Saturday, October 8, 2022

‘ఆడవారి నోట్లో ఆవగింజైనా నానదు’ అని తల్లి కుంతీదేవిని శపించిన ధర్మరాజు ..... ఆస్వాదన-92 : వనం జ్వాలా నరసింహారావు

 ‘ఆడవారి నోట్లో ఆవగింజైనా నానదు’ అని తల్లి కుంతీదేవిని శపించిన ధర్మరాజు

ఆస్వాదన-92

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (09-10-2022)

యుద్ధంలో చనిపోయిన బంధుమిత్రులకందరికీ పాండవులు జలతర్పణాలు ఇచ్చిన తరువాత, మృత శౌచాన్ని పోగొట్టుకోవడానికి గంగానదీ తీరంలో ఒక నెల రోజులు బస చేశారు. పాండవులతో పాటు ధృతరాష్ట్ర, విదురాదులు, భరత వంశీయుల భార్యలు కూడా అక్కడే వున్నారు. ఆ సందర్భంలో ధర్మరాజును దర్శించుకోవడానికి వ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్థాణుడు, కణ్వుడు మొదలైన మునీంద్రులు వారి శిష్యులతో సహా వచ్చేశారు. వారందరినీ ధర్మరాజు ఉచితరీతిన సేవించాడు.

         ఆ సమయంలో అందరి మునుల పక్షాన ధర్మరాజుతో మాట్లాడుతూ నారదుడు, కృష్ణార్జునుల తోడ్పాటుతో, ప్రజలంతా గౌరవిస్తుండగా ధర్మరాజు రాజ్యాన్ని సగౌరవంగా, సార్థకంగా పొందాడని ఆయన్ను అభినందించాడు. ధర్మరాజుది ధర్మయుద్ధమని నారదుడు ప్రశంసించాడు. జవాబుగా ధర్మరాజు, శ్రీకృష్ణుడి కృపాదృష్టి తన మీద ప్రసరించడం వల్ల, బ్రహ్మజ్ఞుల అనుగ్రహం వల్ల, భీమార్జునుల బాహుబలం వల్ల రాజ్యం అంతా తమకు దక్కిందని, అయినప్పటికీ జ్ఞాతులందరినీ యుద్ధంలో అతి దారుణంగా చంపడం వల్ల, అభిమన్యుడు, ఉప పాండవుల లాంటి వీరులను కోల్పోవడం వల్ల, తనకు కలిగిన విజయాన్ని విజయంగా స్వీకరించడానికి తన బుద్ధి అంగీకరించడం లేదని అన్నాడు.

         ధర్మరాజు తనను కలతపెట్టుతున్న మరో ముఖ్యమైన విషయాన్ని కూడా నారదుడితో, ఇతర మునులతో ప్రస్తావించాడు. కర్ణుడు కుంతీదేవి మొదటి బిడ్డ అనే సంగతి తెలిసి, అతడికి జలతర్పణాలు ఇచ్చినప్పటి నుండి తన మనస్సు నిప్పుల్లో దొర్లించినట్లుందని అన్నాడు. కర్ణుడి దగ్గరికి కుంతీదేవి పోయి అతడి జన్మ రహస్యం చెప్పి తమ్ములతో వచ్చి చేరమని అడిగిన విషయం, దానికి జవాబుగా తాను దుర్యోధనుడిని వదిలితే కృతఘ్నతా దోషం కలుగుతుందని కర్ణుడు చెప్పిన విషయం, అర్జునుడు తప్ప మిగతా నలుగురు దొరికినా చంపనని కర్ణుడు వాగ్దానం చేసిన విషయం, ఆ వాగ్దానం మేరకు తాము దొరికినా పట్టి బాధించాడే కాని ప్రాణాలు తీయని విషయం చెప్పి ధర్మరాజు బాధపడ్డాడు.

కర్ణుడి జన్మ రహస్యం కుంతీదేవి దాచి పెట్టడం వల్ల తామైదుగురం తెలుసుకోలేక పోయామని, దానివల్ల ఇంతటి విపత్తు వాటిల్లిందని, అంతా అయిపోయిన తరువాత ఇప్పుడు చేసేది ఏముందని నారదుడిని అడిగాడు ధర్మరాజు. తాను అన్నను చంపిన పాపినని, కర్ణుడూ తామూ కలిసి ఉన్నట్లయితే దేవతాగణం కూడా తమకు అడ్డు నిలవ లేకపోయేదని వాపోయాడు. ఆ విధంగా కర్ణుడి మరణానికి తన ప్రేరణ కారణమైందని బాధ పడ్డ ధర్మరాజు తాను చేసిన పాపానికి నిష్కృతి లేదని వేదన పడ్డాడు.

