మంధర దుర్బోధ
వనం జ్వాలా నరసింహారావు
భక్తి పత్రిక మేనెల, 2024
(శివధనస్సును ఎక్కుపెట్టి శ్రీరాముడు సీతను గెలుచుకున్నాడు.
సీతాకల్యాణం కమనీయంగా జరిగింది. అటుపై పరశురాముడు అందించిన విష్ణు ధనువునూ
ఎక్కుపెట్టాడు. దశరథుడు జరపదల్చుకున్న శ్రీరామపట్టాభిషేకం కైక వరాల కారణంగా
వాయిదాపడింది. మంధర చేసిన దుర్బోధ శ్రీరామ వనవాసానికి నాంది పలికింది.)
సీతా కల్యాణం అనంతరం బ్రహ్మర్షి విశ్వామిత్రుడు హిమాలయాలకు వెళ్లిపోయాడు.
దశరథుడు, కొడుకులు, కోడళ్లు పరివారంతో కలిసి అయోధ్యకు ప్రయాణమయ్యారు. దారిలో గండ్రగొడ్డలిని
ధరించి పరశురాముడు కోపంగా వచ్చాడు. శ్రీరాముడిని సమీపించి, శివుడి విల్లు విరిచిన నీ
బలాన్ని స్వయంగా పరీక్షించాలని వచ్చానన్నాడు, తన దగ్గర వున్న విష్ణువు
విల్లును ఎక్కుబెట్టి, క్షత్రియ వంశంలో పుట్టిన రాముడు తనబలం నిరూపించుకోవాలని చెప్పాడు.
అలా రాముడు చేయగలిగితే ఆయనతో ద్వంద్వ యుద్ధంచేస్తానని అన్నాడు. పరశురాముడు రెండు విల్లుల
వృత్తాంతం కూడా చెప్పాడు.
కోపం తెచ్చుకున్న శ్రీరామచంద్రమూర్తి వెంటనే వింటిని లాగి, ఎక్కుపెట్టాడు. ఒక బాణాన్ని సంధించాడు,
కానీ పరశురాముడు తన గురువైన విశ్వామిత్రుడి
బంధువైనందున, అతడిమీద బాణాన్ని ప్రయోగించడానికి
మనసొప్పుకోవడంలేదని అన్నాడు. ప్రత్యామ్నాయంగా, పరశురాముడు ఎంతమాత్రం
నడవ లేకుండా, ఒక దిక్కున పడే విధంగా అతడి కాళ్ల గమనవేగాన్నిగానీ,
లేదా, ఆయన తపస్సు చేసి సంపాదించిన పుణ్యలోకాలనుగానీ,
తన బాణంతో ఖండిస్తాననీ, ఏది కావాలో కోరుకొమ్మనీ
అవకాశం ఇచ్చాడు. విష్ణు సంబంధమైన బాణం కనుక సంధించిన తర్వాత వ్యర్థంగా పోదని, సార్థకంగా లక్ష్యాన్ని భేదించిన తర్వాతే శాంతిస్తుందని, దేనిని
ఖండించాలో చెప్పమని అంటాడు. బాణాన్ని విడిచి, తన కీర్తిని నాశనం చేయమని పరశురాముడు చెప్పాడు. శ్రీరాముడు అలాగే చేసిన తరువాత పరశురాముడు ఆయనకు ప్రదక్షిణ చేసి మహేంద్ర పర్వతానికి వెళ్లిపోయాడు.
