వాల్మీకిని చూసేందుకు వచ్చిన బ్రహ్మ
్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-33
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (30-11-2020)
(శ్లోక-పద్య రూపంలో శాపం ఇవ్వాలన్న తలంపు వాల్మీకికి లేదు. ఆయనా, తను వూరికే దూషించిన వాక్యం శాపంగా మారిందేనని, వాల్మీకి ఆశ్చర్యపడ్డాడు. దీని యదార్థ భావాన్ని వివిధ రకాలుగా
విశ్లేషించవచ్చు. వాల్మీకి నారదుడిద్వారా రామ కథనంతా-సర్వం తెలుసుకుంటాడు. కరుణ రస
భూరితంగా ఆ చరిత్రను గ్రంథస్థం చేయాలనుకుంటాడు. అందుకు ఆయనకి కరుణ రసం తగినంత
పాళ్లలో వుండాలికదా! ఆ విషయాన్ని పరీక్షించగోరి, గతంలో భృగుమహర్షి ఇచ్చిన శాపాన్ని స్థిర పరిచేందుకు, శ్రీరాముడు బోయవాడి వేషంలో రాక్షసుడైన క్రౌంచపక్షిని చంపాడట. దీనినే
శ్రీరాముడు-సీత అనే భార్యా-భర్తల ఎడబాటుగా అన్వయించుకోవచ్చు కూడా. ఏదేమైనా, వాల్మీకి రామాయణంలో చెప్పిన దానికి అర్థం వెతికేటప్పుడు, వాల్మీకి రామాయణమే ప్రమాణం కాని, ఇతర గ్రంథాలు ప్రమాణం
కావు.
అలాంటప్పుడు, వాల్మీకి రామాయణం సత్యచరిత్రమనీ, అందులోని అనేక విషయాలు
జరిగినవి-జరిగినట్లే,
తెలుపబడ్డాయనీ చదువరులు మనస్సులో వుంచుకోవాలి. తక్కిన
రామాయణాలన్నీ స్వమతాభిమానాన్ని, స్వమతాన్ని
వుద్ధరించాలన్న ఆలోచనను తెలియబర్చేవి మాత్రమే. తన ఏడుపు కథను రాసేందుకు వాల్మీకికి
తగినంత మోతాదులో ఏడుపు గొట్టుందానని శ్రీరాముడు పరీక్షించాడనడం విడ్డూరమనే అనాలి.
ఇంతకూ, వాల్మీకి రామాయణాన్ని శృంగార ప్రబంధంగా వ్యాఖ్యాతలందరు అంగీకరించారు కాని, కరుణ ప్రబంధంగా అంగీకరించలేదు. సీతా వియోగం కూడా విప్రలంభ శృంగారమే.
వాల్మీకి బోయవాడిని రామచంద్రమూర్తి
అని అనుకుని శపించలేదనేది పూర్తి యదార్థం. ఆయన రాముడి భార్య సీత తన ఆశ్రమంలో
వుందన్న విషయం,
ఆమె దుఃఖంతో పరితపిస్తున్న విషయం ఎరిగిన వాల్మీకి, ఆమె దుఃఖాన్ని మరింత పెంచడు కదా! తను శ్లోక (పద్య) రూపంలో అన్నది శాపంగా
పరిణమిస్తుందని ఆయనకూ తెలియదప్పుడు. ఆయన మనస్సు లోని ఉద్దేశం తిట్టు రూపంలో శ్లోకం
(పద్యం)గా రావడానికి కారణం,
ఆయన నాలుకపై సరస్వతి వుండడమే. పలికించింది బ్రహ్మ పనుపున
రామకథ వాల్మీకితో చెప్పించాలని వచ్చిన సరస్వతి. అంటే, కవి అనుకోకున్నప్పటికీ,
సరస్వతి ఆయన నోట అలా పలికించిందనాలి).
