Sunday, May 26, 2024

అల్లసాని పెద్దనామాత్య రాసిన మనుచరిత్ర కథాసంగ్రహం : వనం జ్వాలా నరసింహారావు

 అల్లసాని పెద్దనామాత్య రాసిన మనుచరిత్ర కథాసంగ్రహం

వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (27-05-2024)

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో, ఆయన భువనవిజయ అష్టదిగ్గజాలలో పేరొందిన పెద్ద కవీంద్రుడు అల్లసాని పెద్దనామాత్యుడు. ఆయనే “ఆంధ్ర కవితా పితామహుడు” అన్న బిరుదు కలవాడు. ఏదైనా మంచి ప్రబంధ కావ్యం రచించి లోకానికి పరమోపదేశం చేయాలని భావించిన అల్లసాని పెద్దన్న మనుచరిత్ర రచన చేశాడు. సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలు ఈ గ్రంథానికి కృతిపతి. కృతిని అందుకొనే సమయంలో పెద్దన ఎక్కిన పల్లకిని తన చేత్తో లేవనెత్తి రాయలు ఆయన పట్ల తన గౌరవాన్ని ప్రదర్శించాడు.

స్వారోచిషమనువు జన్మ వృత్తాంతం ఇతిహాసంగా రచించబడిన మార్కండేయ పురాణం ఆధారంగా అల్లసాని మనుచరిత్ర రాశాడని అంటారు. మనుచరిత్రలోని ప్రతిపదం ‘అల్లసానివాని అల్లికజిగిబిగి అన్న మాటను సార్థకపరుస్తున్నది. పెద్దన మనుచరిత్ర రచనానంతరం అనేక ప్రబంధాలు దానికి ప్రతిరూపాలుగా వచ్చాయి. శ్రీకృష్ణదేవరాయలు కృతి రచించమని అల్లసానిని కోరినప్పుడు పెద్దన్నగారు ఈ పద్యం చెప్పారని అంటారు.

"నిరుపహతి స్థలంబు, రమణీప్రియ దూతిక తెచ్చి యిచ్చు క

ప్పుర విడె మాత్మ కింపైన భోజన ముయ్యెల మంచ మొప్పు త

ప్పరయు రసజ్ఞు లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్

దొరకని గాక ఊరక కృతుల్ రచియింపుమనంగ శక్యమే!"

ఇల్లాలికి ఇష్టురాలైన చెలికత్తె (రమణీప్రియదూతిక) ప్రియమారగా తెచ్చి ఇచ్చే కర్పూర తాంబూలం (కప్పురవిడెము) ఉండాలి. మనసుకు నచ్చిన (ఆత్మకింపైన) భోజనమూ, భోజనం చేశాక కర్పూర తాంబూలం వేసుకొని విలాసంగా ఊగడానికొక ఉయ్యాలమంచం ఉండాలి. తాను చెప్పే కవిత్వంలో తప్పొప్పులు చూడగలిగే రసజ్ఞులూ, కవి ఊహను ముందుగానే తెలుసుకోగల వారూ అయిన ఉత్తమలేఖకులూ, ఉత్తమపాఠకులూ దొరకాలి. వీళ్ళందరూ దొరికినప్పుడే కానీ ఊరికే కృతులు రచించమంటే కుదురుతుందా (శక్యమే)? కుదరదు అంటున్నాడు అల్లసాని పెద్దన. అల్లసాని పెద్దన చెప్పిన ఈ పద్యం తెలియని సాహిత్యోపజీవులు తెలుగునాట దుర్లభులనే చెప్పొచ్చు. మనుచరిత్ర అనగానే అందరికీ గుర్తొచ్చే పద్యాలు, అర్థం తెలిసినా తెలియకపోయినా, చదవగానే (వినగానే) "ఓహో!" అనిపించే పద్యాలు:

“అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ

పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన

స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్

గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్”

“ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ ఒంటి చరించె దోటలే

కివ్వనభూమి భూసురుడ నే ప్రవరాఖ్యుడ త్రోవతప్పితిన్‌

క్రొవ్వున నిన్నగాగ్రమునకున్‌ చనుదెంచి పురంబుచేర నిం

కెవ్విధి కాంతు తెల్పగదవే తెరువెద్ది శుభంబు నీకగున్‌”

“ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ఏ

కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లా

గింతియ కాక నీవెరుగవే మునువచ్చిన త్రోవచొప్పు నీ

కింత భయంబులే కడుగ నెల్లిదమైతిమె మాటలేటికిన్”

           ఇక మనుచరిత్ర కథ విషయానికొస్తే......ఆర్యావర్త దేశంలో, వరణానది ఒడ్డున, అరుణాస్పదం అనే ఒక పురం వున్నది. ఆ పురంలో ప్రవరాఖ్యుడు అనే సద్బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు. ఆయన వేదవేదాంగ పారంగతుడు. ధనికుడు. సఛ్చీలుడు. ఆయన భార్య సోమిదమ్మ భర్తకు అన్ని విధాల అనుకూలవతి. ప్రవరుడికి అతిథి పూజ అంటే పరమానందం. భర్త ఆనందానికి అనుగుణంగా ఆయన భార్య సోమిదమ్మ ఎంతమంది అతిథులు వచ్చినా వంటచేసి వడ్డించడానికి వెరువదు. అతిథులు అర్థరాత్రి వచ్చినా మహానందంతో వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తుంది.

         ఇలా వుండగా ఒకనాడు ఒక సిద్ధుడు వారింటికి అతిథిగా వచ్చాడు. ఆయనకు సకలోపచారాలు చేసిన తరువాత, ఆయన ఎక్కడెక్కడ తిరిగాడని, ఎక్కడి నుండి ఎక్కడికి పోతున్నాడని ప్రశ్నించాడు ప్రవరుడు. అయన చూడని ప్రదేశం లేదని చెప్పి అదంతా తన దగ్గరున్న పాదలేపం మహిమని చెప్పాడు. ప్రవరుడి ప్రార్థనను మన్నించి సిద్ధుడు ఆయనకు ఆ పసరు ఇచ్చి పాదాలకు పూసాడు. తక్షణమే ప్రవరుడు హిమగిరిని చూడాలనుకోవడం, వెంటనే అక్కడికి పోయి నిలవడం జరిగింది. అక్కడ అనేక దివ్యస్థలాలను చూసి మధ్యాహ్నానికల్లా ఇంటికి పోదామని అనుకున్నాడు. అయితే ఆయన కాలికున్న పసరు హిమాలయాల మంచుకు కరిగిపోవడం వల్ల ఎగరలేకపోయాడు. దిగులుతో ఏంచేయాలో తోచక అటూ-ఇటూ తిరగసాగాడు.

         ఇంతలో సమీపంలో ఆయనకొక గంధర్వ రమణి వీణ వాయిస్తూ కనిపించింది. ఆమె ఎవరని అడిగి, తన విషయం చెప్పి, తనకు ఇంటికి పోవడానికి దారి చూపమని కోరాడు ప్రవరుడు. అతడిమీద ఆపాటికే మది తగిలిన ఆమె, తన పేరు వరూధిని అనీ, తన చెలికత్తెలతో అక్కడు వుంటున్నాననీ, తన ఇంటికి రమ్మనీ, విందు ఆరగించమనీ అన్నది. తానక్కడ వుండడానికి వీలులేదని, అగ్నిహోత్రాది కర్మకాండలు చేయాలని, తనను ఇంటికి పంపే ఏర్పాటు చేయమని కోరాడు ప్రవరుడు. అక్కడే వుండిపోయి తనను కూడి సుఖించమని వరూధిని కోరినప్పటికీ ప్రవరుడు అంగీకరించలేదు. ఆయన తిరస్కారానికి వరూధిని భంగపడ్డది, బాధ పడింది, కోపం తెచ్చుకున్నది. కళ్లల్లో నీరు తెచ్చుకుంటూ, వరూధిని, ప్రవరుడి మీద పడి కౌగలించుకొని పెదవులను నొక్కడానికి ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాన్ని కొనసాగనీయకుండా ప్రవరుడు ఆమెను తోసాడు. ఆమె తనకు జరిగిన పరాభవానికి దుఃఖించింది. చివరకు ఆమెను వదిలి ప్రవరుడు ఏదో విధంగా స్వస్థలానికి చేరుకున్నాడు.

