Sunday, October 23, 2022

శ్రీవారి దర్శనం నాడు....నేడు : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీవారి దర్శనం నాడు....నేడు

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (23-10-2022)

"వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి"… ఆ కలియుగ ప్రత్యక్ష దైవ దర్శనం ఒక్క క్షణ కాలంపాటు కలిగినా చాలని, వందల-వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి, లక్షలాది మంది భక్తులు, పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమల కొండకు నిత్యం వెళుతుంటారు. స్వామిని దర్శించుకున్న సామాన్యులు కాని, అసామాన్యులు కాని, గంటల తరబడి క్యూలో నిలుచున్న వారు కాని, సరాసరి వైకుంఠ ద్వారం గుండా లోనికి వెళ్లగలిగిన వారు కాని, ఒక్క టంటే ఒక్క దర్శనం చాలనుకునేవారు కాని, వీలై నన్ని దర్శనాలు కావాలనుకున్నవారు కాని, ఒక్క రూపాయి హుండీలో వేయలేని వారు కాని, కోట్లాది రూపాయలు సమర్పించుకోగలిగే వారు కాని, ఎవరైనా, కారణమేదైనా, ఎలా వెళ్లినా, వచ్చినా....తృప్తి తీరా, తనివితీరా దేవుడిని చూశామంటారే కాని, అసంతృప్తితో ఎవరూ వెనుదిరిగిపోరు. వెళ్తూ....వెళ్తూ, దర్శనంలో పడ్డ ఇబ్బందులేమన్నా వుంటే పూర్తిగా మరచి పోతూ, ఏ భక్తుడైనా, ఏం కోరినా-కోరకున్నా, తప్పకుండా కోరేది మాత్రం ఒకటుంటుంది.....అదే, "స్వామీ, పునర్దర్శన ప్రాప్తి కలిగించు" అని. అలా తన భక్తులను తన వద్దకు రప్పించుకుంటాడా కలియుగ దైవం!

నాకు ఊహ తెలియక ముందు, తెలిసీ-తెలియని రోజుల్లో, తెలిసినప్పటి నుంచీ గత ఏబై-అరవై ఏళ్లుగా తిరుమల వెళ్లి రావడంలో చాలా మార్పులు స్వయంగా చూస్తూ వస్తున్నాను. దర్శనానికి వచ్చిన వేలాది-లక్షలాది యాత్రీకులందరికీ, వారివారి స్థోమతకనుగుణంగా, వుండడానికి వసతితో పాటు, కావలసిన వారికి ఉచిత భోజన సౌకర్యం కూడా తిరుమలలో కలిగించిన విధంగా ప్రపంచంలో ఎక్కడా, అదీ అనునిత్యం కలిగిస్తున్న దాఖలాలు లేవనాలి. ఏమిటీ కొండ మహాత్మ్యం? ఏముందీ దైవంలో? ఎందుకిన్ని ఆర్జిత సేవలు? ఒక్కో సేవకున్న ప్రత్యేకత ఏమిటి?పొరపాటునన్నా, లేదా, ఏమరుపాటునన్నా ఏనాడైనా ఏదైనా సేవ ఆగిందా? ఏ సేవ, ఎప్పుడు, ఎంతసేపు జరపాలన్న విషయంలో ఏవన్నా నియమ నిబంధనలున్నాయా? గతంలోను, ఇప్పుడు సేవల వేళల్లో కాని, పట్టే సమయాల్లోకాని, మార్పులు చేర్పులు జరిగాయా? జరగడానికి శాస్త్రీయ కారణాలే మన్నా వున్నాయా? ఆర్జిత సేవలకు అనుమతిచ్చే భక్తుల సంఖ్యలో పెంచడం-తగ్గించడం జరిగిందా? ఇవన్నీ ఆసక్తికరమైన విషయాలు.

మార్పులకు కారణాలుండే వుండాలి. ఇవన్నీ భక్తులు తెలుసుకోవాలనుకున్నా, ఏ కొద్దిమందికో తప్ప అందరికీ వీలుండదేమో! ఒకప్పుడు ఎల్ 1. ఎల్ 2. ఎల్ 3, బ్రేక్ దర్శనాలు వుండేవి. వాటిని రద్దు చేసి వాటి స్థానంలో ఒకే ఒక బ్రేక్ దర్శనం పెట్టారు. కాకపోతే ముందుగా ప్రోటోకాల్ దర్శనాలు, తరువాత శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు, చివరగా వీఐపీ దర్శనాలు ఏర్పాటు చేశారు. తోపులాట అన్నిటికీ వున్నా కొద్దిగా తేడా వున్నది.

          ఇవన్నీ కాక శ్రీ వేంకటేశ్వరుడికి అను నిత్యం జరిపించే ఒక్కో సేవకు ఒక్కో ప్రాధాన్యం వుంది-విశేషముంది. ప్రతి సేవలో అనుసరించే ఒక్కో విధానానికి విశేష ప్రాముఖ్యత వుంది. ఉదాహరణకు "సన్నిధి గొల్ల" అని పిలువబడే ఒక యాదవ వ్యక్తి బంగారు వాకిళ్ల తాళాలు తీయడం. ప్రతి నిత్యం తొలి దర్శనం అతడికే కలుగుతుంది. సుప్రభాత సేవ సమయాన పొర్లు దండాలు మరో విశేషం. ప్రతి నిత్యం స్వామివారికి ఇలా అనేకం జరగడం ఆనవాయితీ.

          బాల్యంలో మా నాన్నగారి ఆధ్వర్యంలో చాలా అట్టహాసంగా సుమారు పాతిక మందికి పైగా ఒక జట్టుగా కలిసి వెల్లేవాళ్ళం. ఎద్దుల బండ్లలో సమీపంలోని రైల్వే స్టేషన్ కు చేరుకుని, అక్కడ నుంచి పాసింజర్ రైల్లో విజయవాడ వెళ్లి, అక్కడ ఒక సత్రంలో బస చేసి, మర్నాడు సాయంత్రం తిరుమలకు ప్రయాణం చేసేవాళ్లం. ఇప్పటి లాగా హోటెల్ భోజనం కాదు. వంట చేసుకుని తినడమే. మినరల్ వాటర్ బాటిల్స్ వుండేవి కాదు. ఏ నీరు లభ్యమవుతే అదే తాగే వాళ్లం. బయల్దేరిన మూడో రోజు ఉదయం తిరుపతి రైల్వే స్టేషన్‌లో దిగి, ఒక పూట తిరుపతి సత్రంలో బస చేసి, వంటా-వార్పూ కానిచ్చి, స్థానికంగా వున్న దేవాలయాలను దర్శించుకుని, మర్నాడు తిరుమలకు బస్సులో పోయేవాళ్లం. ఆ రోజుల్లో తిరుమల-తిరుపతి దేవస్థానం వారే బస్సులు నడిపేవారు. రూపాయో-రెండో టికెట్ ధర వుండేది. తిరుమల వెళ్లడానికి-రావడానికి ఒకే ఘాట్ రోడ్డుండేది.

బస్సు మొత్తం ప్రయాణం  పూర్తయ్యేంతవరకు, గోవింద నామ స్మరణతో మారు మోగేది. అప్పట్లో సెక్యూరిటీ చెకింగులు అసలే లేవు. తిరుమలలో ఇప్పటి లాగా టిటిడి వారి వసతి గృహాలు అంతగా వుండేవి కావు. ఎన్నో ప్రయివేట్ సత్రాలుండేవి. వాటిలో "పెండ్యాల వారి సత్రం" చాలా పేరున్న సత్రం. తిరుమల చేరుకోగానే, బస, వంటా-వార్పూ అన్నీ అక్కడే. దాదాపు మూడు రోజులు వుండేవాళ్ళం. దర్శనానికి ఎన్ని సార్లు వీలుంటే అన్ని సార్లు, ఏ దర్శనం కావాలనుకుంటే ఆ దర్శనానికి, ఎవరి సహకారం లేకుండానే వెళ్లొచ్చాం. ఏ నియమ నిబంధనలుండేవి కావు. నాకు గుర్తున్నంతవరకు ప్రధాన ద్వారం గుండా సరాసరి వెళ్లొచ్చాం. కాకపోతే, శ్రీవారి దర్శనానికి ముందు వరాహ స్వామి దర్శనం చేసుకున్నాం. పక్కనే వున్న స్వామిపుష్కరణి-కోనేరులో  స్నానం చేసే వాళ్లం. అప్పట్లో అందులో నీరు శుభ్రంగా-కొబ్బరి నీళ్లలా వుండేది. తిరుమల సమీపంలోని పాప నాశనానికి తప్పనిసరిగా వెళ్లే ఆచారం వుండేది అప్పట్లో. అక్కడ నిరంతరం ధారగా నీరు పడుతుండేది.

గుళ్లో తిరగని ప్రదేశం లేదు. ఏ రకమైన కట్టుబాట్లు లేవు. ఇక లడ్డులకు కొదవే లేదు. కళ్యాణోత్సవం చేయించిన వారు బస చేసే చోటికి, ఆలయ నిర్వాహకులు, ఒక పెద్ద గంప నిండా పులిహోర, దద్ధోజనం, పొంగలి, పెద్ద లడ్డులు, వడలు, చిన్న లడ్డులు వచ్చేవి. కళ్యాణం చేయించినవారికి ప్రత్యేక దర్శనం వుండేది.

          తిరుగు ప్రయాణంలో ఇప్పటిలాగే అప్పుడూ, అలి మేలు మంగాపురం పోయాం. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అంతకంటే ముందు అక్కడి కోనేట్లో స్నానం చేశాం. స్థానికంగా వున్న గోవింద రాజ స్వామి దర్శనం కూడా చేసుకున్నాం. తిరుపతి నుంచి ఒక పూట శ్రీ కాళహస్తి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నాం. ఆ మర్నాడు విజయవాడకు బయల్దేరాం. ఆ రోజుల్లో ఒక పద్దతి ప్రకారం దైవ దర్శనం చేసుకునే ఆచారం వుండేది. వరాహ స్వామి దర్శనం, వేంకటేశ్వర స్వామి దర్శనం, అలి మేల్ మంగ దర్శనం, గోవింద రాజ స్వామి దర్శనం, శ్రీ కాళహస్తి దర్శనం తిరుగు ప్రయాణంలో విజయవాడలో ఆగి కనకదుర్గ దర్శనం చేసుకునే వాళ్లం. సుమారు వారం-పది రోజుల యాత్ర అలా సాగేది అప్పట్లో. ఇక ఇప్పుడు విమానంలో తిరుమల పోయి దొరికిన దర్శనం చేసుకుని, 24 గంటల్లో తిరిగి వస్తున్నారు.  

ప్రత్యేక ప్రవేశ దర్శనం రు. 25 లతో ప్రారంభమైనట్లు జ్ఞాపకం. క్రమేపీ సిఫార్సు ఉత్తరాల సాంప్రదాయం మొదలైంది. ఆర్జిత సేవలకు కోటా మొదలైంది. అయినప్పటికీ మొదట్లో అంతగా ఇబ్బంది కలగలేదనాలి. ఎలాగో ఆలాగ అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉత్తరాలు దొరికేవి స్వామివారి దయవల్ల. అప్పట్లో సర్వ సాధారణంగా చేసుకునే మంచి దర్శనం అర్చనానంతర దర్శనం. ఎప్పుడైతే కళ్యాణం చేయించిన వారికి మామూలు దర్శనాలు మొదలయ్యాయో చాలా మంది అవి చేయించడం మానుకున్నారు. తరువాతి కాలంలో అర్చనానంతర దర్శనాలు రద్దయ్యాయి. ఒకప్పుడు రు. 25 వుండే బ్రేక్ దర్శనం అంచలంచలుగా పెరిగి ఇప్పుడు రు. 500 కు చేరుకుంది.

ఎన్నాళ్ల బట్టో మాకు స్వామివారికి అభిషేకం చేయించాలన్న కోరిక వుండేది. ఆ కోరికా తీరింది అర్చన, సుప్రభాతం, అభిషేకం, కళ్యాణం లాంటివి చేయించిన మాకు "వస్త్రం" సేవ చేయించాలనే కోరిక కలిగింది. ఆ ముచ్చటా తీర్చుకున్నాం. ఒక సారి మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డితో, ఒక సారి ప్రస్తుత సీఎం కేసీఆర్ తో బ్రహ్మాండమైన దర్శనాలు కలిగాయి. అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి దగ్గర పీఆర్వోగా పనిచేస్తున్నప్పుడు కూడా నాకిలాంటి దర్శనమే లభించింది. అప్పట్లో అమల్లో వున్న నిబంధనల ప్రకారం, సీఎం వెంట వున్న వారందరినీ ముఖద్వారం నుంచే లోనికి అనుమతించినట్లు జ్ఞాపకం.

సీఎం కేసీఆర్ ఆభరణాలు స్వామివారికి సమర్పించిన తరువాత ఎస్వీబీసీ ఛానల్ తో మాట్లాడుతూ తన స్వానుభవం ఒకటి వివరించారు. కొన్నేళ్ల క్రితం తిరుమలకు వచ్చి కూడా, దర్శనం చేసుకోకుండా తిరిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, స్వామి అనుజ్ఞ లేనిదే దర్శనం జరగదని, "దర్శనం స్వామి ఇస్తేనే దొరికేది" అనీ, అందుకే ఆభరణాలు ఇవ్వడానికి ఇంత కాలం పట్టిందనీ, అన్నారు. ఇది నూటికి నూరు పాళ్లు వాస్తవం. 

కాలం మారింది. ఏబై-అరవై ఏళ్ల క్రితం పరిస్థితులు ఇప్పుడు లేవు. సరాసరి దైవ దర్శనానికి పోయేందుకు ఇప్పుడు వీలు లేదు. ఇప్పటి నియమనిబంధనలు పాటించక తప్పదు. భక్తులను ఇలా నియంత్రిస్తేనే అందరికీ దర్శనం దొరికే అవకాశం వుంటుంది. ఒకనాడు విఐపి లకు వున్న ప్రాముఖ్యత ఇప్పుడు లేదే! గతంలో లాగా వీఐపీలకు హారతి ఇచ్చే ఆచారం ఆగిందే! ఆ రోజుల్లో లాగా అన్నీ-అందరికీ ఇప్పుడు జరగడం లేదే! కాకపొతే ఇంకా, ఇంకా వసతులు శాస్తీయంగా పెరగాల్సిన అవసరం వున్నది.

అందుకే బహుశా, రాబోయే రోజుల్లో ఏం జరగ బోతోందో ఎవరూ ఊహించలేరేమో.

No comments:

Post a Comment