Monday, October 10, 2022

‘ముందస్తు రాజీనామాలు’ రాజకీయలబ్ధికే! ..... వనం జ్వాలా నరసింహారావు

 ‘ముందస్తు రాజీనామాలు’ రాజకీయలబ్ధికే!

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (11-10-2022)

తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు మరో పదిహేను నెలలలో జరుగనున్న నేపథ్యంలో, మునుగోడు శాసనసభ సభ్యుడు సుమారు రెండు నెలల క్రితం తన పదవికి రాజీనామా చేయడం, ఖాళీ అయిన ఆ స్థానానికి నవంబర్ 3న ఉపఎన్నిక జరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. జరగబోయే ఈ ఉపఎన్నిక అటు అభ్యర్థులకు, ఇటు ప్రభుత్వానికి అత్యంత వ్యయంతో కూడుకున్న ఎన్నికగా విశ్లేషకులు భావించడం ఆశ్చర్యం కాదేమో!

ఇటీవల కాలంలో, ఎవరి కారణాలు వారికి ఉన్నప్పటికీ, కొందరు గౌరవ చట్టసభ సభ్యులు తమ ఇష్టానుసారం పదవీకాలం పూర్తికాక పూర్వమే సభ్యత్వానికి రాజీనామా చేయడం, తమను గెలిపించిన పార్టీని వదలడం ఒక ఆనవాయితీగా మారింది. ఇలా జరగడం చాలావరకు వ్యక్తిగత కారణాలతోనేనని, రాజకీయ లబ్దికోసమేనని, సిద్ధాంతపరమైన భేదాభిప్రాయాలు కావని, తమను గెలిపించిన పార్టీని వీడుతున్న ఇలాంటివారిలో చాలామంది అక్కడున్నప్పుడు అనేకరకమైన పదవులు అనుభవించారని రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంటున్నారు. సాధారణ ఎన్నికలకు కొద్దినెలల ముందే ఉపఎన్నికలలో గెల్చిన వీరికి ఎక్కువలో ఎక్కువ ఒకటి–రెండుసార్ల కంటే శాసనసభలో కూర్చునే అవకాశం కూడా కలగకపోవచ్చని వీరి అంచనా. అలాంటప్పుడు ఎందుకీ ఆర్థిక భారం అనేది వారి ప్రశ్న.

రాజీనామా చేసిన తరువాత, ఉపఎన్నిక తథ్యమని తేలిన తరువాత, వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రాధాన్యులు, అప్రాధాన్యులు, సిద్ధాంతాలతో ఏమాత్రం నిమిత్తం లేకుండా కేవలం స్వార్ధ ప్రయోజనాల కోసం, పార్టీలు మారడం, కండువాలు కప్పుకోవడం పరిపాటి. ఐదేళ్ల కాలపరిమితికి తమను ఎన్నుకున్న ఓటర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా, ప్రతిష్టాత్మకమైన చట్టసభలకు ఎన్నుకోబడడం అందరికీ లభించని ఒక అసాధారణ గౌరవమని ఏమాత్రం భావించకుండా, మధ్యలోనే అర్ధాంతరంగా రాజీనామా చేయడం అనైతికమనీ, బాధ్యతారాహిత్యమని, అశాస్త్రీయమనీ తెలుసుకోవాలి.

ఓటర్లకు అర్థంకాని మరో విషయం సభ్యత్వానికి రాజీనామా చేసిన వ్యక్తే పార్టీ మారి మళ్లీ అదేచోట, అదే స్థానానికి పోటీకి దిగడం. అలా చేయడంలోని హేతుబద్ధత జవాబులేని ప్రశ్న. సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నామని చెప్పుకునే కొన్ని జాతీయ పార్టీలు రాత్రికి రాత్రే రాజీనామా చేసిన వారికి ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్నిరకాల సభ్యత్వాలు ఇవ్వడమే కాకుండా పోటీలో దిగమని టికెట్ కూడా ఇవ్వడం మరో ఆశ్చర్యకరమైన విషయం. ఒకానొక రోజుల్లో సిద్ధాంతపరమైన పార్టీలలో చేరడానికి, చట్టసభలకు పోటీ చేయడానికి టికెట్ పొందడానికి చాలాకాలం నిరీక్షించాల్సివచ్చేది. అప్పటి నైతిక విలువలకు ఇప్పుడు ఏమాత్రం ప్రాధాన్యత లేనేలేదు. ఇప్పుడు చూస్తున్నదల్లా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని ఎలా ఓడించాలని మాత్రమే!

భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశాలలో చట్ట సభలకు ఎన్నికైనవారు అర్ధాంతరంగా, పదవీకాలం పూర్తికాకముందే రాజీనామా చేయడం, ఫలితంగా అది ఉపఎన్నికలకు దారితీయడం, ప్రభుత్వాల మీదా, పోటీచేస్తున్న వ్యక్తుల, పార్టీల మీదా అమితమైన ఆర్థికభారం పడడం ఎంతవరకు శాస్త్రీయమో ఆలోచించాలి. అసలీ రాజీనామాల విషయంలో స్పష్టమైన నిబంధనలు కాని, సాంప్రదాయాలు కాని, పద్ధతులు కాని, ప్రక్రియలు కాని ఉన్నాయా అని పరిశీలిస్తే ఒక్కో దేశంలో ఒక్కోవిధంగా ఉండడం గమనించాల్సిన విషయం.