         ధర్మరాజు కోరిక మీద నారదుడు కర్ణుడి జన్మ రహస్యం వివరించాడు. కుంతీదేవి కన్యగా వున్నప్పుడు దుర్వాస మహామునికి సపర్యలు చేయడం, ఆయన ఉపదేశించిన మంత్ర ప్రభావం వల్ల సూర్యుడి ద్వారా ఆమె కొడుకును కనడం, ఆమె బాలుడుని నదిలో విడవడం, సూతుడికి దొరికి అక్కడ పెరగడం, సూతపుత్రుడుగా ప్రసిద్ధికెక్కడం, అర్జునుడి మీద ద్వేషంతో కర్ణుడు దుర్యోధనుడితో చేతులు కలపడం, ద్రోణాచార్యుడు బ్రహ్మాస్త్రం నేర్పనందున పరశురాముడిని ఆశ్రయించడం, బ్రాహ్మణుడి శాపం, పరశురాముడి శాపం, కర్ణ-జరాసంధుల పోరు, ఇంద్రుడు కవచ కుండలాలను కర్ణుడి దగ్గర సంగ్రహించడం చెప్పి వీటన్నిటి మూలాన అర్జునుడు కర్ణుడిని సంహరించగలిగాడని చెప్పాడు. నారద మహర్షి కర్ణుడి వృత్తాంతం సంగ్రహంగా చెప్పి ముగించిన రీతిని తిక్కన ఒక అపురూపమైన పద్యంలో వివరించారు.

         చ:       వినుము నరేంద్ర! విప్రుఁ డలివెన్, జమదగ్ని సుతుండు శాప మి

చ్చె, నమరభర్త వంచనము సేసె, వరంబని గోరి కుంతీ మా

న్పె నలుక, భీష్ముఁ డర్థరథుఁ జేసి యడంచే, గలంచే ముద్రరా

జనుచిత మాడి, శౌరి విధి యయ్యె, నరం డనిఁ జంపెఁ గర్ణునిన్

(ధర్మరాజా! నేను చెప్పేది గ్రహింపుము. బ్రాహ్మణుడు తన ఆవుదూడ చనిపోవడంతో కోపించి శపించాడు. జమదగ్ని సుతుడైన పరశురాముడు తనకి బ్రాహ్మణుడని అసత్యమాడి తనవద్ద విద్య గ్రహించినందుకు శాపమిచ్చాడు. అమరభర్త అయిన ఇంద్రుడు కర్ణుడి గొప్పతనాన్ని ధ్వంసం చేయదలచి కవచకుండలాలు భిక్షగా అడిగి పుచ్చుకున్నాడు. కుంతీదేవి వరం అనే నెపంతో కోరి కర్ణుడి కోపాన్ని మాన్పింది. భీష్ముడు కర్ణుడిని అర్జునుడు చేతిలో పలుమార్లు ఓడిపోవడం చేత  అర్థరథుడిని చేసి అవమానపరిచాడు. మద్రదేశాధిపతి శల్యుడు అనుచిత వ్యాఖ్యలతో మనసుని గాయపరిచాడు. శ్రీకృష్ణుడు కర్ణుడికి దాటరాని విధిగా నిలిచాడు. యుద్ధంలో కర్ణుడిని అర్జునుడు చంపాడు. ఈ పద్యంలో కర్ణుడి జీవితాన్ని మొత్తం చూపెట్టాడు తిక్కన అని విశ్లేషించారు డాక్టర్ జీవీ సుబ్రహ్మణ్యంగారు. కర్ణుడి జీవితాన్నంతా ఒక పద్యంలో ఇమిడ్చిన అపురూప రచన ఇది అన్నారాయన. ఎంతటి మహాత్ముడికైనా దైవబలం లేకపోతే ఎట్లా కుప్పకూలిపోతాడో చెప్పడానికి ఈ పద్యం ఒక ఉదాహరణ అని విశ్లేషించారాయన).

ఇలా నారదుడు చెప్పగా విన్న ధర్మరాజు తీవ్రమైన దుఃఖంతో కలత చెంది కన్నీరు మున్నీరు కాగా, అతడి సమీపంలో వున్న కుంతీదేవి, కర్ణుడి కొరకు మానసిక వేదన పొందవలదని కొడుక్కు చెప్పింది. అలా తల్లి మాట్లాడడంతో ఏవగింపు కలిగిన ధర్మరాజు, కుంతీదేవిని చూసి, ఆమె నిర్వహించిన ఈ రాచకార్యాన్ని రహస్యంగా వుంచడం వల్లే ఇంతటి విపరీత పరిణామం కలిగిందని, అందువల్ల, సమస్త లోకాలలో వుండే ఆడవారికి రహస్యాలను రహస్యంగా కాపాడే శక్తి వారి మనస్సులలో లేకుండా పోవు కాక! అని శపించాడు. ఆ తరువాత కౌరవ పాండవ పక్షాలలో ప్రాణాలు కోల్పోయిన బందు మిత్రులు ముఖ్యంగా కర్ణుడు జ్ఞాపకానికి వచ్చి అమితంగా దుఃఖించాడు ధర్మరాజు. ఆయన మనసు తీవ్రంగా గాయపడింది.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment