Tuesday, October 11, 2022

వైద్యంలో ఒకప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా! ..... వనం జ్వాలా నరసింహారావు

 వైద్యంలో ఒకప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా!

వనం జ్వాలా నరసింహారావు

సాక్షి దినపత్రిక (12-10-2022)

ఇటీవల చిన్న ఆరోగ్య సమస్య వస్తే సంప్రదించడానికి బాగా పరిచయం, వైద్య వృత్తిలో ఐదారు దశాబ్దాలకు పైగా అపారమైన అనుభవం, ఎండీ జనరల్ మెడిసిన్ డిగ్రీ వున్న ఒక సీనియర్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్లాం. డాక్టర్ గారు చాలా విపులంగా పరీక్షచేసి, సమస్యకు నెబ్యులైజర్ వాడమని, ఐదారు రోజులు కొన్ని ఇంజక్షన్లు తీసుకోవాలని సూచించారు. నెబ్యులైజర్ కొనుక్కొని వచ్చి, ఆయనకు చూపించి ఎలావాడాలో నేర్పమని అడిగాం. టెక్నీషియన్లకు మాత్రమే తెలిసిన ఆ నైపుణ్యం ఆయనకు సరిగ్గా తెలియకపోయినా మామీద వున్న అభిమానం కొద్దీ కొంత కుస్తీపడి చూపించారు. ఇంజక్షన్ తననే ఇవ్వమని కోరితే అదెప్పుడో మర్చిపోయానని నవ్వుతూ జవాబిచ్చారు. కాకపొతే బీపీ చూడడం, స్టెత్ పెట్టి చూడడం స్వయంగా చేశారు. బహుశా ఆయన స్పెషలిస్ట్ కాకపోవడంతో ఇవన్నీ చేశారు, చేయగలిగారు. అదే ఏ స్పెషాలిటీ ఆసుపత్రికో కన్సల్టేషన్ కు పోతే ఆ అనుభవమే వేరు. రోగి వంటిమీద ఏ స్పెషలిస్టయినా చెయ్యి వేయడం కాని, స్టెత్ పెట్టి చూడడం కాని సాధారణంగా ఉత్పన్నం కానేకాదు.

పరిస్థితి అంతగా మెరుగు పడక పోవడంతో స్పెషలిస్టును సంప్రదించాలనుకున్నాం. స్పెషలిస్టుల అప్పాయింట్మెంట్ దొరకడం, కలవడం ఒక ప్రహసనం. భారీ మొత్తంలో కన్సల్టేషన్ ఫీజ్ చెల్లించుకుని, గంటలకొద్దీ వెయిట్ చేసి, బయటనే పారామెడికల్ వ్యక్తితో బీపీ, సాచ్యురేషన్, బరువు ఇత్యాదులు చూపించుకుని, స్పెషలిస్టును కలిసీ కలవడంతోనే సమస్య విని, తక్షణమే ఖరీదైన డయాగ్నాస్టిక్ పరీక్షలు చేయించాలి అంటారు చాలామంది. అవి ఏకం కావచ్చు లేదా అనేకం కావచ్చు. స్పెషలిస్టు చెప్పిన పరీక్షలలో కొన్ని ఆపాటికే చేయించుకున్నా, వాటిని పరిశీలించకుండా, తాను పనిచేస్తున్న ఆసుపత్రిలో కాని, తాను చెప్పిన డయాగ్నాస్టిక్ సెంటర్లో కాని మళ్లీ చేయించుకోమని అంటాడు.

డాక్టర్ ఖర్చు కంటే ఆ ఖర్చే ఇబ్బడి ముబ్బడిగా వుంటుంది. రిపోర్టులు వచ్చిన తరువాత చాలామంది స్పెషలిస్టులు పూర్తిగా వాటి ఆధారంగా చికిత్స మొదలు పెట్టడమే కాని క్లినికల్ గా కోరిలేట్ చేసుకోవడం ఆరుదేమో అనాలి. పెద్ద-పెద్ద సూపర్ స్పెషలిస్టుల దగ్గర, వాళ్లు చూడడానికి ముందు ఒక సహాయక డాక్టర్ రోగి వివరాలు తీసుకుంటారు. ఆ వివరాల మీదా, రేడియాలజీ, పాథాలజీ పరీక్షల రిపోర్టుల మీదా ఆధారపడి సాగుతున్నది ఆధునిక వైద్యం. ఇలా అందరు చేస్తారా అంటే, చేయకపోవచ్చు. ఇది మంచిదా కాదా అంటే జవాబు చెప్పగలిగేవారు ఆ రంగానికి చెందిన నిపుణులు మాత్రమే.     

వైద్యరంగంలో వచ్చిన, వస్తున్న పెనుమార్పులు, అభివృద్ధి ప్రతిఒక్కరూ హృదయపూర్వకంగా ఆహ్వానించాల్సిందే కాని, వాటి మరో కోణం కొంత ఆందోళనకు దారితీస్తుంది అనడం తప్పుకాదేమో! ఒకప్పుడు కేవలం ఎంబీబీఎస్ చదువుతో ఆపి ప్రభుత్వ ఉద్యోగమో, ప్రయివేట్ ప్రాక్టీసో చేసుకునేవారు. ఎక్కువలో ఎక్కువ జనరల్ మెడిసిన్, లేదా జనరల్ సర్జరీ చదివేవారు. వారిదగ్గరికి పోయిన రోగికి చికిత్స చేసే క్రమంలో రోగి నాడి చూడడం దగ్గరనుండి, స్టెతస్కోప్ వంటిమీద పెట్టి రోగ నిర్ధారణ చేయడంతో సహా, బీపీ చూడడం, అవసరమైన వారికి స్వయంగా ఇంజక్షన్ ఇవ్వడం, కట్టు కట్టడం లాంటి అనేకమైన వాటిని డాక్టర్ స్వయంగా చేసేవాడు. రోగికి ఎంతో తృప్తి కలిగేది. వారే అన్ని రకాల శస్త్ర చికిత్సలు చేసేవారు. ఎప్పుడైతే స్పెషలిస్టులు వైద్యరంగంలో పెరిగిపోసాగారో, ఒక్కోరుగ్మతకు ఒక్కో డాక్టర్ అవసరం పెరగసాగింది. ఎవరో సరదాగా అన్నట్లు కుడి కంటికి ఒక స్పెషలిస్టు, ఎడమ కంటికి మరో స్పెషలిస్టు, కుడికాలికి ఒకరు, ఎడమకాలికి ఒకరు, కుడి చేతికి ఒకరు, ఎడమ చేతికి ఒకరు అవసరమౌతున్నదీరోజుల్లో. స్పెషలిస్టులతో పాటు పారామెడికల్ సిబ్బంది సంఖ్య పెరగసాగింది.

ఈ నేపధ్యంలో, ఎంబీబీఎస్ మాత్రమే తప్ప అదనపు స్పెషలిస్ట్ క్వాలిఫికేషన్ లేని ప్రజా వైద్యుడు, 50-60 సంవత్సరాల క్రితమే వృత్తిపరంగా రోగుల అన్నిరకాల రుగ్మతలకు తన అనుభవాన్ని ఆసాంతం రంగరించి చికిత్స చేసిన మహామనీషి, ఖమ్మం జిల్లా వాసి, మాజీ రాజ్యసభ సభ్యుడు, స్వర్గీయ డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి (వైఆర్కే) అనుభవం నుంచి ప్రతి వైద్యుడూ నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. ఆయన ప్రయివేట్ ప్రాక్టీసు చేసినప్పుడు చికిత్సా విధానం ఎలా ఉండేదో నేను గ్రంధస్తం చేసిన ఆయన జీవిత చరిత్ర “అనుభవాలే అధ్యాయాలుగా” పుస్తకంలో వివరంగా వుంది.

ఖమ్మం పట్టణానికి రాధాకృష్ణమూర్తి వచ్చి, డాక్టర్‍గా ప్రాక్టీస్ ప్రారంభించిన అచిరకాలంలోనే, వైద్య వృత్తిలో వృత్తిపరమైన నైపుణ్యం కల ప్రజావైద్యుడిగా మంచి పేరు వచ్చింది. ఆయన ప్రాక్టీసు చేస్తున్న రోజుల్లో, "స్పెషలిస్టు" డాక్టర్లంటూ ఎక్కువ మంది లేరు. అధికశాతం జనరల్ ప్రాక్టీషనర్లే. ఎంబిబిఎస్ ఉత్తీర్ణులైన వారే, తాము చదువుకున్న రోజుల్లో నేర్చుకొనేటప్పుడే, అన్నిరకాల వైద్యం చేయడానికి అవసరమైన ప్రతి విషయంలోను అంతో-ఇంతో నైపుణ్యం అలవరచుకునే వారు. అలానే సాధ్యమైనంత వరకు, అప్పటి మెడికల్ ప్రొఫెసర్లు, వీరికి జనరల్ ప్రాక్టీషనర్లకు కావాల్సిన నైపుణ్యం, కష్టపడడం, ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా విజ్ఞానాన్ని పెంపొందించు కోవడం లాంటివి బోధించేవారు. రాధాకృష్ణమూర్తి గారు కూడా విద్యార్ధి దశలోనే అలా ప్రతి విషయాన్ని ఆసక్తిగా నేర్చుకునేవారు.

వైఆర్కే ఖమ్మంలో వైద్య వృత్తి ఆరంభించిన నాటి రోజులకు, ఇప్పటికి, చికిత్సా విధానంలోను, రోగ నిర్ధారణలోను, నివారణలోను, శస్త్ర చికిత్సా పద్దతులలోను గణనీయమైన మార్పులు వచ్చినప్పటికీ, అప్పుడు నేర్చుకుని ఆచరించిన పద్దతుల ద్వారా కూడా మెరుగైన చికిత్సను అందించగలిగామన్న తృప్తి వుండేదని ఆయన భావన, నమ్మకం. ప్రముఖులతో సహా పలువురికి, ఆయన, అప్పటికున్న సదుపాయాల ఆధారంగానే, ట్రాన్సిల్స్ ఆపరేషన్ చేశారు. బహుశా ఖమ్మం పట్టణంలో మొదటి ట్రాన్సిల్ ఆపరేషన్ చేసింది ఆయనేనేమో! సాధారణ ఆపరేషన్‍కు అప్పట్లో అయ్యే ఖర్చు కేవలం రు. 25 మాత్రమే. అలాగే వేసెక్టమీ ఆపరేషన్లు ఖమ్మంలో ప్రారంభించిది కూడా యలమంచిలి రాధాకృష్ణమూర్తి గారే.

డాక్టర్ రాధాకృష్ణమూర్తి చేసిన ఆపరేషన్లలో, ఈ రోజుల్లో స్పెషలిస్ట్ వైద్యులు మాత్రమే చేస్తున్న హైడ్రోసిల్, హెర్నియా, అపెండిసైటిస్, ఫ్రాక్చర్స్, ట్యూమర్ లాంటివి కూడా వున్నాయి. ఏ ఆపరేషన్ చేసినా, ఆయనకు ఎప్పుడూ, ఏ విధమైన క్లిష్ట సమస్యలు ఎదురు పడలేదు. సాధారణంగా మెడికల్ పరమైన చికిత్సలనే ఎక్కువగా చేపట్టేవారు. ఇప్పటిలాగా ఐడ్రాప్స్ కాకుండా కంట్లో నలకపడితే తీసే విధానం వుండేదప్పట్లో. సులభమైన మౌలిక సూత్రాలకు అనుగుణంగా చికిత్సా విధానం వుండేది. అనుభవం ప్రాతిపదికగా రోగ నిర్ధారణ నైపుణ్యం అలవరచుకునే వారు వైద్యులు. నిపుణుల ద్వారా చికిత్స చేయించాల్సిన అవసరముంటే, అరుదుగా విజయవాడకో, హైదరాబాద్‍కో రోగులను పంపేవారు. అక్కడ కూడా ఎక్కువమంది స్పెషలిస్ట్ వైద్యులు వుండకపోయేవారు. ఎక్స్-రే వాడకం ఇంకా అలవాటు కాలేదప్పట్లో. సీటీ స్కానులు, ఎంఆర్ఐలు, పెట్ స్కానులు అసలే లేవు. రోగ నిర్ధారణ కొరకు ఇప్పటి మాదిరిగా రక్త, మల, మూత్ర పరీక్షలు అంతగా లేవప్పుడు. సీబిపి కాని, మైక్రోస్కోపిక్ పరీక్షలు కాని, ఎక్స్-రే సౌకర్యం కాని లేవు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి స్థాయి పెంచిన తరువాత, 1960 దశకంలో లో నర్సింగ్ హోంలు ఆరంభం కావడం ప్రారంభం అయిన తరువాత, స్పెషలిస్టుల రాక మొదలైంది.

