వేదాలను, పురాణాలను లోకానికి అందించిన వేదవ్యాసుడు
ఫలశ్రుతి
శ్రీ మహాభాగవత కథ-88
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
వేదవ్యాసుడు వేదాలను, పురాణాలను లోకానికి అందించిన విషయాన్ని
సూతుడు శౌనకుడికి వివరించాడు. పరాశర మహర్షి పుత్రుడైన వేదవ్యాసుడికి పైలుడు, సుమంతుడు, జైమిని,
వైశంపాయనుడు అనే నలుగురు శిష్యులు వుండేవారు. వీరు ఋగ్వేదం,
యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని
వున్న నాలుగు వేదాలను వ్యాసమహర్షి ఉపదేశించిన క్రమంలో అన్ని లోకాలలో ఆవిష్కరించారు.
మొట్టమొదట బ్రహ్మ హృదయాకాశంలో ఒక నాదం ఉత్పన్నమైంది. ఆయన ఆత్మయోగంతో
చిత్తవృత్తులను నిరోధించి వున్నప్పుడు ఆ నాదం ఆయన శ్రవణ పుటాలలో వ్యక్త రూపాన్ని
పొందింది.
బ్రహ్మ హృదయాకాశంలో
ఉదయించిన ఆ నాదం, బృహతీ వాక్కుగా, ‘ఓమ్’ అన్న
ధ్వనిగా వినిపించి, అక్షరాకృతిని ధరించింది. ఆ ఓంకారమే బ్రహ్మవిద్యాసర్వస్వములైన
అన్ని మంత్రాలకు, అన్ని ఉపనిషత్తులకు,
పుట్టినిల్లైన వేదమాత అని చెప్పబడింది. ఆ ఓంకారం త్రిగునాత్మకమైనది. అంటే, సత్త్వరజస్తమస్సులనే మూడు గుణాలు, ఋగ్యజుస్సామములనే
మూడు నామాలు, భూర్భువస్సువస్సులనే మూడులోకాలు, జాగ్రత్స్వప్నసుషుప్తులనే మూడు వృత్తులను కలిగినది. అప్పుడు బ్రహ్మదేవుడు
ఆ ఓంకారం నుండి స్వరాలు, స్పర్శలు,
అంతస్థములు, ఊష్మములు (హ్రస్వములు,
దీర్ఘములు) మొదలైన లక్షణాలతో కూడిన అక్షర సమామ్నాయాన్ని రూపొందించాడు. ఆ అక్షరాల
సహాయంతో ఆయన తన నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలను ఉద్భవింపచేశాడు. ఆయన మానస
పుత్రులైన మరీచి మొదలైన వారు ఆయన ఉపదేశానుసారం ఆ వేదాలను నేర్చుకుని, తమ
శిష్యగణానికి బోధించారు. ఆ విధంగా ఒక్కొక్క యుగంలో మహర్షులు గురుముఖతః వేదాలను
అభ్యసిస్తున్నారు.
కాలమహిమ వల్ల వేదాలను
సమగ్రంగా అధ్యయనం చేసే శక్తి లేనివారికి దారి చూపడానికి ద్వాపర యుగారంభంలో దాశరాజు
కూతురు సత్యవతీదేవి కడుపున భగవంతుడు స్వయంగా పరాశర మహర్షికి పుత్రుడై అవతరించాడు.
అనంతమైన వేదరాశిని ప్రకరణానుసారం, ఛందస్సుల ప్రకారం, ఋగ్యజుస్సామాధర్వములని నాలుగు సంహితలుగా చేసి, వాటిని పైల, వైశంపాయన, జైమిని, సుమంతులనే నలుగురు శిష్యులను పిలిచి, ఒక్కొక్కటి
వారికి ఉపదేశించారు.
పైలమహర్షి అధ్యయనం చేసిన
ఋక్సంహిత పరిమాణం చాలా పెద్దది. ఋక్కుల సంఖ్య చాలా ఎక్కువ. దాన్ని అందుకే బహ్వ్ఋచ
సంహిత అనేవారు. పైలుడు దాన్ని రెండుగా విభజించి ఇంద్రప్రమితికి, భాష్కలుడికి బోధించాడు. భాష్కలుడు తన
భాగాన్ని నాలుగు శాఖలుగా పునర్విభాగం చేసి, తన శిష్యులైన బాద్య, యాజ్ఞవల్క్య, పరాశర,
అగ్నిమిత్రులకు నేర్పాడు. ఇంద్రప్రమితి తన సంహితభాగాన్ని తన కొడుకు మాండూకేయ ఋషికి
ఉపదేశించాడు. మాండూకేయుడు తన శిష్యుడు దేవమిత్రుడికి బోధించిన విద్యను సౌభరి
మొదలైన ఋషులు నేర్చుకున్నారు. సౌభరి కొడుకు శాకల్యుడు తాను నేర్చుకున్న శాఖను
ఐదుగా విభజించి తన శిష్యులైన వాత్స్య, మౌద్గల్య, శాలీయ, గోముఖ, శిశిరులకు ఉపదేశించాడు. వారు జాతుకర్ణికి,
ఆయన బలాకుడు, పైంగుడు, వైతాలుడు, విరజుడు అనే ఋషులకు నేర్పాడు. భాష్కలుడి కొడుకు భాష్కలి వాలఖిల్య సంహితను
సంకలనం చేసి తన శిష్యులు బాలాయని, గర్గ్యుడు, కాసారుడు అనేవారికి చెప్పాడు. అలా, అలా, బహ్వ్ఋచ సంహితను సత్సంప్రదాయానుగుణంగా బ్రహ్మర్షులంతా అధ్యయనం చేశారు.
వైశంపాయనుడు యజుర్వేదాన్ని
క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. అతడి శిష్యులు చరకుడు, అధ్వర్యువు. వారు గురువుగారి దగ్గర అన్ని క్రతువులు సలక్షణంగా
చేయించడం నేర్చుకున్నారు. ఒకసారి ఆ శిష్యులు చేపట్టిన కర్మకాండను వైశంపాయనుడి మరో
శిష్యుడు యాజ్ఞవల్క్యుడు అధిక్షేపించాడు. దానికి కోపగించుకున్న వైశంపాయనుడు యాజ్ఞవల్క్యుడిని
ఆయన నేర్చుకున్న వేదాన్ని మొత్తం అక్కడ వదిలి తక్షణమే వెళ్లిపొమ్మన్నాడు.
యాజ్ఞవల్క్యుడు మొత్తం కక్కేసి వెళ్లిపోయాడు. ఆ కక్కును ఆయాశాఖాధి దేవతలు తిత్తిరి
పక్షుల రూపంలో భుజించారు. అప్పటి నుండి ఆ భాగానికి తైత్తిరీయ శాఖ అన్న
పేరొచ్చింది. ఆ తరువాత యాజ్ఞవల్క్యుడు సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకుని, ఇతరులకు తెలియని యజుర్వేద సూత్రాలను నేర్చుకున్నాడు. ఆ నవీన
శుక్లయజుర్వేద భాగం వాజసనేయ సంహితగా ప్రసిద్ధికెక్కింది.
సామవేదాన్ని నేర్చుకున్న
జైమిని మహర్షి తన కొడుకైన సుమంతుడికి ఉపదేశించాడు. సుమంతుడు ఆయన కొడుకైన
సుకర్ముడికి నేర్పాడు. అతడు సామవేద తరువును వేయి శాఖలుగా విభజించి శిష్యులకు
నేర్పాడు. అధర్వవేద పండితుడైన సుమంతుడు తన విద్యను కబంధుడనే శిష్యుడికి, అతడు పధ్యుడికి, వేదదర్శుడికి, వారు వారి
శిష్యులకు, అలా అలా శాఖోపశాఖలతో అధర్వవేదం వృద్ధి చెందింది.
త్రయ్యారుణి, కశ్యపుడు, సావర్ణి, అకృతవ్రణుడు, వైశంపాయనుడు, హారీతుడు అనే ఆరుగురు వేదాంగవేత్తలు
సూతుడి తండ్రి రోమహర్షుడి దగ్గర పురాణాలను నేర్చుకున్నారు. సూతుడు వారి దగ్గర
శిష్యరికం చేసి పురాణ సంహిత మొత్తాన్నీ అభ్యసించాడు. కశ్యపుడు, సూతుడు, సావర్ణి,
అకృతవ్రణుడు, రోమహర్షుడి దగ్గర మూల సంహితలు నాలుగూ నేర్చుకున్నారు.