పట్టాభిషేకానికి ఏర్పాట్లు
దశరథుడి బృందం అయోధ్యకు చేరుకున్నది. కొంతకాలానికి తండ్రి
ఆజ్ఞ ప్రకారం శత్రుఘ్నుడితో కలిసి, భరతుడు మేనమామ ఇంటికి వెళ్లాడు. అయోధ్యలోనే వున్న శ్రీరామచంద్రమూర్తి,
తమ్ముడు లక్ష్మణుడుతో కలిసి,
తండ్రి ఆజ్ఞ ప్రకారం
ప్రజలకు మేలైన, సంతోషకరమైన కార్యాలను చేస్తుండేవాడు. ఈ నేపధ్యంలో, శ్రీరాముడిని అయోధ్యా రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేయాలని దశరథుడు ఆలోచించాడు. మంత్రులతో ఆలోచించి నిర్ణయం
తీసుకుందామని నిశ్చయించుకుంటాడు. యోగ్యుడు,
సమర్థుడు, ఎదిగినవాడైన కుమారుడు, వుండగా ఇంకా రాజ్యభారం వహించడం ధర్మం కాదని భావించాడు దశరథుడు. అయితే తన
తదుపరి కొడుకును ఇష్ట ప్రకారం పట్టాభిషేకం చేసే అధికారం తనకి లేదని, రాజ్యం
ప్రజలదని, రాజ్యాన్ని
పరిపాలించే శక్తి ఎవరికి కలదో, వానినే, పట్టాభిషిక్తుడిని చేసే అధికారం ప్రజల కుందని దశరథుడు అనుకుంటాడు.
ఆలోచన చేసేందుకు, సామంతులను, మంత్రులను, గ్రామాలలో వుండేవారిని కూడా పిలిపించి దశరథుడు వారిని
సంప్రదించాడు. అందరూ ముక్తకంఠంతో మేలు-మేలు అని, బాగు-బాగు అని కేకలు వేశారు. దశరథుడిని శ్లాఘించారు. అంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. అలా పౌరుల సమ్మతి తీసుకుని శ్రీరాముడికి
పట్టాభిషేకం చేయాలన్న నిర్ణయానికి దశరథుడు వచ్చాడు. జరగబోయే రామపట్టాభిషేక నిర్ణయాన్ని హర్షిస్తూ ప్రజలు
వాడవాడలా సంబురాలు జరుపుకుంటూ సంతోషంగా, కోలాహలంగా
సందడి చేయసాగారు.
చుప్పనాతి మాటలు
దశరథుడి
ముద్దుల భార్య కైక. ఆమె దాసి అయిన
మంధర, ప్రజల కోలాహాలాన్ని చూసింది. విషయమేమిటని ఒక స్త్రీ మూర్తిని అడిగింది. శ్రీరాముడికి దశరథుడు యౌవరాజ్య
పట్టాభిషేకం చేయనున్నాడని తెలుసుకుని బిరబిరా
కైక వద్దకు పోయింది. శ్రీరామ
పట్టాభిషేక వార్త కైకకు చేరకుండా దశరథుడు జాగ్రత్త పడ్డాడు. తెలిస్తే ఆమె మనస్సులో వికారం కలిగి,
విఘ్నం చేయవచ్చని ఆయన అనుమానం.
శ్రీరాముడి పట్టాభిషేకం జరుగనున్న విషయాన్ని కైకకు
చేరవేస్తూ మంథర, ఆమెలో రాముడి పట్ల లేని
ద్వేషాన్ని కలిగించింది. ఆమెకు ఏమీ తెలియదని,
చెడిపోయే కాలం వచ్చిందని, మౌనంగా వుంటే కీడు కలగవచ్చని రెచ్చగొట్టింది. దశరథుడు శ్రీరాముడికి పట్టాభిషేకం జరిపిస్తే, సమస్తం కైక సవతి కౌసల్యకు ఇస్తే, కైకకు, ఆమె కుమారుడు భరతుడికి అన్యాయం జరుగుతుందని వక్రభాష్యం
చెప్తుంది. అలా మంథర
చెప్పినప్పటికీ, ఆ వార్తను
శుభ వార్తలాగా పరిగణించిన కైక ఆమెకు బహుమానంగా తన మెడలోని బంగారు ఆభారానాన్ని
ఇస్తుంది. తన మాట అర్థం చేసుకోలేదని మంథరకు కోపమొచ్చింది. ఆమె తనకు
ఇచ్చిన సొమ్మును విసిరి పారవేసింది. కైక సంతోషించాల్సిన సమయం కాదు అంటుంది. కైక
మనస్సు చీకాకు పడే మాటలు పదే పదే
చెప్పి, దుర్బోధ
చేసి ఆమె మనసు మార్చింది.
