బోయవాడిని శపించిన వాల్మీకి మహర్షి
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-32
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (23-11-2020)
"ఓరీ నిషాదుడా,
క్రౌంచ పక్షుల జంట కలిసున్నప్పుడు, కామ క్రీడలు సలుపుతున్నప్పుడు, ఆ మత్తులో
తేలుతున్నప్పుడు,
జంటలో ఒక పక్షిని చంపావు కనుక, నీవు దీర్ఘకాలం బ్రతకవు". శపించిన తర్వాత సర్వ శాస్త్రజ్ఞాన సంపన్నుడైన
వాల్మీకి మహర్షి,
ఎంతగానో దుఃఖిస్తున్న క్రౌంచ పక్షి దురవస్థ చూడలేనందువల్లే
బోయవాడినుద్దేశించి ఇలా అంటినికదా అనుకుంటాడు. అయితే తానన్న మాటలు ఎలా పరిణమించాయో
నని ఆలోచించిన వాల్మీకి,
శిష్యుడు భరద్వాజుడితో :"ఇప్పుడొక వింత జరిగింది.
గమనించావా?
దుష్టుడైన బోయవాడు చేసిన తప్పుడు పనికి బాధపడ్డ నేను, కోపంగా బోయవాడినన్న మాటలు, ఛందోశాస్త్ర విధుల
ప్రకారం ఓ (శ్లోకం) పద్యమై వర్ధిల్లుతున్నది. ఏమి ఆశ్చర్యం? నాలుగు పాదాలతో,
సమాన సంఖ్యగల అక్షరాలతో, మనోహరమై, వీణపై వాయించేందుకు అనువుగా, తాళానికి-లయకు సరిపడే
(శ్లోకం) పద్యమైంది చూసావా?"
అని అంటాడు. ఇలా వాల్మీకి ప్రేమతో చెప్పిన తర్వాత
భరద్వాజుడు,
గురువు చెప్పిన మాటలను గ్రహించి, ఆ (శ్లోక) పద్యరూప వాక్యాలకు చాలా ఆశ్చర్యపడి, దానిని కంఠస్తమయ్యేట్లు వల్లెవేస్తాడు. ఆ శిష్యుడి నడవడి చూసిన వాల్మీకికి
ఎంతో సంతోష మేస్తుంది. తాను చెప్పింది లోకం మెచ్చుకోవడమే కవికి కావాల్సింది.
సంస్కృత రామాయణంలో ఆ శ్లోకం ఇలా
వచ్చింది వాల్మీకి నోట:
"మానిషాద ప్రతిష్ఠాం త్వ! మగ మ శ్శాశ్వతీ స్సమాః
యత్క్రౌంచ మిథునాదేక! మవధీః
కామమోహితం"
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో వాసుదాసుగారిలా తెనిగించారు ఆ
శ్లోకాన్ని:
"తెలియు మా నిషాదుండ ప్రతిష్ఠ నీక
ప్రాప్తమయ్యెడు శాశ్వతహాయనముల
గ్రౌంచ మిథునంబునందు నొక్కండు నీవు
కామమోహిత ముం జంపు కారణమున"
(రామాయణం రాద్దామని సంకల్పించిన వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకమిది. ఆంధ్ర
వాల్మీకి రామాయణ రచనలో వాసుదాసుగారు మొట్టమొదట రాసిన పద్యమూ ఇదే.
"మానిశాద" శ్లోకం అంతవరకు తెనిగించినవారు లేరంటారు కవి. వ్యాఖ్యాతలు
రాసిన అన్ని అర్థాలు వచ్చే ట్లు రాయడం కష్టమనీ, దీన్ని తెనిగించగలిగితే
మిగిలిందంతా తెనిగించడం తేలికవుతుందనీ భావించి, తనను తాను
పరీక్షించుకోదల్చి,
తొలుత ఆ పద్యాన్ని రాసానంటారు వాసుదాసుగారు. ఈ పద్యానికి
నాలుగు పాదాలు.పాదానికి 13 అక్షరాలు.సాంఖ్యశాస్త్రంప్రకారం 13 ప్రణవాన్ని బోధిస్తుంది.
ఎందుకంటే,
వర్ణసమామ్నాయంలో 13వ అక్షరం "ఓ"
విష్ణు అనే అర్థమున్న "మానిషాద" శబ్దం "అ" కారాన్ని
సూచిస్తుంది. "అకారోర్థో విష్ణు" వని ప్రమాణం."ప్రతిష్ఠ” స్త్రీ
లింగం.ఇక్కడ స్త్రీ వాచకం ప్రకృష్టమైంది. ప్రతిష్ఠ అనేది లక్ష్మీ వాచకమైన
"ఉ" కారాన్ని బోధిస్తుంది."నీక" అనేది "ఉ" కార
మొక్క అవథారణార్థకాన్ని తెలుపుతుంది. "క్రౌంచ మిథునంబునందు నొక్కండు", ప్రకృతి పురుషుల్లో కుటిల గతి కలది ప్రకృతి అనీ, దాని సంబంధంవల్ల అల్పమైన జ్ఞానమున్నవాడు (బద్ధ జీవుడు) పురుషుడని అర్థం
చేసుకోవాలి. ఇది "మ" కారాన్ని బోధిస్తుంది).
బ్రహ్మ అనుగ్రహంతో రామాయణానికి మొట్ట
మొదలు బీజ రూపంలో వెలువడ్డ ఆ శ్లోకం కేవలం శాపంగానే భావించకూడదని, అది శ్రీరామచంద్రుడి మంగళా శాసనం కావచ్చునని పూర్వులు ఆ శ్లోకానికి ఎన్నో
అర్థాలు చెప్పుకున్నారు. క్రౌంచ మిథునాన్ని మండోదరి-రావణుల కలయికగానూ, క్రౌంచమంటే కుటిల స్వభావంగల రావణుడిగా అన్వయించి, అట్టి రావణుడిని చంపి లోకాలను రక్షించినందున తప్పక శాశ్వతంగా జయం కలుగుతుందని
అర్థం చెప్పుకున్నారు కొందరు. మరో వ్యాఖ్యానంలో, రాముడు వాల్మీకిచే శపించబడాలని కోరుకుంటాడట. కోరుకుని బోయవాడయ్యాడట. దీనికి
కారణం, శోకరసపూరితమైన తన చరిత్ర రాయడానికి సరిపోయినంత శోక రసం వాల్మీకి మనస్సులో
వుందో-లేదోనని పరీక్షించేందుకేనట.
(ఈ పద్యం రామాయణార్థాన్ని సంపూర్ణంగా సూచిస్తుంది. "మానిషాదుండ... ...
అంటే లక్ష్మికి నివాస స్థానమయిన శ్రీనివాసుడా, శ్రీరాముడా" అనే పదం బాలకాండ అర్థాన్ని సూచిస్తుంది.
"ప్రతిష్ఠ నీక శాశ్వతంబగు" అనే పదం పితృవాక్య పరిపాలన, రాముడి ప్రతిష్ఠను తెలియచెప్పే అయోధ్య కాండ అర్థాన్ని
సూచిస్తుంది."శాశ్వతహాయనముల" అనే పదంలో రాముడు దండకారణ్యంలో ఋషులకు
చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్చినందువల్ల ఆయనకు కలిగిన ప్రతిష్ఠను తెలియచేసే అరణ్య కాండ
అర్థాన్ని సూచిస్తుంది. దాని ఉత్తరార్థంలో కిష్కింధ కాండార్థాన్ని సూచిస్తుంది.
క్రౌంచ దుఃఖం సీతా విరహతాపాన్ని తెలియచేసే సుందర కాండ అర్థాన్ని సూచిస్తుంది. ఇలా
రకరకాలుగా రామాయణార్థం సూచించబడిందీ శ్లోకం- పద్యంలో).
No comments:
Post a Comment