శ్రీకృష్ణుడికి గాంధారి శాపం, కర్ణుడు తన కుమారుడే అని ధర్మరాజుకు చెప్పిన కుంతి
వనం జ్వాలా
నరసింహారావు
సూర్యదినపత్రిక
ఆదివారం అనుబంధం (02-10-2022)
తన దగ్గరికి
వచ్చి విలపించిన ద్రౌపదీదేవిని ఓదార్చిన తరువాత గాంధారికి వ్యాస మునీంద్రుడి వర
ప్రభావం వల్ల అప్పటికప్పుడు దివ్యదృష్టి కలిగింది. దీనివల్ల ఆమె తన కళ్లకు కట్టిన
గంత తీయకుండానే యుద్ధభూమిలో దగ్గరివి,
దూరాన వున్నవి ప్రత్యక్షంగా కనిపించడం మొదలైంది. ఏనుగుల, గుర్రాల మానవుల మృత దేహాలతో నిండి, ఛిన్నాభిన్నమైన యుద్ధ భూమి చూసిన గాంధారికి
పరితాపం అధికమై, హృదయం తరుక్కు పోయింది. గుండెల్లో గుబులు
పుట్టింది. అదంతా చూడడానికి చాలా అసహ్యంగా వున్నది. గాంధారి మనస్సు కకావికలై
పోయింది. వీరులంతా యుద్ధంలో చనిపోయి రక్తపు మడుగులలో పడి వుండడం చూసిన గాంధారి
గుండెలో ఆరాటం కలిగింది. శవాలను భక్షిస్తున్న రాక్షసుల, నక్కల, గద్దల,
కాకుల గుంపులు గాంధారి మనస్సును కలచి వేసింది.
గాంధారి
బాధపడుతూ యుద్ధభూమిని అంతా పరికించంది. అదే సమయంలో వ్యాస మహర్షి అక్కడ ప్రత్యక్షమై
పాండవులను పిలిచి, ‘మృతులైన బంధువుల శవాలకు సరైన ఆచారాలతో అగ్నిసంస్కారం
చేయండి’ అని చెప్పి అంతర్థానమయ్యాడు. అప్పుడు పాండవులు
ధృతరాష్ట్రుడిని నడిపించుకుంటూ శ్రీకృష్ణుడు తోడురాగా బంధువుల దహన సంస్కారానికి
కౌరవ స్త్రీలను ఆ ప్రదేశానికి తీసుకువెళ్లారు. అక్కడ వారంతా తమతమ భర్తలు, కొడుకులు,
తమ్ముళ్లు, అన్నలు, మనుమలు, స్నేహితులు శవాలై పడి వుండడం చూసి నేలమీద ఒరిగిపోయారు. నిశ్చేష్టులై
కొయ్యబారి పోయారు. అప్పుడు గాంధారి శ్రీకృష్ణుడిని దగ్గరికి పిలిచి ఒక్కొక్క
శవాన్ని, ఆ శవం తాలూకు సంబంధీకులను చూపించి దుఃఖించింది. అదంతా చూసి ఎలా భరించడం
అని ప్రశ్నించింది. అదంతా కృష్ణుడు చేసిన ఘన కార్యమని ఎత్తిపొడిచింది. అదెంత
దురవస్థ కదా! అని అన్నది.
మహారాజు (ధృతరాష్ట్రుడు) కోడళ్లను చూపించి
వారిని చూస్తుంటే పుట్టెడు దుఃఖం కలుగుతున్నదని అన్నది. శల్యుడి, ద్రుపదుడి, కర్ణుడి,
ద్రోణుడి, శవాలు చూపించి వారిలో ఇంకా కాంతి తగ్గలేదని, ప్రకాశం తగ్గకుండా వున్నారని అన్నది. వీరందరి
కంటే ఎక్కువ కాంతితో అభిమన్యుడు మెరిసిపోతున్నాడని చెప్పింది. చాలామంది మహావీరుల
దేహాలను రాపులుగులు, నక్కలు, గద్దలు, కాకులు ఆక్రమించి పొడిచి పొడిచి
ఎంగిలి చేశాయన్నది. కత్తులు, కటార్లు చేతుల్లో వుంచుకుని మరణించిన
వీరులు బతికున్నవారిలాగే కనిపిస్తున్నారని పోల్చింది. ఇలా గాంధారి మాట్లాడుతున్న
సమయంలో ఆమెకు దుర్యోధనుడి శవం కంటబడింది. వెంటనే మూర్ఛపోయి తెప్పరిల్లుకుంది.
