ప్రతీహారవంశం, పాలవంశం (బ్రాహ్మణ రాజులు-24, 25)
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(20-05-2024)
ప్రతీహారవంశం
భారత దేశంలోని రాజపుత్ర స్థానాన్ని పాలించిన రాజవంశాలలో ప్రతీహార వంశం
ప్రముఖమైనది. హరిశ్చంద్రుడు అనే బ్రాహ్మణుడు ఈ రాజ్యస్థాపకుడు. ఈ వంశంలో చివరివాడు
శీలుకుడు. ఇది తరువాత కాలంలో గొప్ప శక్తి సమన్వితమైన రాజ్యంగా రూపుదిద్దుకున్నది.
ప్రతీహార వంశానికి చెందిన రాజులు వివిధ ప్రాంతాలలో ముఖ్యంగా ప్రాగ్దక్షిణ
ప్రదేశాలలో చిన్న చిన్న రాజ్యాలను స్థాపించుకుని పాలించారు. కొందరేమో లాట దేశంలోని
నందిపురి రాజధానిగా దక్షిణ భాగాన్ని ఏలారు. ఘూర్జర రాజ్యాన్ని ప్రతీహార వంశానికి
చెందిన ప్రధానమైన శాఖ వారు పాలించినట్లు కూడా ఆధారాలున్నాయి. ప్రధాన శాఖకు చెందిన
ప్రతీహార ప్రభువులు జోధ్పూర్ రాజధానిగా పాలన చేశారు. ప్రతీహార వంశీయుడైన నాల్గవ
వత్సరాజు జాలార్, అవంతీ
రాజ్యాలను పాలించినట్లు ఆధారాలున్నాయి. నాల్గవ వత్సరాజు, అతడి పూర్వీకులు ఉజ్జయినీ
నగరాన్ని రాజధానిగా చేసుకొని పాలించారు.
ప్రతీహార వంశం క్రీస్తుశకం 8 వ శతాబ్ది
ప్రథమార్థంలో ప్రాముఖ్యంలోకి వచ్చింది. నాగభట్టు అనే ప్రతీహార ప్రభువు
మ్లేచ్చరాజును ఎదిరించి ఓడించాడు. ఇతడే మొదటి నాగభట్టు. ఇతడు భారతావని మీద
దండెత్తి వచ్చిన అరబ్బు రాజులను కూడా ఓడించాడు. మొదటి నాగభట్టు ప్రాక్ ప్రతీహార
శాఖకు చెందినవాడు. మొదటి నాగభట్టు క్రీస్తుశకం 730 నుండి క్రీస్తుశకం 756 వరకు
సుమారు 27 సంవత్సరాలు పాలించినట్లు ఆధారాలున్నాయి. మొదటి నాగభట్టు సైన్యాన్ని
సమీకరించుకొని, మాళవము, రాజపుత్ర
స్థానం, ఘూర్జరము లోని
కొన్ని ప్రాంతాలను జయించి శక్తి సమన్వితమైన ప్రతీహార రాజ్యాన్ని ఏర్పాటు
చేసుకున్నాడు. నాగభట్టు భారత జాతి గర్వించదగ్గ మహారాజు. విదేశీయుల దాడులను
అరికట్టి గొప్ప జాతీయ నాయకుడిగా ప్రసిద్ధికెక్కాడు.
మొదటి నాగభట్టు అనంతరం అతడి సోదరుడి
కుమారులు కక్కుకియా, దేవరాజు
అనేవారు ఒకరి తరువాత ఒకరు రాజ్యపాలన చేశారు. దేవరాజు కుమారుడు వత్సరాజు చారిత్రిక
పురుషుడు. గొప్ప బలవంతుడు. శక్తిమంతుడైన రాజు. ఇతడు రణహస్తి వత్సరాజుగా
ప్రఖ్యాతుడు. వత్సరాజు తన రాజ్యానికి ఉత్తర దిశలో వున్న భూభాగాన్ని, మధ్య రాజపుత్ర స్థానాన్ని పాలించాడు. భండి
తెగవారి నుండి వారి రాజ్యాన్ని వత్సరాజు బలవంతంగా గ్రహించాడు. వత్సరాజు గౌడ
ప్రభువును కూడా జయించాడు. వత్సరాజు ఉత్తరాపథంలోని అనేక రాజ్యాలను జయించి మహా
సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు.
వత్సరాజు మరణానంతరం అతడి కుమారుడు రెండవ
నాగభట్టు ప్రతీహార రాజ్యాదిపత్యాన్ని వహించాడు. ఇతడు అనేక రాజ్యాలను జయించి తన
రాజ్యాన్ని వృద్ధి చేసుకున్నాడు. అనేక గిరి దుర్గాలను కూడా స్వాధీన పర్చుకున్నాడు.
రెండవ నాగభట్టు అనేక విజయాలను సాధించినప్పటికీ, చివరకు
రాష్ట్రకూటాన్వయుల చేతిలో పరాజితుడయ్యాడు. విశాల సామ్రాజ్య నిర్మాణానికి
ప్రయత్నించిన ప్రతీహార రెండవ నాగభట్టు కోరిక కలగా మిగిలిపోయింది. రాష్ట్రకూటులతో రెండవ
నాగభట్టు యుద్ధంలో ఓడిపోయినప్పటికీ, అతడు
అజ్ఞాతవాసిగా జీవిస్తూ, తిరిగి
రాజ్యాన్ని సంపాదించి, ప్రతీహార
సామ్రాజ్యంలోని కొన్ని భాగాలను పాలించాడు. ఇతడు క్రీస్తుశకం 833 వరకు పాలించాడు.
రెండవ నాగభట్టు అనంతరం, అతడి కుమారుడు
రామభద్రుడు సింహాసాన్ని అధిష్టించి కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే పాలించాడు. ఇతడు
పిరికివాడు. యుద్ధంలో వెనుకంజ వేసేవాడు. పరిపాలనా పటిమ లేనివాడు. విశాల ప్రతీహార
రాజ్యంలోని అధిక భూభాగాన్ని ఇతడు యుద్ధాలలో కోల్పోవాల్సి వచ్చింది. ఇతడు ఆదరణ
కోల్పోయి కేవలం నామ మాత్రపు ప్రభువుగా కొనసాగాడు. రామభద్రుడి పాలనాకాలం
క్రీస్తుశకం 833-835.
రామభద్రుడి కుమారుడు భోజుడు బాల్యం నుండే
సమస్త విద్యలలో ఆరితేరి తండ్రి మరణానంతరం ప్రతీహార సింహాసనం అధిష్టించాడు.
శత్రువుల హస్తగతమై వున్న కన్యాకుబ్జాన్ని భోజరాజు జయించి తన రాజధానిగా
చేసుకొన్నాడు. శత్రురాజుల వశమై పోయిన రామభద్రుడి కాలంలో దానం ఇచ్చిన అగ్రహారాలను
భోజరాజు పునరుద్ధరించాడు. భోజుడు రాజ్యాధికారం వహించిన తరువాత అనేక రాజ్యాలను
జయించి పూర్వ ప్రతీహార రాజ్యాన్ని పునరుద్ధరించాడు. అయితే పాల వంశీయుడైన దేవపాలుడు
ప్రతీహార రాజ్యం మీద దండెత్తి భోజుడిని ఓడించాడు. భోజుడు పట్టుదల కలవాడు.
ప్రతిభావంతుడు. అపజయాలను లెక్కచేయకుండా సైన్యాన్ని సమకూర్చుకుని, క్రీస్తుశకం 9 వ శతాబ్దాంతంలో దండయాత్రలు
నిర్వహించి విజయాలు సాధించాడు. ప్రతీహార భోజుడు కడు సమర్థుడు. యుద్ధ విద్యా
విశారదుడు. విశాల సామ్రాజ్యాన్ని తన వారసులకు అప్పచెప్పాడు. క్రీస్తుశకం 855 లో
ఇతడు మరణించాడు.
భోజుడి తరువాత రాజ్యానికి వచ్చిన
ప్రతీహార పాలకులు బలహీనులు, భోగాలాలసులు.
వారి పాలనా కాలంలో మాళవము రాష్ట్రకూటుల స్వాధీనమైపోయింది. కానిభోజుడి అనంతరం
రాజ్యానికి వచ్చిన మొదటి మహేంద్రపాలుడు మాత్రం పూర్వం ప్రతీహార సామ్రాజ్యంలో వున్న
మాళవమును తిరిగి జయించగలిగాడు. యుద్ధాలలో కోల్పోయిన రాజ్య భాగాలు పోగా మిగిలిన
విశాల ప్రతీహార సామ్రాజ్యాన్ని మొదటి మహేంద్రపాలుడు అవిచ్చిన్నంగా పాలించాడు.
తండ్రి ఆర్జించి ఇచ్చిన రాజ్యానికి అదనంగా మహేంద్రపాలుడు అనేక ప్రాంతాలను జయించి
సామ్రాజ్యాన్ని విస్తృతపరచాడు. యితడు క్రీస్తుశకం 885 నుండి క్రీస్తుశకం 908 వరకు
పాలించాడు.
మహేంద్రపాలుడు మరణించిన తరువాత అతడి
కుమారుడు రెండవ భోజుడు ప్రతీహార సామ్రాజ్యాధినేత అయ్యాడు. ఇతడు రాజ్యానికి వచ్చిన
తరువాత సవతి సోదరుడు మహీపాలుడితో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. చివరకు మహీపాలుడు
సింహాసనాన్ని ఆక్రమించాడు. అంతఃకలహాల్లో కూరుకుని బలహీనపడివున్న ప్రతీహార
రాజ్యభాగాలను రాష్ట్రకూటులు ఆక్రమించుకున్నారు. మహీపాలుడు చాళుక్య నరసింహుడి
ధాటికి తట్టుకోలేక పారిపోయి, అలహాబాద్
ప్రాంతంలో తలదాచుకున్నాడు. ఆ తరువాత కాలంలో చెల్లాచెదరైన తన సైన్యాన్ని
సమీకరించుకొని, సామంతులను కూడగట్టుకొని, మహీపాలుడు, ప్రతీహార సామ్రాజ్యాన్ని పునరుద్ధరించుకున్నాడు.
క్రీస్తుశకం 942 వరకు మహీపాలుడు పాలించాడు.
మహీపాలుడి కుమారుడు ఆ తరువాత ఒక ఏడాది మాత్రమే
పాలించాడు. ఆ తరువాత నలుగురు రాజులు సుమారు 15 సంవత్సరాలు పాలించారు. ప్రతీహార
సామ్రాజ్యం రాష్ట్రకూట, పాల వంశీయుల
దండయాత్రల వల్ల క్షీణించ సాగింది. సుమారు ఒక శతాబ్దికాలం మహావైభవంగా అనుభవించిన
ప్రతీహార వంశం, ఉత్తర భారత దేశంలో మహా సామ్రాజ్య స్థాపన చేసిన వంశంగా
ప్రసిద్ధికెక్కింది.
పాలవంశం
శశాంకుడి మరణానంతరం వంగ దేశం శతాబ్దికాలం అరాజక స్థితికి లోనైంది.
దేశంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజల ఆర్ధిక స్థితి అస్తవ్యస్తంగా
తయారైంది. ప్రజలప్పుడు ప్రతిభా సంపన్నుడు, యుద్ధవీరుడు, ధైర్యవంతుడు అయిన గోపాలుని తమ ప్రభువుగా
ఎన్నుకున్నారు. అతడికి సమస్త అధికారాలను అప్పచెప్పారు. గోపాలుడి పేరుమీద పాల వంశం
ఏర్పడినది. పాలవంశ స్థాపకుడైన గోపాల ప్రభువు తాత దైతవిష్ణువు గొప్ప పండితుడు.
రాజానుగ్రహం వున్నవాడు. దైతవిష్ణువు కుమారుడు వస్సత విద్యావంతుడు. క్షాత్ర
విద్యలలో నేర్పరి. భుజబల సంపన్నుడు. ఇతడి కుమారుడు పాలవంశ స్థాపకుడైన గోపాలుడు.
