Thursday, March 31, 2022

ముందుగా మేల్కొంటే విజయం తథ్యమే! ..... వనం జ్వాలా నరసింహారావు

 ముందుగా మేల్కొంటే విజయం తథ్యమే!

వనం జ్వాలా నరసింహారావు

సాక్షి దినపత్రిక (01-04-2022)

ఇటీవల ముగిసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలలో ప్రసంగించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన దృష్టిలో తనకు, టీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలంటే ఒక క్రీడ కానేకాదని, అదొక విద్యుక్త ధర్మమని (Politics is not a game but a task) వ్యాఖ్యానించారు. ఆయన చెప్పిన మాటలను లోతుగా విశ్లేషించి అర్థం చేసుకుంటే అనేక భావాలు గోచరిస్తాయి. వర్తమాన రాజకీయ పరిస్థితులకు అన్వయించుకుంటే అర్థవంతంగా వుంటుంది.

         భారతీయ ఎన్నికల విధానంలో, ప్రస్తుతం క్షణ క్షణానికి మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో ఓట్లను సంపాదించుకోవడం ఒక వికృత క్రీడలాగా పరిగణించకూడదు. ఎన్నికైన, కాదల్చుకున్న రాజకీయ నాయకులు ప్రజలకు, వారి సంక్షేమానికి తాము చేస్తున్న మంచి పనుల ద్వారా ఒక విద్యుక్త ధర్మం లాగా ఓట్లను పొందాలి. రాజకీయ నాయకులు ప్రజల సంక్షేమం కోసమే నిరంతరం పాటుపడుతూ తద్వారా ఓటర్లను ఆకట్టుకుని, ప్రజల మద్దతు పొందడమే గెలుపునకు ప్రధాన మంత్రం.

         2014 తర్వాత, మోడీ నేతృత్వంలోని బిజెపి అజేయం అన్నట్లుగా కొందరి భావన. ఆ భావన కారణాన పలువురు బీజెపీయేతర రాజకీయ ప్రత్యర్థులు, వివిధ పార్టీల నాయకులు కొంత మేరకు అయోమయంలో పడిపోయారు. అది సహజం. అయితే 2024లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలలో మోడీ నేతృత్వంలోని బిజెపిని ఓడించాలంటే కష్టం కావచ్చేమో కాని అసాధ్యం మాత్రం కాదు. కాకపోతే దాన్నొక టాస్క్ లాగా తీసుకోవాలి. ఈ కర్తవ్యాన్ని జయప్రదంగా సాధించడానికి ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉన్నది. అదే సమయంలో వారు ఒక గొప్ప వ్యూహాన్ని కూడా రూపొందించాలి. ఆ వ్యూహాన్ని చివరి అక్షరం వరకు మనసా వాచా త్రికరణశుద్ధిగా, ఒక స్ఫూర్తితో అమలు చేయాలి. 

ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో గెలిచి, ఆమ్ ఆద్మీ పార్టీ  పంజాబును కైవసం చేసుకున్న దాన్ని విశ్లేషించి చూస్తే, దేశంలో ఎన్నికల వ్యూహంలో గణనీయమైన మార్పులు వచ్చాయని స్పష్టంగా అవగతమవుతున్నది.  అయితే, ఈ విషయాన్ని చాలా రాజకీయ పార్టీలు అర్థం చేసుకోలేకపోయాయి. ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన బీఎస్పీ, ఎస్పీలతో సహా కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోవడానికి  కారణం ఇదే. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం ప్రాంతీయ పార్టీల సమర్థతను చాటిచెప్తున్నాయి.

         70వ దశకం ప్రారంభంలో, 1975 జూన్ లో దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి ముందు, అన్ని రాజకీయ పార్టీలు,  ఒకే గొడుగు కిందకు వచ్చాయి. వామపక్షాలతో సహా అన్నిరకాల మితవాద భావజాలం వున్న  రాజకీయ పార్టీల కన్సార్టియం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో జనతా పార్టీగా ఆవిర్భవించి విజయవంతంగా ఎన్నికలను గెలిచింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్ట మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వంగా జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే అంతర్గత కుమ్ములాటల కారణంగా జనతాపార్టీ అధికారాన్ని కోల్పోవడం, మరోసారి ఇందిరాగాంధీ అధికారంలోకి రావడం అనే విషయం తదనంతర చరిత్ర. జనతా పార్టీ ఆవిర్భవించిన రోజుల్లో, ఆ పార్టీ అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి ఎవరు? అనే ప్రశ్న ఎప్పుడూ ఉత్పన్నం కాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీవారు మాత్రం అప్పుడు ఇందిరా గాంధీని ఎవరు ఎదుర్కోగలరు అన్న ప్రశ్న ప్రజల ముందుకు పదేపదే తీసుకొచ్చింది. అలాగే, ఇప్పుడు కూడా బిజెపి దాని మద్దతుదారులు అదే ప్రశ్న అడుగుతున్నారు. మోడీని ఎవరు ఎదుర్కోగలరు? అని.

అప్పట్లో ముఖ్యంగా ఉత్తరాదిలో కాంగ్రెస్ ను ఓడించడం అనే విషయం ప్రజలలో వచ్చిన బలమైన మార్పుకు సంకేతం. జనతాపార్టీలో ప్రధానమంత్రి కావడానికి అన్ని అర్హతలు ఉన్న అనేక మంది ప్రముఖులు వున్నప్పటికీ, ఎనబై సంవత్సరాల వయసున్న మొరార్జీ దేశాయ్ ప్రధాని అవుతారని ఎవరూ అనుకోలేదు. పైగా, జయప్రకాష్ నారాయణ్ లాంటి ఒక అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు, అప్పటికి శక్తివంతురాలైన ఇందిరా గాంధీని ఎదిరించి నిలబడతాడని కూడా ఎవరూ ఊహించలేదు. అవసరమైతే పోరాడటానికి వయస్సు సమస్య కానేకాదని ఇది రుజువు చేస్తుంది.

కేంద్రంలోని జనతా పార్టీ ప్రభుత్వం విఫలమై ఉండవచ్చు, కానీ జనతా పార్టీ ప్రయోగం దేశ రాజకీయ ఎజెండాలో కొత్త దృశ్యాలను ఆవిష్కరించింది.  ఈ ప్రయోగమే నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, యునైటెడ్ పీపుల్స్ అలయన్స్ (UPA I, II), నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA I, II) తదితర ఫ్రంట్ల శ్రేణికి నాయకత్వం వహించిందనవచ్చు.  