         ఇదిలా వుండగా, అంతకు పూర్వం నుండి వరూధినిని మోహించి తిరస్కారానికి గురైన గంధర్వుడు ఒకడు, ఈ వృత్తాంతాన్ని ఆసాంతం గమనించి ప్రవరుడి రూపంలో ఆమెను చేరాడు. వరూధిని అతడిని చూసి నిజమైన ప్రవరుడనే భావించింది. కాసేపు అసలైన ప్రవరుడి లాగానే వరూధిని అంటే ఇష్టంలేనట్లు ప్రవర్తించాడు. చివరకు కొన్ని నిబంధనలు పెట్టి ఆమె పొందుకు అంగీకరించాడు. ఆ తరువాత వారిద్దరూ చిరకాలం సుఖాలను అనుభవించారు. వరూధిని గర్భవతి అయింది. తనకు పాదలేపనం ఇచ్చిన సిద్ధుడు కనిపించాడని అబద్ధం చెప్పి వరూధినిని ఒప్పించి, ఆమె దగ్గర సెలవు తీసుకొని, తన మార్గాన తాను పోయాడు ప్రవరుడి రూపంలో వున్న గంధర్వుడు. వరూదినికి అసలు విషయం తెలియదు.  

         ఒక శుభ ముహూర్తాన వరూధిని చక్కటి కుమారుడిని కన్నది. అతడికి స్వరోచి అని పేరు పెట్టింది. సకల విద్యలు నేర్పించింది. అతడు ఆ ప్రాంతంలో రాజ్యపాలన చేయసాగాడు. ఒకనాడు ఒక మహారణ్యానికి వేటకు పోయాడు సైన్యంతో. ఆ సమయంలో ఒక దుర్మార్గుడైన రాక్షసుడు ఒక అనాథ రమణిని బాధించడం చూసాడు. ఆమె గురించిన విషయాలు తెలసుకున్నాడు. ఒక ముని శాపం వల్ల తన చెలికత్తెలు క్షయ రోగం పాలయ్యారని, తనను ఒక రాక్షసుడు వెంటాడుతున్నాడని ఆమె చెప్పింది. తానొక గంధర్వ కన్యను అన్నది. తాను ఇందీవరాక్షుడు అనే గంధర్వుడి కుమార్తె మనోరమను అని చెప్పింది. తనకు తెలిసిన ‘అస్త్రహృదయం అనే విద్యను స్వరోచికి నేర్పింది. దాని సహాయంతో తనను వెంబడిస్తున్న రాక్షసుడిని చంపమన్నది. స్వరోచి రాక్షసుడిని చంపాడు. అతడి దేహం నుండి ఒక దివ్య తేజస్సు వెలువడింది. తాను శాపవశాన వున్న ఇందీవరాక్షుడు అనే గంధర్వుడిని అన్నాడు. తనకు, తన కూతురుకు చేసిన మహోపకారం కారణాన ఆయుర్వేద విద్యను నేర్పుతానని, తన కూతురు మనోరమను ఇచ్చి వివాహం చేస్తానని అన్నాడు స్వరోచితో. ఇరువురి అంగీకారంతో వారి పెళ్లి జరిగింది.

         తనకు తెలిసన ఆయుర్వేద విద్య ద్వారా మనోరమ చెలికత్తెలకు చికిత్స చేసాడు స్వరోచి. వారికి వారి పూర్వ సౌందర్యం వచ్చింది. వారిద్దరిని కూడా స్వరోచి వివాహం చేసుకున్నాడు. ఆ ముగ్గురితో స్వరోచి చాలా కాలం సుఖంగా జీవించాడు. ఆ తరువాత ఆ అరణ్యంలోని వనదేవత కోరిక మీద ఆమెను కూడా వివాహం చేసుకున్నాడు స్వరోచి. కొన్ని దినాలకు స్వరోచి ద్వారా వనదేవత గర్భం దాల్చింది. నవమాసాలు నిండిన తరువాత ఒక చక్కటి కుమారుడిని కన్నది. స్వారోచిషుడు అనే పేరుకల ఆ బాలుడు యుక్తసమయంలో శ్రీహరిని గురించి తపస్సు చేసాడు. శ్రీహరి ప్రత్యక్షమై, భూలోకంలో ధర్మాన్ని రక్షించమని, రెండవ మనువై పాలించమని ఆదేశించాడు స్వారోచిషుడిని. ఆయన అలాగే చేసి చివరకు శ్రీహరిలో ఐక్యం అయ్యాడు.   

         (వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ ప్రచురించిన మనుచరిత్రము ఆధారంగా)

No comments:

Post a Comment