వాకాటక వంశం (బ్రాహ్మణ రాజులు-21)
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(06-05-2024)
దక్షిణ భారత
దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన శకం ప్రారంభానికి మూడవ శతాబ్దిలోని మధ్యకాలం గుర్తుగా
నిలిచి వున్నది. నాలుగున్నర శతాబ్దాల కాలం దక్షిణ భారతదేశంలోని విశాల ప్రాంతం మీద
రాజ్యాధికారం వహించిన శాతవాహనులు ఈ కాలంలోనే చారిత్రిక రంగం నుండి అదృశ్యులయ్యారు.
శాతవాహన రాజులలో నాల్గవ పులమావి పతనానంతరం అతడి ఆధిపత్యంలో వున్న వివిధ
రాష్ట్రాలలో పలు చిన్న రాజ్యాలు ఆవిర్భవించాయి. శాతవాహనుల అనంతరం హైదరాబాద్ రాజ్య
దక్షిణ ప్రాంతంలో శకులు రాజ్యాధికారానికి వచ్చినట్లు తెలుస్తున్నది. అయితే
శాతవాహనుల పతనానంతరం రాజ్యాదిపత్యానికి వచ్చిన వంశీయులలో వాకాటకులను పురాణాలు
ఉటంకించక పోవడం వింతగా గోచరిస్తున్నది. శాతవాహనుల అనంతరం వచ్చిన కిలకిల, కోలికిల రాజుల అనంతరం వాకాటకులకు చెందిన
వింధ్యశక్తి రాజ్యాదిపత్యానికి వచ్చినట్లు పురాణాలలో కనిపిస్తున్నది.
చరిత్రకు తెలిసినంతవరకు వాకాటక వంశీయులలో
ఒకటవ వింధ్యశక్తి మొట్టమొదటి రాజు. వాకాటక వంశానికి ఇతడు పతాకమని, ద్విజుడని వర్ణించబడినాడు. ద్విజుడు అంటే
బ్రాహ్మణుడు. విష్ణువృద్ధ అనేది వాకాటకుల గోత్రం. వింధ్యశక్తి అంతకు పూర్వం
శాతవాహనుల కింద ఒక అధికార హోదాలో వుండేవాడు. అలా, అలా, ఇతడు రాజ్యాధికారానికి ఎదిగాడు. బహుశః
వింధ్యశక్తి స్వస్థలం వల్లూరుకు దగ్గరిలో మధ్య దక్కన్ లో వుండి వుండవచ్చును. అజంతా
శాసనం వింధ్యశక్తిని కొనియాడింది. ఇతడి రాజ్యం వింధ్య పర్వతాల దాకా విస్తరించి
వుండేది. శాసనాల ఆధారంగా అర్థమయ్యే విషయం ఒకటుంది. బహుశః వింధ్యశక్తికి
లాంఛనప్రాయంగా పట్టాభిషేకం జరగలేదనేది. కాకపోతే ఇది నమ్మదగినదిగా లేదు. ఇతడు
క్రీస్తుశకం 250-270 మధ్య కాలంలో పాలించి వుండవచ్చు.
ఒకటవ వింధ్యశక్తి అనంతరం సింహాసనాన్ని
అధిష్టించిన ఒకటవ ప్రవరసేనుడు ఈ వంశంలో చాలా ప్రఖ్యాతుడు. ఇతడు తన రాజ్యాన్ని
నాల్గు దిక్కులకు విస్తరింప చేశాడు. యుద్ధాలలో విజయం సాధించిన ఇతడు తన రాజధానిని
పురికాకు మార్చాడు. ఇది సాత్పూరా పర్వత శ్రేణుల దిగువన వున్నది. ఒకటవ ప్రవరసేనుడు
దైవ భక్తి కలవాడు. వేదపరాయణుడు. ఇతడు అనేక యజ్ఞాలను చేశాడు. ఇతడికి సామ్రాట్ అనే బిరుదు
వచ్చింది. ధర్మమహారాజు అనే బిరుదు కూడా వున్నది. అనేక విజయాలను నమోదు చేసుకోవడం
వల్ల ఒకటవ ప్రవరసేనుడు దక్కన్ లో తన రాజ్యాదిపత్యాన్ని ప్రకటించుకున్నాడు. తన
స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు ఉత్తర భారత దేశీయులతో వైవాహిక సంబంధాలు
ఏర్పరుచుకున్నాడు. ఇతడు క్రీస్తుశకం 270 నుండి క్రీస్తుశకం 330 వరకు 60 సంవత్సరాలు
సుదీర్ఘంగా పాలన చేశాడు. ఇతడి మరణానంతరం అతడి విశాల సామ్రాజ్యం అతడి నలుగురు
కొడుకులకు విభాగించబడిందని అంటారు.
ఒకటవ ప్రవరసేనుడి కంటే ముందుగానే అతడి
పెద్ద కొడుకు గౌతమపుత్ర మరణించాడు. అందువల్ల క్రీస్తుశకం 330 లో అతడి మనుమడు ఒకటవ
రుద్రసేనుడు రాజ్యాభిషిక్తుడయ్యాడు. ఇతడు మహాభైరవుడి ఉగ్రభక్తుడు. ఒకటవ
రుద్రసేనుడు సముద్రగుప్తుడి సమకాలికుడు. వాకాటక ప్రదానశాఖకు చెందిన ఒకటవ
రుద్రసేనుడి అధికారానికి, గౌరవానికి
గుప్త విజయాలు పెద్ద దెబ్బగా పరిణమించాయి. అనేకమంది రాజులు వాకాటక
రాజ్యాదిపత్యాన్ని వదిలి గుప్త చక్రవర్తికి లొంగిపోయారు. ఒకటవ రుద్రసేనుడి
సామ్రాజ్యం చాలా తగ్గిపోయనప్పటికీ, అతడు తన
స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకుని, గుప్తచక్రవర్తికి
లొంగిపోలేదు.