ఆ తర్వాత వాల్మీకి శాస్త్రం చెప్పిన
రీతిలో నదిలో స్నానం చేసి,
సమీపంలో వున్న జల పూర్ణ కమండలాలను తీసుకుని, శిష్యుడు వెంటరాగా,
తాను చెప్పిన (శ్లోకం) పద్యం గురించే ఆలోచిస్తూ ఆశ్రమం వేపు
వెళ్తుంటాడు. వెళ్తూ,
తను వూరికే శపిస్తే అది పద్యమెలా అయిందానని అనుకుంటూ, ఆ పద్యమే శాపానికి బదులుగా ఆశీర్వాదమయిందికదా అని ఆశ్చర్య పోతుంటాడు. ఆశ్రమం
చేరి భగవద్విషయాలను తలచుకుంటుంటాడు.
బోయవాడు చేసిన పనికి కలిగిన దుఃఖంతో
బాధపడ్డ వాల్మీకి,
వాడిని దూషిస్తూ చెప్పిన పద్యం గురించి, తదేక ధ్యానంతో ఆలోచిస్తున్న సమయంలో, ఆయన్ను చూడడానికి వచ్చాడు
బ్రహ్మదేవుడు. పది దిక్కులకు తన తేజస్సును వ్యాపింపచేస్తూ, యోగి శ్రేష్ఠులు చేతులు జోడించి వెంబడి వస్తుంటే, వేలాది సంవత్సరాలు తపస్సు చేసినా కానరాని బ్రహ్మదేవుడు, తనంతట తానే,
దేవతా సమూహం చుట్టూ చేరి సేవిస్తుండగా వచ్చాడు. ఇలా బ్రహ్మ
తన ఇష్టులతో,
శిష్టులతో రావడంతో, వాల్మీకి తటాలున లేచి, మిక్కిలి భక్తితో మ్రొక్కి, నిలబడి ఈయనెందుకొచ్చాడా
అని కారణం వెతకసాగాడు. "ఇదేదో వింతలాగుందే. నారదుడే స్వయంగా వచ్చి, రామ చరిత్ర ఉపదేశించడం మొదటి వింత. శాపోక్తులు భగవత్ మంగళా శాసనం కావడం మరో
వింత. ఏళ్ల కొద్దీ తపస్సు చేసినా ప్రత్యక్షం కాని బ్రహ్మ తనంతట తానే నా గుడిసెలోకి
రావడం ఆశ్చర్యంగా వుంది" అని, తనలో అనుకుంటూ,వినయంగా బ్రహ్మకు అర్ఘ్య-పాద్యాలిచ్చి, ప్రదక్షిణ నమస్కారాలు
చేసి, సాష్టాంగ పడ్డాడు వాల్మీకి. తదుపరి, బ్రహ్మదేవుడు, ఉన్నతాసనంలో కూర్చొని,
వాల్మీకిని కుశల ప్రశ్నలడిగి, ఆయన్నూ కూర్చోమని చెప్పాడు. సమీపంలో కూర్చొన్నప్పటికీ, బోయవాడి సంగతి మాత్రం మనస్సులో ధ్యానిస్తూనే వున్నాడు వాల్మీకి."అయ్యో, బోయవాడెంత దయలేనివాడు. ఏ కారణం లేకుండానే, పగబట్టినవాడిలా, పాపమని కూడా అనుకోకుండా, మనోహరంగా కూస్తున్న
క్రౌంచ పక్షిని చంపాడు కదా" అని ఆలోచిస్తూ, పక్షి పడిన దుఃఖాన్ని తలచుకుంటూ, శోకం కలుగుతుంటే, తాను చెప్పిన పద్యం గురించే, ఎదుట బ్రహ్మ వున్న విషయం
కూడా మరిచి వ్యాకుల పడుతున్న వాల్మీకిని గమనిస్తాడు బ్రహ్మ.
No comments:
Post a Comment