విశాలమైన
కుమారుడి రొమ్ముమీద కన్నీరు కారుస్తూ గాంధారి వాలిపోయింది. కౌరవులలో అందరికన్నా
మిన్న అనిపించుకున్న అతడు నికృష్టంగా నేలమీద పడివుండడం అన్యాయం కదా అన్నది.
కుమారుడిని పలు విధాలుగా తలచుకుంటూ హాహాకారాలు చేస్తూ ఏడుస్తుంటే ఆమె దగ్గరికి
కృష్ణుడు వచ్చాడు. యుద్ధం జరగడానికి ముందర దుర్యోధనుడు తన దగ్గరికి వచ్చి తనకు
విజయం సిద్ధించేట్లుగా ఆశీర్వాదం కోరినప్పుడు,
‘నాయనా! ధర్మం ఏ పక్షంలో అధికంగా వుంటుందో ఆ పక్షానికి ద్విగ్విజయం ఎట్లాగైనా
తప్పక సిద్ధిస్తుంది’ అని తాను అన్న విషయం కృష్ణుడికి
చెప్పింది. ‘యుద్ధంలో వెనుతిరిగి వస్తే అపకీర్తి వస్తుందని, అపకీర్తికన్నా చావు నయం అని, యుద్ధ వీరుడిగా జీవించమని, పరలోక సౌఖ్యాన్ని పొందమని’ తాను దుర్యోధనుడితో అన్న విషయం కూడా
చెప్పింది. తాను చెప్పినట్లుగానే దుర్యోధనుడు కీర్తి ప్రతిష్టలు పొందాడని అన్నది.
కోడలు భానుమతిని చూపిస్తూ ‘కొడుకు చనిపోవడం వల్ల కలిగిన దుఃఖం కంటే, కోడలి దుఃఖం తన హృదయాన్ని కాల్చివేయడం
మొదలుపెట్టింది’ అని అన్నది.
ఆ తరువాత గాంధారి
తన ఇతర కుమారుల శవాలను చూసి దుఃఖించింది. వారి-వారి భార్యల ఆక్రందనను గురించి
చెప్పింది. దుశ్శాసనుడి కళేబరం చూసి మరీమరీ విలపించింది. ద్రౌపదీదేవిని అతడు
అవమానం పాలుచేసినప్పుడు తాను అతడిని తప్పు చేస్తున్నావని మందలించిన సంగతి,
ద్రౌపదిని వదలమన్న విషయం గుర్తు చేసుకున్నది. దుశ్శాసనుడి నెత్తురు తాగి భీముడు
దారుణం చేశాడని అన్నది. వికర్ణుడిని,
దుర్ముఖుడిని, శూరసేనుడిని, వివింశతిని, దుష్ప్రహుడిని, ఇతర కుమారులను చూసి విలపించింది. అభిమన్యుడి
కళేబరం చూసి, అతడిని అన్యాయంగా అందరూ కలిసి సంహరించారని,
కాని అభిమన్యుడు చావలేదని, అతడి ముఖంలో కళ ఇంకా అలాగే వుందని
దుఃఖించింది. ప్రపంచమంతా అతడి పరాక్రమం మారుమోగి పోతున్నదని కృష్ణుడితో అన్నది.
