Monday, March 21, 2022

తన వంశక్రమాన్ని వశిష్ఠుడికి చెప్పిన జనకుడు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-100 : వనం జ్వాలా నరసింహారావు

 తన వంశక్రమాన్ని వశిష్ఠుడికి చెప్పిన జనకుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-100

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (21-03-2022)

         ఇక్ష్వాకు వంశ క్రమం వివరించిన వశిష్ఠుడితో జనక మహారాజు తనవంశక్రమాన్ని వినిపించాడీవిధంగా: "మునీంద్రా, కన్యాదానం చేసేవాడు మంచి కులంలో పుట్టినవాడైతే తన వంశం గురించి తెలపడం అత్యంతావశ్యకం. మా వంశానికి పూర్వుడు మిక్కిలి ధర్మాత్ముడైన నిమి. అతడి కొడుకు మిథి అనే మహాత్ముడే ఈ మిథిలా పురాన్ని కట్టించాడు. ఆయనే మొదటి జనకుడు. ఆ పేరే మా వంశంలో జనకుడు అని రాసాగింది. అది వంశనామమే అయింది. మిథి కొడుకు కుదావసువు. అతడి పుత్రుడు నందివర్దనుడు-ఆయన కొడుకు సుకేతుడు-అతడి కుమారుడు దేవరాతుడు. దేవరాతుడికి బృహద్రధుడు జన్మించాడు. ఆయనకు మహావీరుడు పుట్టాడు. మహావీరుడి కొడుకు సుధృతి. అతడి కొడుకు ధృష్టకేతువు-ఆయన కొడుకు హర్యశ్వుడు-ఆయన కొడుకు మరువు-ఆయన కుమారుడు ప్రతీంధకుడు-ఆతడి కొడుకు కీర్తిరథాక్యుడు-అతడి కొడుకు దేవమీఢుడు-అతడి కొడుకు విబుధుడు-అతడి కొడుకు మహీధ్రకుడు-అతడికి కీర్తిరాతుడు-కీర్తిరాతుడికి మహారోముడు-మహారోముడికి స్వర్ణరోముడు-అతడికి హ్రస్వరోముడు జన్మించారు”.

         హ్రస్వరోముడికి ఇద్దరు కుమారులు వారిలో నేను పెద్దవాడిని. నా తమ్ముడు కుశధ్వజుడు. మా తండ్రి తపస్సు చేసేందుకు అడవికి పోతూ వీడిని నాకప్పగించి కొంతకాలానికి మరణించాడు. జనకుడనబడే నేను ఇతడిని కాపాడుతున్నాను. సాంకాశ్య పురపతి సుధన్వుడనేవాడు సీతను-శివుడి ధనస్సును తనకిమ్మని దూతలను పంపాడు. నేనొప్పుకోనందున వాడికీ-నాకు భయంకరమైన యుద్ధం జరిగింది. వాడిని చంపి, నా తమ్ముడిని సాంకాశ్య ప్రభువుగా చేసాను. నేను జ్యేష్టుడను-కుశధ్వజుడు నా తమ్ముడు. శ్రీరామ లక్ష్మణులకు నా కూతుళ్లు సీత-ఊర్మిళలను సంపూర్ణ ప్రీతితో, నీ ఆజ్ఞ ప్రకారం ఇచ్చి వివాహం జరిపిస్తాను".

         వంశ క్రమాన్ని వివరించిన జనకుడు దశరథుడితో, ముమ్మాటికి తన ఇద్దరు కూతుళ్లను ఆయన ఇద్దరు కుమారులకిస్తానని, కాబట్టి, ఆయన కొడుకులిద్దరితో గోదానం చేయించడానికి ఇదే సరైన సమయమని చెప్పాడు. చెప్పి ఇలా అంటాడు: " రాజేంద్రా, నేడు మఖా నక్షత్రం. నేటికి మూడోరోజు-అనగా రేపుకాక ఎల్లుండి ఉత్తర ఫల్గుని నక్షత్రం వస్తుంది. ఆ రోజున వివాహం చేద్దాం. నీ కొడుకులతో దానాలు చేయించు. భవిష్యత్ కాలంలో సుఖం కలుగుతుంది".