ఈసారి ప్రయోగం ఫ్రంట్ కాకపోవచ్చు. మరేదైనా కావచ్చు. అన్ని రకాల సారూప్య రాజకీయ పార్టీల కన్సార్టియం కావచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలోని రాజకీయం పెనుమార్పులకు గురైంది. ఒకప్పుడు ప్రమాదంగా భావించబడిన హిందుత్వమే నేడు ప్రధాన ఎజెండాగా మారింది. బిజెపి, దాని మితవాద అనుబంధ సంస్థలు ప్రజల మనస్సుల్లోకి హిందూత్వ వాదాన్ని ప్రభావవంతంగా ఎక్కించగలిగాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల శైలి పరిశీలిస్తే, మూడు రాష్ట్రాలలో బిజెపి హిందుత్వం బాగా పని చేసిందని, యుపిలో సమాజ్ వాదీ పార్టీ ప్రభావాన్ని తగ్గించగలిగిందని స్పష్టమైంది.

         అందువల్ల, ఇక్కడ సందేశం చాలా స్పష్టంగా ఉంది, తదుపరి సార్వత్రిక ఎన్నికలలో మోడీ నేతృత్వంలోని బిజెపి బలాన్ని సొంతంగా ఏ జాతీయ రాజకీయ పార్టీ తగ్గించలేక పోవచ్చు. కానీ, టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రతిపాదించిన కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీల కన్సార్షియం కచ్చితంగా బీజేపీ విజయానికి అడ్డుకట్ట వేయగలదు.

కొంత కాలంగా ఇదే ఆలోచనలో ఉన్న కేసీఆర్ ఈ విషయంలో తొలి అడుగులు వేశారు. చాలావరకు అందులో సఫలీకృతులవుతున్నారు కూడా. అయితే, ఈ కన్సార్షియం కూటమికి ఎవరు నాయకత్వం వహించాలి? తమలో ప్రధానమంత్రి ఎవరు కావాలనే విషయాలను చర్చించడం ప్రస్తుతానికి అప్రస్తుతం అనొచ్చు. ఇదే విషయాన్ని 2018 నుంచీ కేసీఆర్ ఉద్ఘాటిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనే సమస్యే లేదు. అయితే రాజకీయంగా ఎంపిక చేయాల్సిన అవసరం, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాత్రం ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు.

బిజెపి హిందుత్వానికి వ్యతిరేకంగా ఈ కన్సార్షియం, లౌకికవాదం, ప్రజా సంక్షేమం అనే లక్ష్యాలను తీసుకోవాలి. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఉటంకించాలి. ప్రజా సమస్యలకు పరిష్కారాలు కూడా చూపాలి. యూపీలో సమాజ్ వాదీ పార్టీ ఈ అంశంలో విఫలమైంది. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో తెలిసినా కూడా, పరిష్కారానికి నోచుకోకుండా పోయినా ఎస్పీ మాత్రం ఆ సమస్యలను సరిగా ఎత్తిచూపలేకపోయింది. కానీ, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం అక్కడి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపగలిగింది. ఆ సమస్యలకు కేజ్రీవాల్ మోడల్ పాలనలో పరిష్కారాలను కూడా చూపించింది. దీంతో అక్కడ విజయం సాధించింది.

         కాంగ్రెస్ మద్దతు లేకుండా బీజేపీకి వ్యతిరేకంగా కన్సార్షియంకు ఆస్కారం లేదన్న వాదన సరైంది కాదు. బీజేపీకి వ్యతిరేకంగా క్రియాశీల పాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందనే విషయాన్ని గుర్తించాలి. నేడు దేశంలో బీజేపీకి అడ్డుకట్ట వేయగలిగేది కూడా ప్రాంతీయ పార్టీలేనన్న విషయాన్ని గుర్తెరగాలి. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో రూపుదిద్దుకోనున్న కన్సార్షియంలో, కాంగ్రెస్ పార్టీ కూడా జూనియర్ భాగస్వామిగా చేరాలనుకుంటే, దాన్ని అన్నిపార్టీలూ స్వాగతించాలి. కాంగ్రెస్ నాయకత్వంలోనే కన్సార్షియం  వుండాల్సిన అవసరంలేదు.

సరిగ్గా కేసీఆర్ చెప్పినట్లుగా ఎన్నికలను ఒక ఆటలాగా కాకుండా, ఒక టాస్క్ లాగా, తాము తప్పక నెరవేర్చాల్సిన విద్యుక్త ధర్మంలాగా చూడాలి. 2024 ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలను నేటి నుంచే ఒక టాస్క్ గా  తీసుకోవాలి. తెలంగాణలో కోట్లాది మందికి లబ్ది చేకూర్చేలా విజయవంతంగా అమలు చేస్తున్న  పథకాలను, కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా, ప్రజల అవసరాలను గుర్తెరిగి అమలు చేస్తున్న వినూత్న పథకాలను దేశ ప్రజలందరికీ తెలియచేసి ప్రచారం చేయాలి. తెలంగాణ నమూనాను అంతటా హైలైట్ చేయాలి. జాతీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలి. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులను దేశ ప్రజలకు అర్ధం చేయిస్తూ, ఆకట్టుకోవాలి. కాంగ్రెస్, బిజెపియేతర పార్టీల కన్సార్షియం ఈ కార్యక్రమాన్ని వెంటనే చేపడితేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.

నేడు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు కొన్ని నెలల ముందుగా మాత్రమే ప్రజలకు పనులు చేసి, ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాయి. కానీ, ఈ వ్యూహం యూపీలో సమాజ్ వాదీ పార్టీకి, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ లో కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం పనిచేయలేదు. దీన్నిబట్టి చూస్తే, ఎన్నికలకు ముందు పనిచేయాలని కాకుండా, చాలాముందు నుంచే ప్రజల్లో ఉండటం ఎంతో ముఖ్యమని గుర్తించాలి. దేశంలోని కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలు కలిసి ఈ పనిని వెంటనే ప్రారంభించి, బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా గళమెత్తితే. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని నిలువరించడం పూర్తిగా సాధ్యమే. కన్సార్షియం ఈ పనిని ఎంత త్వరగా, ఎంత బలీయంగా తీసుకుంటే అంత మంచి ఫలితాలు వస్తాయి.

దేశంలో మంచి మార్పు కోసం ప్రజల నుండి డిమాండ్ వస్తున్నది. తెలంగాణ సీఎం కేసీఆర్ సరిగ్గా ఈ విషయాన్నే ఎత్తిచూపారు. ఈ నేపథ్యంలో నుంచే దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పును తీసుకురావడానికి, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నూతన నాయకత్వం ఆవిర్భవిస్తుందని, అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

Wednesday, March 30, 2022

బడ్జెట్ పై చర్చించటమైనా మనకు వచ్చా? : వనం జ్వాలా నరసింహారావు

 బడ్జెట్ పై చర్చించటమైనా మనకు వచ్చా?

