Monday, October 17, 2022

ధర్మరాజు వైరాగ్యం తొలగించిన తమ్ములు, ద్రౌపది, శ్రీకృష్ణుడు, వ్యాసుడు, దేవస్థానుడు ..... ఆస్వాదన-93 : వనం జ్వాలా నరసింహారావు

 ధర్మరాజు వైరాగ్యం తొలగించిన తమ్ములు, ద్రౌపది, శ్రీకృష్ణుడు, వ్యాసుడు, దేవస్థానుడు

ఆస్వాదన-93

వనం జ్వాలా నరసింహారావు

వనం జ్వాలా నరసింహారావు  

నారదుడు ధర్మరాజుకు కర్ణుడి వృత్తాంతమంతా చెప్పిన తరువాత స్వయానా అన్న అయిన కర్ణుడు జ్ఞాపకానికి వచ్చి అమితంగా దుఃఖించాడు ధర్మరాజు. ఆయన మనసు తీవ్రంగా గాయపడింది. ఇంత భందుక్షయం జరిగిన తరువాత రాజ్యం అనవసరమని, ఎక్కడికైనా వెళ్లి అక్కడ బిచ్చమెత్తుకునే కార్యక్రమంతో బతుకును సాగిద్దామని, అలాగైతేనే సుఖంగా ఉంటామని అర్జునుడితో అన్నాడు ధర్మరాజు. ఆ విధంగా తన విరక్తిని ప్రకటించాడు. ముల్లోకాలను ఏలే ప్రభుత్వమైనా తనకు సంతోషాన్ని కలిగించదని, కాబట్టి తాను రాజ్యాన్ని స్వీకరించనని, దాన్ని తమ్ములనే తీసుకొమ్మని చెప్పాడు. రాజ్య స్వీకార దోషం రాజ్య పరిత్యాగం వల్లే పోతుందని, తాను త్యాగం చేసి పరిశుద్ధుడిని అవుతానని అంటూ తమ్ములను రాజ్యపాలన స్వీకరించి వర్ణాశ్రమ ధర్మరక్షణ చేయమని చెప్పాడు. తాను తపోవనానికి పోయి సుఖంగా వుంటానన్నాడు.

ఈ మాటలు విన్న అర్జునుడు, భుజబలంతో శత్రువులను యుద్ధంలో చంపి, చివరకు బిచ్చమెత్తుకోవడాన్ని కోరడం ధర్మరాజుకు తగునా అని ప్రశ్నించాడు. ధర్మ మార్గంలో వశమైన రాజ్యాన్ని పాలించకుండా వదిలివేయడం న్యాయం కాదన్నాడు. భయపడి రాజ్యం వదిలి అడవికి పోతే ఆయన్ను బేలవని గేలిచేస్తారని చెప్పాడు. ఒకవేళ పాపం కలిగిందని అనుమానం వస్తే దాన్ని అశ్వమేధయాగం చేసి తొలగించుకోవచ్చు కదా అన్నాడు. ధనం వుంటేనే పురుషార్థాలు ఫలిస్తాయని చెప్పాడు. క్షత్రియులు బల పరాక్రమాలతో రాజ్యాలను గెలుచుకొని, ఫలితాన్ని అనుభవించి, స్వర్గాది లోకాలను పొందుతారని వేదాలు చెప్తున్నాయని, అదే ఉత్తమ మార్గమని అన్నాడు అర్జునుడు.

అర్జునుడు చెప్తున్న మాటలను అనాసక్తితో ధర్మరాజు వినడం గమనించిన భీముడు, ధర్మరాజుకు రాజధర్మాల మీద ఇప్పుడు అసూయ కలిగింది కాని, గతంలో అలా వున్నట్లయితే, రాజులంతా ప్రాణాలతో బతికి పోయేవారు కదా అని, తామప్పుడే బిచ్చం ఎత్తుకునే పద్ధతిలో ప్రవేశించి వుండేవారం కదా అని అన్నాడు. ఎంతో భీకరంగా యుద్ధం చేసి, కౌరవుల మీద గెలిచి, ఇప్పుడు అడవికి పోతున్నానని అంటే లోకులు అవహేళన చేయరా అని, తమను వెర్రివాళ్లు అని అనరా అని అడిగాడు. ధర్మరాజు అలా చేస్తే ప్రజలంతా దుఃఖిస్తారని చెప్పాడు.

భీమార్జునులు చెప్పిన తరువాత నకులుడు కూడా ధర్మరాజుకు మనస్తాపోశమనం చేశాడు. యజ్ఞాది కర్మలు మానివేయడం గొప్ప అనిపించుకొనదని, గృహస్థధర్మం ఆశ్రమ ధర్మాలలోకల్లా గొప్పదని, శత్రువులను చంపకుండా ఏరాజు కూడా రాజ్యాన్ని పాలించ లేదని, అలాగే ధర్మరాజు కూడా వ్యవహరించాలని, ప్రజారక్షణ చేయక పోవడమే రాజుకు మహాపాపం అని, కాబట్టి ధర్మాన్ని వదిలి అడవికి పోవడం ఉత్తమ క్షత్రియుల లక్షణం కాదని నకులుడు అన్నాడు.

ఆ తరువాత సహదేవుడు కూడా తనకు తోచిన విధంగా కొన్ని మాటలు చెప్పాడు. శరీర సుఖం జీవితానికి ప్రథమాధారం అని, అరణ్యానికి వెళ్ళినా శరీర పోషణం తప్పదని, అలాంటప్పుడు అడవికి పోవడం దేనికని, ఈ సత్యం తెలుసుకునే ఎందరో రాజులు రాజ్యం చేశారని, ధర్మరాజు కూడా అదే మార్గాన నడవాలని, ఆయనే తమ్ములకు, ప్రజలకు, తల్లి, తండ్రి, గురుదు, దైవం అని, కాబట్టి తన ప్రార్థన మన్నించి రాజ్యాన్ని పాలించమని వేడుకున్నాడు సహదేవుడు.

ధర్మరాజుకు ఆయన తమ్ములు చెప్పిన మాటలను వింటున్న ద్రౌపదీదేవి ఆమె వంతుగా హితవచనాలు చెప్పి ధర్మరాజు మనస్తాపోశమనం చేయడానికి ప్రయత్నించింది. శత్రువులను సంహరించి రాజ్యాన్ని ధర్మరాజు స్వీకరించాడని, ఇప్పుడు అదే రాజ్యాన్ని త్యజించి పోతాననడం అంటే తమ్ములను తపింప చేయడమే అని, అది ఆయనకు న్యాయమా అని, ధర్మాన్ని గురించి, సత్యాన్ని గురించి, ఔచిత్యాన్ని గురించి ఆయన కంటే ఎక్కువ ఎవరికి తెలుసని అన్నది. రాజనేవాడు ధైర్యస్థైర్య గుణాలను కోల్పోయి బేలగా వుండడం ధర్మం కాదని, లోకాన్ని రక్షించడానికి, పోషించడానికి రాజును దిక్పాలక అంశతో బ్రహ్మదేవుడు సృష్టించాడని చెప్పింది. కౌరవులు ధర్మరాజును, నిండు సభలో తనను అవమానించిన దానికి ఫలితంగా యుద్ధంలో ఓడిపోయి మరణించారని, దానికి మనస్సులో దుఃఖపడడం సమంజసం కాదని అన్నది. ధర్మరాజు చేసింది పాపం కాదన్నది. తప్పు చేసిన వారిని శిక్షించకపోతే అదే మహా పాపం అవుతుందన్నది. కౌరవులు తమ పాపం పండి తామే నశించారని, వారి చావుకు వారే కారకులని, కాబట్టి ధర్మరాజుకు పాపం తగలదని స్పష్టం చేసింది. కాబట్టి విచారం వదిలి రాజ్య పాలనను చేపట్టమని, అనేక యజ్ఞాలు చేసి సర్వలోక కళ్యాణాన్ని కలిగేట్లు చూడమని వేడుకున్నది.  

ఆ తరువాత భీమార్జునులు మరోమారు ధర్మరాజుకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. పాలకుడు సమర్థంగా వుండకపోతే దేశం అరాజకమౌతుందని, హింస చెలరేగుతుందని, అయినా యుద్ధంలో శత్రువీరులను చంపడం హింస కాదని, తమ తండ్రి పాండురాజు పాలించిన రాజ్యాన్ని ఆశించడంలో తప్పులేదని, ఆయన రాజ్యాన్ని ఆయన గ్రహించడం ధర్మమని అంటూ అర్జునుడు, అడవులకు పోయే ప్రయత్నాన్ని మానుకొమ్మని ధర్మరాజుకు సలహా ఇచ్చాడు. చేజిక్కిన రాజ్యాన్ని జారవిడుచుకొంటే అంతా ధర్మరాజును పిరికి వాడని అంటారని, రాజ్యాన్ని వదలడం నింద్యం అని, కాబట్టి రాజ్య పాలన చేస్తూ కురువంశ కులోత్తముడిగా ప్రకాశించమని కోపంగా అన్నాడు భీమసేనుడు.