         (గోదానం-కేశఖండనం- చౌలంలాగా చేయాలిగాని తొడమీద కూచోడం కాదు. మీసాలు మాత్రం పవనం చేయాలి. స్నానంచేసి, మౌనం వహించి పగలంతా గడిపి, సూర్యాస్తమానంకాగానే, గురువు దగ్గర మౌనం వీడాలి. గురువుకు దక్షిణ ఇస్తానని చెప్పి గోమిథునం ఇవ్వాలప్పుడు. దీనికి గోదానం అనిపేరు. ఇది మొదలు చేసిన తర్వాత సమావర్తనం చేయాలి. గోదానం, సమావర్తనం చేయకుండా వివాహం జరిపించరాదని మనుస్మృతిలో చెప్పబడింది. ఉత్తర ఫల్గునీ నక్షత్రం నాడు వివాహం చేద్దామని జనకుడు మరో విషయం చెప్పాడు. ఉత్తర ఫల్గునీ నక్షత్రం శ్రీరామచంద్రమూర్తికి శుభకరమే కాని సీతకు జన్మ నక్షత్రం. అయినా గాని, తిథి-వార-నక్షత్ర దోష శాస్త్రం ప్రకారం, అభిజిత్సర్వదోషఘ్నం అయినందున, ఆ లగ్నమే మంచిది. అదే నక్షత్రంలో మొదటి పాదం తర్వాత ఆమెది కన్యారాశి అయినందున, తృతీయ ఏకాదశ రూప నక్షత్రకూట శుద్ధి కావడంతో నక్షత్ర దోషం లేదు. అయినా, భార్యా-భర్తలిద్దరికి ఏక నాడి అయినందున వియోగప్రాప్తంటారు).

గోదాన వివరణ

         జనక మహారాజు ఇలా తమ వంశ క్రమాన్ని చెప్పి, శ్రీరామ లక్ష్మణులకు తన ఇద్దరు కూతుళ్లైన సీత ఊర్మిళలను ఇచ్చి వివాహం జరిపించుదామని చెప్పిన తర్వాత, విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఆలోచించి మరో ప్రతిపాదన చేశారు. ఆ విషయం చెప్పడానికి ముందు, జనకుడి వంశం-దశరథుడి వంశం రెండూ తెలుసుకోలేనంత మహిమగలవని, మిక్కిలి గొప్పవని, వారిని మించినవారెవరూలేరని, సౌందర్యంలో-సంబంధంలో రామ లక్ష్మణులకు సీత ఊర్మిళలు సరిసమానమని అంటూ, జనకుడి చెప్పింది తమకు సమ్మతమేనని దశరథుడి పక్షాన తెలియచేశారు. జనకుడి తమ్ముడైన కుశధ్వజుడి ఇరువురు పుత్రికలను, దశరథుడి కుమారులైన భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం చేయమని కోరారు వారు. సౌందర్యంలో-భుజబలంలో-ప్రాయంలో దశరథుడి నలుగురు కుమారులు సమానమైన వారని, అందరూ దిక్పాలురవలె బలశాలురని, ఆనందించతగినవారని, రామ లక్ష్మణులకు సీత ఊర్మిళల ఈడు-జోడు ఎలా బాగుంటుందో అలాగే భరత శత్రుఘ్నులకు కుశధ్వజుడి కుమార్తెలిరువురి ఈడు-జోడు బాగుంటుందని లోకులు శ్లాఘిస్తారని చెప్పరు. విశ్వామిత్ర వశిశ్ఠులు చెప్పినదానికి జనకుడంగీకరిస్తూ, తమ ఇరువురి వంశాలు సమానమని-పరస్పర సంబంధం చెల్లుతుందని వారన్నారంటే, సూర్య వంశపు రాజులతో తమ వంశపు రాజులను సమానం చేసి తమను పావనం చేయడమేనని అంటాడు. సంతోషంతో కుశధ్వజుడి ఇరువురు పుత్రికలను భరత శత్రుఘ్నులకిస్తానని, నలుగురికీ ఒకే రోజున వివాహం చేస్తానని, ఒకే రోజున నలుగురు కోడళ్లను సంపాదించుకొని దశరథుడు సంతోషించవచ్చని అంటాడు జనకుడు.