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (31-03-2022)

ప్రజాస్వామ్యం పరిణతి చెందే క్రమంలో రాష్ట్ర శాసన సభలలో, శాసన మండలిలో, పార్లమెంట్  ఉభయ సభలలో చోటు చేసుకోవాల్సిన చర్చల సరళి కూడా అదే మోతాదులో పరిణతి చెందాల్సిన అవసరం ఎంతైనా వున్నది. ఇటీవలి కాలంలో ఈ సభలకు మంచి భవిష్యత్ వున్న విద్యావంతులు, యువతీ యువకులు, ఉజ్వల భవిష్యత్ వున్న వ్యక్తులు ఎన్నికవుతున్నారు. వీరి ద్వారానే భవిష్యత్ లో రాష్ట్రాలకు, దేశానికి యువనాయకత్వం రానున్నది. అనేక దేశాలలో ప్రజాస్వామ్యం బలపడి పరిణతి చెందుతున్న కొద్దీ చట్టసభల చర్చల సరళిలో సమకాలీన సామాజిక ధోరణులు ప్రతిబింబించే విధంగా అనేక రకాల చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఇలా చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా వుంటాయి. ఆ విధంగా చాలా దేశాలు ముందుకు పురోగమిస్తున్నాయి. మన దేశంలో కొన్ని అలవాట్లు వచ్చేశాయి. వాటిల్లో కొంత మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా అవున్నది.

దురదృష్టవశాత్తూ బడ్జెట్ అనగానే, అదేదో బ్రహ్మ పదార్ధం అయినట్లు, అంకెలు చెప్పడానికే పరిమితమైనట్లు ఒక అభిప్రాయం మన దేశంలో ప్రబలి పోయింది. అన్ని స్థాయిలలోనూ అదే దిశగా చర్చ జరగడం తెలిసిన విషయమే. సహజంగా జరిగేది, ఆర్ధిక మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్తారు. అధికార పార్టీ సభ్యులు దాన్ని ఆహా- ఓహో అని పొగడడం, ప్రతిపక్ష సభ్యులు పనికిమాలిన బడ్జెట్ అని విమర్శించడం ఆనవాయితీ. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండీ ఇదే ధోరణి. ప్రతి రాజకీయ పార్టీ అధికారంలో వున్నప్పుడు బాగుంది అనడం, అధికారంలో లేనప్పుడు సప్పగా వుంది అనడం కూడా మామూలే!

బడ్జెట్ అనేది నిధుల కూర్పు. ఈ కూర్పు ఎలా వుండాలి అనే విషయం మీద, రాష్ట్రాలకు కానీ, దేశానికి కానీ ఎలా ఉపయోగ పడాలి అనే విషయం మీదా సుదీర్ఘమైన కసరత్తు జరుగుతుంది. నిధుల కూర్పులో అప్పులు కూడా ఒక భాగమే. గత శతాబ్ది అరవయ్యవ దశకం తరువాత కాలంలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కొంత పుంతలు తొక్కుతున్నది. తదనుగుణంగానే మన భారత దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా కొత్త పుంతలు తొక్కుతూ వున్నది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజుల్లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేవలం 190 కోట్ల రూపాయలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  బడ్జెట్ కూడా డాక్టర్ చెన్నారెడ్డి గారి హాయంలో కేవలం 680 కోట్ల రూపాయలే. ఇప్పుడేమో లక్షల కోట్ల రూపాయలలో మాట్లాడుకుంటున్నాం.

ప్రజాస్వామ్య దేశంలో అన్నింటికన్నా ముఖ్యమైనది ప్రణాలికా విభాగం. ప్రభుత్వ బడ్జెట్ కు, ప్రయివేట్ బడ్జెట్ కు చాలా స్పష్టమైన తేడా వుంటుంది. ప్రభుత్వ బడ్జెట్ కు మొదలు ఒక నిర్ధిష్టమైన ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది. ఏఏ రంగం మీద ఎంత వ్యయం చేయాలి, అవసరాలు ఎలావున్నాయి లాంటి విషయాల మీదా కూలంకషంగా చర్చించి ఒక ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి పన్నులు వేసే అధికారం వుంటుంది. ఆ పన్నులు ఎక్కువ వేశారా, తక్కువ వేశారా అనేది తేలేది ప్రజాకోర్టులలోనే-అంటే ఎన్నికలలో. ప్రజాస్వామ్యంలో వున్న గొప్పదనమే అది. నిధుల కూర్పులో భాగంగా రాష్ట్రానికి వచ్చే పన్నులు, కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటా, ఆర్ధిక సంఘం ఇచ్చే గ్రాంట్స్, పన్నేతర రెవెన్యూ, మార్కెట్ బారోయింగ్స్ వుంటాయి. ఇవన్నీ కలిపిన సమాహారమే బడ్జెట్.

ఇలాంటి నిధుల కూర్పులో రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా ప్రచురించిన హాండ్ బుక్ లెక్కల ప్రకారం అనేక విషయాలలో తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం అయినప్పటికీ అద్భుతాలు సాధిస్తున్నదని స్పష్టమవుతున్నది. ఇక తెలంగాణ రాష్ట్రం చేస్తున్నదన్న అప్పుల విషయానికొస్తే, ప్రస్తుతం వున్న విజ్డం ఆఫ్ ఎకానమీ ప్రకారమైనా, ఎకనామిక్ డైనమిక్స్ ప్రకారమైనా అలాంటి అప్పులు వాస్తవానికి అప్పుగా పరిగణించ కూడదు. దానిని వనరుల సమీకరణ కింద పరిగణించాలి. వనరులు అనేవి రకరకాల పద్ధతులలో వస్తాయి. పన్నుల ద్వారా, పన్నేతర రెవెన్యూ ద్వారా, మార్కెట్ బారోయింగ్స్ ద్వారా, తదితర వనరుల సేకరణ ద్వారా వస్తాయి. వీటన్నిటి విషయంలో తెలంగాణ రాష్ట్రం బ్రహ్మండమైన, కఠోరమైన క్రమశిక్షణ పాటిస్తున్నది. అవినీతికి ఆస్కారం లేకుండా చేయడం జరిగింది. గతలోఎన్నడో లేనటువంటి పారదర్శకతను ప్రవేశ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఉదాహరణకు రైతుబంధు కింద ఇచ్చిన ఏబై వేల కోట్ల రూపాయల పైచిలుకు నిధులు పూర్తి పారదర్శకతతో జరిగింది. ఇలాంటి అనేక సంస్కారవంతమైన ఆర్ధిక క్రమశిక్షణ కఠినంగా పాటించడం మూలాన తెలంగాణలో ప్రగతి సాధ్యమైంది.

ఇక అప్పుల విషయానికి వస్తే, దేశంలోని 28 రాష్ట్రాలలో అప్పులు చేసే క్రమంలో తెలంగాణాది 25వ స్థానం. అంటే, తెలంగాణ కంటే ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలు దేశంలో 24 వున్నాయి. దీనర్థం తెలంగాణ తక్కువ అప్పులు చేస్తున్నదని అర్థం. అప్పులు చేయడం వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రమాదం ఏమీలేదు.

బడ్జెట్ మీద చర్చ జరిగేటప్పుడు ఒక విషయం మీద తప్పక చర్చ జరగాలి. ఆ స్థాయి రాష్ట శాసనసభకు రావాలి. భారతదేశంలో వున్నటువంటి విధానం ప్రకారం విత్తవిధానం కానీ, ఆర్థికపరమైన అంశాల మీద నియంత్రణ కానీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే వున్నది. దేశం విత్త విధానాన్ని నిర్ణయించేది, నిర్వహించేది, నియంత్రించేది కేంద్ర ప్రభుత్వమే. ఏ రాష్ట్ర ఆర్ధిక విధానమైనా దీనికి లోబడి ఉండాల్సిందే. కేంద్రప్రభుత్వ అడుగుజాడలలో ముందుకు పోవాల్సిందే. కొద్దిమేరకే స్వేచ్చ వుంటుంది. కేంద్రం వ్యవహారం గొప్పగా వుంటే దేశం అంతా గొప్పగా వుంటుంది. ఆ పరిస్థితులను కూడా రాష్ట్రాల శాసనసభలు సమీక్ష చేయాలి. తదనుగుణంగా చర్చ జరగాలి. ఆ పరిణతిని రాష్ట్ర శాసనసభలు సమీక్ష చేయాలి. ఇది చాలా ముఖ్యమైన అకాడమిక్ విషయం. దీన్ని గురించి ఒక సమగ్రమైన విశ్లేషణ జరగాలి.

ఉదాహరణకు రాష్ట్రాల మార్కెట్ బారోయింగ్స్ వ్యవహారం తీసుకుందాం. దీనికి సంబంధించి ఒక చట్టం వున్నది. దాన్నే ఎఫార్బీఎం (FRBM) లేదా ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మానేజ్మెంట్ అంటారు. దేశానికి పెద్దగా వ్యవహరించాల్సిన కేంద్ర ప్రభుత్వం, అదీ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం, ఈ దేశాన్ని సరైన రీతిలో నడపడం లేదు. ఇప్పుడు పాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం విధానంలో కొన్ని విచిత్రమైన ధోరణులు కనిపిస్తున్నాయి. క్రమశిక్షణ అనేది అంతటా పాటించాలి. అది ఎవరూ కాదనరు. ఆంక్షలున్నా, పద్ధతులున్నా, మొత్తం దేశం పరిస్థితిని దృష్టిలో వుంచుకోవాలి. అది కనబడటం లేదు. ఇప్పుడు అధికారంలో వున్న కేంద్ర ప్రభుత్వం పాలసీ, బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు వుండాలనేది. ఇది ఫెడరల్ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే, అనారోగ్యమైన, అప్రజాస్వామిక చర్య. భవిష్యత్ లో దేశంలో అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఈ పెడధోరణి ఆశించతగింది కాదు.

భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అనే విషయం రాజ్యాంగం మొట్టమొదటి పేజీలోనే వున్నది. ఇది రాజ్యాంగం చెప్పిన మాట. కాబట్టి రాష్ట్రాల ఉనికి లేకుండా చేస్తాం, రాష్ట్రాలను అణచి పెడుతాం అనే కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ చర్యలు సమంజసం కాదు. మరొక్క విషయం దృష్టిలో వుంచుకోవాలి. కేంద్ర ప్రభుత్వ పనితీరు తెలంగాణ రాష్ట్రంతో పోల్చి చూస్తే ఏమంత బాగాలేదు. రాష్ట్రం కంటే చాలా దిగజారి పోయింది. అందులో ఏమాత్రం అనుమానంలేదు. గణాంకాలు స్పష్టంగా తెలియచేస్తున్నాయి. ఇందులో దాచిపెట్టడానికి ఏమీలేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించిన ఆర్ధిక గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం పనితీరుకు, కేంద్రం పనితీరుకు చాలా తేడా వున్నది. తలసరి ఆదాయం చూసినా, జీడీపీ చూసినా, ఇంకా ఏవిధంగా చూసినా కేంద్రం చాలా వెనుకబడి వున్నది.

రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం వెల్లడి చేసిన లెక్కల ప్రకారం జీడీపీలో కేంద్ర ప్రభుత్వ అప్పుల శాతం 58.5. అంటే కేంద్ర ప్రభుత్వం 58.5 మేరకు అప్పులు తీసుకున్నది. ఈ రోజు భారదేశం చేసిన అప్పు రు 152 లక్షల కోట్లు. రాష్ట్రాలకు ఇచ్చేది మాత్రం 25 శాతం మాత్రమే. రాష్ట్రాలకు ఒక నీతి, కేంద్రానికి ఇంకొక నీతి వుంటుందా? కేంద్రం పైన ఇంకెవరూ వుండరు కాబట్టి, వాళ్లను అడిగేవారు ఎవరూ లేరు కాబట్టి, ఇష్టమొచ్చినట్లు నిధుల సమీకరణ చేస్తారు. రాష్ట్రాలను మాత్రం తొక్కి పెడతారు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని చాలా భయంకరంగా దెబ్బతీస్తున్నది. అది తీసుకునే నిర్ణయాలు సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయా లేక సమాఖ్య స్ఫూర్తిని పెంపొందిస్తున్నాయా అనే విషయాలు శాసనసభలో సమీక్ష చేయాల్సిన అవసరం వున్నది. ఇక్కడ ప్రతిపక్షం, అధికార పక్షం అన్న భేదం లేకుండా ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా జరిగే విధానాలను ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం వున్నది. దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలు, ఈ విషయాన్ని క్షుణ్ణంగా చర్చించి ప్రమాదంలో వున్న సమాఖ్యస్ఫూర్తిని కాపాడాలి.

బడ్జెట్ అనేది ఒక పబ్లిక్ ఫండ్. ఇందులో రాజకీయాలకు తావులేదు. వాస్తవానికి రాజకీయాలనేవి వోట్లు, సీట్ల కంటే అతీతమైనవి. కేవలం ఓట్లు, సీట్లు లేక్కపెట్టుకోవడమే రాజకీయం కాదు. అంతవరకే పరిమితమైతే అది అరాచకమవుతుంది కాని రాజకీయం కాదు. దురదృష్టమేమిటంటే ఇటీవలి కాలంలో చాలా మంది పిగ్మీలు రాజకీయాలలో దూరిపోయి, అవగాహనాలేమితో, అసాధారణమైన పెడధోరణులతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి భయంకరమైన విఘాతం తెచ్చే పనులు చేస్తున్నారు. మంచిగా వున్న ఈ దేశంలో విషబీజాలు నాటుతున్నారు. ఇది సరైనది కాది. తాత్కాలికంగా కొంతమందికి రాక్షసానందం కలిగించవచ్చు. కాని కాలం గడిచే కొద్దీ, ప్రపంచానికి మార్గదర్శకంగా వుంటూ, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నతువంటి భారత సమాజం ఔన్నత్యానికి దారుణంగా దెబ్బతీస్తుంది వీరి ధోరణి.

కేంద్ర ఆర్ధిక పరిస్థితి దిగజారిపోవడానికి కరోనా కేవలం సాకు మాత్రమే. కరోన రాకముందే దేశ ఆర్ధిక అభివృద్ధి తిరోగమన దిశగా పయనించింది. తెలంగాణ సాధించిన తరహాలో కేంద్రం గ్రోత్ వుంటే బాగుండేది. ఏడు సంవత్సరాల కాలంలో దేశం జీడీపీ 124 లక్షల కోట్ల రూపాయల నుండి 236 లక్షల కోట్లకు పెరిగింది. అదే సమయంలో ప్రతిసంవత్సరం తెలంగాణ లక్షల కోట్ల సంపదను పెంచుకుంటూ పోయింది. భారతదేశ వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు 38.7 శాతం ఎక్కువ. కేంద్ర ప్రభుత్వ అసమర్థ ఆర్ధిక విధానాల మూలంగా తెలంగాణకు సమకూరాల్సిన మరో మూడు లక్షల కోట్ల రూపాయల సంపద సమకూరకుండా పోయింది. ఇదిలా వుండగా 2025 సంవత్సరానికల్లా 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అని భ్రమలు కలిగిస్తున్నది కేంద్రం. అదెప్పటికి నేరవేలాలో భగవంతుడికే తెలియాలి. ఇటీవల పార్లమెంటులో కేంద్రం వెలువరించిన లెక్కల ప్రకారం ప్రస్తుతానికి 3.1 ట్రిలియన్ డాలర్ ఎకానమీలోనే వున్నాం. భవిష్యత్తులో వాళ్లు చెప్పినట్లు చేరుకోవాలంటే ప్రతి సంవత్సరం నిరంతరంగా 16 శాతం కనీస గ్రోత్ వుండాలి. కాని ప్రస్తుత గ్రోత్ 6 మాత్రమే. కేంద్రం ఎంత గొప్పగా వుంటే రాష్ట్రాలు అంత గొప్పగా వుంటాయి.

  కేంద్రప్రభుత్వం ఆర్ధిక అసమర్థత తెలంగాణ మీద ప్రభావం చూపుతున్నది. రాష్ట్రానికి బాగా నష్టం వస్తున్నది. రాజకీయాలు కూడా పెడధోరణి పడుతున్నాయి. ఎఫార్బీఎం విషయంలో ఆంక్షలు విధిస్తున్నారు. కేంద్రం ఎఫార్బీఎం 6.9 శాతం పెట్టుకుని రాష్ట్రానికి 4 శాతం ఇస్తామని అంటారు. అందులో కూడా పాయింట్ ఐదు శాతానికి ఆంక్షలు విధించారు. వారు ఇస్తామన్న 4 శాతం కూడా కరెక్ట్ గా ఇవ్వరు. జీడీపీ తగ్గింది. పరిశ్రమలు మూతబడ్డాయి. ఆత్మనిర్భర్ ఏమోకాని, దేశం ఆత్మనిబ్బరాన్ని కోల్పోయింది. మతపిచ్చి  పెరిగింది. ఆ మతపిచ్చి అనే కార్చిచ్చు ఈ దేశాన్ని దహించి వేస్తుంది. దేశంలో నెలకొన్న వాతావరణం, దశాబ్దాల తరబడి సాగిన కృషి కుప్పకూలుతున్నది. యువతకు ఉద్యోగ అవకాశాలు పోయాయి. ఇలా కొనసాగితే దారుణమైన పరిస్థితులు వస్తాయి.

బడ్జెట్ మీద చర్చ అర్థవంతంగా వుండాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో వుంచుకోవాలి. కేంద్రప్రభుత్వ ఆర్ధిక విధానాలు రాష్ట్ర ఆర్ధిక విధానం మీద ప్రభావం చూపుతాయన్న విషయం మరచిపోకూడదు. కేవలం విమర్శించడం కోసమే విమర్శించడం సమంజసం కాదు.

(2022 ద్రవ్యవినియోగ బిల్లు మీద జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన ప్రసంగం ఆధారంగా) 

Sunday, March 27, 2022

 సీతా కల్యాణ ఘట్టం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-101

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (28-03-2022)

" సీతను సర్వాభరణో,  పేతను  దా నిలిపి నగ్ని  కెదురుగ గౌస

ల్యా తనయున  కభిముఖముగ,  క్ష్మాతలనాథుండు రామచంద్రున కనియెన్ "

         అన్ని విధాలైన అలంకారాలతో ప్రకాశిస్తున్న సీతను, అగ్నికి ఎదురుగా-శ్రీరామచంద్రమూర్తికి అభిముఖంగా, నిలువబెట్టి, జనక మహారాజు శ్రీరామచంద్రమూర్తితో:

ఈ సీత నాదుకూతురు, నీ సహధర్మచరి దీని నిం గై కొనుమా

కౌసల్యాసుత, నీకును భాసురశుభ మగు గ్రహింపు పాణిం బాణిన్ "

" కౌసల్యా కుమారా, ఈ సీత నా కూతురు. నీ సహధర్మచారిణి. ఈమెను పాణి గ్రహణం చేసుకో. నీకు జగత్ ప్రసిద్ధమైన మేలు కలుగుతుంది. నీకు శుభం కలుగుతుంది. మంత్రపూర్వకంగా ఈమె చేతిని నీ చేత్తో పట్టుకో. రామచంద్రా, పతివ్రత-మహా భాగ్యవతి అయిన నీ సీత, నీ నీడలా ఒక్కసారైనా నిన్ను విడిచి వుండదు" అని అంటూ, మంత్రోచ్ఛారణతో పవిత్రవంతములైన జలధారలను రామచంద్రమూర్తి చేతుల్లో జనక మహారాజు ధారపోశాడు. దేవతలు, ఋషులు మేలు-మేలనీ, భళీ అనీ శ్లాఘించారు. సంతోషాతిషయంతో దేవతలు పూలవాన కురిపించారు. దేవదుందుబులను చాలా సేపు మోగించారు. వాసవుడు మొదలైన పలువురు,తమ శోకత్వాన్ని-దీనత్వాన్ని తమ మనస్సులనుండి తొలగించుకున్నారు.

ఈవిధంగా మంత్రించిన జలాలను ధారపోసి భూపుత్రి సీతను శ్రీరామచంద్రమూర్తికిచ్చి వివాహం చేసానని జనక మహారాజు సంతోషిస్తూ లక్ష్మణుడివైపు చూసి, "లక్ష్మణా ఇటు రా. దానంగా ఊర్మిళను స్వీకరించు. ప్రీతిపూర్వకంగా ఇస్తున్నాను. ఈమె చేతిని ప్రేమతో గ్రహించు" మని కోరాడు. ఊర్మిళను లక్ష్మణుడికిచ్చిన తర్వాత, భరతుడిని మాండవి చేతిని, శత్రుఘ్నుడిని శ్రుతకీర్తి చేతిని గ్రహించమని ప్రేమతో పలికాడు జనకుడు. ఇలా నలుగురు కన్యలను దశరథుడి నలుగురు కొడుకులకు ధారపోసి, జనకుడు రాజకుమారులతో, దోష రహితమైన మనసున్న వారందరు సుందరులైన భార్యలతో కలిసి, సౌమ్య గుణంగలవారిగానూ-సదాచార సంపన్నులుగానూ కమ్మని అంటాడు. జనక మహారాజు మాటలను విన్న దశరథుడి కుమారులు-రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, తండ్రి అనుమతితో భార్యల చేతులను తమ చేతుల్లో వుంచుకొని, సంతోషాతిషయంతో, మలినంలేని భక్తితో, అగ్నికి-వేదికి-మౌనీశ్వరులందరికి-రాజులకు భార్యలతో కలిసి ప్రదక్షిణ చేసారు. వివాహం శాస్త్ర ప్రకారం ప్రసిద్ధంగా జరిగింది. పూలవాన కురిసింది. ఆకాశంలో దేవ దుందుభులు ధ్వనించాయి. దేవతా స్త్రీలు నాట్యం చేసారు. గంధర్వ కాంతలు పాడారు. రావణాసురుడి భయం వీడి, సందుల్లో-గొందుల్లో దాక్కున్న వారందరు నిర్భయంగా-గుంపులు, గుంపులుగా ఆకాశంలో నిలిచారు. మంగళ వాద్యాలు మోగుతుంటే, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అగ్నికి మూడుసార్లు ప్రదక్షిణ చేయడంతో పెళ్లి తంతు ముగిసింది. తమ భార్యలతో దశరథ కుమారులు విడిది ఇళ్లకు పోవడంతో, వారివెంట దశరథుడు, వశిష్ఠ విశ్వామిత్రాది మునీశ్వరులతో, బందువులతో విడిదికి పోయారు.

         (సీతా కల్యాణ ఘట్టం చదివినవారికి శ్రీ సీతా వివాహ విషయ చర్చకు సంబంధించి ఆసక్తి కలగడం సహజం. కన్యాదానం చేస్తూ జనకుడు రాముడిని "కౌసల్యా సుత" అని సంబోధించాడు. ఎందుకు జనకుడు కౌసల్యా కుమారా అని పిలవాలి? స్త్రీ పేరుతో పిలవకుండా, వాడుక పేరైన "రామా" అని పిలవచ్చు కదా. దశరథ కుమారా అనకూడదా? ఆ రెండూ ఇప్పుడు సరిపోవని అర్థం చేసుకోవాలి. కేవలం రామా అని పిలిస్తే ఆ పేరుకలవారు మరొకరుండవచ్చు కదా. దశరథ కుమారా అని పిలవడానికి ఆయనకు నలుగురు కొడుకుల్లో వేరొకరు కావచ్చు కదా. కౌసల్యా కుమార అంటే ఏవిధమైన సందేహానికి తావుండదు. "ఈ సీత" అంటాడు రాముడితో. సీత, సిగ్గుతో తన చేయి పట్టుకొమ్మని, తనంతట తానే రాముడిని అడగదు. రామచంద్రమూర్తి తనకు తానే సీత చేయి పట్టుకుంటే, పెళ్లికాక ముందే ఎందుకలా స్వతంత్రించి కాముకుడిలా ప్రవర్తించాడని సీత అనుకోవచ్చు-లోకులూ భావించవచ్చు. అందుకే జనకుడు తానే సీతచేతిని రామచంద్రమూర్తికి చూపి "ఈ సీత" అని చెప్పాడు. అలంకరించబడిన కల్యాణమంటపంలో, నలు వైపులా నిలువుటద్దాలు వేసి వుండడంతో, అన్నిటిలోనూ సీత రూపమే కనిపించసాగింది. అద్దంలో సీతేదో-నిజమైన సీతేదో తెలుసుకోలేక నలుదిక్కులు చూస్తున్న రాముడి భ్రమపోయేట్లు, చేయి చూపి "ఈ సీత" అని చెప్పాడు జనకుడు.

"ఈ సీత" అంటే,అతి రూపవతైన సీతని, సౌందర్య-శౌకుమార్య-లావణ్యాదులలో స్త్రీలందరిని అతిశయించిందని అర్థంకూడా వస్తుంది. "ఈ సీత" అంటే, "ఈ యగు సీత" అనే అర్థం కూడా వుంది. రాముడెప్పుడైతే శివుడి విల్లు విరిచాడో, అప్పుడే అతడు శివుడికంటే గొప్పవాడైన విష్ణువని జనకుడు గ్రహించాడు. అలాంటి ఆమెకు సాక్షాత్తు లక్ష్మీదేవైన సీతను ఇస్తున్నాననే అర్థమొచ్చే విధంగా "ఈ సీత" అన్నాడు. రాముడెంత మహా సౌందర్య పురుషుడని పేరుందో, అంతకంటే తక్కువకాని సౌందర్యం ఆమె కుందని చెప్పదల్చుకున్నాడు జనకుడు. సీత అంటే కేవలం నాగటి చాలనే కాదని, నాగటి చాలు భూమిని ఛేదించుకొని రూపంకలదిగా ఎలా అవుతుందో, అలానే భూమిని ఛేదించుకొని రావడంవల్ల సీత అనే పేరు ఆమెకు ప్రఖ్యాతమయింది. దీనివల్ల ఆమె ఆభిజాత్యం తెలుస్తున్నది. సీత-నాగటి చాలు-అంటే కాపువాడి కృషి ఫలింపచేసి, వాడికి ఫలం కలిగించేది. అలానే రాముడు చేయబోయే కార్యాలన్నీ, సీత వలనే ఫలవంతమవుతాయనీ, ఆమె సహాయం లేకుండా రాముడి కృషి వ్యర్థమని, ప్రతిఫలాపేక్ష లేకుండా అతడికి సహాయపడుతుందని జనకుడి మనస్సులోని ఆలోచన.

ఆకాశ గంగానది శాఖైన సీత ఏవిధంగా ఒకసారి తనను సేవించినవారి పాపాలను ధ్వంసం చేస్తుందో, అలానే "ఈ సీత" తనకొక్కసారి నమస్కారం చేసిన వారి పాపాలను ధ్వంసంచేస్తుంది. కౌసల్యా సుతుడైన రాముడు యోనిజుడని, సీత అయోనిజని, కాబట్టి ఆభిజాత్యంలో రాముడికంటే తక్కువైందేమీ కాదని జనకుడి భావన. సీత నాగటి చాలులో దొరికినప్పటికీ జనకుడు సగర్వంగా, "నాదుకూతురు"-తన కూతురని చెప్పాడు. అలాంటి తనకూతురును, ఎలా ప్రేమించాలో అలానే ప్రేమించమని సూచించాడు. సీతంటే జన్మపరిశుద్ధి అనీ, "నాదుకూతురు" అంటే నానా సపరిశుద్ధి అనీ తెలుపబడింది. "నీ సహధర్మచరి" అనడమంటే, రాముడి విషయంలో ఎలా వుంటుందోనని ఆలోచించాల్సిన పనిలేదనే అర్థం స్ఫురిస్తుంది. రాముడేది ధర్మమని భావిస్తాడో, ఆ ధర్మంమందే ఆమె ఆయనకు తోడుగా వుండి ఆ కార్యాన్ని నిర్వహిస్తుంది. రాముడు తండ్రి వాక్యాన్ని ఎలా పాలించాడో, అలానే ఆయన వాక్యాన్ని సీత పాలిస్తుందని అర్థం. సీతే లక్ష్మీదేవి అయినందువల్ల, విష్ణువు అవతారమైన రాముడి కైంకర్యమే ఆమె స్వరూపం. సృష్టిలో, రక్షణలో, సంహారంలో ఆమె ఆయనకు సర్వకాల సర్వావస్థలందు తోడుగా వుంటుంది. వివాహ లీల కేవలం లోక విడంబనార్థమేనని, ఆయన సొత్తును ఆయనే తీసుకొమ్మని కూడా అర్థం).

 

Saturday, March 26, 2022

మూడవ రోజు యుద్ధంలో చక్రాన్ని ధరించి భీష్ముడి మీదికి ఉరికిన శ్రీకృష్ణుడు .... ఆస్వాదన-64 : వనం జ్వాలా నరసింహారావు

 మూడవ రోజు యుద్ధంలో చక్రాన్ని ధరించి భీష్ముడి మీదికి ఉరికిన శ్రీకృష్ణుడు

ఆస్వాదన-64

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (27-03-2022)

కురుక్షేత్ర సంగ్రామంలో రెండవరోజు యుద్ధంలో అర్జునుడి విజృంభణతో పాండవులది పూర్తిగా పైచేయి అయింది. మర్నాడు తెల్లవారగానే భీష్ముడు కౌరవ సేనను ఒక దగ్గరికి తెచ్చి, ‘గరుడ వ్యూహం’ గా తీర్చిదిద్దాడు. ఆ వ్యూహం ముక్కుగా, అందం, బలం చేకూరే విధంగా స్వయంగా భీష్ముడే నిలబడ్డాడు. ద్రోణుడు, కృతవర్మ కన్నులుగా; కృపుడు, అశ్వత్థామ శిరస్సుగా; త్రిగర్తులు, భూరిశ్రవుడు, శల్యుడు, భగదత్తుడు, సౌవీరరాజు, సింధుభూపతి, జయద్రథుడు కంఠంగా; దుర్యోధనుడు, ఆయన తమ్ములు వీపుగా; విందుడు, అనువిందుడు, కాంభోజరాజు, శూరసేనరాజు తోకగా; మాగధరాజు, కళింగరాజు మొదలైనవారు కుడి రెక్కగా; కర్ణాటక, కోసల సేనలు మున్నగువారు ఎడమ రెక్కగా అయ్యారు. మిగిలినవారు అటు-ఇటు సర్దుకున్నారు.

భీష్ముడి గరుడ వ్యూహాన్ని చూసిన అర్జునుడు ‘అర్థచంద్రాకారం లో పాండవుల వ్యూహాన్ని అమర్చమని ధృష్టద్యుమ్నుడికి చెప్పి, దాని లక్ష్యం దుర్యోధనుడి వ్యూహాన్ని ఛేదించడం అన్నాడు. అతడు అలాగే తీర్చిదిద్దాడు. ఆ అర్థచంద్రాకార వ్యూహంలో భీముడు, పాండ్య మగధ సేనలతో కూడి, కుడి కొసన నిలిచాడు. అటు తరువాత విరాటుడు, ద్రుపదుడు నిలిచారు. నీలుడితో పాటు ధృష్టకేతుడు, కాశీదేశ కరూశదేశ సేనలతో పాటు నిలిచాడు. శిఖండితో పాటు ధృష్టద్యుమ్నుడిని ముందుంచుకుని యుధిష్టరుడు వ్యూహానికి మధ్యగా నిలిచాడు. అటు పక్కగా సాత్యకి, నకుల సహదేవులు, ద్రౌపది కొడుకులు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, కేకయరాజులు వ్యూహంలో భాగంగా నిలిచారు. శ్రీకృష్ణుడు సారథిగా అర్జునుడు ఎడమ కొసన నిలిచాడు. మిగిలిన రాజులు వారి-వారి స్థానాలలో నిలిచారు. ఈ విధంగా కౌరవ పాండవ సేనలు యుద్ధానికి సంసిద్ధమై ఒకరినొకరు ఎదుర్కున్నారు.

అర్జునుడు విజృంభించి కౌరవ సేనలోని కాల్బలాన్ని చీకాకు పరిచి, మొత్తం కౌరవ సేనను విధ్వంసం చేయడంతో కౌరవులు అంతా ఏకమై అతడిని ఎదుర్కున్నారు. అప్పుడు పాండవులు అందరూ ఏకమై పోయారు. భీష్ముడి నాయకత్వంలో కౌరవ సేన, భీముడి నాయకత్వంలో పాండవ సేన వెనుకంజ వేయకుండా పోరాడారు. ఇరుపక్కలా భీష్మద్రోణాది కురువీరులు, భీముడు, ఘటోత్కచుడు, సాత్యకి, అభిమన్యుడు మొదలైన పాండవ వీరులు యుద్ధంలో పాల్గొన్నారు. దుర్యోధనుడు భీముడితో యుద్ధం చేసి మూర్ఛపోయాడు. అతడు మూర్ఛబోవడం చూసిన సారథి రథాన్ని యుద్ధభూమికి దూరంగా తీసుకుపోయాడు.

తమ రాజు అలా కావడం చూసిన కౌరవసేన పారిపోసాగింది. ద్రోణుడు, భీష్ముడు వారిని మరలించడానికి చేసిన ప్రయత్నం సఫలం కాలేదు. పారిపోయే సేనను భీముడు వెంబడించాడు. మరోవైపు సాత్యకి, అభిమన్యుల చేతిలో శకుని ఓడిపోయాడు. అర్జునుడు మరో దిక్కున కౌరవసేనను వెన్నాడి తరిమికొట్టాడు. మూర్ఛనుండి తేరుకున్న దుర్యోధనుడు యుద్ధ భూమికి వచ్చి భీష్మ ద్రోణులు వున్న చోటుకు వెళ్లి, వారికి పాండవుల మీద పక్షపాతం వున్నదని ఆరోపించాడు. దేవేంద్రుడితో పాటు దేవతల సేన మొత్తం దండెత్తి వచ్చినా సరే, యుద్ధభూమిలో పాండవులు నిలబడితే వారిని జయించడం సాధ్యం కాదని భీష్ముడు స్పష్టంగా పేర్కొంటూ, దుర్యోధనుడు అలా మాట్లాడడం న్యాయం కాదన్నాడు. అయినా, తన శక్తివంచన లేకుండా పాండవుల సేనలను సంహరిస్తానని చెప్పాడు. అలా చెప్పి భీష్ముడు విజృంభించాడు. ఆర్జునుడిని ఎదుర్కున్నాడు. భీష్ముడికి సహాయంగా దుర్యోధనుడితో సహా కౌరవ వీరులు కూడా విజృంభించారు.

ఎక్కడ చూసినా పరాక్రమంతో విజృంభించిన భీష్ముడే కనిపించాడు. ప్రళయకాల రుద్రుడిలాగా పరాక్రమ నృత్యం చేశాడు. పాండవులు అప్పుడు ఏమీ చేయలేక పోయారు. భయభ్రాంతులయ్యారు. భీష్మద్రోణులను ఎదుర్కొనమని ఆర్జునుడిని ప్రేరేపించాడు శ్రీకృష్ణుడు. అర్జునుడి రథాన్ని చూసిన భీష్ముడు తన బాణాలతో శ్రీకృష్ణుడి రథాశ్వాలను, అర్జునుడిని నొప్పించాడు. శ్రీకృష్ణుడు స్వయంగా దెబ్బతిన్నాడు. అర్జునుడు కూడా దెబ్బ తిన్నట్లు అర్థం చేసుకున్నాడు. పాండవులు పారిపోవడం చూశాడు. ఇక ఇప్పుడు తాను ఉపేక్షిస్తే వీలులేదనుకున్నాడు శ్రీకృష్ణుడు. భీష్ముడిని చంపి ధర్మరాజుకు జయం చేకూర్చాలనుకున్నాడు. పారిపోతున్న పాండవ సేనలను వెనుకంజ వేయవద్దని సాత్యకి విజ్ఞప్తి చేశాడు. తానున్నాను భయపడవద్దని అన్నాడు. అలా అంటూ అర్జునుడి రథానికి ముందు వచ్చి నిలబడ్డాడు.

అలా నిలబడి పాండవులను వెనక్కు రమ్మని అంటున్న సాత్యకితో శ్రీకృష్ణుడు, దుర్యోధనుడి గెలుపు తాను సహించలేనని, భీష్ముడిని సంహరిస్తానని, ద్రోణుడి పని పట్తానని, కౌరవ యోధుల అవయవాలు చీల్చి చెండాడ గలనని, కౌరవ సేనలను నాశనం చేయగలనని, భూభారాన్ని కుంతీ పుత్రులైన పాండవులకు కట్టిబెట్టగలనని, తన భుజ పరాక్రమాన్ని చూపించి, చక్రాయుధాన్ని ప్రయోగించి, విక్రమ వీరవిహారం చేస్తానని అన్నాడు. ఇలా అంటూ, శ్రీకృష్ణుడు తన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని సంస్మరించాడు. వెంటనే చక్రం ఆయన దగ్గరికి వచ్చింది. శ్రీకృష్ణుడు ఆ చక్రాయుధాన్ని తన కుడిచేతికి అమర్చుకున్నాడు. గుర్రాల కళ్ళాలు జాగ్రత్తగా విడిచి కిందికి దూకాడు. భూమి దద్దరిల్లగా విజృంభించాడు. శ్రీకృష్ణుడు గర్వించి వున్న భీష్ముడి మీదికి ఉరికాడు. దుర్యోధనుడి యోధ ముఖ్యులు నివ్వెరపోయారు. శ్రీకృష్ణుడిని అలా చూసిన భీష్ముడు ఆయన ఆవిధంగా తనను ధన్యుడిని చేస్తున్నాడని, శీఘ్రంగా రమ్మని, ఆయనకు తోచిన విధంగా చేయమని నమస్కరిస్తూ ప్రార్థించాడు.

భీష్ముడు ఇలా అంటుండగానే అర్జునుడు రథం మీది నుండి దూకి, పరుగెత్తిపోయి, శ్రీకృష్ణుడిని వెనుకవైపు నుండి గట్టిగా పట్టుకున్నాడు. కాని, శ్రీకృష్ణుడు ఆర్జునుడిని పెనుగాలిలా ఈడ్చుకుని పోయాడు. అప్పుడు అర్జునుడు మొండికేసి కూర్చుని, శ్రీకృష్ణుడితో, ‘ఓ శ్రీకృష్ణా! నీకోపం ఉపశమింప చేసుకోవయ్యా! నీవే కదా పాండవులకు సంరక్షకుడవు! నువ్వే ప్రతిజ్ఞ తప్పితే, ఇక ప్రతిజ్ఞను పాలించే ధర్మరాజు మాట ఏమిటి? ధర్మరాజు పరాక్రమం ఏమికావాలి? ఈ చర్య నీకు తగినదా? ఈ విధంగా ఆయుధం పట్టుకుని ప్రతిజ్ఞమీరి యుద్ధం చేయడం నీకు తగునయ్యా? శాంతించు. నీ సహాయంతో కౌరవ సేనను రూపుమాపడం నాకు సులువు అని అన్నాడు. ఆ మాటలకు కోపం పోగొట్టుకున్న శ్రీకృష్ణుడు వెనక్కు మరలి, రథం ఎక్కి, సారథి పీఠం మీద కూర్చున్నాడు. కృష్ణార్జునులు ఇద్దరూ శంఖాలు పూరించారు.

ఆ తరువాత అర్జునుడు విజృంభించాడు. కౌరవ సేనను నాశనం చేశాడు. కౌరవ పక్షం నుండి ఎంతమంది వీరులు ఎదుర్కొన్నా అర్జునుడిదే పైచేయి అయింది. అతడు ప్రయోగించిన ఐంద్రాస్త్రం కౌరవ సేనను చిత్తు చేసింది. అర్జునుడు విజయ గర్వంతో దేవదత్తాన్ని, శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించారు. ఇద్దరూ సింహనాదాలు చేశారు. అప్పుడే సూర్యాస్తమయం అయింది. ఆ మలిసంధ్యలో భీష్ముడు, ద్రోణుడు, బాహ్లికుడు తమ సేనలను ఉపసంహరించి, కాగడాల వెలుగులో తమ విడిదులకు వెళ్లారు. పాండవులు ఉత్సాహంగా ఉప్పొంగిపోయి, తమతమ నివాస స్థలాలకు పోయారు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, భీష్మపర్వం, ద్వితీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)