Saturday, March 26, 2022

మూడవ రోజు యుద్ధంలో చక్రాన్ని ధరించి భీష్ముడి మీదికి ఉరికిన శ్రీకృష్ణుడు .... ఆస్వాదన-64 : వనం జ్వాలా నరసింహారావు

 మూడవ రోజు యుద్ధంలో చక్రాన్ని ధరించి భీష్ముడి మీదికి ఉరికిన శ్రీకృష్ణుడు

ఆస్వాదన-64

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (27-03-2022)

కురుక్షేత్ర సంగ్రామంలో రెండవరోజు యుద్ధంలో అర్జునుడి విజృంభణతో పాండవులది పూర్తిగా పైచేయి అయింది. మర్నాడు తెల్లవారగానే భీష్ముడు కౌరవ సేనను ఒక దగ్గరికి తెచ్చి, ‘గరుడ వ్యూహం’ గా తీర్చిదిద్దాడు. ఆ వ్యూహం ముక్కుగా, అందం, బలం చేకూరే విధంగా స్వయంగా భీష్ముడే నిలబడ్డాడు. ద్రోణుడు, కృతవర్మ కన్నులుగా; కృపుడు, అశ్వత్థామ శిరస్సుగా; త్రిగర్తులు, భూరిశ్రవుడు, శల్యుడు, భగదత్తుడు, సౌవీరరాజు, సింధుభూపతి, జయద్రథుడు కంఠంగా; దుర్యోధనుడు, ఆయన తమ్ములు వీపుగా; విందుడు, అనువిందుడు, కాంభోజరాజు, శూరసేనరాజు తోకగా; మాగధరాజు, కళింగరాజు మొదలైనవారు కుడి రెక్కగా; కర్ణాటక, కోసల సేనలు మున్నగువారు ఎడమ రెక్కగా అయ్యారు. మిగిలినవారు అటు-ఇటు సర్దుకున్నారు.

భీష్ముడి గరుడ వ్యూహాన్ని చూసిన అర్జునుడు ‘అర్థచంద్రాకారం లో పాండవుల వ్యూహాన్ని అమర్చమని ధృష్టద్యుమ్నుడికి చెప్పి, దాని లక్ష్యం దుర్యోధనుడి వ్యూహాన్ని ఛేదించడం అన్నాడు. అతడు అలాగే తీర్చిదిద్దాడు. ఆ అర్థచంద్రాకార వ్యూహంలో భీముడు, పాండ్య మగధ సేనలతో కూడి, కుడి కొసన నిలిచాడు. అటు తరువాత విరాటుడు, ద్రుపదుడు నిలిచారు. నీలుడితో పాటు ధృష్టకేతుడు, కాశీదేశ కరూశదేశ సేనలతో పాటు నిలిచాడు. శిఖండితో పాటు ధృష్టద్యుమ్నుడిని ముందుంచుకుని యుధిష్టరుడు వ్యూహానికి మధ్యగా నిలిచాడు. అటు పక్కగా సాత్యకి, నకుల సహదేవులు, ద్రౌపది కొడుకులు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, కేకయరాజులు వ్యూహంలో భాగంగా నిలిచారు. శ్రీకృష్ణుడు సారథిగా అర్జునుడు ఎడమ కొసన నిలిచాడు. మిగిలిన రాజులు వారి-వారి స్థానాలలో నిలిచారు. ఈ విధంగా కౌరవ పాండవ సేనలు యుద్ధానికి సంసిద్ధమై ఒకరినొకరు ఎదుర్కున్నారు.

అర్జునుడు విజృంభించి కౌరవ సేనలోని కాల్బలాన్ని చీకాకు పరిచి, మొత్తం కౌరవ సేనను విధ్వంసం చేయడంతో కౌరవులు అంతా ఏకమై అతడిని ఎదుర్కున్నారు. అప్పుడు పాండవులు అందరూ ఏకమై పోయారు. భీష్ముడి నాయకత్వంలో కౌరవ సేన, భీముడి నాయకత్వంలో పాండవ సేన వెనుకంజ వేయకుండా పోరాడారు. ఇరుపక్కలా భీష్మద్రోణాది కురువీరులు, భీముడు, ఘటోత్కచుడు, సాత్యకి, అభిమన్యుడు మొదలైన పాండవ వీరులు యుద్ధంలో పాల్గొన్నారు. దుర్యోధనుడు భీముడితో యుద్ధం చేసి మూర్ఛపోయాడు. అతడు మూర్ఛబోవడం చూసిన సారథి రథాన్ని యుద్ధభూమికి దూరంగా తీసుకుపోయాడు.

తమ రాజు అలా కావడం చూసిన కౌరవసేన పారిపోసాగింది. ద్రోణుడు, భీష్ముడు వారిని మరలించడానికి చేసిన ప్రయత్నం సఫలం కాలేదు. పారిపోయే సేనను భీముడు వెంబడించాడు. మరోవైపు సాత్యకి, అభిమన్యుల చేతిలో శకుని ఓడిపోయాడు. అర్జునుడు మరో దిక్కున కౌరవసేనను వెన్నాడి తరిమికొట్టాడు. మూర్ఛనుండి తేరుకున్న దుర్యోధనుడు యుద్ధ భూమికి వచ్చి భీష్మ ద్రోణులు వున్న చోటుకు వెళ్లి, వారికి పాండవుల మీద పక్షపాతం వున్నదని ఆరోపించాడు. దేవేంద్రుడితో పాటు దేవతల సేన మొత్తం దండెత్తి వచ్చినా సరే, యుద్ధభూమిలో పాండవులు నిలబడితే వారిని జయించడం సాధ్యం కాదని భీష్ముడు స్పష్టంగా పేర్కొంటూ, దుర్యోధనుడు అలా మాట్లాడడం న్యాయం కాదన్నాడు. అయినా, తన శక్తివంచన లేకుండా పాండవుల సేనలను సంహరిస్తానని చెప్పాడు. అలా చెప్పి భీష్ముడు విజృంభించాడు. ఆర్జునుడిని ఎదుర్కున్నాడు. భీష్ముడికి సహాయంగా దుర్యోధనుడితో సహా కౌరవ వీరులు కూడా విజృంభించారు.

ఎక్కడ చూసినా పరాక్రమంతో విజృంభించిన భీష్ముడే కనిపించాడు. ప్రళయకాల రుద్రుడిలాగా పరాక్రమ నృత్యం చేశాడు. పాండవులు అప్పుడు ఏమీ చేయలేక పోయారు. భయభ్రాంతులయ్యారు. భీష్మద్రోణులను ఎదుర్కొనమని ఆర్జునుడిని ప్రేరేపించాడు శ్రీకృష్ణుడు. అర్జునుడి రథాన్ని చూసిన భీష్ముడు తన బాణాలతో శ్రీకృష్ణుడి రథాశ్వాలను, అర్జునుడిని నొప్పించాడు. శ్రీకృష్ణుడు స్వయంగా దెబ్బతిన్నాడు. అర్జునుడు కూడా దెబ్బ తిన్నట్లు అర్థం చేసుకున్నాడు. పాండవులు పారిపోవడం చూశాడు. ఇక ఇప్పుడు తాను ఉపేక్షిస్తే వీలులేదనుకున్నాడు శ్రీకృష్ణుడు. భీష్ముడిని చంపి ధర్మరాజుకు జయం చేకూర్చాలనుకున్నాడు. పారిపోతున్న పాండవ సేనలను వెనుకంజ వేయవద్దని సాత్యకి విజ్ఞప్తి చేశాడు. తానున్నాను భయపడవద్దని అన్నాడు. అలా అంటూ అర్జునుడి రథానికి ముందు వచ్చి నిలబడ్డాడు.