మంథర
చెప్పిందే సరైనదిగా అనిపించింది కైకకు. తన కొడుకుకు
రాజ్యం రావాలని, రాముడికి పట్టాభిషేకం కాకూడదని, తన కొడుకు రాజు కావడానికి
మంచి ఆలోచన, ఉపాయం చెప్పమని అడిగింది.
సమాధానంగా దేవదానవుల యుద్ధాన్ని, ఇంద్రుడు దశరథుడుని
సాయంగా రమ్మన్న సందర్భాన్ని గుర్తు చేసింది మంథర. దశరథుడు రాక్షసుల వల్ల గాయపడి రథం
మీద మూర్ఛపోయినప్పుడు రెండు సార్లు రాక్షసుల బారిన పడకుండా భర్త ప్రాణాన్ని తోడుగా
వున్న కైక కాపాడిన విషయాన్ని, రెండు
సార్లు ప్రాణాపాయం నుంచి కాపాడినందుకు దశరథుడు
ఆమెకు రెండు
వరాలిచ్చినప్పటికీ ఆ వరాలను
అప్పుడు కోరకుండా, ఇష్టం
వచ్చినప్పుడు అడుగుతానంటే, అలాగే
కానిమ్మని దశరథుడు అన్న మాటలను
గుర్తుచేసింది మంథర. వాటిని ఇప్పుడు అడగమని, చెపుతూ, ఏం అడగాలో కూడా
తెలియచేసింది. మంథరను మెచ్చుకున్న కైక కోప గృహంలో ప్రవేశించింది.
కైకమ్మ వరాలు
శ్రీరాముడి
పట్టాభిషేక వార్త కైకకు చెప్పాలనుకున్న
దశరథుడు ఆమె అంతఃపురంలోకి
ప్రవేశించాడు. ఆమె కోప గృహంలో వుందని విని, అక్కడికి వెళ్లి, కైక కోపానికి
కారణం అడిగాడు. తన కోరిక తీరుస్తానని దశరథుడు ప్రమాణం చేసిన తరువాత, గతంలో భర్త తనకు ఇచ్చిన వరాల విషయాన్ని
జ్ఞాపకం చేసుకోమని, అవి ఇప్పుడు కావాలని
అంటుంది. శ్రీరాముడికి దశరథుడు చేస్తున్న పట్టాభిషేక ప్రయత్నం నిలిపి,
దానికి బదులుగా తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేయమని, శ్రీ రామచంద్రుడు నార చీరెలు
కట్టుకుని, పద్నాలుగు సంవత్సరాలు దండకారణ్యంలో తిరగాలని,
రెండు వరాలను కోరుకున్నది.
కైకేయి
మాటలను విన్న దశరథుడు, వెంటనే మూర్ఛపోయాడు.
అతి కష్టం మీద తెలివి తెచ్చుకుని గుండెలు చెదిరేలా దుఃఖించాడు. కైకను పరిపరి
విధాలుగా దూషించాడు. రఘు వంశాన్ని నాశనం చేయడానికే వచ్చిందనీ,
చెడ్డ పని తలపెట్టిందనీ, ఎలా తాను
శ్రీరామచంద్రుడిని అడవులకు పొమ్మని ఆజ్ఞాపించగలననీ,
వరాలు ఉపసంహరించుకోమనీ వేడుకున్నాడు. అతడి మాటలను ఆక్షేపిస్తూ కైక, వరాలు ఇస్తానని ప్రమాణం చేసి,
తనను నమ్మించి,
అవి ఇవ్వడానికి వగలమారి ఏడుపులతో మోసగిద్దామనుకోవడం మంచిది కాదని అన్న కైకతో దశరథుడు
న్యాయ నిష్టూరాలు ఆడాడు. శ్రీరాముడు అరణ్యానికి పోతే తన మరణం సంభవించడం తథ్యమని కూడా అన్నాడు.