గృహస్థదర్మం వదిలిపోవడం ధర్మవిరుద్ధమని, అడవికి పోవడంవల్ల మోక్షం కలుగుతుందని అనుకోవడం తప్పని అర్జునుడు మరో మారు చెప్పినప్పటికీ, దానితో విభేదించాడు ధర్మరాజు.

అర్జునుడు చెప్పిన మాటలు ధర్మ బద్ధంగా వున్నాయని దేవస్థానుడు అనే ముని, వ్యాస మహర్షి ఇద్దరూ అన్నారు ధర్మరాజుతో. శివుడు, బ్రహ్మ, దేవతలు, మరుత్తులు, చక్రవర్తులు, ఇలా అందరూ భూమిని పాలిస్తూ యజ్ఞాలు చేసి రాణించారని, అరిషడ్వర్గాలను జయించి ప్రజలను కాపాడే రాజును సమస్త గుణాలూ తమంతట తామే వచ్చి చేరుతాయని బృహస్పతి కూడా చెప్పాడని అన్నాడు దేవస్థానుడు. ఇలా చెప్పి, కుల ధర్మాన్ని కాపాడుకుంటూ భూమిని పాలించమని, పూర్వ చక్రవర్తుల లాగే గృహస్థాశ్రమాన్ని నిర్వహించి, చివరకు జ్ఞానబోధతో వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించమని చెప్పాడాయన. ఆ మాటలు విన్న ధర్మరాజు నిర్వేదంలో మునిగిపోయాడు.

అర్జునుడి చెప్పింది నిజమని, గృహస్థ ధర్మం కంటే రాజులకు మరొక పరమ ధర్మం లేదని, పరిపాలనలో ప్రజలను రక్షించ కుండా వదిలి వేయడం రాజుకు పాప హేతువని వ్యాస మహర్షి ధర్మరాజుతో అన్నాడు. దండనీతిని అనుసరించి ఆ తరువాత మోక్షం పొందిన సుద్యుమ్నుడు అనే రాజు గురించి ప్రస్తావించాడు. రాజులకు యుద్ధాలు హానికరం కావని, కాబట్టి హింసను గూర్చిన అనుమానం వదిలి క్షత్రియోచిత ధర్మాలను నిర్వహించమని చెప్పాడు వ్యాసుడు. యుద్ధంలో చనిపోయిన వారి బంధువులు కన్నీరు-మున్నీరుగా విలపిస్తుంటే తనకు దుఃఖం కలుగుతుందని ధర్మరాజు అన్నప్పుడు, వ్యాసుడు, చావు పుట్టుకలు కాలానికి లోబడి వుంటాయని, కాబట్టి ధర్మరాజు బాధ పడాల్సిన అవసరం లేదని, కులధర్మం అవశ్య కర్తవ్యం అని బోధించాడు.

ఇంత చెప్పినప్పటికీ వినకుండా, బందుమరణ శోక వ్యాకులుడైన ధర్మరాజును ఉద్దేశించి అర్జునుడు కృష్ణుడితో, ఆయన హితోక్తుల ద్వారా ధర్మరాజును తేరుకోనేట్లు చేయమని కోరాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, ఆయన లాంటివాడు బాధలతో కుంగిపోవడం సమంజసం కాదని, ఆయన బంధువులు శౌర్యాన్ని ప్రదర్శించి స్వర్గస్థలయ్యారని, రాచరికం అనేది ఒక కల అని, ఒక్క రాజులే కాకుండా శాశ్వతమైన ఆయుర్దాయం కలవారు భూమ్మీద ఎవరున్నారో చెప్పమని ప్రశ్నించాడు. ఆ తరువాత ధర్మరాజుకు షోడశరాజుల చరిత్ర చెప్పాడు. మరుత్తుడు, సుహ్రోత్రుడు, అంగుడు, శిబిచక్రవర్తి, శ్రీరాముడు, భగీరథుడు, దిలీపచక్రవర్తి, మాంధాతృ చక్రవర్తి, యయాతి, అంబరీషుడు, శశిబిందుడు, గయుడు, రంతిదేవుడు, భరతుడు, పృథుచక్రవర్తి, పరశురాముడు అనే వారి చరిత్ర వివరంగా చెప్పి, వారెన్ని యజ్ఞయాగాదులు, క్రతువులు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా కలకాలం జీవించలేక పోయారని, ఎవరు కూడా శాశ్వతమైన శరీరాలు పొందలేక పోయారని అన్నాడు. దానితో పాటు ధర్మరాజు కోరిక మేరకు పర్వత నారదుల వృత్తాంతం, సువర్ణష్టీవి కథ కూడా వినిపించాడు.

 ఆ తరువాత అక్కడే వున్న నారదుడు ధర్మరాజుతో, శ్రీకృష్ణుడు, వ్యాసుడు ఆయన మీద వున్న ప్రేమతో చెప్పిన మాటలన్నీ గొప్ప లోతైన భావాలతో వున్నాయని, మేలు కలిగించే ఆ బోధనలను మనసులో పెట్టుకుని, భూభారాన్ని వహించి, గొప్ప కీర్తిని ఆర్జించమని చెప్పాడు. అప్పుడు వ్యాసుడు, రాజులకు ప్రజలను రక్షించడానికన్నా మించిన ధర్మం మరొక్కటి లేదని, కాబట్టి ప్రజా రక్షణ చేయవలసిందని ధర్మరాజుకు చెప్పాడు. మానవులు చేసే కర్మలన్నీ భగవంతుడి ఆజ్ఞమేరకే వర్తిస్తాయని, అన్నింటినీ చేయించేవాడు భగవంతుడే అని, మానవుడు ఉపకరణ మాత్రమే అని, అతడికి పాపం అంటదని, కాబట్టి క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించమని, సంసారాన్ని వదలడం మంచిది కాదని ధర్మరాజుతో అన్నాడు వ్యాసుడు.

ధర్మరాజుకు పాపం అంటదని, యుద్ధంలో చనిపోయిన వారి రాజుల రాజ్యాలను ధర్మబద్ధంగా వారివారి వారసులకు ఇచ్చివేయమని, అశ్వమేధ యాగం చేయమని బోధించాడు వ్యాసుడు ధర్మరాజుకు. ఆ తరువాత వ్యాసుడు ధర్మరాజుకు ప్రాయశ్చిత్త విశేషాలను తెలియచేశాడు. ఆహారం మితంగా తీసుకుంటూ, ఏకాంత స్థలంలో పగలు అయ్యేప్పుడు (ఉదయ సంధ్యలో), రాత్రి వున్నప్పుడు (సాయం సంధ్యలో) మనసులో ఏమరుపాటు లేకుండా గాయత్రీమంత్ర జపం చేస్తే పాపాలన్నీ నశిస్తాయన్నాడు. భగవంతుడి పట్ల విశ్వాసం, శ్రద్ధ, వినయం వున్నవారే ప్రాయశ్చిత్తానికి అర్హులని అన్నాడు. గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించే వారు అతిథి పూజ, పితృ దేవతాపూజ, దేవతా పూజ చేసుకున్న తరువాతనే తినాలి. ఆ తరువాత వ్యాసుడు దాన యోగ్యత లేనివారి గురించి చెప్పి, వారికి దానం చేయడం నిష్ఫలం అన్నాడు. అపాత్రదానం చేయరాదన్నాడు.

ఇవన్నీ చెప్పిన తరువాత వ్యాసుడు తాను చేయగలంత జ్ఞాన బోధ చేశానని, ఆ మాటలను ప్రమాణంగా గ్రహించి ధర్మరాజు విద్యుక్త ధర్మాలను ఆచరించమని అన్నాడు. కురు వంశంలో వారందరికీ పెద్ద దిక్కు భీష్ముడని, ఇంద్రాదులకు కూడా ఆయన పూజ్యుడని, అతడికి ధర్మాలన్నీ కరతలామలకం అని, ఆయన ధర్మరాజు అడిగే అంశాలన్నీ వివరించగల సమర్థుడని, ఆయన పైలోకాలకు వెళ్లే సమయం సమీపిస్తున్నదని, ఆయన దగ్గర ధర్మోపదేశం చేసుకోమని చెప్పాడు. మహర్షి చెప్పిన మాటలు వినమని, ఆయనకు మేలు కలుగుతుందని శ్రీకృష్ణుడు కూడా అన్నాడు.

ఇలా అంతా చెప్పిన మాటలు విన్న ధర్మరాజు వైరాగ్యం తొలగించుకొని పట్టాభిషేకానికి సుముఖుడయ్యాడు.        

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

             

           

No comments:

Post a Comment