అలా నిలబడి పాండవులను వెనక్కు రమ్మని అంటున్న సాత్యకితో శ్రీకృష్ణుడు, దుర్యోధనుడి గెలుపు తాను సహించలేనని, భీష్ముడిని సంహరిస్తానని, ద్రోణుడి పని పట్తానని, కౌరవ యోధుల అవయవాలు చీల్చి చెండాడ గలనని, కౌరవ సేనలను నాశనం చేయగలనని, భూభారాన్ని కుంతీ పుత్రులైన పాండవులకు కట్టిబెట్టగలనని, తన భుజ పరాక్రమాన్ని చూపించి, చక్రాయుధాన్ని ప్రయోగించి, విక్రమ వీరవిహారం చేస్తానని అన్నాడు. ఇలా అంటూ, శ్రీకృష్ణుడు తన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని సంస్మరించాడు. వెంటనే చక్రం ఆయన దగ్గరికి వచ్చింది. శ్రీకృష్ణుడు ఆ చక్రాయుధాన్ని తన కుడిచేతికి అమర్చుకున్నాడు. గుర్రాల కళ్ళాలు జాగ్రత్తగా విడిచి కిందికి దూకాడు. భూమి దద్దరిల్లగా విజృంభించాడు. శ్రీకృష్ణుడు గర్వించి వున్న భీష్ముడి మీదికి ఉరికాడు. దుర్యోధనుడి యోధ ముఖ్యులు నివ్వెరపోయారు. శ్రీకృష్ణుడిని అలా చూసిన భీష్ముడు ఆయన ఆవిధంగా తనను ధన్యుడిని చేస్తున్నాడని, శీఘ్రంగా రమ్మని, ఆయనకు తోచిన విధంగా చేయమని నమస్కరిస్తూ ప్రార్థించాడు.

భీష్ముడు ఇలా అంటుండగానే అర్జునుడు రథం మీది నుండి దూకి, పరుగెత్తిపోయి, శ్రీకృష్ణుడిని వెనుకవైపు నుండి గట్టిగా పట్టుకున్నాడు. కాని, శ్రీకృష్ణుడు ఆర్జునుడిని పెనుగాలిలా ఈడ్చుకుని పోయాడు. అప్పుడు అర్జునుడు మొండికేసి కూర్చుని, శ్రీకృష్ణుడితో, ‘ఓ శ్రీకృష్ణా! నీకోపం ఉపశమింప చేసుకోవయ్యా! నీవే కదా పాండవులకు సంరక్షకుడవు! నువ్వే ప్రతిజ్ఞ తప్పితే, ఇక ప్రతిజ్ఞను పాలించే ధర్మరాజు మాట ఏమిటి? ధర్మరాజు పరాక్రమం ఏమికావాలి? ఈ చర్య నీకు తగినదా? ఈ విధంగా ఆయుధం పట్టుకుని ప్రతిజ్ఞమీరి యుద్ధం చేయడం నీకు తగునయ్యా? శాంతించు. నీ సహాయంతో కౌరవ సేనను రూపుమాపడం నాకు సులువు అని అన్నాడు. ఆ మాటలకు కోపం పోగొట్టుకున్న శ్రీకృష్ణుడు వెనక్కు మరలి, రథం ఎక్కి, సారథి పీఠం మీద కూర్చున్నాడు. కృష్ణార్జునులు ఇద్దరూ శంఖాలు పూరించారు.

ఆ తరువాత అర్జునుడు విజృంభించాడు. కౌరవ సేనను నాశనం చేశాడు. కౌరవ పక్షం నుండి ఎంతమంది వీరులు ఎదుర్కొన్నా అర్జునుడిదే పైచేయి అయింది. అతడు ప్రయోగించిన ఐంద్రాస్త్రం కౌరవ సేనను చిత్తు చేసింది. అర్జునుడు విజయ గర్వంతో దేవదత్తాన్ని, శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించారు. ఇద్దరూ సింహనాదాలు చేశారు. అప్పుడే సూర్యాస్తమయం అయింది. ఆ మలిసంధ్యలో భీష్ముడు, ద్రోణుడు, బాహ్లికుడు తమ సేనలను ఉపసంహరించి, కాగడాల వెలుగులో తమ విడిదులకు వెళ్లారు. పాండవులు ఉత్సాహంగా ఉప్పొంగిపోయి, తమతమ నివాస స్థలాలకు పోయారు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, భీష్మపర్వం, ద్వితీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

No comments:

Post a Comment