దశరథుడు
అనదల్చుకున్న మాటలన్నీ అన్న తరువాత మెత్తని
మాటలతో కైకను బతిమిలాడాడు. తనకు వరాలిస్తానని
ప్రమాణం చేసిన దశరథుడిని
ధర్మమేంటో ఆలోచించమన్నది. చేసిన
ప్రమాణం తీర్చడం ధర్మమో, తీర్చకుండా వుండడం ధర్మమో ఆలోచించమన్నది. సత్యం తప్పవద్దని బోధించింది. ధర్మం
విడుస్తాడో, శ్రీరాముడిని
విడుస్తాడో తేల్చుకోవాలన్నది. తనకిచ్చిన ప్రమాణం
తక్షణమే నెరవేర్చకపోతే, భర్త పాదాల మీద పడి,
ప్రాణాలు తీసుకుంటానని బెదిరించింది. దశరథుడు ఏం చేయాలో తోచక కలత చెందాడు. ఇవేమీ తెలియని వశిష్ఠుడు, రాజు
వుండే అంతఃపురానికి వెళ్లగానే, దశరథుడికి
ఆయన రాక గురించి మంత్రి
సుమంత్రుడికి తెలియచేసి, శ్రీరామ పట్టాభిషేక కార్యం
నెరవేర్చమని అంటాడు.
వనవాసానికి ఏర్పాట్లు
వెంటనే కైక, దశరథ మహారాజు
రమ్మంటున్నారని చెప్పి శ్రీరామచంద్రుడిని అక్కడికి
పిలుచుకురమ్మని సుమంత్రుడికి
చెప్పింది. ఆ విషయం సుమంత్రుడు చెప్పగానే, లక్ష్మణ సహితంగా బయల్దేరి,
అంతఃపురంలోకి వెళ్లాడు శ్రీరాముడు. దశరథుడి
పరిస్థితి చూసి విచారపడ్డాడు. అప్పుడు
రాముడికి కైక తన వరాల సంగతిని చెప్పింది. తండ్రి
మాట పాలించదల్చుకుంటే, తన వరాలను
నెరవేర్చమన్నది. పద్నాలుగేండ్లు అరణ్యాలలో సంచరించడానికి
తక్షణమే బయల్దేరాలని చెప్పింది. ఆయన
అభిషేకానికై సిద్ధపరిచిన సామాగ్రి
అంతా భరతుడికి ఇవ్వాలనీ చెప్పింది. వెంటనే రాముడు, తాను జడలు ధరించి,
నార వస్త్రాలు కట్టుకుని, భయంకరమైన
అడవులకు పోయి, తండ్రి మాటలు యథార్థం చేస్తానన్నాడు. తనకు తండ్రి ఆజ్ఞ ఎలాంటిదో తల్లి ఆజ్ఞ
కూడా అలాంటిదేనన్నాడు.
అడవులకు
పోవడానికి సిద్ధపడ్డ శ్రీరాముడు, తండ్రికి
ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. కైకకూ నమస్కారం
చేశాడు. తల్లి కౌసల్య ఆజ్ఞ, సమ్మతి తీసుకుని సీతా
లక్ష్మణ సమేతంగా పద్నాలుగేళ్ల వనవాసానికి పోవడానికి
పూర్వం శ్రీరాముడు మరోసారి తండ్రి దశరథుడి వద్దకు వెళ్లాడు. శ్రీరాముడు
తనను వదలి పోతున్నాడనే బాధతో, దుఃఖంతో,
గుండె చెదరిన దశరథుడు, కొడుకును
కౌగలించుకుని, శవంలాగా కాళ్లు చేతులాడించకుండా నేల మీద
పడిపోయాడు.సుమంత్రుడు తోలుతున్న రథం ఎక్కి అడవులకు బయల్దేరారు సీతారామలక్ష్మణులు.
(ఆంధ్ర వాల్మీకి వాసుదాసుగారి రామాయణం మందరం
ఆధారంగా)
No comments:
Post a Comment