గోపాలుడు క్షాత్ర ధర్మం అవలంభించి
మహావీరుడుగా ప్రశంసింపబడినాడు. గోపాలుడి తాత దైతవిష్ణువు బ్రాహ్మణుడు. వైదికమత
నిరతుడు. గోపాలుడి తరువాత రాజ్యానికి వచ్చిన వారు వైదిక ధర్మంతో పాటు క్షాత్ర
ధర్మం కూడా అవలంభించారు. తరువాత కాలంలో ఈ వంశీయులు క్షత్రియులుగా పరిగణింపబడ్డారు.
మరికొంత కాలానికి ఈ వంశీయులు సూర్య వంశీయులుగాను, సాగర
వంశీయులుగాను పరిగణింపబడ్డారు.
గోపాలరాజు తరువాత పాల రాజ్య సింహాసనాన్ని
అతడి కుమారుడు ధర్మపాలుడు క్రీస్తుశకం 770లో అధిష్టించి సుమారు 40 సంవత్సరాలు
పాలించాడు. పాల రాజ్యాన్ని విస్తరించడానికి ధర్మపాలుడు యువకులను చేర్చుకొని గొప్ప
సైన్యాన్ని సనకూర్చుకున్నాడు. ధర్మపాలుడు ఉత్తరాపథాన్ని జయించిన తరువాత తన
సార్వభౌమత్వాన్ని ప్రకటించుకున్నాడు. ఇతడు ఉత్తర భారతంలో అనేక రాజ్యాలను
జయించినప్పటికీ వాటిని పాల సామ్రాజ్యంలో చేర్చుకోలేదు. అనేక రాజ్యాలను జయించిన
ధర్మపాలుడు ఆ రాజ్యాదిపతులను తన సామంతులుగా స్వీకరించి, వారిని ఆ రాజ్యాలను పాలించడానికి నియమించాడు. అతడు
అంగ, వంగ దేశాలను
మాత్రమే ప్రత్యక్షంగా పాలించాడు. అతడు శతాధిక యుద్ధాలను చేసిన మహాశూరుడు. అజేయ
పరాక్రముడు. సామాన్యంగా వున్న పాల రాజ్యాన్ని మహా సామ్రాజ్యంగా రూపొందించి వంగ
దేశానికి సమున్నత స్థానాన్ని కలిగించాడు. ఇతడు క్రీస్తుశకం 810 లో మరణించాడు.
ధర్మపాలుడి అనంతరం అతడి కుమారుడు
దేవపాలుడు రాజ్యాధిపతి అయ్యాడు. ఇతడు కూడా శూరుడు. సమర్థుడైన పాలకుడు. తండ్రి
సంపాదించి ఇచ్చిన మహా సామ్రాజ్యానికి అదనంగా కొన్ని ప్రాంతాలను జయించి విశాల భూ
భాగాన్ని అతి వైభవంగా పాలించాడు. దేవపాలుడు అనేక దండయాత్రలు చేసి విజయాలు
సాధించాడు. ప్రతీహార వంశీయుల ఆధిపత్యాన్ని నశింపచేసి, పాలరాజ వంశ ప్రతిష్టను
పెంపొందించి, ఉత్తర భారతంలో ప్రముఖ వ్యక్తిగా దేవపాలుడు కీర్తించబడ్డాడు.
దేవపాలుడి పాలనా కాలం క్రీస్తుశకం 810-850.
