....అయినప్పటికీ చెరగని ముద్ర
(సామ్యవాద, ప్రజాస్వామ్య మార్గంలో ఇందిరాగాంధీ నియంతృత్వం)
వనం జ్వాలా నరసింహారావు
సాక్షిదినపత్రిక (31-10-2022)
సుమారు 28 సంవత్సరాల సర్వసత్తాక, సామ్యవాద,
లౌకిక, ప్రజాస్వామ్య భారతదేశంలో
ఒక చీకటి అద్యాయానికి తెర లేచిన చీకటి రోజులు, అప్పట్లో దాదాపు అదే వయసున్న నాకు ఇప్పటికీ
చాలా స్పష్టంగా జ్ఞాపకం వున్నాయి. అప్పటి సంగతులు ఎప్పటికప్పుడు గుర్తుకు వస్తూనే
వుంటాయి. 1975 జూన్ 26న (25వ తేదీ అర్ధరాత్రి) అలనాటి ప్రధానమంత్రి (స్వర్గీయ) ఇందిరాగాంధీ చేసిన సిఫార్సుతో, అప్పటి రాష్త్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటింఛారు. 1977లో తిరిగి ఎన్నికలు జరిగే వరకూ, 21 నెలలపాటు దారుణమైన
ఎమర్జెన్సీ పాలన కొనసాగింది. సామ్యవాద, ప్రజాస్వామ్య మార్గంలో ఇందిరాగాంధీ నియంతగా వ్యవహరించిన ఆ సందర్భంలో ఎన్నో అనుభవాలు, మరెన్నో జ్ఞాపకాలు.
ఎమర్జెన్సీ విధింపు నేపధ్యంలో, రాయబరేలిలో గెలుపుకోసం ఇందిర అనేక అక్రమాలకు పాల్పడ్డారని, కాబట్టి ఎన్నికను రద్దు చేయాలంటూ ఆమె చేతిలో ఓడిపోయిన అభ్యర్థి రాజ్ నారాయణ్
అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖల్ చేశారు. ప్రధాని ఇందిరా గాంధీ లోక్ సభకు
ఎన్నిక చెల్లదని, అలహాబాద్ హైకోర్టు
న్యాయమూర్తి జస్టిస్ జగ్ మోహన్ లాల్ సిన్హా జూన్ 12, 1975 న చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఇందిర
అనర్హురాలిగా న్యాయస్థానం ప్రకటించింది. ఆమె తక్షణమే రాజీనామా చేయాలని
ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండు చేశాయి. రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి
చెప్పడమే కాకుండా, యావత్ పాలనా యంత్రాగాన్ని
తన గుప్పిట్లో పెట్టుకునే దిశగా అడుగులు వేసింది ఇందిరాగాంధి.
యోధాన యోధులైన రాజకీయ నాయకులను
నిర్బంధించే ప్రక్రియకు నాంది పలికింది. అలనాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఆమె అనుంగు సహచరుడు సిద్ధార్థ శంకర రే సలహా మేరకు దేశ సమగ్రత-సమైక్యతలకు
తీవ్రమైన ముప్పు వాటిల్లనున్నదన్న కారణం చూపుతూ, జూన్ 25,
1975 అర్థరాత్రి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఇందిరా గాంధీ
ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా. స్వతంత్ర భారత దేశంలో చీకటి రోజులకు తెరలేపింది
ఇందిరా గాంధీ. అలహాబాద్ హైకోర్టు తీర్పుతో నియంతగా మారిన ఇందిరా గాంధీ
ప్రజాస్వామ్య వ్యవస్థనే ఖూనీ చేస్తూ పలువురు ప్రజాస్వామ్య వాదులు ముందే
హెచ్చరించినట్లుగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
వాస్తవానికి 1971లో పాకిస్తాన్‍తో యుద్ధాన్ని బూచిగా చూపి, విధించిన ఎమర్జెన్సీని రద్దుచేయకుండానే, దేశానికి ఆంతరంగికంగా ముప్పు ఏర్పడిందంటూ 352 ఆర్టికల్ కింద తిరిగి ఇందిరాగాంధి ఎమర్జన్సీని ప్రకటించింది. దీనిపై
కోర్టుకు వెళ్లటానికి వీలులేకుండా రాజ్యాంగానికి 39వ సవరణ తెచ్చింది. అసాధారణ అధికారాలను చేజిక్కించుకుని, పౌర హక్కులను కాల రాసింది. అంతర్గత భధ్రత చట్టం కింద వందల, వేల సంఖ్యలో అరెస్టులు చేయించింది.