ఇలా విరాటరాజు
గురించి, కర్ణుడి గురించి, వృషసేనుడి గురించి, బాహ్లికుడి గురించి చెప్పి ఏడిచింది గాంధారి. సైంధవుడి
కళేబరాన్ని చూసి, అతడు చేసింది తప్పేనని అంటూ,
దైవ నిర్ణయం ఎవరూ తప్పించలేరని, అందుకే పాండవులు అతడిని చంపారని
అన్నది గాంధారి. దుస్సల పడుతున్న బాధను గుర్తు చేసుకున్నది. శల్యుడి శవాన్ని
చూపించి అతడు ధర్మరాజుతో సమానమైన వాడని,
అయినా యుద్ధంలో చనిపోయాడని అన్నది. భగదత్తుడి పరాక్రమం చూసి ఓర్వలేక అర్జునుడి మీద
అభిమానంతో అతడిని మరణం పాలుచేశాడు కృష్ణుడని నిందించింది.
ఆ
తరువాత గాంధారి శరతల్పగతుడైన భీష్ముడిని చూసి శోకించింది. ఆయన లాంటి మహానుభావుడు, పరాక్రమవంతుడు, బలశాలి కూడా శత్రువుల బాహుదర్పానికి నేలమీద పడ్డాడని, చివరివరకూ కురుకుమారులతోనే వుండి ప్రాణాలు
వదిలినవాడు అతడని, ధర్మస్వరూపుడని అన్నది. ద్రోణాచార్యుడి శవాన్ని చూసి
విలపించింది. సోమదత్తుడి కొడుకు భూరిశ్రవుడి పార్థివ శరీరాన్ని, శకుని కళేబరాన్ని, బృహద్బలుడి శవాన్ని, ద్రుపదుడి శవాన్ని, ఇలా ఎందరి శవాలనో చూపించి
దుఃఖించింది.
ఈ
విధంగా విలపించిన గాంధారి, కృష్ణుడు సంధి చేయడానికి హస్తినకు వచ్చిన విషయం, సంధి కుదరదని తెలిసినప్పుడు ఆయన ఏ మాటలు
చెప్పాడో అవన్నీ నిజమైన విషయం, విదురుడు, భీష్మద్రోణాచార్యుల మాటలు దుర్యోధనుడు వినక
పోవడం చెప్పి, పశ్చాత్తాపం వల్ల కలిగిన దుఃఖంతో మూర్ఛపోయి
మళ్లీ తేరుకుంది. పాండవులు, కౌరవులు అసూయతో యుద్ధానికి సిద్ధపడితే
శ్రీకృష్ణుడు అడ్డుపడకుండా నిర్లక్ష్యం చేశాడని, దుర్యోధనుడిని నాశనం చేయడానికే రాయబారాలు చేశాడని, చేసిన దానికి ఆయన ఫలాన్ని అనుభవించాలని, తన శాపాగ్నిలో ఆయన్ను కాల్చి వేస్తానని అన్నది
గాంధారి.
మంచి
దాయాదులను తమలో తాము పోరాడుకొని ఒకరినొకరు చంపుకొనేట్లు చేశాడు కృష్ణుడని, ఆయన
దాయాదులు కూడా అలాగే ఒకరినొకరు కొట్టుకొని చస్తారని, కృష్ణుడు కూడా ఆరోజు నుండి సరిగ్గా 36 సంవత్సరాలు పూర్తికాగానే
చూడడానికి ఏ దిక్కూ లేకుండా అతి క్రూరంగా చావబోతున్నాడని, తన మాట తప్పదని, కౌరవ కాంతలు ఏడ్చినట్లే యాదవ కాంతలు కూడా
కుమిలి కుమిలి ఏడుస్తారని గాంధారి శపించింది. ఇది విని చిరునవ్వుతో శ్రీకృష్ణుడు, యాదవులకు మునివర్యులు ఇచ్చిన ఘోరమైన శాపం
ఇప్పటికే వున్నదని, ఆమె కొత్తగా చెప్పిందేమీలేదని
గాంధారిని ఉద్దేశించి అన్నాడు.