         "ఎల్లుండి ఉత్తర ఫల్గుని. దానికధిపతి భగుడనే ప్రజాపతి. ఆయన శుభకరుడు కాబట్టి, ఉత్తర ఫల్గుని ఉత్తమమని అందరు ప్రశంసిస్తారు. నేను మీ శిష్యుడను-మీ దయకు పాత్రుడను-మీరు నాకు గొప్ప ధర్మాన్ని చెప్పారు. ఋశీష్వరులారా, మీరు ఈ మూడు ఆసనములమీద కూర్చోండి. నా రాజ్యం-తమ్ముడి రాజ్యం-దశరథుడి రాజ్యం అన్నీ మీవే కదా. దశరథుడికి ఇక్కడెంత స్వతంత్రముంటుందో, అంతే నాకు అయోధ్యలో వుంటుందికదా. ఇదీ-అయోధ్యా నా సొంతమే. అయోధ్య-ఇది దశరథుడి సొమ్మే. కాబట్టి మీ యోగ్యతకు తగిన విధంగా కార్య భారం వహించండి. సందేహించ వద్దు. దోషమేదైనా జరిగితే, ఆ తప్పు మీదే-నాది కాదు. మీ రాజ్యంలో తప్పు జరిగితే దోషం మీకు తగులుతుంది" అని కలుపుగోలుగా జనకుడన్నాడు. ఆ మాటలకు మెచ్చిన దశరథుడు, "మీ ఇరువురు అన్నదమ్ములు అమితమైన కల్యాణగుణాలున్నవారు. కోటాను-కోట్ల రాజులు, ముని శ్రేష్టులు పూజించే పుణ్యాత్ములు మీరు. మీకు తెలియందేదీలేదు. కార్య భారం అన్నీ తెలిసిన వారిమీద వుండాలికాని, ఏమీ తెలియని మామీద వేస్తే ఫలితం లేదు. తెలివితక్కువగా మేం ఏదైనా లోపంచేస్తే, అన్నీ తెలిసిన జనకుడు ఏం చేస్తున్నాడని మిమ్ములనే నిందిస్తారు. కాబట్టి మీరేం చెపితే అదే చేస్తాం" అని జనకుడితో చెప్పాడు. నాంది మొదలైన కార్యక్రమాలు జరిపించాలని అంటూ, విశ్వామిత్ర వశిష్ఠులతో కలిసి విడిదికి పోయాడు.

తన విడిదికి పోయిన దశరథుడు, నాందీ కార్యక్రమాలను జరిపించి, ఉదయమే నిద్రలేచి, తన ప్రియమైన కొడుకులను పిల్చాడు. బంగారు కొమ్ములున్న బాగా పాలిచ్చే నాలుగు లక్షల ఆవులను తెప్పించి, వాటి పాలుపితుకేందుకు తన నలుగురు కొడుకులకు కంచు పాత్రలనిచ్చాడు. కొడుకుల కొరకై, శాస్త్ర ప్రకారం బ్రాహ్మణులకు, విశేష దానాలు చేసిన దశరథుడు, నలుగురు దిక్పాలకులతో కూడిన బ్రహ్మలాగా కనిపించాడు.

