విశ్వాస నిరూపణా, అవిశ్వాస విజయమా ?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దిన పత్రిక: (03-06-2011)
అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం - జగన్ వర్గం బలం తేలేదీ ఇప్పుడే! సభ్యులపై వేటుకు కాంగ్రెస్‌కు దారి - ప్రభుత్వ విధానాలను ఎండగట్టే అవకాశం - పథకాల ప్రచారానికీ ప్రభుత్వానికి వేదిక - విశ్వాసాన్ని కోల్పోతే పరిస్థితి ఏమిటి?
కిరణ్ కుమార్ రెడ్డి ఆరు నెలల ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని శాసన సభలో ప్రవేశపెడతామని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
కేంద్ర స్థాయిలో పార్లమెంటు (లోక్ సభ) లో, రాష్ట్ర స్థాయిలో శాసన సభలో, అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టేందుకు, రాజ్యాంగ పరంగా అవకాశం వున్న పదునైన ఆయుధాన్ని "అవిశ్వాస తీర్మానం" అనడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయం. పార్లమెంటుకు, రాష్ట్రాల శాసన సభలకు (ఈ రెండూ చట్ట సభలే) రాజ్యాంగ పరంగా తిరుగులేని శాసనాధికారాలుంటాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకగా చెప్పుకునే బ్రిటన్ లో, అవిశ్వాస తీర్మానానికి "విశ్వాస తీర్మానం" అని, "అభిశంసన తీర్మానం" అని పర్యాయ పదాలు వాడుకలో వున్నాయి. బ్రిటీష్ పార్లమెంటరీ సాంప్రదాయంలో, ప్రతిపక్షాలు ప్రవేశ పెట్ట తలుచుకున్న అవిశ్వాస తీర్మానాన్ని తిప్పికొట్టేందుకు, ప్రభుత్వం, తనంతట తానే విశ్వాస తీర్మానాన్ని పార్లమెంటులో ప్రతిపాదించడం ఆనవాయితీ. పార్లమెంటరీ సత్ సంప్రదాయాలకు అనుగుణంగా, విశ్వాస (రాహిత్య) తీర్మానంలో ఓటమిపాలైన అధికార పక్షం తక్షణం రాజీనామా చేసి, ప్రతిపక్షాలకు ప్రభుత్వంలోకి వచ్చే అవకాశమన్నా ఇవ్వాలి, లేదా, సంబంధిత రాజ్యాంగ అధినేతకు (రాష్ట్రపతి లేదా గవర్నర్) పార్లమెంటు లేదా శాసన సభను రద్దు చేయమనన్నా సిఫారసు చేయాలి. చట్ట సభలలో మెజారిటీ సభ్యుల మద్దతు లేని రాజకీయ పార్టీకి, లేదా సంకీర్ణ కూటమికి, ప్రభుత్వంలో కొన సాగే నైతిక-రాజ్యాంగ పరమైన హక్కు లేదనేది తెలిసిన విషయమే. ఒకానొకప్పుడు అత్యంత అరుదుగా ప్రతిపక్షాలు వాడుకునే ఈ ఆయుధాన్ని ఇప్పుడు, విరివిగా-తరచుగా, కేవలం రాజకీయ లబ్ది కోసం ఉపయోగించే స్థితికి తెచ్చాయి రాజకీయ పక్షాలు. భారత దేశానికి చెందినంత వరకు ఈ పాపంలో కాంగ్రెస్-కాంగ్రేసేతర రాజకీయ పార్టీలు భాగస్వాములే!
వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏనాడై తే, దివంగత ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి రాజకీయ (కాంగ్రెస్) వారసుడుగా గుర్తించడానికి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధినేత-అధిష్టానం విముఖత వ్యక్త పరిచిందో, అప్పుడే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అస్థిర ప్రభుత్వాలకు అంకురార్పణ జరిగింది. రాజశేఖర రెడ్డి తదనంతరం బాధ్యతలు చేపట్టిన ముఖ్య మంత్రుల నాయకత్వంలోని ప్రభుత్వాలపై, ఆయన ప్రారంభించిన ప్రజోపయోగమైన పథకాల అమలు విషయంలో, అఖిలాంధ్ర ప్రజలకు, ఆయన మరణించిన మర క్షణమే విశ్వాసం పోయింది. దరిమిలా ప్రజల అనుమానాలను నిజం చేస్తూ, అలనాటి రోశయ్య ప్రభుత్వం, ఇప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, ఆ పథకాలకు తూట్లు పొడిచింది. అలా ప్రజల విశ్వాసం కోల్పోతున్న ప్రభుత్వానికి, వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సరసన ఆయన నాయకత్వంలో చేరుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య, శాసన సభలో మైనారిటీకి చేరే పరిస్థితి కలిపిస్తోంది.
రాజకీయాలలో ఒక్క క్షణం ఆలశ్యమైనా-ఆలశ్యం చేసినా, అనుకున్నదొకటి-ఐందొకటి తప్పదనుకున్న జగన్మోహన్ రెడ్డి అనుయాయులు, ఆయన అనుమతి వుందో-లేదో కాని, రాజశేఖర రెడ్డి మరణించిన తక్షణం నుంచే, ఆయనను ముఖ్య మంత్రి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందిరా గాంధి మరణానంతరం, ఆయన స్థానంలో రాజీవ్ గాంధీని కూర్చొబెట్టడానికి, "ఇందిరా-రాజీవ్ క్లిక్" ఇలాంటి ప్రయత్నమే చేశారు. అప్పట్లో, ఆ ప్రయత్నానికి నాటి రాష్ట్రపతి జైల్ సింగ్ మద్దతు కూడా వుందంటారు. కాకపోతే. అల నాడు అక్కడ కేంద్రంలో నెల కొన్న పరిస్థితులు, ఇక్కడ రాజశేఖర రెడ్డి మరణానంతరం వున్న పరిస్థితులు ఒక రకంగా లేవు. ఇందిర వారసుడుగా రాజీవ్ ను తెద్దామనుకున్న వారిలోని సమిష్టి ఐకమత్యం-విభేదాలు, రాజీవ్ ను తప్ప ఇతరులను ప్రధానిగా చేసేందుకు అనుకూలించే విధంగా లేవు. ఇక్కడ అలా కాదు. రాజశేఖర రెడ్డి జీవించి వున్నంత కాలం, ఆయన ముఖ్య మంత్రిగా వున్నంత వరకు, ఆయనకు వ్యతిరేకంగా నోరు విప్పడానికి భయపడిన ఆయన బద్ధ వ్యతిరేకులకు జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి కావడం ససేమిరా ఇష్టం లేదు. అది గమనించిన జగన్ అభిమానులు, రాజశేఖర రెడ్డిని వ్యతిరేక ఎమ్మెల్యేల సంతకాలతో సహా, దాదాపు అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలను సేకరించి, ముఖ్య మంత్రిగా ఆయనే కావాలని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. చివరకు ఆయనకా పీఠం దక్కక పోవడంతో, 2009 ఎన్నికలలో మెజారిటీ సీట్లను పొంది అధికారంలో కొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరతకు దారితీసే పరిస్థితులు మొదలయ్యాయి. అలా మొదలైంది, కాంగ్రెస్ ప్రభుత్వంపై పరోక్ష అవిశ్వాసం. ఆ తర్వాత జగన్ ఓదార్పు యాత్ర, దానికి కాంగ్రెస్-కాంగ్రేసేతర రాజకీయ పక్షాల వ్యతిరేకత, ప్రజల అఖండ అభిమానం, జగన్ పై కాంగ్రెస్ అధిష్టానం మరింత చిన్న చూపు, చివరకు ఆయన పార్టీకి-లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి సోనియా గాంధీపై ధిక్కార స్వరం వినిపించడంతో ప్రభుత్వంపై అవిశ్వాసం దిశగా మరి కొంత అడుగులు పడ్డాయి. ఇంతలో చిరంజీవి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. పోయిందనుకున్న బలం తిరిగొచ్చిందనుకున్నారు కాంగ్రెస్ వారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం, కడప ఎన్నికలలో గెలుపు జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వంపై "అవిశ్వాసం" వేగవంతం చేయడానికి బలం చేకూరింది.
జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి ఎప్పుడైతో గణనీయమైన సంఖ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధమై నారని కాంగ్రెస్ అధిష్టానం భావించిందో, ఆ మరు నిమిషంలోనే, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా, కిరణ్ సర్కారును రక్షించేందుకు చిరంజీవిని అక్కున చేర్చుకుంది. ప్రజారాజ్యం పార్టీ అనే "కుంపటి" ని వీలైనంత తొందరలో నెత్తి మీద నుంచి దించుకోవాలన్న ఆలోచనలో వున్న చిరంజీవికి కాంగ్రెస్ ఆలోచన కలిసొచ్చింది. కొంతలో కొంత జగన్మోహన్ రెడ్డి ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకో గలిగామన్న భరోసా కలిగింది కిరణ్ సర్కారుకు. జగన్ వెంట నడుస్తున్న ఎమ్మెల్యేల పై కాని, ఎంపీల పై కాని క్రమ శిక్షణ చర్య తీసుకోక పోవడానికి కాంగ్రెస్ అధిష్టానానికి బలీయమైన కారణాలుండి వుండాలి. అలానే, తన తండ్రి రెక్కల కష్టంతో ఏర్పాటైన ప్రభుత్వాన్ని కూలగొట్టనని మొదట్లో చెప్పిన జగన్ ప్రభుత్వం పడిపోవాలని అనడం తప్ప పడగొట్టడానికి తనంతతానుగా "అవిశ్వాసం" ప్రతిపాదన తేకపోవడానికీ బలీయమైన కారణాలుండి వుండాలి. ఈ నేపధ్యంలో, తెలుగు దేశం పార్టీ కిరణ్ సర్కారుకు అండగా వుందన్న ఆరోపణ చేయడం మొదలెట్టారు జగన్ వర్గీయులు. ప్రభుత్వం పడిపోకుండా చిరంజీవి ప్రత్యక్షంగా కాపాడుతుంటే, "మాచ్ ఫిక్సింగ్" తరహాలో చంద్రబాబు నాయుడు పరోక్షంగా కాపాడుతున్నాడని జగన్ టిడిపిని నిందించడం మొదలైంది. ఇంకొంచెం ముందుకు పోయి, తొంభై మందికి పైగా శాసన సభ్యుల సంఖ్యా బలం కలిగిన తెలుగు దేశం పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాల్సిందేనని డిమాండు చేశారు జగన్.
సవాలును స్వీకరించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డికి ప్రతి సవాలు విసిరారు. ఆయనే అవిశ్వాసం తీర్మానం తన కాంగ్రెస్ మద్దతు దారుల ద్వారా ప్రవేశపెట్టాలని, లేదా, గవర్నర్ దగ్గరకు వెళ్ళి తన పక్షాన వున్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం వివరించి, ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని చెప్పాలని డిమాండు చేశారు బాబు. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి పదిహేను శాతం (అంటే సుమారు 29-30 మంది) సభ్యుల మద్దతుండాలని, తమకంత మంది లేరని, అందుకే టిడిపిని అడుగుతున్నామని బయట పెట్టారు జగన్. ఆ విధంగా తన బలమెంతో చెప్పకనే చెప్పారు జగన్. అయితే, జగన్ కు తెలియని విషయం ఒకటుంది. తీర్మానానికి నోటీసు ఇవ్వడానికి ఒక్క సభ్యుడు చాలు. చర్చకు చేపట్టడానికి మాత్రం పది శాతం మంది మద్దతు కావాలి.
తెలుగు దేశం పార్టీ మహా నాడు సందర్భంగా, అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన అంశాన్ని వివిధ కోణాల నుంచి చూపించుకుంటూ విశ్లేషణాత్మకమైన సవాళ్లను జగన్ ముందు, కిరణ్ సర్కారు ముందు వుంచిన చంద్రబాబు నాయుడు, మహా నాడు ముగింపు చివరలో, ప్రభుత్వంపై రాబోయే సమావేశాలలో, అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే నిర్ణయాన్ని ప్రకటించారు. అంటే, అందరి కోరికా నెరవేరనున్నదన్న మాట.
ప్రతి పక్షాలు ప్రవేశ పెట్తామని పదే-పదే అంటున్న అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు తన ప్రభుత్వం సిద్ధంగా వుందని ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ధైర్యంగా చెపుతున్నారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా ఐకమత్యంగా కాంగ్రెస్ పార్టీలోనే వున్నారని, ఎవరన్నా ఒకరిద్దరు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసినట్లు తమ దృష్టికి వస్తే, సరైన సమయంలో, వారిపై సరైన రీతిలో క్రమశిక్షణ చర్య తీసుకుంటామని కూడా అంటున్నారు. అలా అంటానికి కారణం, బహుశా, తెలుగు దేశం పార్టీ ప్రతిపాదించ తలచుకున్న అవిశ్వాస తీర్మానానికి జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా మద్దతు పలకడమే కావచ్చు.
ఈ నేపధ్యంలో "విశ్వాస నిరూపణ" కోణం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడడం మొదలెట్టారు. ఇతర పార్టీల వారు తమపై అవిశ్వాసం ప్రకటించే దాకా వేచి చూడటం కన్నా, తమంతట తామే విశ్వాసం కోరి, బలం నిరూపించుకుంటే మంచిదని భావిస్తున్నట్లు, ఇదే కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు తాజా ఆలోచనన్నట్లు వార్తలొస్తున్నాయి. "అవిశ్వాసం పెడతాం", అని ప్రకటించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి, "పెడితే పడగొట్టేందుకు సిద్ధం" అని అంటున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర రావుల వ్యూహానికి ఇది ప్రతి వ్యూహంగా అనుకోవచ్చు. ఈ లోపుగా, రాష్ట్ర రాజకీయ సమీకరణల పరిణామాలలో అనూహ్యమైన మార్పులొచ్చినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. ఈ దిశగా సన్నిహిత మంత్రులతో కిరణ్ కుమార్ రెడ్డి సంప్రదించినట్లు కూడా వార్తలొస్తున్నాయి. "విశ్వాస నిరూపణ" ఐనా, "అవిశ్వాస తీర్మానం" ఐనా, కిరణ్-కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో తోక జాడించే జగన్ వర్గం ఎమ్మెల్యేల పై, అనర్హత వేటు వేయడానికి ఇదొక చక్కటి అవకాశంగా మారొచ్చు. అలానే, మరో ఏడాది పాటు అవిశ్వాస తీర్మానం గురించి ప్రతిపక్షాలు మాట్లాడకుండా చేయవచ్చు. ప్రభుత్వం విశ్వాస నిరూపణకు వెళ్లినా, ప్రతిపక్షాలు అవిశ్వాసం ప్రతిపాదించినా, పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తుంది. దీనిని ధిక్కరించిన వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. జగన్ వర్గం ఎమ్మెల్యేలు తప్పనిసరిగా కిరణ్ ప్రభుత్వాన్ని బలపరచక తప్పదు.
"విశ్వాస నిరూపణ" ఐనా, "అవిశ్వాస తీర్మానం" ఐనా, ప్రభుత్వం నిలిచినా-పడిపోయినా, ప్రతిపక్షాలు ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికి, ప్రభుత్వం తాను చేపట్టిన పథకాల అమలు గురించి ప్రచారం చేసుకోవడానికి చక్కటి వేదిక లభించడం మాత్రం తప్పని సరి. కనీసం దీని కోసమన్నా తీర్మానాన్ని ఆహ్వానించాలి.
అయితే, ఓటింగ్ అంటూ జరిగి, ప్రభుత్వం శాసన సభ విశ్వాసాన్ని కోల్పోతే ఆ తర్వాత అధికారంలోకి ఏ పార్టీ వస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న!
ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ తెలుగు వెబ్ మీడియా - కెలుకుడు బ్లాగులు గానీ బూతు బ్లాగులు గానీ లేని ఏకైక సకుటుంబ సపరివార సమేత అగ్రెగేటర్ http://telugumedia.asia యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్‌లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి administrator@telugumedia.asia అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి.
ReplyDeleteఇట్లు నిర్వాహకులు
Thank You. You may do it please.
ReplyDelete