దుర్యోధనుడు
చేసిన దుర్మార్గపు పనుల కారణాన ఈ దశ వచ్చిందని,
కౌరవుల తప్పులకు తనదెలా బాధ్యత అవుతుందని,
అలా మాట్లాడడం గాంధారికి న్యాయమా అని,
శోకాన్ని దూరం చేసుకొమ్మని కృష్ణుడు చెప్పాడు. గాంధారి ఏమీ సమాధానం చెప్పకుండా
వూరుకున్నది. అప్పుడు ధృతరాష్ట్రుడు కౌరవ పాండవ సైన్యాలలో కలిపి మొత్తం ఎంతమంది
చనిపోయారని ధర్మరాజును అడిగాడు. జవాబుగా ధర్మరాజు, ప్రసిద్ధులు, ఉన్నత వర్గాల వారు 76 కోట్ల 20 వేల
మంది, ఇతర జనం 24 వేల 320 మంది చనిపోయారని చెప్పాడు.
ఎవరెవరు, ఏఏ గతులకు వెళ్తారో వివరించాడు ధృతరాష్ట్రుడి
కోరిక మీద. యుద్ధంలో ఎలా చనిపోయినప్పటికీ అంతా స్వర్గానికే పోతారని, ఎవరూ నరకానికి పోరని అన్నాడు.
ధర్మరాజు
ఆ తరువాత ధౌమ్యాచార్యులను చూసి, విదుర, సంజయులను పిలిచి, వారిద్దరిని భరత వంశీయులకు తప్ప ఏ దిక్కూ
లేకుండా చనిపోయిన వారందరికీ విధి ప్రకారం దహనకర్మను చేయమని చెప్పాడు. వారలాగే
చేశారు. అప్పుడు ధర్మరాజు ధృతరాష్ట్ర మహారాజును ముందు వుంచుకొని, కౌరవ స్త్రీ జన
సమూహాన్ని పిలుచుకొని, బందు జనులతో నదికి వెళ్లాడు. అంతా
స్నానాలు చేశారు. యుద్ధంలో మరణించిన కౌరవులందరికీ ధృతరాష్ట్రుడు, కురుకుమారుల భార్యలు, తాను, తన
తమ్ములు తిలోదకాలు ఇచ్చారు.
ఆ
సమయంలో కుంతీదేవి అక్కడి వచ్చింది. అంతా రాధేయుడు అని పిలుస్తున్న కర్ణుడు
నిజానికి తన కుమారుడేనని ధర్మరాజుకు చెప్పింది. పాండవులు ఐదుగురికి ఆయన అన్నగారని, సూర్యుడి వర ప్రసాదంగా తనకు కవచ కుండలాలతో
అతడు జన్మించాడని, ఆ మహానుభావుడికి కూడా ధర్మరాజాదులు తిలోదక
ప్రదానం చేయాలని అన్నది. కర్ణుడు పుట్టిన తీరును వివరించింది కుంతీదేవి. ఇన్నాళ్లూ
కొంగులో నిప్పును దాచిన విధంగా కర్ణ జన్మ రహస్యం ఎలా దాచిపెట్టావమ్మా? చెప్పమని అడిగాడు ధర్మరాజు. కర్ణుడు తమ అన్న
అని ముందుగానే తెలిసి వున్నట్లయితే, కురుకుమారులు, వారి సైన్యం వ్యాకులం చెందకుండా ఎట్లా మసలుకోవాలో అలాగే మెలిగే
వాళ్లమని, అలా జరిగి వున్నట్లయితే మానవ లోకానికి ఏ దుఃఖం కలిగేది కాదని అన్నాడు.
ఆ
తరువాత ధర్మరాజు దుఃఖం వల్ల వణకుతున్న కంఠంతో, గోత్ర నామాదులను ఉచ్ఛరిస్తూ, కర్ణుడికి తిలోదకాలు వదలిపెట్టాడు. వెంటనే
భీమార్జున నకుల సహదేవులు కూడా అట్లాగే చేశారు. కర్ణుడు పాండవుల అన్న అని తెలిసి
కురుకుమారుల భార్యలు ఆర్తనాదాలు చేస్తూ ఏడ్చారు. ధృతరాష్ట్రుడు గాంధారి, కుంతీదేవులతో కలిసి ధర్మోదకాలు
సమర్పించారు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, స్త్రీపర్వం, ద్వితీయాశ్వాసం
(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment