ఆచార అనుబంధాల సేతువు హిందూ వివాహ క్రతువు
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ
దినపత్రిక (08-05-2024)
‘హిందూ వివాహం ఓ సంస్కారం. పవిత్రమైన మతకర్మ. భారతీయ
సమాజంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వివాహమంటే ఆటపాటలు, విందువినోదాలు,
కట్నకానుకలు ఇచ్చిపుచ్చుకునే సందర్భమో, లేదా,
వాణిజ్యపరమైన లావాదేవీనో కానే కాదు. ఇది కుటుంబ వ్యవస్థకు ఓ గంభీరమైన పునాది
కార్యక్రమం’ అంటూ జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ లతో కూడిన సుప్రీం
కోర్టు ధర్మాసనం, ఇటీవల (మే నెల 1 తేదీన) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. హిందూ
వివాహం చెల్లుబాటు కావాలంటే ‘సముచిత ఆచార వ్యవహారాల మధ్య వివాహ క్రతువు’
నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. పవిత్ర అగ్నిగుండం చుట్టూ 7 అడుగులు వేసే ‘సప్తపది’ ప్రాధాన్యాన్ని ప్రస్తావించింది. ‘రిజిస్ట్రేషన్
కేవలం ఋజువు’ మాత్రమేనని ధర్మాసనం అన్నది.
ఇంతకూ, ఏమిటీ ఆ ‘సముచిత ఆచార వ్యవహారాల వివాహ
క్రతువు'? వేదాలలో ‘హిందూ వివాహం’ ప్రస్తావన చాలా
స్పష్టంగా వుంది. తోడూ, నీడా లేని ఒంటరి బ్రతుకు ఒక బ్రతుకే కాదని, మగకు ఆడ, ఆడకు మగ తోడు అవసరమని, మంచి కుటుంబమే మంచి సమాజమవుతుందని, ఆడ, మగను కలపడానికి పవిత్రమైన వివాహ బంధాన్ని ఏర్పరిచినారని వేదంలో వున్నది. వేద
సూక్తంలో ‘వధువుకు ప్రాధాన్యత’ ఇస్తూ, వివాహం గురించి విపులంగా చెప్పబడినది. దాంపత్యాన్ని గురించిన ఆశయాన్ని
చక్కగా వివరించడం జరిగింది. పిల్లలు, పిల్లల పిల్లలతో
ఆడుకుంటూ గడిపే వార్థక్యం గురించిన వివరణ వుంది.
స్త్రీ
పురుషులకు అనుకూల దాంపత్యం ఒక వరం. కలిసి ఉన్న దంపతులు కష్టాలను లెక్కచేయరు. ఆనందం
సంపదలో లేదు! అనన్యత్వంలో ఉంది!! సుఖ దుఃఖాలు సాపేక్షాలు. కలసి నవ్వడంలో వున్న
ఆనందం కలసి ఏడవడంలోనూ ఉంది. ఆలుమగలు కలసి సాగడం వల్ల హృదయానికి విశ్రాంతి,
మనశ్శాంతి. వార్ధక్యం వచ్చినా అదే అనురాగమైన వలపు వుంటుంది. కాలం నడుస్తుంటే ప్రేమ
పండుతుంది. స్నేహం స్థిరంగా ఉంటుంది. హిందూ వివాహం పవిత్ర బంధం. ఏడేడు జన్మల అనుబంధం.
నూరేళ్ల పంట! మృత్యువు సహితం విడదీయలేదు. ఎంతటి సమాజంలోనైనా కుటుంబానిదే అగ్ర
స్థానం. కుటుంబమే సమాజానికి మూల కారణం.
ధర్మం ప్రాతిపదికగా, అర్థం, కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన
విధానం ‘హిందూ వివాహం.’ వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం
చేయబడింది. హిందూ వివాహంలో మొదటి ఘట్టం ‘వాగ్ధానం,’ లేదా, ‘నిశ్చితార్థం’ లేదా ‘నిశ్చయ తాంబూలం.’ అప్పుడే
వధూవరుల తారా బలం, చంద్ర బలం చూసి సుముహూర్తం నిశ్చయిస్తారు.
పెళ్లిరోజుకు ముందర పురోహితులు వరుడిని ‘బ్రహ్మచర్యం’ నుండి
‘గృహస్థాశ్రమం’ స్వీకరించడానికి సిద్ధంచేసే ‘స్నాతకం’ అనే వేడుకైన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వరుడు గొడుగు పట్టుకొని, చేత కర్ర పుచ్చుకొని,
పాదాలకు పావు కోళ్లు ధరించి, పసుపు బట్టలు వేసుకొని,
సన్యాసం స్వీకరించేందుకు, కాశీకి పోతున్నానని చెప్పి
బయలు దేరుతాడు. వధువు సోదరుడు వచ్చి కాశీ ప్రయాణం విరమించుకోమని, తన సోదరిని వివాహం చేసుకొని గృహస్థుగా జీవించమని నచ్చచెప్పి వెనుకకు తీసుకొని
వస్తాడు.
పెళ్ళికి ముందర పెళ్ళికొడుకును, పెళ్ళికూతురును చేయడం ఆచారం. తెల్లవారక ముందే, మంగళ వాయిద్యాల మధ్య మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు. ‘పెళ్ళికూతురు’ ను చేసిన అనంతరం,
సమయానుకూలంగా, నవ ధాన్యాలను మట్టి మూకుళ్లలో పుట్ట మన్నులో కలిపి
మొలకెత్తే విధంగా అమర్చి ‘అంకురార్పణ’ జరిపిస్తారు. స్నాతకం చేసుకున్న తరువాత మగపెళ్లివారు
ఆడపెళ్ళివారి ప్రదేశానికి తరలి పోతారు. విడిదికి చేరుకున్న
వారికి, ఆడపెళ్లి వారు, ‘ఎదురు కోలు’
సరదాగా, సందడిగా పలుకుతారు.
వధువు గౌరీ పూజకు, విడిదిలో వరపూజకు సన్నాహాలు మొదలవుతాయి. హిందూ సంప్రదాయం
ప్రకారం వధువుని ‘లక్ష్మి, పార్వతి, సరస్వతి’ ల ఉమ్మడి రూపంగా, వరుడిని ‘త్రిమూర్తుల
దివ్యస్వరూపం’ గా, విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో
నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషుడుగా భావిస్తారు. వరపూజ
అనంతరం మగ పెళ్లివారు కన్యాదాత ఇంటికి చేరుకునే సమయానికి, కన్యా
వరణానికి వచ్చే వరుడికి ఎదురేగి తన కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్ధిల్లమని
కన్యాదాత దీవించే కార్యక్రమంతో వివాహ మండపం వద్ద వేడుక మొదలవుతుంది. హిందూ వివాహ సంప్రదాయం ప్రకారం, ‘నారాయణ స్వరూపుడైన’
వరుడికి పాద ప్రక్షాళన జరిపించి, కన్యాదాత ‘మధు పర్కం’
రూపంలో ఆతిధ్యం ఇస్తారు. మధు పర్కాలుగా ఇచ్చిన నూతన వస్త్రాలను
ధరించి వరుడు వివాహ వేదిక మీద జరగాల్సిన తంతుకై వేచి వుంటాడు.
కన్యాదాత వరుడు తండ్రిని తీసుకొని వధువు గౌరీ పూజ చేస్తున్న చోటుకెళ్తారు. అక్కడ, లాంఛనంగా, ఇరు పక్షాల వారి గోత్రం, ప్రవర చెప్పే కార్యక్రమం, పురోహితుల
చాతుర్యాన్ని బట్టి ఆసక్తికరంగా, విన సొంపుగా వుంటుంది. ‘గోత్రం’
అంటే వంశం, ‘ప్రవర’ అంటే ఆ వంశం మూల పురుషుల సమాచారం.
మీ అమ్మాయిని, మా అబ్బాయికి
ఇచ్చి వివాహం జరిపించమని వరుడి తండ్రి, కన్యా దాతను కోరడమే ఈ
వేడుక ముఖ్య ఉద్దేశం. ‘చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య
శ్శుభం భవతు’ అని మొదలవుతుంది తంతు. వధువు మేనమామలు పెళ్ళి కూతురిని గంపలో
కూర్చొబెట్టి వివాహ వేదిక పైకి తీసుకొచ్చే కార్యక్రమం సరదాగా, సామాజిక స్పృహతో కూడి
వుంటుంది. తల్లి తర్వాత మేనమామలు ముఖ్యమని తెలియచేయడమే దీని అర్థం.
గంపలో ధాన్యం పోస్తారు. కొబ్బరి బోండా మానసిక స్వచ్ఛతకు
చిహ్నం. అందులోని పీచులాగా, ఎల్లవేళలా ఇరువురు
విడిపోకుండా, అల్లుకు పోయి జీవిస్తామని, సత్ సంతానం కలవారమవుతామని
సంకేతం కూడ.
కళ్యాణ వేదిక పైన వున్న వరుడి కాళ్లు కడిగే కార్యక్రమం ప్రాధాన్యతను సంతరించుకున్న
ఘట్టం. వయసులో పెద్దయిన
కన్యాదాత, చిన్నవాడైన వరుడి కాళ్లు కడిగే సాంప్రదాయ బద్ధమైన ప్రక్రియలో తేజస్సు తరిగి
పోకుండా పురోహితుడు మంత్రాన్ని చెప్పుతాడు. అది కన్యాదాత ఉచ్చరిస్తూ,
ఇచ్చిన ‘అర్ఘ్యాన్ని’ (మంచి నీరు) స్వీకరిస్తాడు వరుడు. కన్యా దాత వరుడి కాళ్ళు కడిగి నందువల్ల,
చిన్నవాడైన వరుడు, తనలోని కాంతి తరిగిపోకుండా వుండేందుకు,
ఆచమనం చేయించి, దానికి తగ్గ మంత్రాన్ని చదివిస్తారు.
వధువుని గంపలోనే వుంచి ‘మహా సంకల్పం’తో ఆరంభించి,
తర్వాత జరగాల్సిన వేడుక మొదలు పెట్తారు పురోహితులు.
వధూవరులను సాక్షాత్తు ‘లక్ష్మీనారాయణ స్వరూపులు’ గా భావించుతారు
కాబట్టి, ఆ విధంగానే
కల్యాణం జరిపించుతారు. ‘మహాసంకల్పం’ చెప్పడం,
సృష్టి క్రమంతో మొదలుపెట్టి, పరమేశ్వరుడి శక్తి,
సామర్థ్యాలు అనంతమని, అచింత్యాలని, ఆయన అనుగ్రహంతోనే యావత్ సృష్టి
జరిగిందని కొనసాగుతుంది. మానవుడి మేథస్సు ఊహించనలవికాని పరిమాణంలో
వున్న ఈ జగత్తు, పరమేశ్వరుడి ఆద్యంతాలు లేని రూపంలో ఒక అతి చిన్నదైందని
పురోహితుడంటాడు. అఖిలాండ బ్రహ్మాండంలో, అనేకానేక చిన్న, చిన్న గోళాలున్న ఖగోళంలోని అత్యంత సూక్ష్మమైన భూగోళంలో,
భరత ఖండంలో, మారు మూలనున్న మానవుడు, అణు పరిమాణంలో వున్న చిన్న భాగమని తెలియచేసేదే మహా సంకల్పం. ఇది చెప్పడం ద్వారా, పరమాత్మ స్వరూపాన్ని ఎరుక పరిచి,
మానవుడి అహంకారాన్ని తగ్గించుకోమని, వినయ సంపదను
పెంచుకోమని సూచించడం జరుగుతుంది.
మహా సంకల్పం విశ్వ స్వరూపాన్ని, ఖగోళ స్థితిని చక్కగా వివరిస్తుంది. భూమండలాన్ని పరిపాలించిన షోడశ మహారాజులు, షట్చక్రవర్తులు,
సప్త ద్వీపాలు, నవ వర్షాలు, నవ ఖండాలు, దశారణ్యాలు, యాభై కోట్ల
విస్తీర్ణం గల జంబూ ద్వీపం, అందులో భరత వర్షం, భరత ఖండం,
దానిలో ఈ కన్యాదానం ఎక్కడ చేస్తున్నది కన్యాదాత పేర్కొంటాడు.
అలాగే బ్రహ్మ కాలమాన ప్రకారం, శ్వేత వరాహకల్పంలో, పద్నాలుగు మన్వంతరాలలో ఏడవదైన వైవస్వత మన్వంతరంలో, శాలివాహన శకంలో, ఇరవై ఎనిమిదవ
మహా యుగంలో, కలియుగంలో, ఫలానా సంవత్సరంలో, ఫలానా మాసంలో, ఫలానా తిది రోజున,
సుముహూర్త సమయంలో శ్రీ లక్ష్మీనారాయణ ప్ర్రీతి కోసం ‘సర్వాలంకార
భూషితైన ఈ కన్యను దానం చేస్తున్నాను’ అని కన్యాదాత చెప్పే సంకల్పం ఇది.
ఈ కన్యాదానం వల్ల తనకు బ్రహ్మ లోకంలో నివసించే యోగ్యత సిద్ధించాలని,
అగ్ని, స్తోమ, అతిరాత్ర, వాజపేయాది యాగాలు చేసిన పుణ్య ఫలం లభించాలని, తనకు వెనుక
పది, ముందు పది తరాల వాళ్ళు , తనతో కలిపి 21 తరాల వారు, బ్రహ్మ లోకంలో నివసించాలని
కన్యాదాత సంకల్పం చేస్తాడు.
‘కన్యాదానం’ తంతు మొదలవుతుంది. ‘కన్యాం కనక సంపన్నాం
కనకాభరణైర్యుతాం! దాస్వామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగీషియా’ అన్న వాక్యాలు పురోహితుడి నోటి వెంట వస్తాయి. దీని అర్ధం: ‘ఈమె బంగారం వంటి మనస్సు
కలది. కనకం వంటి శరీర చాయ కలది. శరీరమంతా
ఆభరణాలు కలిగినది. నా పిత్రాదులు సంసారంలో విజయం పొంది శాశ్వత
ప్రాప్తి పొందినట్టు శృతి వలన విన్నాను. నేనూ ఆ శాశ్వత బ్రహ్మలోకప్రాప్తి
పొందేందుకు విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానం చేస్తున్నాను’ అని కన్యాదాత
అంటారు. ‘సమస్త ప్రపంచాన్ని, అఖిలాండ బ్రహ్మాండాలను
భరించే శ్రీ మహావిష్ణువు, పంచభూతాల, సర్వ దేవతల సాక్షిగా, పితృదేవతలను
తరింపచేసేందుకు, ఈ కన్యను దానం చేస్తున్నాను. సౌశీల్యం కలిగి, బుద్ధిమంతుడి వైన నీకు, ధర్మార్థ కామాలు సిద్ధించేందుకు, సాలంకృత సాధ్వియైన ఈ
కన్యను సమర్పించుకుంటున్నాను’ అంటాడు.
ఇలా అంటూ, కన్యా దాత
వరుడి చేతిలో నీళ్లు పోసి మరో మాటంటారు. ‘నీకు దానం చేసినప్పటికీ,
ఈ కన్య నా కుమార్తే సుమా!’ అని. ఇలా అంటూనే, ‘ధర్మేచ, అర్థేచ, కామేచ, ఏషా నాతి చరితవ్యా’ అని ప్రతిజ్ఞ చేయిస్తారు కన్యాదాత వరుడితో. దీనికి
సమాధానంగా, ‘నాతి చ రామి’ అని మూడుసార్లు వరుడితో
చెప్పిస్తారు. వధూవరులను కళ్యాణ వేదికపై కూచోబెట్టి, తెరను అడ్డం
పెట్టి, ఇరువురి చేతికి ‘జీలకర్ర-బెల్లం’
కలిపిన ముద్దను ఇస్తాడు పురోహితుడు. నిర్ణయించిన సుముహూర్తానికి
మంగళ వాయిద్యాలు మోగిస్తుంటే, పురోహితుడు మంత్రాలు చదువుతుంటే,
వధువు, వరుడు ఏక కాలంలో ఒకరి శిరస్సు మీద (బ్రహ్మ రంధ్రం మీద) మరొకరు ‘జీలకర్ర-బెల్లం’ కలిపిన ముద్దను వుంచుకుంటారు.
పెద్దలందరూ దంపతులు మీద అక్షితలు చల్లుతారు.
తదుపరి మాంగల్య ధారణ తంతు మొదలవుతుంది. వివాహం అయిన మహిళలు ‘మంగళ సూత్రం’ ధరించడం
భారతీయ సంప్రదాయం. హిందువుల ఆచారం. సన్నని పోగులు, తొమ్మిది లేదా పదకొండు దారాలతో కలిపి, పసుపు రాసి తాళిని తయారు చేస్తారు.
సమస్త శుభాలకు, మంగళ ప్రదమైన కర్మలకు నిలయమైంది
కాబట్టి, దీనికి, మంగళ సూత్రం అని పేరొచ్చింది.
దీన్నే ‘శత మానములు’ అని కూడా అంటారు. రెండు సూత్రాలలో ఒకటి అత్తింటి వారు, ఇంకోటి పుట్టింటి
వారు చేయించడం ఆచారం. మంగళ సూత్ర ధారణకు ముందు, మేనమామ పెట్టిన ‘మధుపర్కం చీరె’ ను, వధువు
కట్టుకుంటుంది.
మంగళ వాయిద్యాలు మారుమోగుతుంటే, ‘మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా
! కంఠే మిద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం’ అని చదువుతుంటే, వరుడితో మంగళ సూత్రాన్ని, వధువు మెడలో ధారణ చేయించుతాడు పురోహితుడు. మూడు ముళ్లు వేయమంటాడు. మూడు ముళ్లంటే, మూడు లోకాలకు, త్రిమూర్తులకు,
సత్వ, రజ, తమో గుణాలకు సంకేతం. మంగళ సూత్ర ధారణ
అవుతూనే వేద పండితులు ’శతమానం భవతి, శతాయుః
పురుష’ అని ఆశీర్వదిస్తారు.
మాంగల్య ధారణ అనంతరం అత్యంత కోలాహలంగా, తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకోవడం
హిందూ సాంప్రదాయం. వధూవరుల గృహస్థాశ్రమ
జీవితం శుభప్రదంగా, మంగళప్రదంగా వుండాలని ‘మంగళ ద్రవ్యాలతో’ చేయించే
పవిత్రమైన వైదిక ప్రక్రియ ఇది. ఈ తంతు ముగిసిన తర్వాత,
వధువు చీరె కొంగు అంచును, వరుడి ఉత్తరీయం అంచుకు
కలిపి ‘బ్రహ్మముడి’ వేస్తారు. తరువాత, వధూవరులను వివాహ వేదికనుంచి కిందికి దింపి, ‘స్థాళీపాకం’
జరిపిస్తాడు పురోహితుడు. అతి ముఖ్యమైన ‘సప్తపది’
ఘట్టం వుంటుంది. అగ్నిహోత్రుడి చుట్టూ, ఆయన సాక్షిగా, వధూవరులిద్దరు, వధువు
కుడి కాలి అడుగుతో ఆరంభించి, ‘ఏడు అడుగులు’ వేస్తారు.
గృహస్థాశ్రమ స్వీకారానికిది పరమావధి. ఆ తరువాత
నాగవల్లి, సదశ్యం జరుగుతాయి.
కన్యాదాత ఇంట్లో జరిగే వేడుకల్లో చివరది ‘అప్పగింతలు’ కార్యక్రమం.
అంటే కూతురును అత్తవారి ఇంటికి పంపే వేడుక. హృదయాన్ని కలచివేసేది. కంట తడి
పెట్టించేది. పెళ్లికూతురును అత్తవారింటి వైపు బంధువులకు పరిచయం చేయడం కొరకు కూడా ఈ
వేడుకను జరిపిస్తుండవచ్చు. తంతులో
భాగంగా వధూవరులకు ‘అరుంధతి’ నక్షత్రాన్ని చూపిస్తాడు పురోహితుడు. చివరకు విడిది గృహ ప్రవేశానికి పంపుతారు.
హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాకుండా
ఎంతో పవిత్రమైన వ్యవస్థ కూడా. పెళ్ళయినాక భార్యాభర్తల మధ్య దాంపత్య ధర్మం అనే బాధ్యత మొదలవుతుంది. పెళ్ళి
అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా
ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది. లక్ష్మీదేవి
స్వరూపమైన తమ కూతుర్ని, వరుడిని శ్రీ మహావిష్ణువు అవతారంగా భావించి, ‘కన్యాదానం’
చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుందని హిందువుల నమ్మకం. ఈ యావత్తు
ప్రక్రియ ‘కన్యాదానం’ లో భాగమే.
(‘సజీవ వాహిని సనాతన ధర్మం’ పుస్తక తచయిత రాసిన వ్యాసం)
(మే నెల 1 న, సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం
వ్యాఖ్యల నేపధ్యంలో)
ఈ మధ్య ఆంధ్రపదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి విభిన్న అభిప్రాయాలు రాజకీయ శంఖారావాలు విని పి స్ తున్నాయి.
ReplyDeleteదీనిపై మీ సమగ్ర విశ్లేషణ వ్రాయగలరు ఈ చట్టం నిజంగానే మోసపూరితమైనదా ?