Saturday, October 22, 2022

తెలంగాణ కిరీటంలో హరిత వజ్రం : వనం జ్వాలా నరసింహారావు

 తెలంగాణ కిరీటంలో హరిత వజ్రం

వనం జ్వాలా నరసింహారావు

మనతెలంగాణ దినపత్రిక (23-10-2022)

దక్షిణ కొరియాలోని జెజు నగరంలో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ పండ్ల తోటల ఉత్పత్తి దారుల సంఘం (ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్- ఎఐపిహెచ్) సదస్సులో హైదరాబాద్ నగరం ప్రతిష్ఠాత్మక వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు-2022ను దక్కించుకోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అందరికన్నా ఎక్కువ సంతోషించడంతో పాటు గర్వంగా ఫీలయి ఉంటారు. హైదరాబాద్ ఈ అవార్డుకు ఎంపికయిన ఏకైక భారతీయ నగరం. అంతేకాదు మొత్తం ఆరు కేటగిరీల్లోను అత్యుత్తమమైనదిగా నిలవడమే కాక, ప్యారిస్, బొగోటా, మెక్సికో సిటీ, మాంట్రియల్, బ్రెజిల్లోని ఫోర్టలెజా నగరాలను ఓడించి ఈ అవార్డును దక్కించుకుంది. హైదరాబాద్ నగరం 'లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ అవార్డు'ను కూడా దక్కించుకుంది.

     ముఖ్యమంత్రి కెసిఆర్ మాటల్లో చెప్పాలంటే ఈ అంతర్జాతీయ అవార్డులు తెలంగాణ, దేశ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేయడమే గాక రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలను నాటడం, పట్టణాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదనడానికి నిదర్శనం. ఈ నెల 14 దక్షిణ కొరియాలోని జెజుదీవుల్లో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయుసిఎన్) సహకారంతో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో హైదరాబాద్ మెట్రో పాలిటన్ అభివృద్ధి సంస్థ (హెచ్ఎండిఎ) అధికారులు ఈ అవార్డును అందుకొన్నారు.

ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చరల్ ప్రొడ్యూసర్ అనేది పళ్ల తోటల ఉత్పత్తిదారులను ప్రోత్సహించడం, అంతర్జాతీయ పూలు, పండ్ల ఉత్సవాలను నిర్వహించడానికి అంకితమైన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ. పూలు, మొక్కలు, పచ్చదనాన్ని అంతర్జాతీయ అజెండాలో ఉంచడం ఈ సంస్థ లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పూలు, అలంకరణ మొక్కలను పెంచే రైతులు ఈ సంస్థలో సభ్యులుగా వున్నారు. ప్రజల జీవితాల్లో మొక్కలకు ఒక స్థానాన్ని కల్పించడమనే లక్ష్యం కోసం వీరంతా పని చేస్తున్నారు.

అవార్డులు, రివార్డుల పరంపరలో భాగంగా హైదరాబాద్ నగరం ఇంతకు ముందు కూడా ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఒ), ఆర్బర్ ఫౌండేషన్ అందజేసిన '2020 ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్', అలాగే '2021 ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ అవార్డును కూడా దక్కించుకున్నది. అంతేకాకుండా మెర్సర్ సంస్థ నిర్వహించిన 'క్వాలిటీ ఆఫ్ లివింగ్ (ఇండియా) ర్యాంకింగ్స్ – 2019' లో కూడా హైదరాబాద్ దేశంలో నివసించడానికి అత్యుత్తమ నగరంగా నిలిచింది.

         హైదరాబాద్ నగరంలో వివిధ పథకాల కింద పెద్ద ఎత్తున చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం వల్లనే ఇదంతా సాధ్యమైంది. రోడ్డు పక్కన మొక్కలను నాటడం, రోడ్ల పక్కన అలాగే రోడ్లమధ్యలో పచ్చదనాన్ని అభివృద్ధి చేయడం, ట్యాంక్ బండ్ ప్లాంటేషన్, అర్బన్ పార్క్ అభివృద్ధి, కాలనీల్లో మొక్కలు నాటడం, పారిశ్రామిక ప్రాంతాల్లో మొక్కలు నాటడం, రెయిన్ గార్డెన్స్, థీమ్ పార్కులు, నర్సరీలు, ప్రజలకు ఉచితంగా పెద్ద ఎత్తున పూలు, అలంకరణ మొక్కలను పంపిణీ చేయడం లాంటివి వీటిలో వున్నాయి.

తెలంగాణలో హరిత హారం అనేది బ్రెజిల్, చైనా తర్వాత ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద అడవుల పెంపకం కార్యక్రమం. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన అయిన దీన్ని రాష్ట్ర ప్రభుత్వం 2015-16 నుంచి ప్రజల భాగస్వామ్యం, అటవీ అధికారుల పర్యవేక్షణ-ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అమలు చేస్తూ వుంది. ఈ వినూత్న కార్యక్రమాన్ని రోజువారీ పర్యవేక్షించడానికి ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి కూడా వున్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 10 శాతం అంటే ఇంతకు ముందువున్న 24 శాతం నుంచి 33 శాతానికి పెంచాలన్నది ఈ కార్యక్రమం ఉద్దేశం. రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలను నాటడంతోపాటు పరిర క్షించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకొంది.

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఈ హరితహారం కృషికి ఇతోధికంగా తోడ్పడుతోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా సామాన్య ప్రజలు మొదలుకొని ప్రముఖుల నుంచి కనీవినీ ఎరుగని స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం స్ఫూర్తితో ఇప్పుడు చాలా మంది స్వచ్ఛందంగా తమ పుట్టిన రోజులాంటి కార్యక్రమాల్లో మొక్కలను నాటడం ఒక అలవాటుగా స్వీకరించారు.

హరిత హారం కార్యక్రమం రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని పచ్చదనాన్ని గణనీయంగా పెంచిందని ఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐ) తన ద్వైవార్షిక 'ఇండియా' స్టేట్ ఆఫ్ ఫారెస్టు రిపోర్టు' లో వెల్లడించింది. హరిత హారం కార్యక్రమంలో భాగంగా దాదాపు కోటి జనాభా కలిగి వున్న హైదరాబాద్ మహా నగరం పెద్ద ఎత్తున మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. గత ఏడేళ్ల కాలంలో దాదాపు 10 కోట్ల మొక్కలను నాటడం ద్వారా నగరంలో పచ్చదనం గణనీయంగా పెరిగింది. హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున చేపట్టిన మొక్కలను నాటే కార్యక్రమం వల్ల పర్యావరణం గణనీయంగా మెరుగుపడడమే కాకుండా సగటు వార్షిక వర్షపాతం కూడా పెరిగింది.

         భూగర్భ జలాల పెరుగుదల, వాయు, శబ్ద కాలుష్యం తగ్గడం కూడా జరిగింది. మొక్కలను నాటే కార్యక్రమం లక్ష్యాన్ని చేరుకోడానికి బహుముఖ వ్యూహాన్ని అమలు చేయడం జరిగింది. బలమైన రాజకీయ చిత్తశుద్ధి, ప్రతి ప్రభుత్వ విభాగాన్ని, స్వచ్ఛంద సంస్థలు (ఎన్ జిఓలు), సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వాములను చేయడం లాంటివి వీటిలో వున్నాయి. ఇళ్లలో నాటడానికి అవసరమైన మొక్కలను కార్పొరేషన్ ఉచితంగా సరఫరా చేసింది. ఇతర రాష్ట్రాలు, దేశాలు ఆదర్శంగా తీసుకునే విధంగా, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, సమాజంలోని ఇతర వర్గాలు తమ వంతు విరాళాలు అందజేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం హరిత నిధిని ఏర్పాటు చేసింది. అలాగే అర్బన్ ఫారెస్ట్రీ విభాగాలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించడం కూడా జరిగింది. జిహెచ్ఎంసిలో ఒక ప్రత్యేక అర్బన్ బయో డైవర్సిటీ విభాగం పనిచేస్తోంది.

         గాలిలో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి హెచ్ఎండిఎ హైదరాబాద్లో నర్సరీలు, మొక్కల పెంపకాన్ని కూడా చేపట్టింది. ప్రధాన ప్రాంతంలో 1350 చెరువులు, హెచ్ఎండిఎ పరిధిలో దాదాపు 3000 చెరువులు కలిగి వున్న హైదరాబాద్ నగర ప్రజలకు పరిశుభ్రమైన, అందమైన వాతావరణాన్ని అందించడానికి కంకణబద్ధమై వుందని ఎఐపిహెచ్ అభిప్రాయపడింది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఈ ఎకో సిస్టమ్ల ద్వారా నగరంలో స్వచ్ఛమైన నీరు, గాలి, మరింత మెరుగైన వాతావరణాన్ని అందించగలదని కూడా ఆ సంస్థ అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ల ద్వారా గాలి నాణ్యత ఎంతగానో మెరుగుపడింది. చిన్న లేఅవుట్ ప్రాంతాలు సైతం ఇప్పుడు దట్టమైన మొక్కలు, పార్కులు, నడక దారులు, విశ్రాంతి తీసుకొనే ప్రాంతాలు, కొన్ని ప్రాంతాల్లో అయితే ఫిట్నెస్ ఏరియాలతో కళకళలాడుతున్నాయి.

హైదరాబాద్ మహా నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు ఒక 'పచ్చల హారం'గా ఉందని ఎఐపిహెచ్ పేర్కొనడం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల విజయవంతానికి ఒక ఉదాహరణ. నగరంలో ఏర్పాటు చేసిన గ్రీన్ కారిడార్లు, అర్బన్ లంగ్ స్పేస్ పార్కులు ప్రజలు విశ్రాంతి తీసుకోడానికి, పర్యావరణ పట్ల అవగాహన పెంచుకోడానికి తోడ్పడుతున్నాయి. సంజీవయ్య పార్కులో అభివృద్ధి చేసిన ఔషధ పార్కు, బటర్ ఫ్లై గార్డెన్, రోజ్ గార్డెన్ లాంటి థీమ్ గార్డెన్లు పర్యావరణ అవగాహనకు కేంద్రాలుగా మారాయి.

హైదరాబాద్ నగరంలో చేపట్టిన మొక్కల పెంపకం కార్యక్రమం ఇతర నగరాలకు ఆదర్శంగా, పర్యావరణ అవగాహనకు కేంద్రంగా మారాయి. హైదరాబాద్ లో చేపట్టిన మొక్కల పెంపకం కార్యక్రమాన్ని సందర్శించడానికి, దాన్ని రాష్ట్రం మొత్తం మీద అమలు చేయడానికి తెలంగాణ అటవీ విభాగం వాటిని సందర్శించడానికి తమ అధికారులను పంపిస్తోంది. హైదరాబాద్ నగరంలో అభివృద్ధి చేసిన పచ్చదనం ఇతర నగరాలకు ఆదర్శంగా మారిందని ఎఐపిహెచ్ అభిప్రాయపడింది. హైదరాబాద్ నగరానికి 'వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు–2022’ దక్కడం ఎంతైనా సముచితం. దీనితో భాగస్వామ్యం కలిగిన ప్రతి ఒక్కరికీ అభినందనలు.

 

No comments:

Post a Comment