పద్దెనిమిది మహాపురాణాలు:
బ్రహ్మ, పద్మ,
విష్ణు, శివ, భాగవత, భవిష్య, నారద, మార్కండేయ, అగ్ని, బ్రహ్మవైవర్త, లింగ, వరాహ, స్కాంద, వామన, కూర్మ, మత్స్య, బ్రహ్మాండ, గరుడ పురాణాలు. ఇవి కాకుండా ఉపపురాణాలు కూడా వున్నాయి.
పద్దెనిమిది మహా పురాణాల
పరిమాణం వేర్వేరుగా వుంటుంది. బ్రహ్మ పురాణం పదివేల శ్లోకాలతో కూడి వున్న గ్రంథం. పద్మ
పురాణం 55 వేల, విష్ణు పురాణం 23 వేల, శివ పురాణం 24 వేల, శ్రీమద్భాగవత పురాణం 18 వేల, నారద పురాణం 25 వేల, మార్కండేయ పురాణం 9 వేల, అగ్ని పురాణం 15400, భవిష్యోత్తర పురాణం 14500,
బ్రహ్మవైవర్త పురాణం 18 వేల, లింగ పురాణం 11 వేల, వరాహ పురాణం 24 వేల, స్కాంద పురాణం 81100, వామన
పురాణం 10 వేల, కూర్మ పురాణం 17 వేల, మత్స్య పురాణం 14 వేల, గరుడ పురాణం 19 వేల, బ్రహ్మాండ పురాణం 12 వేల
శ్లోకాలు వుంటాయి.
ఇలా నాలుగు లక్షల శ్లోకాలతో
కూడి వున్న అష్టాదశ పురాణాలలోను, భాగవత
పురాణం శ్రేష్టమైనది. భాగవత పురాణాన్ని పఠించినవారు శ్రీమహావిష్ణువుతో
సాయజ్యముక్తిని పొందుతారు.
ఫలశ్రుతి
సర్వ
పురాణాలలో శ్రేష్టతమమైన భాగవతాన్ని వినేవారు,
వినిపించేవారు, చదివేవారు, వ్రాసేవారు, ఆయురారోర్గ్య ఐశ్వర్యాలు సిద్ధించి శ్రీమహా విష్ణువుతో సాయుజ్యం
పొందుతారు. ఆసక్తితో ఆదివారం నాడు భాగవత పఠనం గావించిన భక్తుడు సంసార సాగరాన్ని
అవలీలగా దాటుతాడు.
పరమాత్మ
సకల గుణాతీతుడు, సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, అఖిల లోకాధారుడు, ఆదిదేవుడు, త్రిదశాభివందితపాదాబ్జుడు, వనధిశయనుడు,
ఆశ్రితమందారుడు, ఆద్యంతశూన్యుడు,
వేదాంతవేద్యుడు, విశ్వమయుడు, కౌస్తుభ
శ్రీవత్స కమనీయవక్షుడు, శంఖచక్రగదాసిశార్జ్గధరుడు,
శోభనాకారుడు, పీతాంబరాభిరాముడు,
రత్నరాజిత మకుట విభ్రాజమానుడు, పుండరీకాక్షుడు, మహనీయ పుణ్యదేవుడు అని స్తుతించిన సూతుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని సర్వకాల
సర్వావస్థలలోనూ తలచుకుంటూ, సన్నుతిస్తూ వుంటానని శౌనకుడికి
చెప్పాడు.
ఇలా
స్తుతించి భాగవతాన్ని ఆసాంతం సూతుడు చెప్పగా,
మునులంతా విని, శ్రీ వాసుదేవుడిని హృదయ మందిరాలలో నిలుపుకుని, ఆయన గుణాలను కొనియాడుతూ, పరవశులై, ఉత్సాహం పొంగుతుండగా, తమతమ నివాసాలకు తరలి వెళ్లారు.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment