మహా పల్లవ వంశం (బ్రాహ్మణ రాజులు-22)
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(13-05-2024)
కలభ్రులు పూర్వ పల్లవ రాజ్యాన్ని అంతం
చేసి, క్రీస్తుశకం
ఆరవ శతాబ్ది చివరి పాదంలో తమిళ రాజ్యాన్ని ఆక్రమించారు. పల్లవ వంశ సంజాతుడైన సింహ
విష్ణువు క్రీస్తుశకం 575 నాటికి కలభ్రులను ఓడించి, తమిళ
భూభాగాల నుండి తరిమివేసి, పల్లవ
రాజ్యాన్ని ఉద్ధరించాడు. సింహ విష్ణువు, అతడి సంతతి
వారు కాంచీ నగరం రాజధానిగా సుమారు 325 సంవత్సరాలు దక్షిణాపథ, దక్షిణ భారత
దేశాలలోశక్తి సమన్వితులై వైభవోపేతంగా పరిపాలన చేశారు. సింహ విష్ణువు వంశీయులను
చారిత్రకులు మహా పల్లవ ప్రభువులుగా గుర్తించారు.
మహాపల్లవ వంశానికి ఆద్యుడు సింహ
విష్ణువు. ఇతడు అపరిమిత బలపరాక్రమ సంపన్నుడు. గొప్ప విజేత. పతనమైవున్న పల్లవ
రాజ్యాన్ని సముద్ధరించిన మహావీరుడు. కదనజీవి. రాజ్యాధికారం వహించిన తరువాత సింహ
విష్ణువు అపార సైన్యాన్ని సమకూర్చుకుని, కలభ్ర, చోళ, మాళవ, సింహళ, కేరళ
రాజ్యాధీశుల మీద దండెత్తి విజయం సాధించాడు. ఇతడికి ‘కావన సింహుడు’ అని బిరుదం
వున్నది. సింహ విష్ణువుకు దండయాత్రలో రేనాటి చోళ వంశానికి చెందిన ధనంజయ వర్మ
తోడ్పడ్డాడు. అతడు సింహ విష్ణువు సామంతుడు. సింహ విష్ణువు సంస్కృత భాషా పోషకుడు.
సింహ విష్ణువు పల్లవ రాజ్యాన్ని అతి వైభవంగా క్రీస్తుశకం 575 నుండి క్రీస్తుశకం
600 వరకు సుమారు 25 సంవత్సరాలు పాలించాడు.
సింహ విష్ణువు మరణానంతరం అతడి కుమారుడు
మొదటి మహేంద్ర వర్మ పల్లవ రాజ్యాదిపత్యం వహించాడు. పల్లవ రాజవంశంలో
ప్రసిద్ధికెక్కిన రాజులలో ఇతడు మొదట పేర్కొనదగినవాడు. మహేంద్ర వర్మ సమరశూరుడు.
లలితకళలను పోషించినవాడు. సంగీత శాస్త్ర ప్రవీణుడు. గ్రంథకర్త. తాను అభ్యసించిన
సంగీత శాస్త్రాన్ని భావి తరాల వారికి ఉపయోగపడే విధంగా ఒక గ్రంథాన్ని రచించాడు. శిల్ప
విద్యలో అసమాన పాండిత్యం వున్నవాడు. మహేంద్ర వర్మ పల్లవ రాజ్యాన్ని విస్తృతపరచి
ప్రజానురంజకంగా పాలించాడు. మహేంద్ర వర్మ చోళ రాజులను జయించి వారి రాజ్య భాగాలను
ఆక్రమించాడు. కాంచీనగర సమీపంలోని పుల్లలూరును ఇతడు జయించాడు. ఇతడు ప్రజానురంజకంగా
పల్లవ రాజ్యాన్ని క్రీస్తుశకం 600 నుండి క్రీస్తుశకం 630 వరకు సుమారు 30 సంవత్సరాలు
పాలించాడు.
మొదటి మహేంద్ర వర్మ పెద్ద కుమారుడు మొదటి
నరసింహ వర్మ తండ్రి అనంతరం పల్లవ రాజ్య సింహాసనాన్ని అధిష్టించాడు. రాజైన వెంటనే
నరసింహ వర్మ శత్రువుల దండయాత్రలను ఎదుర్కోవాల్సి వచ్చింది. తొలి యుద్ధాలలో అతడు
ఓడిపోవడంతో పల్లవ రాజ్యంలోని కొన్ని భూభాగాలు అన్యాక్రాంతం అయ్యాయి. కాని ఆతరువాత
తన రాజ్యం మీద దండెత్తి వచ్చిన రెండవ పులకేశిని ఎదుర్కొని యుద్ధభూమి నుండి
వెనుతిరిగేట్లుగా చేశారు. రెండవ పులకేశి యుద్ధరంగంలో మరణించాడు. పల్లవ నరసింహ వర్మ
జీవితమంతా యుద్దాలలోనే గడిచిపోయింది. అయినప్పటికీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను
నిర్వహించడం విస్మరించలేదు. ఇతడు క్రీస్తుశకం 630 నుండి క్రీస్తుశకం 668 వరకు
సుమారు 38 సంవత్సరాలు పాలించాడు.
మొదటి నరసింహ వర్మ కుమారుడు రెండవ మహేంద్ర
వర్మ తండ్రి అనంతరం రాజ్యానికి వచ్చాడు. ఇతడు సమర్థుడైన వాడు కాదు. శత్రువులు
ఆక్రమించిన రాజ్య భాగాలు పోగా మిగతా చోళ రాజ్యాన్ని రెండవ మహేంద్ర వర్మ
క్రీస్తుశకం 668 నుండి క్రీస్తుశక 669 వరకు ఏడాది పాటు మాత్రమే పాలించాడు. ఇతడి
కుమారుడు మొదటి పరమేశ్వర వర్మ అతడి అనంతరం రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి వచ్చిన
వెంటనే అతడు అనేక చిక్కులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇతడు కూడా కేవలం ఒక్క
సంవత్సరం మాత్రమే క్రీస్తుశకం 700 వరకు పాలించాడు.
మొదటి పరమేశ్వర వర్మ కుమారుడు రెండవ
నరసింహ వర్మ క్రీస్తుశకం 700 లో పల్లవ సింహాసనం అధిష్టించి, సుమారు 30 సంవత్సరాలు పాలించాడు. ఇతడు గొప్ప
పరాక్రమశాలి. రాజసింహ బిరుదాంకితుడు. నరసింహ వర్మ చాళుక్య రాజులతో పోరాడవలసి
వచ్చింది. చాళుక్యుల దండయాత్రలను ఎదుర్కొని పల్లవ రాజ్య భాగాలను రక్షించుకున్నాడు.
నరసింహ వర్మ పాలన పల్లవ రాజ్యమంతటా నిరాఘాటంగా సాగింది. రెండవ నరసింహ వర్మ
కళాప్రియుడు. ఇతడు ప్రత్యేకత సంతరించుకున్న అనేక దేవాలయాలను నిర్మించాడు. ఇతడి
కాలంలో సంస్కృత భాషకు ఆదరం లభించినది.
రెండవ నరసింహ వర్మ కుమారుడైన రెండవ
పరమేశ్వర వర్మ తండ్రి అనంతరం క్రీస్తుశకం 730 లో పల్లవ రాజ్యాధిపత్యాన్ని వహించి, 3 సంవత్సరాలు మాత్రమే పాలించాడు. ఇతడు సమర్ధుడైన
పాలకుడు కాదు. చాళుక్యులతో జరిగిన పోరాటంలో అపజయం పొందాడు. చాళుక్యులతో పాటు
పశ్చిమ గాంగ పురుష ముత్తమ రాజు పల్లవ రాజ్య భాగాల మీద దండెత్తటం సహించని పరమేశ్వర
వర్మ అతడి రాజ్యం మీద దండెత్తాడు. ఇరు సైన్యాలు భీకరంగా పోరాడాయి. ఈ యుద్ధంలో
పరమేశ్వర వర్మ మరణించాడు.
రెండవ పరమేశ్వర వర్మ మరణానంతరం పల్లవ
రాజ్యంలో అలజడులు రేగాయి. దాయాదులు సింహాసనాన్ని అధిష్టించడానికి సుముఖులుగా
లేకుండిరి. సింహ విష్ణువు సోదరుడు, భీమవర్మ సంతతి వాడైన పరమేశ్వర వర్మను
క్రీస్తుశకం 733 లో మంత్రులు, (రెండవ) నందివర్మ పేరుతో పల్లవ రాజ్యాధీశుడిని
చేశారు. అప్పటికి అతడు వయసు 12 సంవత్సరాలే. ఇతడు ప్రసిద్ధుడైన రాజు. పల్లవమల్ల
బిరుదాంకితుడు. ఇతడు సుమారు 65 సంవత్సరాలు పల్లవ రాజ్యాన్ని పాలించాడు. రెండవ
నందివర్మ రాజ్యానికి వచ్చిన తరువాత తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి అనేక యుద్ధాలు
చేయాల్సి వచ్చింది. విజయం సాధించిన నందివర్మ వేంగీ రాజ్య దక్షిణ భాగాలను, పల్లవ
రాజ్యానికి ఉత్తరంలో వున్న ప్రాంతాలను పల్లవ రాజ్యంలో చేర్చుకున్నాడు. దీంతో పల్లవ
రాజ్య ప్రతిష్ట ఇనిమడించినది. కాని బాదామీ చాళుక్యులతో వైరం ముదిరినది. ఇతడు
వృద్ధాప్యంలో దివంగతుడయ్యాడు.
రెండవ నందివర్మ మరణానంతరం అతడి కుమారుడు
దంతి వర్మ పల్లవ రాజ్య సింహాసనాన్ని క్రీస్తుశకం 798 లో అధిష్టించాడు. దంతి వర్మ
రాష్ట్ర కూట ప్రభువులతో పోరాడవలసి వచ్చింది. దంతి వర్మ 50 సంవత్సరాల పాటు
సుదీర్ఘంగా పల్లవ రాజ్యాన్ని పాలించాడు. దంతి వర్మ తరువాత అతడి కుమారుడు, మనుమడు నృపతుంగ వర్మ పల్లవ రాజ్యాన్ని
క్రీస్తుశకం 890 వరకు పాలించారు. నృపతుంగుడి సవతి సోదరుడు అపరాజితుడు క్రీస్తుశకం
890 ప్రాంతంలో పల్లవ రాజయ్యాడు. క్రీస్తుశకం 899 లో చోళ వంశజుడైన ఆదిత్యతో జరిగిన
ఒక యుద్ధంలో మరణించాడు. ఆ తరువాత తంజావూరు పట్టణంలో చోళ రాజ్యం స్థాపించ బడింది.
పల్లవ వంశానికి చెందిన మూడవ నందివర్మ కుమారుడు కంప వర్మ పల్లవ రాజ్యంలోని కొన్ని
భాగాలను పాలించాడు. క్రీస్తుశకం 10 వ శతాబ్దం ఆరంభంలో పల్లవుల అధికారం పూర్తిగా అంతరించింది.
(స్వర్గీయ
బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)
No comments:
Post a Comment