తమసాతీరంలో విహరించిన వాల్మీకి మహర్షి
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-31
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (16-11-2020)
(నారదుడు చెప్పిన రామ చరిత్రను విన్న వాల్మీకి సంతోషంతో ఆయన్ను పూజించాడు.
నారదుడు పోయింతర్వాత,
వాల్మీకి, శిష్యుడితో తమసాతీరంలో తిరుగుతూ, ఒక క్రౌంచమిధునాన్ని చూశాడు. ఆయన చూస్తుండగానే, బోయవాడొకడు,
జంటలోని మగపక్షిని బాణంతో కొట్టి చంపుతాడు. ఆడ పక్షి ఏడుపు
విన్న వాల్మీకి,
ఎంతో జాలిపడి, బోయవాడిని శపించాడు. ఇలా
ఆదికవి నోటినుండి వెలువడిన వాక్యాలు సమాక్షరాలైన నాలుగు పాదాల (శ్లోకం) పద్యమయింది.
అదే విషయం గురించి ఆలోచిస్తూ, శిష్యుడు భరద్వాజుడితో
ఆశ్రమానికి వచ్చాడు. అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి, రామాయణం రాయమని ఉపదేశించి, సర్వం ఆయనకు తెలిసేట్లు
వరమిచ్చి పోయాడు. వాల్మీకి రామాయణాన్ని రచించాలని నిశ్చయించుకున్నాడు.సంక్షిప్తంగా
నారదుడు చెప్పిన రామ చరిత్రను, వాల్మీకి వివరంగా
చెప్పాలనుకున్నాడు.
(గ్రంథాన్ని చదవాలనుకునేవారు మూడు విషయాలు అవశ్యంగా తెలుసుకోవాలి. గ్రంథం
చెప్పిందెవరు?
అతడి నడవడి ఎలాంటిది? లోకులకతడు ఆప్తుడా? అని విచారించాలి. దీన్నే వక్తృ విశేషం అంటారు. మేలుకోరి మంచే చెప్తాడన్న
విశ్వాసానికి పాత్రుడైన వాడే ఆప్తుడు. వీడి వాక్యమే ఆప్త వాక్యం. ఆప్త వాక్యం
తోసివేయలేనటువంటిది. మొదటి ఆప్తుడు భగవంతుడు. వేదం ఆప్తవాక్యం. ఫ్రజల మేలుకోరి, వేదార్థాలను,
పురాణ-ఇతిహాస శాస్త్రాలను, లోకానికి తెలిపినవారు ఆప్తులు. వారి రచనలు ఆప్త వాక్యాలు. యధార్థాన్ని తను
తెలుసుకుని,
కామ-క్రోధ-లోభాలకు లోనుకాకుండా, తనెరిగిన ఆ యధార్థ విషయాన్నే, ఇతరుల మేలుకోరి చెప్పడమే
ఆప్త లక్షణం. అలాంటిదే వాల్మీకికి బ్రహ్మానుగ్రహంవల్ల కలిగింది. కాబట్టి ఆయన
పరమాప్తుడు).
బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం లోకులు
తరించేందుకొరకై వాల్మీకి ఈ కృతి రచించాడు. ఈ వక్తృ విశేషం మొదలు చెప్పుకుంటున్నాం.
తనడిగిన విషయమంతా తన హితం-శ్రేయస్సు కోరి, వింటానికింపైన అమృత
బిందువుల లాంటి వాక్యాలను చెప్పి, తనను కృతకృత్యుడిని చేసి, తన సందేహం తీర్చిన నారదుడిని, మనోహరమైన మాటలతో వాల్మీకి
సంతోష పరిచాడు. వాల్మీకి చేసిన ప్రదక్షిణ నమస్కార పూజలనందుకున్న నారదుడు, ఆయన దగ్గర శలవు తీసుకుని ఆకాశమార్గాన బ్రహ్మ లోకానికి పోయాడు.