అలహాబాద్ హైకోర్టు తీర్పు, జూన్ 24న సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పును దృష్టిలో పెట్టుకుని ఇందిరాగాంధీ
కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలోను, ముఖ్యమంత్రి వెంగళరావు పాలనలోని అలనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍లోను ఎమర్జెన్సీ
దురాగతాలు పెద్దఎత్తున చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇష్టానుసారంగా
దుర్వినియోగం చేశారు. పోలీసు నిఘా విభాగాన్ని తమ గుత్త సంస్థగా మార్చేశారు. దేశ
వ్యాపితంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరితో సహా, జయప్రకాష్ నారాయణ, మొరార్జీ దేశాయ్ వంటి
ప్రతిపక్ష పార్టీల నాయకుల నుండి సాధారణ కార్యకర్తల వరకు వేలాది మంది పేర్లతో
జాబితాలు తయారు చేసి విచ్చలవిడిగా అరెస్టులు చేయసాగారు.
దేశవ్యాప్తంగా అరెస్టయిన వారిలో, కాంగ్రెస్ పార్టీలో ఆమెను బలంగా వ్యతిరేకించిన ఒకరిద్దరితో సహా, సీపీఎం,
జనసంఘ్, సంస్థాగత కాంగ్రెస్, ఇతర కాంగ్రేసేతర రాజకీయ నాయకులను చాలామందిని అరెస్ట్ చేయించింది. విమర్శలను
లెక్క చేయని ఇందిర రాజ్యాంగాన్ని తిరగ రాసి, తనకు వ్యతిరేకంగా వచ్చిన అలహాబాద్ హైకోర్టు తీర్పునుంచి ఊరట పొందింది.
విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేసింది. దేశ సమైక్యతకు-సమగ్రతకు ముప్పు
వాటిల్లిందని,
రోగికి చేదు మందిచ్చి బ్రతికించిన విధంగానే, అత్యవసర పరిస్థితి విధింపు తాత్కాలికమే అని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది.
ఆర్థిక,
రాజకీయ సుస్థిరత కొరకు, జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ఒక ఏడాది వాయిదా వేసింది. విదేశీ బూచిని
చూపించడం పదే పదే చేయసాగింది. మీడియాపై మరిన్ని ఆంక్షలు విధించింది.
పలువురు ముఖ్య నాయకులు అజ్ఞాతంలో ఉండి
పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూన్ 25న అర్థరాత్రి విధించిన ఎమర్జెన్సీ వార్త ప్రముఖ పత్రికలలో రాకుండా ఉండేందుకు
కూడా ప్రభుత్వం విద్యుత్ సరఫరా ఆపుచేసే చర్యలకు పూనుకుందని ఆరోపణలొచ్చాయి. సంబంధిత
అధికారులకు అలాంటి ఆదేశాలు అందాయని 'షా'
కమీషన్ ముందు తరువాత సాక్ష్యాలిచ్చిన వారున్నారు. క్రమంగా అన్ని పత్రికా వార్తలపైనా సెన్సారు
వచ్చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ రాయటానికి వీలులేదు. మీసా వంటి
చట్టాలను కాంగ్రెస్ అధిష్టానం యథేచ్ఛగా తమ కనుకూలంగా వాడుకుంది.
