర్ధిల్లుతారు. పుత్ర-పౌత్రులను పొందుతారు. ఎన్నో తిరుపతులు
తిరిగావు. పడమట దిశగా తిన్నగా పోయి బ్రహ్మ గుండంలో పాముపెట్టేతో సహా నువ్వు స్నానం
చేస్తే ఈ పాము నరనాథుడవుతాడు. శీఘ్రంగా వెళ్లు”.
ఆ మాటలు విన్నదే తడవుగా సుందరి వారికి
సాష్టాంగ దండం చేసి పాముపెట్టెను ఎత్తుకుని అతివేగంగా వారు చెప్పిన దిక్కుకు
పోయింది. పోయి బ్రహ్మగుండం దగ్గరకు చేరి తల్లి తండ్రులకు, పెద్దలకు, దేవుడికి నమస్కారం చేసింది.
అప్పుడు ఆకాశవాణి ఆమెను త్వరగా ఆ గుండంలో మునగమని ప్రోత్సహిస్తుంది. ఆమె అలాగే
ముమ్మారు పాముతో సహా బ్రహ్మగుండంలో మునిగింది.
అలా మునిగిన మరుక్షణమే ఫణిరాజు తన
ఎదుట నాధుడై నిలిచాడు. తాను ఆయన ఇల్లాలినని సుందరి ఆయనకు చెప్పింది. తనను
రక్షించమని వేడుకుంది. అప్పుడతడు ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నాడు. జరిగిన
విషయమంతా పూసగుచ్చినట్లు చెప్తుంది. ఇంకా అతడు సందేహిస్తుంటే ఆకాశవాణి ఆ బాలిక
చెప్పినదంతా నిజమేనని పలుకుతుంది. దంపతులిద్దరూ సుఖంగా వుండాలని దీవించింది.
వారిద్దరూ తిరిగి తీర్థయాత్రలు చేసి కాశ్మీర దేశానికి, కనకాపురానికి తిరిగి వస్తారు. ఆకాశవాణి, మనిషిగా మారిన
నాగరాజుకు, చిత్రాంగదుడు అని పేరు పెట్టింది. చిత్రాంగదుడికి, త్రైలోక్య సుందరికి మళ్లీ శాస్త్రోక్తంగా వివాహం జరుగుతుంది. ఆ తరువాత
సుఖంగా జీవించారు చాలా సంవత్సరాలు.
(పాముపాట అనే దీన్ని
నాగులచవితి రోజున చదువుతే పుణ్యం అని అంటారు)
No comments:
Post a Comment