నారదుడు వెళ్లిన తర్వాత, గంగా తీరం దగ్గరున్న తమసానది దగ్గరకు వచ్చాడు వాల్మీకి. సువాసనలు వెదజల్లే, పూ తీగల పొదరిండ్లున్న ప్రదేశమది. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించే ఆ మహర్షివెంట
ఆయన ప్రియ శిష్యుడు భరద్వాజుడున్నాడు. వీరిరువురు కలిసి, మధ్యాహ్నిక కర్మానుష్ఠానానికి స్నానం చేద్దామని, తమసానదిలో దిగుతారు. తేటగా-నిర్మలంగా నదిలో వున్న నీళ్లను చూసి వాల్మీకి
శిష్యుడు భరద్వాజుడితో: "చూసావుకదా భరద్వాజా, ఈ నదీజలాల అడుగున కాని-పైన కాని, బురదలేదు. లోన పాపపు
అలోచన లేకుండా,
బైట పాపపు చర్య చేయకుండా, శుద్ధాంతఃకరణగల సత్పురుషుడి మనస్సులాగా తేటగా కనిపిస్తుంది కదా. దీన్ని మనం
ఎన్నోసార్లు చూసాంగాని,
ఎప్పటికప్పుడు కొత్తగా-మనోహరంగా కనపడుతూ ఎంతో సంతోషం
కలిగిస్తుంది కదా. నార గుడ్డలివ్వు-కమండలాలను పదిలంగా ఒక చోట వుంచు. ఈ పుణ్య నదీ
తీర్థంలో నేను స్నానం చేయాలి, తొందరగా రా" అంటాడు.
అని చెప్తూ, తనపై నున్న భక్తితో శిష్యుడిచ్చిన నార బట్టలు తీసుకున్నాడు వాల్మీకి. నారద
ఉపదేశం విస్తరించి లోకాన్నెలా బాగుపర్చాలా అని ఆలోచిస్తూ, మధ్యాహ్నం మించిపోతున్న సంగతి కూడా గమనించకుండా, వన సౌందర్యం తిలకిస్తూ,
సంచారం చేయసాగాడు. అప్పుడాయన కంటికి సమీపంలో, మనోహరంగా కూస్తూ,
వియోగం సహించలేని క్రౌంచ పక్షుల జంట కనిపించింది. ఆసమయంలో, తాను చూస్తున్నానన్న లక్ష్యం కూడా లేకుండా, సహజంగా జంతువులను
హింసించే స్వభావమున్న బోయవాడొకడు, రెండు పక్షులలో మగదాన్ని
బాణంతో చంపి నేల కూల్చాడు.
నేల పైనబడి, నెత్తుటిమడుగులో,
తన సమీపంలోనే కొట్టుకుంటూ చావడానికి చేరువలో వున్న
మగపక్షిని చూశాడు వాల్మీకి. ఆహార-నిద్ర-విహార సమయాలలో, రేయింబవళ్లు,
స్నేహంగా తన వెంటే వున్న మగపక్షితో, సమీపంలో బోయవాడున్నసంగతి కూడా గమనించకుండా, ఆనందంతో మైమరిచి కలిసున్న
తమ జంటలో ఒకరు ప్రాణాలు పోగొట్టుకుంటూ విలవిలా తన్నుకుంటుంటే, భరించలేక దుఃఖంతో కూయ సాగింది ఆడ పక్షి. కీచుకీచుమనే సన్నని ధ్వనితో, ఎడతెరిపి లేకుండా కూస్తూ, సమీపంలో వాలి, ముక్కుతో గీరుతూ,
బోయవాడు దగ్గరకు రాగానే భయపడి ఎగిరిపోయి, దగ్గర లోని చెట్టు కొమ్మపై వాలి, చనిపోయిన మగడిని చూస్తూ
ఏడుస్తున్న ఆడ పక్షిని తదేక ధ్యానంతో చూశాడు వాల్మీకి. నేలమీద పడి వున్న మగపక్షినీ
చూశాడు మళ్ళీ. వేటాడడాన్నీ,
జీవహింస కులవృత్తిగా వుండే వేటగాళ్లు అనుసరించాల్సిన
ధర్మాన్నీ తెలిసిన వాల్మీకి, జంటగా పక్షులు కలిసున్న
సమయంలో, ఒకదాన్ని కొట్టి చంపడం ధర్మం కాదని నిశ్చయించుకుంటాడు. కనుబొమలు ముడిపడగా, కళ్లెర్రపడగా,
క్రూరుడైన బోయవాడిపై దయ వీడి శపించాడు.
No comments:
Post a Comment