క్రీస్తుశకం 350 లో ఒకటవ రుద్రసేనుడి
కుమారుడు మొదటి పృథ్వీసేనుడు రాజయ్యాడు. ఇతడు మహేశ్వరుడికి గొప్ప భక్తుడు.
నీతిమంతుడు. దానశీలుడు. ఆత్మనిగ్రహం కలవాడు. వీరుడు. రాజకీయవేత్త. ఇతడు పూర్తిగా
శాంతి విధానాన్ని అవలంభించాడు. అహర్నిశలూ తన రాజ్య సుస్థిరతకు పాటుబడేవాడు. ఇతడు
క్రీస్తుశకం 400 వరకు సుదీర్ఘ కాలం సుమారు 50 సంవత్సరాలు పాలించాడు. మొదటి
పృథ్వీసేనుడు కాలంలో వాకాటకుల రాజధాని నాగపూర్ కు 20 మైళ్ల దూరంలో వున్న రామ్టెక్
దగ్గరలోని నందివర్ధన్ కు మార్చబడింది.
మొదటి పృథ్వీసేనుడి అనంతరం అతడి
కుమారుడు, రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడి అల్లుడైన, రెండవ రుద్రసేనుడు
రాజ్యాభిషిక్తుడయ్యాడు. ఇతడు చక్రపాణికి భక్తుడు. ఇతడు రాజ్యానికి వచ్చిన
కొద్దికాలానికే క్రీస్తుశకం 405 లో మరణించాడు. కేవలం 5 సంవత్సరాలే పాలించాడు.
ఆ తరువాత రెండవ రుద్రసేనుడి కుమారులు దివాకరసేనుడు,
దామోదరసేనుడు ఒకరి తరువాత మరొకరు రాజ్యం చేశారు. దివాకరసేనుడు బాల్యంలోనే
రాజయ్యాడు. అతడు అల్పాయుష్కుడు. అతడి మరణానంతరం క్రీస్తుశకం 420 లో దామోదరసేనుడు
పట్టాభిషిక్తుడయ్యాడు. తన పూర్వీకుడైన ప్రవరసేనుడి పేరు పెట్టుకున్నాడితడు. ఇతడు
క్రీస్తుశకం 450 వరకు 30 సంవత్సరాలు పాలించాడు. ఇతడు తన పేరుమీద ప్రవరపురం అనే ఒక
నగరాన్ని నిర్మించి రాజధానిని అక్కడికి మార్చాడు. విదర్భలోని వార్ధా జిల్లాలో
వున్న పవనార్ పేనార్ ప్రవరపురం ఒక్కటే. ఇతడు శంభుదేవుడి భక్తుడు. అయినప్పటికీ
శ్రీరాముడిని కీర్తిస్తూ సేతుబంధ కావ్యాన్ని రచించాడు.
రెండవ ప్రవరసేనుడి తరువాత అతడి కుమారుడు
నరేంద్రసేనుడు క్రీస్తుశకం 450 లో రాజ్యానికి వచ్చాడు. అజిత భట్టారిక అనే కుంతల
దేశ రాకుమారిని నరేంద్రసేనుడు వివాహం చేసుకున్నాడు. రాజ్యాభిషిక్తుడైనప్పుడు యుక్త
వయస్కుడైన నరేంద్రసేనుడు సుమారు 20 సంవత్సరాలు క్రీస్తుశకం 470 వరకు రాజ్యపాలన
చేశాడు. ఇతడి పాలనాంతర కాలంలో వాకాటక రాజ్యం మీద నలరాజు భవదట్ట దండయాత్ర చేశాడు.
నరేంద్రసేనుడు అతడిని ఓడించాడు. ఆ తరువాత కాలంలో నల వంశీయులు ప్రతీకారంగా వాకాటక
రాజ్యంలోని పలు ప్రాంతాలను ఆక్రమించుకున్నారు.
నరేంద్రసేనుడి తరువాత రెండవ పృథ్వీసేనుడు
రాజ్యానికి వచ్చాడు. ఇతడు విష్ణు భక్తుడు. ఇతడి ఏకైక పుత్రిక మహాదేవి విష్ణుకుండిన
రెండవ మాధవ వర్మను వివాహం చేసుకోవడం వల్ల వాకాటక రాజ్యం, విష్ణుకుండిన రాజ్యంలో విలీనం అయింది.
సమర్థవంతులైన పాలకులు, జ్ఞానవంతులైన
రాజ్య నిర్వాహకులు, కళా సాహిత్య
పోషకులైన అనేకమంది ప్రఖ్యాత రాజులను ఈ వాకాటక శాఖ సృష్టించింది.
సమాంతరంగా వాకాటక వంశీయులకు చెందిన
వత్సగుల్మ శాఖ రాజులు అధికారంలోకి వచ్చారు. వారిలో సర్వసేనుడు, వింధ్యసేనుడు లేదా రెండవ వింధ్యశక్తి, రెండవ ప్రవరసేనుడు, దేవసేనుడు, హరిసేనుడు
వున్నారు. హరిసేనుడే ఈ శాకకు చెందినంతవరకు చివరి రాజు.
గొప్ప వాకాటక సామ్రాజ్యం అకస్మాత్తుగా విచ్చిన్నం
కావడానికి కారణాలను చరిత్రలో భద్రపర్చలేదు.
(స్వర్గీయ
బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)
No comments:
Post a Comment