భారత రాజ్యాంగం హమీ ఇచ్చిన వ్యక్తి
స్వాతంత్య్రాన్ని ఇందిరా కాంగ్రెస్ నిలువునా కాలరాచింది. ప్రముఖ నాయకుల ఫోన్‌లను
ట్యాప్ చేయించింది. ప్రభుత్వంలో ఏ హోదాలేని ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ
రాజ్యాంగేతర శక్తిగా అవతరించాడు. ఢిల్లీ నగరంలోని తుర్కమన్‌గేటు, ఇతర ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ఉన్న మురికివాడలను బుల్డోజర్లు పెట్టి
కూల్చివేశారు. అలాగే పేదవాళ్లు ఎక్కువగా పిల్లలను కనడం వల్లనే దేశానికి
సమస్యలొస్తున్నాయని చెప్పి మురికివాడలలో నిర్బంధంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు
చేయించాడు.
ఇందిరా గాంధి విధించిన ఎమర్జెన్సీ
పుణ్యమా అని, 1975-1977 మధ్య కాలంలో,
న్యాయ వ్యవస్థకున్న స్వతంత్ర అధికారాలకు కూడా భంగం
వాటిల్లింది. ‘ముందస్తు నిర్బంధ చట్టాల’ కు అనుగుణంగా అరెస్టు చేయబడి జైళ్లలో
నిర్బంధించిన పౌరుల రాజ్యాంగ పరమైన హక్కులు కాల రాయబడ్డాయి. దరిమిలా హెబియస్
కార్పస్ పిటీషన్ల రూపంలో చాలా మంది డిటెన్యూలు రాష్ట్ర హైకోర్టులను ఆశ్రయించారు.వివిధ
హైకోర్టులు, భిన్నాభిప్రాయాలను వెల్లడించాయి.
రాజ్యాంగపరమైన మౌలిక అంశం ఇమిడి
వున్నందున సమస్య సుప్రీం కోర్టుకు చేరింది. మెజారిటీ న్యాయమూర్తులు ప్రభుత్వ
ఉత్తర్వులకు అనుకూలంగా తీర్పు ఇస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ
అమల్లో వున్నప్పుడు ‘కార్యనిర్వాహక వ్యవస్థ’ దేశాన్ని కాపాడే బాధ్యత
స్వీకరిస్తుందని,
ఆ వ్యవస్థ చేపట్టిన చర్యలు, వ్యక్తి స్వేచ్ఛకు
భంగం కలిగాయనో, మరేదో కారణానో సవాలు చేయడం సరికాదని, ‘వ్యక్తి స్వేచ్ఛ చట్ట పరిధికి లోబడి, నియంత్రించబడి’
వుంటుందని న్యాయ మూర్తులు అన్నారు. స్వేచ్ఛ "చట్టం ఇచ్చిన కానుక"
లాంటిదని, అదే చట్టం ఆ కానుకను వెనక్కు తీసుకోవచ్చునని వారంటారు.
అలనాటి అత్యున్నత న్యాయస్థానం
బెంచిలోని ఐదుగురు న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ ఖన్నా, మిగిలిన నలుగురు
సహచర న్యాయమూర్తుల మెజారిటీ తీర్పుతో ఏకీభవించకుండా ‘హెబియస్ కార్పస్ ఆదేశం’ అనేది
రాజ్యాంగంలో ప్రధానమైన అంతర్భాగమని, అలాంటి ఆదేశాలను ఇచ్చే రాజ్యాంగపరమైన హైకోర్టుల అధికారాన్ని
రద్దుచేసే నిర్ణయాధికారం ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా, రాజ్యాంగం ఎవరికీ
దఖలు చేయలేదని తన తీర్పులో పేర్కొన్నారు.
కంచే చేనును మేసిందని, పౌరుల ప్రాధమిక హక్కులను
పరిరక్షించాల్సిన అత్యున్నత న్యాయస్థానమే(సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా) వాటి
ఉల్లంఘనకు మార్గం సుగమం చేసిందని, దాదాపు పాతికేళ్ల విరామం తర్వాత, జనవరి 2011 మొదటి వారంలో,
ఒక రివ్యూ పిటీషన్లో ఇచ్చిన తీర్పులో అదే అత్యున్నత
న్యాయస్థానం అంగీకరించింది. ‘హెబియస్ కార్పస్ ఆదేశం’ అనేది రాజ్యాంగంలో ప్రధానమైన
అంతర్భాగమని, అలాంటి ఆదేశాలను ఇచ్చే రాజ్యాంగపరమైన హైకోర్టుల అధికారాన్ని రద్దుచేసే
నిర్ణయాధికారం ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా, రాజ్యాంగం ఎవరికీ
దఖలు చేయలేదని, ఖన్నా వెలిబుచ్చిన అభిప్రాయాన్ని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
హఠాత్తుగా, జనవరి 1977 లో ఎన్నికల నిర్ణయం ప్రకటించింది ఇందిరా గాంధీ. ప్రజలపై, ప్రజా శక్తిపై తనకు అపారమైన విశ్వాసం వుందని, మార్చ్ నెలలో ప్రజల నిర్ణయం కొరకు ఎన్నికలు జరుగుతాయని అన్నది. జైళ్లలో
నిర్బంధించిన వారందరినీ విడుదల చేయించింది. ఎమర్జెన్సీ దురాగతాలను ఎదుర్కోవాలని
జైలు నుంచే జయప్రకాష్‌నారాయణ 'సంపూర్ణ విప్లవం' అంటూ ఇచ్చిన పిలుపు దేశ రాజకీయాల దిశను మార్చివేసింది. అప్పటి వరకు చిన్న
చిన్న పార్టీలుగా ఉన్న అనేక పార్టీలన్నీ ఒకే గొడుగుక్రిందకు వచ్చి జనతాపార్టీగా
ఏర్పడ్డాయి. ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఆమె అనుంగు సహచరుడు జగ్జీవన్ రామ్ కూడా
బాంబు పేల్చాడు. ప్రతి పక్షాల సరసన చేరాడు.
లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ
నాయకత్వంలో జనతా పార్టీ ఆవిర్భవించింది. వామపక్షాల మద్దతు కూడా లభించింది.
కాంగ్రెస్‍లోని యంగ్ టర్క్స్ కూడా వారితో జత కట్టారు. నియంతృత్వ పాలనకు స్వస్తి
చెప్పాలని,
మకుటంలేని మహారాణిని ఓడించాలని జనతా పార్టీ ఎన్నికల్లో
పిలుపిచ్చింది. నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య
పోరాటంగా,
జనతా పార్టీ ఓటర్ల ముందుకు పోయింది. మార్చ్ 20, 1977 న జరిగిన లోక సభ ఎన్నికలలో ఇందిరా గాంధీని ఆమె నియోజక వర్గంలోను, ఆమె సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని దేశంలోను దారుణంగా ఓడించారు. ప్రప్రధమ
కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు ఓటర్లు. కలగాపులగం లాంటి కాంగ్రేసేతర
పార్టీల కలయికతో ఏర్పడిన జనతా ప్రభుత్వానికి, ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో ఉప ప్రధాన మంత్రిగా చేసి, ఆ తర్వాత రెండేళ్లు ఆమెచే జైల్లో నిర్బంధించబడిన మొరార్జీ దేశాయ్ ప్రధాన
మంత్రిగా సారధ్యం వహించారు. ప్రజల తీర్పును శిరసావహిస్తానని, ప్రజల సేవలోనే గడుపుతానని అంటూ పదవికి రాజీనామా చేసింది ఇందిరా గాంధీ.
అప్పట్లో వార్తలు వినాలంటే రేడియో
తప్ప వేరే ఆధారం లేదు. అప్పటికే మా స్నేహితుడు, బంధువు భండారు శ్రీనివాస రావు రేడియోలో పనిచేస్తున్నాడు. దూరదర్శన్
వచ్చినప్పటికీ ప్రజాబాహుళ్యానికి ఇంకా అందుబాటులోకి రాలేదు. మేం ఇందిరాగాంధీ తన
నియోజకవర్గంలో ఓటమి పాలైనప్పుడు, సుదీర్ఘంగా ప్రకటించకుండా ఆపిన ఆ ఎన్నికల ఫలితాన్ని, హైదరాబాద్ బాకారంలో
నివాసం వుంటున్న ఒక అద్దె ఇంట్లో తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో విన్నాం. అలా
ఒక అధ్యాయం ముగిసింది భారత దేశ చరిత్రలో!
ఓటమిని
చవిచూసినా, రాజకీయాల నుండి విరమణ తీసుకోలేదు ఇందిరాగాంధీ. ఆమె తరువాత ప్రధాని అయిన
మొరార్జీ దేశాయ్ అవిశ్వాస తీర్మానం కారణంగా రాజీనామా చేయడం, ఆయన స్థానంలో ఇందిర మద్దతుతో చరణ్ సింగ్ ప్రధానిగా పదవిని
చేపట్టడం, రాజీనామా చేయడం, దరిమిలా జరిగిన ఎన్నికల్లో
ఓడిపోవడం తెలిసిన విషయమే. లోక్‌సభ ఎన్నికలలో 529
స్థానలకు గాను 351 స్థానాలు గెలుచుకుని తమ సత్తాను నిరూపించుకున్న ఇందిరాగాంధీ తిరిగి ప్రధాని
అయింది.
ఆపరేషన్
బ్లూ స్టార్ పేరుతో అమృత్‌సర్ లోని గోల్డెన్ టెంపుల్-హర్మందిర్ సాహిబ్ పై జరిగిన
సైనిక దాడికి నిరసనగా, అంగరక్షకులు సత్వంత్ సింగ్,
బియాంత్ సింగ్ లు జరిపిన కాల్పుల్లో ఇందిరా గాంధి హత్యకు గురై 38
సంవత్సరాలు నిండాయి. అక్టోబర్ 31, 1984 న ఐరిష్ టెలివిజన్ కు,
ఇంటర్వ్యూ ఇచ్చేందుకు నివాసంలో నడుచుకుంటూ గేటును సమీపించే సమయంలో,
గేటు వద్ద నున్న అంగరక్షకులు హఠాత్తుగా తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు ఆమె మీద. కొన వూపిరితో
వున్న ఆమెను అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఆసుపత్రికి తరలించగా, తక్షణమే
శస్త్ర చికిత్స చేసి, ఆమె మరణించినట్లు
నిర్ధారించారు వైద్యులు.
జనవరి
1966-మార్చ్ 1977 మధ్య, తరువాత జనవరి 1980-అక్టోబర్
1984 మధ్య సుమారు పదహారేళ్ల పాటు సర్వేపల్లి రాధా
కృష్ణన్, జకీర్ హుస్సేన్, వరాహగిరి
వెంకట గిరి, ఫకృద్దీన్ అలీ అహమ్మద్, నీలం
సంజీవరెడ్డి, జ్ఞానీ జైల్ సింగ్ లు రాష్ట్రపతులుగా
వున్నప్పుడు ప్రధాన మంత్రిగా పనిచేశారు ఇందిరా
గాంధీ. సామ్యవాద, ప్రజాస్వామ్య మార్గంలో
ఆమె నియంతృత్వ పోకడలను పక్కనపెడితే, అలీన ఉద్యమ నాయకురాలిగా, మహిళా ప్రధానిగా, అరుదైన వ్యక్తిత్వం కలదానిగా ప్రపంచ స్థాయిలో ఇందిరాగాంధీకి
ప్రత్యేకమైన గుర్తింపు వున్నదనడంలో మాత్రం సందేహంలేదు.
No comments:
Post a Comment