భారత రాజ్యాంగ నిర్మాణ స్వరూపం చాలా వరకు, వెస్ట్ మినిస్టర్ నమూనా పార్లమెంటరీ పద్ధతితోనే రూపు దిద్దుకుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనుసరించే భారత, ఇంగ్లాండ్ దేశాలకు, దాదాపు ఒకే రకమైన సంప్రదాయాలు, ప్రక్రియలున్నాయి. బ్రిటీష్ పార్లమెంట్ నియమ–నిబంధనలు, సంప్రదాయాలు భారతదేశం అనుకరించడం జరుగుతున్నప్పటికీ, అ దేశంలో ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు పూర్తికాలం పదవిలో కొనసాగకుండా మధ్యలో రాజీనామా చేయాలనుకున్నప్పుడు, రాజ్యాంగ స్ఫూర్తితో స్పీకర్ తీసుకునే నిర్ణయానికి సంబంధించిన ప్రకరణ మన రాజ్యాంగంలో పొందుపరచకపోవడం బహుశా పొరపాటేమో! ఇంగ్లీష్ పార్లమెంటుకు ఒకసారి ఎన్నికైన వ్యక్తికి, పదవీ కాలం పూర్తవకుండా, లేదా మళ్లీ ఎన్నికలొచ్చేవరకైనా, రాజీనామా చేసే అవకాశం లేనేలేదు.

పదిహేడవ శతాబ్దంలో, రాచరిక వ్యవస్థ నేపథ్యంలో, బ్రిటీష్ పార్లమెంటుకు ఎన్నిక కావడం, సభ్యులుగా ఉండడం అరుదైన గౌరవంగా, ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశంగా భావించినందున ఎవరు రాజీనామా చేసేందుకు ఇష్టపడేవారు కాదు. ఆ అవసరం దృష్ట్యా, ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు వీలుపడకుండా, మార్చ్ 2, 1623న సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. బ్రిటన్‌లో పార్లమెంటు తీర్మానమే రాజ్యాంగం. ఆ తీర్మానమే అమలులో ఉందిప్పటికీ. అక్కడ సభ్యులకు రాజీనామా చేసే అవకాశం లేకపోయినా, సభ్యత్వం నుంచి తొలగడానికి రాజ్యాంగం ఒక పరోక్ష వెసులుబాటు కలిగించింది. ‘రాజీనామా’ బదులుగా ‘పదవీ విరమణ’ చేసే అవకాశం పార్లమెంట్ కలిగించింది. ఈ వెసులుబాటును ఉపయోగించుకున్నవారు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అంటే, రాజీనామా ప్రసక్తే లేదు.

న్యాయశాస్త్ర పరమైన నియమ–నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిద్ధమైన నిబంధనంటూ ఏదీ ఉండాల్సిన అవసరం లేదు. చట్ట ప్రకారం నడుచుకోకపోతే దాని పరిణామాలు ఒక విధంగా ఉంటాయి. సంప్రదాయాలకు అలాంటి ఇబ్బంది లేదు. చట్టాలను సవరించవచ్చు. సంప్రదాయాలను మెరుగుపర్చవచ్చు. ఎంత మంచి సంప్రదాయమైనా చట్టానికి లోబడితేనే దానికి విలువ ఉంటుంది.

భారతదేశంలో చట్టసభలకు ఎన్నికైన సభ్యుల రాజీనామాల విషయంలో, చట్టపరంగా ఎలాంటి అభ్యంతరం లేకపోయినా, అసలుసిసలైన శాస్త్రీయ సాంప్రదాయాలు నెలకొల్పబడలేదు. 75 సంవత్సరాలు గడిచిపోయాయి స్వాతంత్ర్యం వచ్చి. ఎవరూ దీన్ని గురించి పట్టించుకోరు. ఒక వ్యక్తి ఒకేసారి, ఎన్ని స్థానాలకైనా పోటీ చేయవచ్చు. ఒకేసారి లోక్ సభకు, శాసనసభకు పోటీ చేయవచ్చు. గెలిచిన తరువాత ఒక స్థానం ఉంచుకుని మిగిలినవాటికి రాజీనామా చేయవచ్చు. అంటే తక్షణమే ఉపఎన్నికల అవసరం రావచ్చు. అలాగే సభ్యత్వానికి ఎప్పుడంటే అప్పుడు రాజీనామా చేసి ఉపఎన్నికకు దారిచూపవచ్చు. ఇవన్నీ రాజకీయ లబ్దికి ఉపయోగపడేవే. ఆర్థికంగా ప్రభుత్వం మీదా, పోటీచేసేవారి మీదా భారం పడేవే.

ఈ పద్ధతికి స్వస్తి పలకాలి. రాజ్యాంగంలో మార్పులు తేవాలి. చట్టసభలకు ఎవరైనా రాజీనామా చేస్తే ఉపన్నికలకు బదులుగా, మిగిలిపోయిన కాలానికి ఆ వ్యక్తి స్థానంలో సభ్యుడిగా మరొకరిని నియమించే అధికారం స్పీకర్‌కు ఉండాలి. వారి రాజీనామాకు కారణం సభాముఖంగా తెలుసుకునే ప్రయత్నం, లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ స్పీకర్లు చేస్తే బాగుండేదేమో! అలాగే ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయిస్తే తప్ప, ఒక వ్యక్తి ఏకకాలంలో ఒకేఒక్క స్థానానికి పోటీ చేసేవిధంగా చట్టసవరణ తేవాలి. వీలుంటే బ్రిటీష్ సాంప్రదాయం ప్రకారం పూర్తికాలం ముగిసేవరకు ఎన్నికైన సభ్యులకు రాజీనామా చేసే అవకాశం లేకుండా చేయాలి. ఇంతకూ, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అనైతిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు ఆద్యులెవరు? బాధ్యులెవరు? ఆత్మవిమర్శ చేసుకోవడం మంచిదేమో!

No comments:

Post a Comment