దశరథుడిని చూసేందుకొచ్చిన యుధాజిత్తు

         గోదానం జరిగిన రోజునే, కేకయ రాజకుమారుడు మేనల్లుడు భరతుడిని, బావగారు దశరథుడినీ చూడడానికొచ్చాడు. తండ్రి పంపగా వచ్చిన కేకయ రాజకుమారుడు యుధాజిత్తు, భరతుడిని తీసుకుపోయేందుకు తాను అయోధ్యకు పోయానని, వారంతా పెళ్లికై మిథిలకొచ్చారని విని, ఇక్కడకొచ్చానని, ఉభయ కుశలోపరి దశరథుడితో అంటాడు. సంతోషించిన దశరథుడు బావగారిని తగిన మర్యాదలతో గౌరవించాడు. ఆ రాత్రి కొడుకులతో వినోదంగా గడిపి దశరథుడు, మర్నాడు ఉదయం తూర్పు తెల్లవారుతుండగానే, కాల కృత్యాలు తీర్చుకొని యజ్ఞ భూమికి చేరుకున్నాడు. అందమైన ఆభరణాలను ధరించి, కంకణం కట్టుకొని, రామచంద్రమూర్తి మంచి ముహూర్తంలో తమ్ములతో కలిసి వచ్చాడక్కడకు. వశిష్ఠుడు-ఇతర మునీంద్రులు ముందుండి తమ వెంట వస్తుంటే యజ్ఞ భూమి (యజ్ఞ భూమి అంటే, సమీపంలో పెళ్లిజరిపించేందుకై ఏర్పాటుచేసిన ఉత్సవశాల అని అర్థం) ప్రవేశించాడు దశరథుడు. అలా ప్రవేశిస్తుండగానే వశిష్ఠుడు జనక రాజును చూసి, దాత కొరకు దశరథుడు వేచి వున్నాడని చెప్పాడు. ఇచ్చేవాడు-పుచ్చుకునేవాడు ఒకచోట వున్నప్పుడే తదుపరి తతంగం జరుగుతుందని అంటూ, ఆయన స్వధర్మమైన-దాత చేయాల్సిన కార్యమైన పెళ్లి జరిపించమని వశిష్ఠుడు జనకుడికి తెలియచేశాడు.

         జవాబుగా " మునీంద్రా, ఇక్కడ కొత్తవారెవ్వరు? ఎందుకంత ఆలస్యం చేసారు? ఇంతకు ముందే కార్యం ఆరంభం చేయకుండా మీకెవరైనా అడ్డమొచ్చారా? కార్యం జరిపించేందుకు ఎవరి ఆజ్ఞకొరకు వేచి వున్నారు? నా రాజ్యమంతా మీదేనని ముందే చెప్పానుకదా. అలాంటప్పుడు ఈ ఇల్లు కూడా మీదేకదా. అలంకరించుకొని పెళ్లికూతుళ్ల వేషాల్లో, నా నలుగురు కుమార్తెలు సంతోషంగా వేదిలోని అగ్నివలె వెలుగుతూ, మండపం దగ్గరే వున్నారు. సర్వం సిద్ధంగా వుంది. మీరింకా రాలేదని మీరాక కొరకే ఎదురు చూస్తున్నాను. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? నేను చేయాల్సిన కార్యమంతా చేసాను. మిగిలిన కార్యం చేయాల్సినవారు మీరే" అని జనకుడు వశిష్ఠుడికి చెప్పగానే, ఆ విషయాన్నే దశరథుడికి చెప్పేందుకు దూతలను పంపాడాయన. అది విన్న దశరథుడు, తన కొడుకులను, మహర్షులను యజ్ఞశాలకు పంపాడు.

వశిష్ఠుడితో జనకుడు, ఇతర ఋశీష్వరులతో కలిసి త్రిలోకాభిరాముడైన రామచంద్రమూర్తికి శీఘ్రంగా-సంతోషంగా వివాహ సంబంధమైన కార్యాలన్నీ జరిపించమని అన్నాడు. అలానే జరిపిస్తానన్న వశిష్ఠుడు, తనకు సహాయంగా విశ్వామిత్రుడు, శతానందుడు తోడుండగా వివాహ సంబంధమైన కార్యక్రమం చేపట్టాడు. చలువ పందిరిలో శాస్త్ర ప్రకారం వేదిని తీర్చి, పూలతో-పరిమళ ద్రవ్యాలతో దానిని అలంకరించి, మెరుస్తున్న బంగారు పాలికలతో-మొలకలెత్తిన శుభకరమైన అడుగులేని పాత్రలతో-జిగుళ్లుగల మూకుళ్లతో-ధూపమున్న ధూప పాత్రలతో-స్రుక్కులు, స్రువాలు, అర్ఘ్యం పేలాలతో నిండిన స్వచ్ఛ పాత్రలతో-పచ్చని అక్షతలతో వేదిని నింపాడు వశిష్ఠుడు. మంత్రాలు పఠిస్తూ, పరిశుద్ధమైన దర్భలను పరిచి, శాస్త్రోక్తంగా వేదిలో అగ్నిని వుంచి, వశిష్ఠుడు హోమం చేశాడు.

No comments:

Post a Comment