యదువంశంలో ముసలం, నారదుడు చెప్పిన విదేహార్షభ సంవాదం
శ్రీ మహాభాగవత కథ-85
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
బలరామ కృష్ణులు యుద్ధాలలో
అనేకమంది రాక్షస వీరులను సంహరించారు. అది చాలక కృష్ణుడు, భూభారం మరీ ఎక్కువగా
వుందని, పాచికలాట నెపంతో దుర్యోధనుడినీ,
కౌరవపాండవ బలగాన్నీ, కురుక్షేత్ర సంగ్రామంలో అంతరింప చేశాడు.
ఇదంతా చూస్తున్న మునులకు ఆనందం కలిగింది. పుణ్యాత్ములైన నందాదులు సంతోషించారు.
యదువంశం లోని గొప్పగొప్ప వీరులు అతిశయాన్ని పొందారు. శ్రీకృష్ణుడి మహిమ
ముల్లోకాలకూ తెలిసింది. తన అవతార కార్యం నెరవేరిందని అమితానందంగా వున్నాడు
కృష్ణుడు. ఈ నేపధ్యంలో యాదవ బలాలు వృద్ధి చెంది, ఉన్నతిని పొంది, భూమి బరువు మోయలేని స్థితికి వచ్చింది.
శ్రీకృష్ణుడి దృష్టి
యదుముఖ్యుల వైపు మళ్లింది. ఎవరికీ అపకారం చేయని తన భక్తులైన యాదవులను అంతం చేసే
శక్తి తనకు తప్ప వేరొకరికి లేదనుకున్నాడు. తనలో తానే తర్కించుకున్న కృష్ణుడు, యాదవ బలాలకు పరస్పర విరోధాలు కల్పించి, కర్మపరిణామాలను వారివారికి కలగచేసి, అందరినీ అంతమొందించాలనుకుని,
దానంతటికీ బ్రాహ్మణ శాపం మూలం కాగలదని నిశ్చయించాడు.
భూభారాన్ని తగ్గించేందుకు
యదువంశాన్ని సహితం అంతం చేయాలని శ్రీకృష్ణుడు అనుకుంటున్న సమయంలో, ఆయన దగ్గరికి విశ్వామిత్రుడు, అసితుడు, దుర్వాసుడు, భృగువు, అంగిరసుడు, కాశ్యపుడు,
వామదేవుడు, వాలఖిల్యులు, అత్రి, వశిష్ఠుడు, నారదుడు మొదలైన వారు ద్వారకానగరానికి వచ్చారు. వచ్చి
శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. శ్రీకృష్ణుడు కూడా వారికి ఎదురేగి
అర్ఘ్యపాద్యాదులను సమర్పించాడు. మునులంతా శ్రీకృష్ణుడి మహిమలను కొనియాడి, ఆయన్ను స్తోత్రం చేశారు. దానికి శ్రీకృష్ణ పరమాత్మ ప్రసన్నుడయ్యాడు.
మహర్షులు తమ పారవశ్యాన్ని ‘కంజదళాక్షా!’ అన్న సంబోధనతో వినయపూర్వకంగా స్వామికి
విన్నవించుకున్నారు.
మునులంతా తన ఇంటికి ఏ లోక కల్యాణాన్ని కోరి పావనం చేశారని
శ్రీకృష్ణుడు అడిగాడు వారిని. ఆయన దివ్య చరణారవిందాలను సందర్శించుకోవడం కంటే వేరే
వ్యాప్యమైన ధర్మం తమకేమీ లేదని వారు సమాధానం ఇచ్చారు. వారంతా అక్కడి నుండి
బయల్దేరి ద్వారకానగరానికి దరిదాపుల్లోనే వున్న ‘పిండతారకం’ అనే పిండారక పుణ్య తీర్థానికి పితృదేవతలకు తర్పణాలు విడవడానికి వెళ్లారు.
అప్పుడే అక్కడికి కొందరు యాదవులు దురుకుతనంతో శ్రీకృష్ణజాంబవతిల కొడుకు
సాంబకుమారుడిని గర్భం
దాల్చిన జవరాలి వేషం వేసి సింగారించి అక్కడికి వచ్చారు.
యాదవులు అంతటితో వూరుకోకుండా పిండారక తీర్థానికి వెళ్తున్న
ఋషులను ఆపి, నెలలు నిండి పురిటికి సిద్ధంగా వున్న ఆ జవరాలి కడుపున
పుట్టేది అబ్బాయా? అమ్మాయా? అని
ప్రశ్నించారు. వారి వేళాకోళానికి ఋషులకు కోపం వచ్చింది. ‘యదువంశాన్ని
తుదముట్టించడానికి ఈ పిల్ల కడుపున రోకలి పుడుతుంది’ అని
శపించారు మునులు. సాంబకుమారుడి పొత్తికడుపుకు కట్టిన మూటలు విప్పేసరికి ముసలం ఒకటి
నేలమీద పడింది. దాన్ని తీసుకుని కృష్ణుడి దగ్గరికి పోయి జరిగినదంతా చెప్పారు.
మునుల శాపాన్ని అనుభవించాల్సిందేనని, యదువంశం నాశనం కావాల్సిందేనని అన్నాడు కృష్ణుడు. సముద్రం ఒడ్డున వున్న
పెద్ద పర్వతం మీదున్న ఎత్తైన బండమీద యాదవులు తమ భుజ బలం కొద్దీ ఆ ఇనుప రోకలిని
రాచి పొడి చేసి, సముద్రం నీళ్లలో కలిపి రమ్మని చెప్పాడు
వాళ్లకు. వాళ్లు అలాగే ఆ ముసలాన్ని అరగదీసి, చివరకు మిగిలిన
ఒక చిన్న ముక్కను సముద్రంలోకి విసిరేశారు. యాదవులు విసిరిపారేసిన ఇనుప ముక్కను ఒక
చేప మింగింది. దాన్ని ఒక జాలరివాడు పట్టుకున్నాడు. దాని కడుపులో దొరికిన ఇనుప
ముక్కను తన బాణం చివర ములికిగా పెట్టుకున్నాడు.
ఇదిలా వుండగా ఒకనాడు నారదుడు శ్రీకృష్ణుడిని
దర్శించుకోవాలని వచ్చినప్పుడు వసుదేవుడు కలిశాడు. తనకు శ్రీ మహాభాగవతుల జీవిత
కథలలోని ధర్మాలను చెప్పాలని అడిగాడు. బ్రహ్మానందనిలయమైన పరమపదాన్ని పొందగలిగే
భాగవత ధర్మాలను వినిపించమని కోరాడు. ఆ ప్రశ్నకు నారద మహర్షికి అమితానందం కలిగింది.
ఇది వేదశాస్త్రాల నిగ్గు తేల్చే ఒక గొప్ప ప్రశ్న అన్నాడు నారదుడు. శ్రీహరి గుణాలను
గురించి చెప్పడమే ఆ ప్రశ్నకు సరైన సమాధానమని చెప్పాడు. పరమాత్మ స్వరూపుడైన
వాసుదేవుడి మీద భక్తి కలిగించేదీ, అద్వితీయమైన పరబ్రహ్మపదాన్ని
సంప్రాప్తింపచేసేదీ అయిన ‘విదేహార్షభ సంవాదం’ పేరుతో విదేహ
నగర రాజు జనకుడికి, ఋషభదేవుడి కొడుకులైన తొమ్మిదిమంది
అర్షభులకు మధ్య భాగవత ధర్మాలను గురించి జరిగిన సంభాషణను వసుదేవుడికి వినిపించాడు.
‘విదేహార్షభ సంవాదం’ వినిపించి నారదుడు వసుదేవుడితో
ఇలా అన్నాడు. భాగవతోత్తముల కథలు విని వసుదేవుడు పాపాలన్నిటినీ పటాపంచలు
చేసుకున్నాడని, ఆ పుణ్యఫలంగా ఆయనకు విశ్వ వ్యాప్తమైన
విఖ్యాతి కలుగుతుందని, ఆమీదట కైవల్యపదం ఆయన్ను వరిస్తుందని, నారాయణుడు ఆయన కొడుకన్న వ్యామోహాన్ని విడిచి సాక్షాత్ విష్ణువని గ్రహించి
ఆరాధించమని చెప్పాడు. కాబట్టి శ్రీకృష్ణుడు అంటే లోక రక్షణార్థం అవతరించిన పరమ
పురుషుడే అని అన్నాడు వసుదేవుడితో. దేవకీవసుదేవులు నారదుడి మాటలకు ఆశ్చర్యచకితులై
శ్రీకృష్ణుడిని పరమాత్మగా చూడసాగారు.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment