కుముద్ బెన్ జోషి...కొన్ని జ్ఞాపకాలు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి
దినపత్రిక (17-03-2022)
ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నవంబర్ 26, 1985 నుండి ఫిబ్రవరి 7, 1990 వరకు, సుమారు నాలుగు సంవత్సరాలకు పైగా గవర్నర్ గా పనిచేసిన కుముద్
బెన్ జోషి మరణ వార్త, ఆమె దగ్గర పనిచేసిన నాకు చాలా విచారాన్ని కలిగించింది. అతి
చిన్న వయస్సులోనే మూడు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నిక కావడమే కాకుండా, కేంద్ర సహాయ మంత్రిగా రెండుసార్లు పనిచేశారామె. అప్పట్లో అతి చిన్న
వయసులోనే గవర్నర్ గా నియమించబడ్డ వ్యక్తిగా కూడా ఆమె పత్యేకతను సంతరించుకున్నది. గవర్నరుగా
పదవి స్వీకరించిన వెంటనే, ఈమె రాష్ట్రంలోని 23 జిల్లాలు,
రాష్ట్రం బయటా పర్యటించి, తనముందు వచ్చిన 13
మంది గవర్నర్ల కంటే తాను క్రియాశీలకమైన గవర్నరని చూపే ప్రయత్నం చేసింది.
గవర్నర్
గా కుముద్ బెన్ జోషి పదవీ బాధ్యతలు చేపట్టిన నెలరోజులకే, హైదరాబాద్ సమీపంలో గల రామచంద్రాపురం లోని బిహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ
పాఠశాలలో
లైబ్రేరియన్ గా ఉద్యోగం చేస్తున్న నన్ను గవర్నర్ కార్యదర్శిగా పనిచేస్తున్న
స్వర్గీయ డాక్టర్ చంద్రమౌళి ఐఏఎస్ సలహా మేరకు, చేతన స్వచ్ఛంద సంస్థ
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా నియమించడం జరిగింది. కుముద్ బెన్ జోషి గవర్నర్ గా
ఉన్నంత కాలం, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ చెన్నారెడ్డి పీఆర్వో గా వెళ్లేంత
వరకూ నేను అక్కడే పనిచేశాను. గ్రామీణాభివృద్ధి
లక్ష్యంగా స్వర్గీయ శారదా ముఖర్జీ గవర్నర్ గా పనిచేస్తున్న రోజుల్లో అప్పట్లో ఆమె
కార్యదర్శి మోహన్ కందా సలహా మేరకు గవర్నర్ అధ్యక్షతన స్థాపించబడిన సంస్థ చేతన.
కాకపోతే ఆమె వేల్లిపోయిన తరువాత అచేతనంగా పడివున్న చేతన సంస్థను పునరుద్ధరించే
దిశగా నన్ను ఉద్యోగంలోకి తీసుకోవడం జరిగింది. నాకున్న లైబ్రరీ నేపధ్యంలో గవర్నర్
కుముద్ బెన్ జోషి ఆదేశాల మేరకు రాజ్ భవన్ లైబ్రరీని కూడా ఒక పద్ధతిలో పెట్టడం
జరిగింది.
గవర్నర్
గా పనిచేస్తున్న రోజుల్లో ఆమె అధ్యక్షతన వున్న చేతన సంస్థ ద్వారా నిరంతరం
గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేవారు కుముద్ బెన్ జోషి. భారీ ఎత్తున చెట్లు
నాటే కార్యక్రమం, పొగలేని పొయ్యిల వాడకం ప్రచారం,
భారీ వర్షాలు కురిసినప్పుడు రెడ్ క్రాస్ కు సహాయంగా వరద సహాయక కార్యక్రమాలు
లాంటివి చేతనా ద్వారా జరిగేవి.
కుముద్
బెన్ జోషి అధ్యక్షతన నెలకొల్పబడిన మరో స్వచ్చంద సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
సోషల్ యాక్షన్ (నీసా). రెడ్ క్రాస్ సంస్థ ఎలాగూ వుండనే వుంది. నీసా సంస్థ కార్య
కలాపాలను విజయవంతంగా నిర్వహించడానికి కుముద్ బెన్ జోషి కి చేదోడు వాదోడుగా గవర్నర్
కార్యదర్శి స్వర్గీయ చంద్రమౌళి, అప్పట్లో రెడ్ క్రాస్
కార్యదర్శిగా పనిచేస్తున్న స్వర్గీయ డాక్టర్ ఎపి రంగారావు వుండేవారు. నిధుల కొరతతో
ఇబ్బందులు ఎదుర్కుంటున్న రెడ్ క్రాస్ ను బలోపేతం చేయడానికి కుముద్ బెన్ జోషి
అహర్నిశలు కృషి చేసేవారు. హైదరాబాద్ లో వున్న రెడ్ క్రాస్ అనుబంధ సంస్థలను మెరుగు
పరచడం జరిగింది.
చేతన,
నీసా, రెడ్ క్రాస్ సంస్థలు మూడూ కూడా రాజ్ భవన్ భవన సముదాయంలోనే కార్యకలాపాలు
నిర్వహించేవి. నీసా ఆధ్వర్యంలో కుముద్ బెన్ జోషి చొరవతో విజయవంతంగా నిర్వహించిన ఒక
గొప్ప చారిత్రాత్మక కార్యక్రమం తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్, తదితర జిల్లాలో పాతుకుపోయిన జోగిని దురాచార వ్యవస్థను రూపుమాపడం.
స్వర్గీయ లవణం, హేమలత లవణం సహాయ సహకారాలతో వర్నిలో జోగిని
వ్యవస్థ నిర్మూలనకు కుముద్ బెన్ జోషి అనేక కార్యక్రమాలు చేపట్టారు. చరిత్రలో మొట్ట
మొదటి సారిగా రాజ్ భవన్ దర్బార్ హాల్ లో కుముద్ బెన్ జోషి పుట్టిన రోజైన జనవరి 31, 1988 నాడు ముగ్గురు జోగిన్ల జంటలకు స్వయంగా తన ఆధ్వర్యంలో వివాహం
జరిపించింది. సాక్షాత్తు పెళ్ళిళ్ళ రిజిస్త్రార్ సమక్షంలో జరిగిన ఆ వివాహాలకు నాటి
కేంద్ర మంత్రి జలగం వెంగళరావు , రాష్ట్ర ముఖ్య మంత్రి ఎన్టీ రామారావు హాజరయ్యారు.
మర్నాటి పత్రికలలో పొగడ్తలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. జాతీయ స్థాయిలో జోగిన్ల
సమస్య చర్చకు తేవడానికి న్యూ డిల్లీలో జోగిన్ల సంక్షేమం అనే అంశ మీద రెండురోజుల
జాతీయ సమావేశం కూడా కుముద్ బెన్ జోషి
అధ్యక్షతన జరిగింది. నాటి కేంద్ర మంత్రులు పీవీ నరసింహారావు,
జలగం వెంగళరావులె కాకుండా స్వామీ అగ్నివేష్ లాంటి ప్రముఖ సామాజిక ఉద్యమ నాయకులు
హాజరయ్యారు.
జోగిన్ల
వ్యవహారమే కాకుండా జాతీయ స్థాయి స్వచ్చంద సంస్థల సమావేశాన్ని కూడా హైదరాబాద్ రాజ్
భవన్ లో కుముద్ బెన్ జోషి అత్యంత విజయవంతంగా నిర్వహించారు. నీసా ఆధ్వర్యంలో
బ్రహ్మాండంగా నిర్వహించిన మరో కార్యక్రమం భారతరత్న ఇందిరమ్మ రూపవాణి ప్రదర్శన.
హైదరాబాద్ లో తొలుత ప్రదర్శించబడి దరిమిలా రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాలతో సహా
డిల్లీ నగరంలో కూడా ప్రదర్శించడం జరిగింది. అప్పట్లో రెడ్ క్రాస్ కార్యకలాపాలలో
చురుగ్గా పాల్గొనే మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డి ఈ రూపవాణి కార్యక్రమంలో ఇందిరా
గాంధి పాత్రను పోషించింది. దేశంలోని పలువురు రాజకీయ,
రాజకీయేతర రంగ ప్రముఖులు ఈ ప్రదర్శనకు అతిథులుగా వచ్చి ఆసాంతం తిలకించి ప్రశంసల
వర్షం కురిపించారు. అనుపమ చలన చిత్ర దర్శక
నిర్మాత, అలనాటి సినీరంగ ప్రముఖ వ్యక్తి స్వర్గీయ కేబీ తిలక్ ఈ రూపవాణి కార్యక్రమానికి
రూపకర్త. అదేవిధంగా ఆయన చొరవతో రాజ్ భవన్ ప్రాంగణంలో అమెరికా సాంకేతిక సహాయంతో
రూపుదిద్దుకున్న డోమ్ హౌజ్ నిర్మాణం కూడా కుముద్ బెన్ జోషి గవర్నర్ గా ఉన్నప్పుడే
జరిగింది. ప్రస్తుతం దాని ఆనవాళ్ళు లేవు. ఒక కంప్యూటర్ శిక్షణా కేంద్రం కూడా
నెలకొల్పారు జోషి.
రెడ్
క్రాస్ సంస్థ మూడు పూవులు, ఆరుకాయలుగా వర్ధిల్లిన కాలం
కుముద్ బెన్ జోషి గవర్నర్ గా వున్న రోజుల్లోనే అని అనడంలో అతిశయోక్తి లేదు. కరవు
కాటకాలు వచ్చినా, వరదలు వచ్చినా,
మరేఉపద్రవం సంభవించినా నేనున్నాను అంటూ ఆమె ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సేవలు
అందించేది. రెడ్ క్రాస్ మరింత ప్రాచుర్యంలోకి రావాలని సభ్యత్వ కార్యక్రమం, ఉపాధ్యక్షుల నియామకం ఆమె హయాంలోనే జరిగింది. భారత పాకిస్తాన్ దేశాల మధ్య
ఒక బెనిఫిట్ క్రికెట్ మాచ్ నిర్వహణ కూడా కుముద్ బెన్ జోషి గవర్నర్ గా వున్న
రోజుల్లో జరిగింది. ప్రస్తుతం పాకిస్తాన్ అధ్యక్షుడుగా వున్న ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ
జట్టుకు నాయకత్వం వహించగా, భారత జట్టుకు కపిల్ దేవ్ కెప్టెన్
గా వ్యవహరించాడు. ఆ మాచ్ జరగడానికి కొద్ది రోజుల ముందర హైదరాబాద్ లోని కొన్ని
ప్రాంతాలలో మత కలహాలు చెలరేగాయి. ఆ నేపధ్యంలో మాచ్ ప్రారంభానికి ముందు స్టేడియం
చుట్టూ మైదానంలో కుముద్ బెన్ జోషి సారధ్యంలో మేమంతా చుట్టి రావడం నాకింకా
గుర్తుంది.
కుముద్
బెన్ జోషి ఎన్ని కార్యక్రమాలలో బిజీగా ఉన్నప్పటికీ ఆమె దగ్గర పనిచేస్తున్న
సిబ్బంది ఆలనా పాలనా అత్యంత ఆప్యాయంగా చూసుకునేవారు. నేను పేరుకు చేతన సంస్థ
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయినప్పటికీ అధికారేతర ప్రజాసంబంధాల పనులకు (ముఖ్యంగా
ఆమె ఆధ్వర్యంలో నడుస్తున్న స్వచ్చంద సంస్థలకు సంబంధించి) నన్ను కుముద్ బెన్ జోషి
పురమాయించేవారు. హోదా రీత్యా నాది పెద్ద పదవి కాకపోయినా ఆమె నిర్వహించే ప్రతి
కార్యక్రమానికి నాకు ఆహ్వానం వుండేది. ఆమె నివసిస్తుండే మెయిన్ హౌజ్ లో గవర్నర్
హోదాలో ఆమె అడపా దడపా ఆతిధ్యం ఇచ్చే ప్రతి విందుకు నన్ను సతీ సమేతంగా
ఆహ్వానించేవారు. మా పిల్లలు, కుముద్ బెన్ జోషి అన్న
గారి పిల్లలు బేగంపేట్ పబ్లిక్ స్కూల్ లో చదువుకుంటున్నందు వల్ల రాజ్ భవన్
ప్రాంగణంలోనే క్వార్టర్స్ లో నివసుస్తున్న మా ఇంటికి ఆ పిల్లలు రావడమో, లేక మా పిల్లలు అక్కడికి పోవడమో జరిగేది. ఆ విషయాలలో ఆమె గవర్నర్ అన్న
హోదా ఎప్పుడూ ప్రదర్శించక పోయేది.
రాజ్
భవన్ ప్రాంగణంలో అప్పట్లో మంచి ఉద్యాన వనం వుండేది. ఆవులు వుండేవి. దాదాపు
రెగ్యులర్ గా కుముద్ బెన్ జోషి ఆదేశాల మేరకు క్వార్టర్స్ లో వున్న మాలాంటి
సిబ్బందికి పాలు వస్తుండేవి. కుముద్ బెన్ జోషికి చింతపండు పులిహోర, మొక్క ఎత్తిన పెసలు, గోధుమలు, చల్ల మెరపకాయలు అంటే
చాలా ఇష్టం. అవి విరివిగా దొరికే మా ఇంటికి ఆమె హోదా పక్కన పెట్టి చాలా సార్లు
రావడం జరిగింది.
కుముద్
బెన్ జోషి కార్యదర్శిగా మొదలు పని చేసిన స్వర్గీయ చంద్ర మౌళి, ఆ తరువాత పనిచేసిన బీవీ రామారావు, ఇతర అధికారులైన
ఉప కార్యదర్శి సూర్యనారాయణ, ప్రెస్ సెక్రటరీ స్వర్గీయ సంజీవి, రెడ్ క్రాస్
కార్యదర్శి స్వర్గీయ డాక్టర్ రంగారావు, ఏడీసీ మేజర్ గులాటి, సెక్యూరిటీ ఆఫీసర్ సీతారం సింగ్, పేఏ శేషగిరిరావు, పీఎస్ స్వర్గీయ శేషాచార్యులు తదితరుల పట్ల కుముద్ బెన్ జోషి ఎల్లప్పుడూ
ఆదరాభిమానాలతో వుండేవారు. గుజరాత్ లో ఆమె స్వగ్రామంలో నివసిస్తుండే కుముద్ బెన్
జోషి తో ఆమె ఆనారోగ్యంతో గురయ్యేంత వరకూ
నేను ఫోన్లో టచ్ లో వున్నాను.
No comments:
Post a Comment