దేవపాలుడి అనంతరం విగ్రహపాలుడు పాల
రాజ్యాధినేత అయ్యాడు. ఇతడు కేవలం నాలుగు సంవత్సరాలే పాలించాడు. విగ్రహపాలుడు
సన్యాసై రాజ్యాన్ని త్యజించిన తరువాత అతడి కుమారుడు నారాయణ పాలుడు పాల రాజ్య
సింహాసనాన్ని క్రీస్తుశకం 854 లో అధిష్టించి సుదీర్ఘ కాలం పాలించాడు. కాని ఇతడు
రాజ్యంలోని అధిక భాగాలను కోల్పోయాడు. నారాయణ పాలుడు శాంతి కాముకుడు. తత్త్వ
జిజ్ఞాసాపరుడు. ఇతడి కాలంలో సామంతులు స్వతంత్రులయ్యారు. ప్రతీహార వంశీయులు పాల
రాజ్యంలో అధిక భాగాన్ని ఆక్రమించుకున్నారు. అయితే రాష్ట్రకూటులతో సంబంధ బాంధవ్యాలు
ఏర్పడ్డ తరువాత నారాయణ పాలుడు వంగ, అంగ దేశాలలో
పాల సామ్రాజ్యాన్ని పునరుద్ధరించాడు. 54 సంవత్సరాలు పాలించిన ఇతడు క్రీస్తుశకం 908
లో మరణించాడు.
నారాయణ పాలుడి తరువాత అతడి కుమారుడు
రాజ్యపాలుడు సింహాసనం అధిష్టించాడు. ఇతడి కాలం నుండి పాల సామ్రాజ్యం పతనావస్థను
చెందింది. ఇతడి తరువాత కొంతకాలం రెండవ గోపాలుడు, రెండవ
విగ్రహ పాలుడు పాల రాజ్యాన్ని పాలించారు. రెండవ విగ్రహ పాలుడు క్రీస్తుశకం 987 లో
మరణించిన తరువాత అతడి కుమారుడు మొదటి మహీపాలుడు పాల రాజ్యాదిపత్యాన్ని వహించాడు.
ఇతడు పాలనలోకి వచ్చేనాటికి పాల మహాసామ్రాజ్యం అతి సాధారణ రాజ్యంగా వుండేది.
క్రీస్తుశకం 1000 కల్లా పాల వంశీయులు పునః తమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.
మహీపాలుడు పాల సామ్రాజ్య పునరుద్ధరణ చేసి మరో 50 సంవత్సరాలు పాల వంశీయులు వంగ, అంగ
దేశాలను పాలించేట్లు చేశాడు. మొదటి మహీపాలుడు అసాధారణ ప్రజ్ఞావంతుడు. రాజ్యకాంక్ష
కలవాడు. అనేక విజయాలను సాధించాడు. ఇతడు క్రీస్తుశకం 1038 వరకు సుమారు 51
సంవత్సరాలు పాలించాడు.
మొదటి మహీపాలుడు మరణించిన తరువాత
నాయపాలుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడు క్రీస్తుశకం 1055 వరకు 17 సంవత్సరాలు
పాలించాడు. ఆ తరువాత నయపాలుడి కుమారుడు మూడవ విగ్రహ పాలుడు రాజ్యాదిపత్యం వహించి
15 సంవత్సరాలు పాలించాడు. ఇతడి అనంతరం అతడి జ్యేష్ట కుమారుడు రెండవ మహీపాలుడు
రాజయ్యాడు. శత్రురాజుల దండయాత్రల వల్ల బలహీనపడి సామ్రాజ్య భాగాలను కోల్పోయిన
సమయంలో ఇతడు అధికారంలోకి వచ్చాడు. ఇతడి పాలనాకాలం క్రీస్తుశకం 1070-1075. ఇతడి
తరువాత శూరపాలుడు రాజై రెండు సంవత్సరాలు పాలించాడు. ఆ తరువాత రామపాలుడు, రాజ్యపాలుడు, కుమారపాలుడు, మూడవ గోపాలుడు రాజులయ్యారు. మూడవ గోపాలుడు
క్రీస్తుశకం 1144 వరకు 14 సంవత్సరాలు పాలించాడు. ఆ తరువాత మదనపాలుడు రాజ్యానికి
వచ్చాడు. ఇతడే పాల వంశీయులలో చివరివాడు. ఇతడు క్రీస్తుశకం 1161 వరకు 15 సంవత్సరాలు
పాలించాడు. అనేక విజయాలను సాధించిన పాల వంశీయుల పాలన సుమారు 400 సంవత్సరాలు
సాగింది.
(స్వర్గీయ
బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)
No comments:
Post a Comment