రోగ నిర్ధారణ పరీక్షలు చేసే వసతి లేకుండా మెడికల్ ప్రాక్టీస్ చేయడం అంత తేలికైన విషయం కాకపోయినా చేయక తప్పని పరిస్థితులుండేవి అప్పట్లో. ధనుర్వాతంలాంటి జబ్బులొస్తే, ఆ రోగికి చికిత్స చేయడానికి, డాక్టర్లెవరు ముందుకు రాని రోజులవి. అలా చేయడం సాహసంతో కూడుకున్న పని. డాక్టర్ రాధాకృష్ణమూర్తి రిస్క్ తీసుకోవాలనుకుని ధైర్యంగా అలాంటి కేసులను చేపట్టి, విజయవంతంగా నయం చేసిన సందర్భాలెన్నో వున్నాయి. అలానే క్షయ వ్యాధికి సంబంధించిన కేసులను డాక్టర్లు అంత తేలిగ్గా చికిత్స చేయడానికి ఆసక్తి చూపక పోయేవారు. స్ట్రెప్టోమైసిన్ మందులివ్వడమే టీబీ చికిత్సకు అప్పట్లో వున్న ఒకే ఒక చికిత్సా విధానం. ఇప్పుడైతే రకరకాల మందులొచ్చాయి.

మల్టీ డ్రగ్స్ చికిత్సా విధానంతో పాటు, అవి వాడినందువల్ల రోగ నిరోధక శక్తికూడా శరీరానికి తగ్గసాగింది. ఇప్పుడు కొత్తగా వస్తున్న అన్నిరకాల మందులు క్రిములకు అలవాటుపడిపోతున్నాయి. "డ్రగ్ రెజిస్టెన్స్" మూలాన అవి పనిచేయకుండా పోతున్నాయి. "మల్టీ డ్రగ్ రెజిస్టెన్స్" ఒక సమస్యగా తయారైంది. అప్పట్లో క్షయ వ్యాధి చికిత్సకు ఒక క్రమ పద్ధతి అవలంబించారు రాధాకృష్ణమూర్తి గారు. ప్రపంచ వ్యాప్తంగా అవలంబించే "ఆర్టిఫిషల్ న్యూమో థొరాక్స్" అనే విధానం ద్వారా, ఊపిరి తిత్తులను "కొలాప్స్" చేసే పద్ధతి పాటించేవారు. ఒక ఊపిరి తిత్తి చుట్టూ వుండే (స్పేస్) ప్రదేశంలోకి గాలిని పంపి, "కొలాప్స్" చేసి, దానికి విశ్రాంతినిచ్చి, మరో దాన్ని నయం చేసేవారు. ఊపిరితిత్తి మచ్చ వుంటే, గాలిని పొట్టలో నింపి, పైకి తన్ని "న్యూమో పెరిటోనియం" చికిత్స చేసేవారు. అప్పట్లో సరైన ఆ విధానాన్ని ఇప్పుడు ఎవరూ ఉపయోగించడం లేదని డాక్టర్ అనేవారు.

విరిగిన ఎముకలను బాగు చేయించుకోవడానికి ఆయన దగ్గరకు అనేక మంది వచ్చే వారు. జనరల్ మెడికల్ ప్రాక్టీస్ చేసే డాక్టర్లు ఆ కేసులను సాధారణంగా ఒప్పుకోరు. అలాంటి వారికి ప్లాస్టర్ వేసి బాగు చేయడం డాక్టర్ రాధాకృష్ణమూర్తి గారు ఒక ప్రత్యేక నైపుణ్యంగా అలవరచుకున్నారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో నేర్చుకున్న దానిని, మరింత పదును పెట్టడానికి, నిరంతర అధ్యయనం చేసేవారాయన. విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో నిర్వహించే మెడికల్ ఎడ్యుకేషన్ తరగతులకు హాజరై తన వృత్తి నైపుణ్యాన్ని ఆధునీకరించుకునేవారు. అలా చేస్తూ, ఒంటి చేత్తో ఎన్నో కేసులను నయం చేసేవారు. అదనంగా తన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి వివిధ మెడికల్ జర్నల్స్ లో ప్రచురించబడే వ్యాసాలను అధ్యయనం చేసేవారు.

ఇంకా కొంచెం వెనక్కు పొతే, ఆర్ఎంపీల ప్రాక్టీసు చేసిన రోజులు జ్ఞప్తికి వస్తాయి. నా చిన్నతనంలో, మా గ్రామంలో ఎవరికైనా "సుస్తీ" చేస్తే, వైద్యం చేయడానికి, వూళ్లో వున్న నాటు వైద్యుడే దిక్కు. నాటు వైద్యులలో అల్లోపతి వారు, హోమియోపతి వారు. ఆయుర్వేదం వారు, పాము-తేలు మంత్రాలు వచ్చిన వాళ్లు, మూలిక వైద్యులు, ఇలా అన్ని రకాల వాళ్లు వుండేవారు. ఎవరికి ఏ సుస్తీ చేసినా వాళ్లే గతి. వారిలో కొందరికి ఇంజక్షన్లు ఇచ్చి వైద్యం చేసే అలవాటుండేది. జ్వరాలకు (ఎక్కువగా ఇన్ ఫ్లు ఎంజా, మలేరియా-చలి జ్వరం) ఏ.పీ.సీ టాబ్లెట్లు ఇచ్చేవారు. ఒక సీసాలో (ఆర్ఎంపీ) డాక్టర్ ఇంట్లో తయారు చేసిన "రంగు నీళ్లు" కూడా ఇచ్చేవాడు. తగ్గితే వైద్యుడి హస్తవాసి, లేకపోతే, రోగి కర్మ అనుకునేవారు ఆ రోజుల్లో.

గ్రామాలలో "గత్తర" (కలరా), "స్పోటకం-పాటకం" (స్మాల్ పాక్స్) వ్యాధులు తరచుగా వస్తుండేవి. వీటికి తోడు "దద్దులు", "వంచెలు" కూడా చిన్న పిల్లలకు పోసేవి. ఇవి రాకుండా ముందస్తు నివారణ చర్యగా కలరా ఇంజక్షన్లు చేయడానికి, "టీకాలు" వేయడానికి ప్రభుత్వ వైద్యుల బృందం గ్రామంలోకి వచ్చేది. ఇప్పుడైతే స్మాల్ పాక్స్ పూర్తిగా నిర్మూలించబడింది. కలరా కూడా దాదాపు నిర్మూలించబడినట్లే.

         వూళ్లో ఏవైనా సీరియస్ కేసులు వుంటే, ఎడ్ల బండిలోనో, మేనాలోనో తీసుకుని సమీపంలోని పట్టణానికి పోయే వాళ్లు. వారి వెంట (ఆర్ఎంపీ) డాక్టర్ కూడా వెళ్లేవాడు. ఐతే, అక్కడ కూడా ఆ రోజుల్లో ఎం.బి.బి.ఎస్ డాక్టర్లు ఎక్కువగా లేరు. కొందరు ఆర్.ఎం.పి డాక్టర్లు కూడా చిన్న-చిన్న నర్సింగ్ హోంలు పెట్టి వైద్యం చేసేవారు. ఆపరేషన్లు కూడా వాళ్ళే చేసేవారు.

ఇప్పుడైతే ప్రతిచోటా వందలాది మంది ఎం.బి.బి.ఎస్ డాక్టర్లు, స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు, మల్టీ సూపర్ స్పెషలిస్టులు, వందల-వేల నర్సింగ్ హోంలు, సూపర్ స్పెషాలిటీ- మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వాటికి దీటుగా, మరింత మెరుగ్గా ప్రభుత్వ రంగంలో, వివిధ అంచెలలో అన్నిరకాల వైద్యసేవలు, అందరికీ ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసి వైద్యం అందరికీ అందుబాటులోకి తేవడం జరుగుతున్నది. డయాగ్నాస్టిక్ పరీక్షలన్నీ ప్రభుత్వ పరంగా అన్ని స్థాయి ఆసుపత్రులలో ఉచితంగా లభ్యమవుతున్నాయి. ఆద్యతన భవిష్యత్తులో, బహుశా క్వాలిఫైడ్ డాక్టర్ లేని గ్రామం వుండదంటే అతిశయోక్తి కాదేమో! అయినా ఎక్కడో, ఎందుకో, ఏదో కానరాని వెలితి!!!

No comments:

Post a Comment