నిలోఫర్ ఆసుపత్రి "నెల నిండని శిశు" మరణాలు
వనం జ్వాలా నరసింహారావు
ముఖ్య మంత్రి, ఇటీవల సహచర మంత్రులతో జరిపిన ఇష్టాగోష్టి సమావేశంలో, శిశు మరణాలు అధికంగా చోటు చేసుకుంటున్న నిలోఫర్ ఆసుపత్రి ప్రస్తావన వచ్చిందని పత్రికలలో వార్తలొచ్చాయి. దీని కంటే ఒకటి రెండు రోజుల ముందు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్, భారత వైద్య మండలి సంయుక్తంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సదస్సులో ప్రధానోపన్యాసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య-వైద్య-కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్, రాష్ట్ర వ్యాప్తంగా శిశు మరణాల సంఖ్య ఏడాదికి 74 వేలకు పైగా వున్నాయని పేర్కొనడం జరిగింది. గిరిజనులలో-షెడ్యూల్డ్ కులాల వారిలో ఇతరుల కంటే శిశు మరణాల సంఖ్య చాలా అధికమని, వీటిని తగ్గించాలంటే వైద్య విద్య కళాశాలలు ముఖ్య భూమిక పోషించాలని డాక్టర్ రమేష్ సూచించారు. మెడికల్ కాలేజీలలో పనిచేస్తున్న డాక్టర్లు, కమ్యూనిటీ, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలతో సమన్వయం కుదుర్చుకుని పనిచేస్తే, శిశు మరణాల సంఖ్య తగ్గే అవకాశం వుందని కూడా ఆయన అన్నారు. ప్రభుత్వ-ప్రయివేట్ రంగంలోని ఆసుపత్రులన్నీ విధిగా గర్భిణీ స్త్రీల వివరాలను నమోదు చేసే కార్యక్రమం దిశగా "మాతా-శిశు ఆరోగ్య కార్డులు" ప్రవేశ పెట్టినట్లు కూడా ఆయన చెప్పారు. ఇదిలా వుంటే, యావత్ రాష్ట్రానికి, ఒకే ఒక్క "చిల్డ్రన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి" గా వున్న, హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రిలో, సగటున ప్రతి రోజు, పది-పదిహేను శిశు మరణాలు సంభవిస్తున్నట్లు కూడా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ సందర్భంగా ప్రకటించి, సంచలనం కలిగించారు. ఆయన చెప్పింది అక్షరాల నిజం. కాకపోతే, ఆ మరణాలను అరికట్టడం అంత కష్టమైన పనేమీ కాదు. ప్రభుత్వం పూనుకుంటే చాలా తేలిక.
అనారోగ్య శిశువు పుట్టిన ముప్పై రోజుల వరకు ఉచిత వైద్య చికిత్స, ఉచిత మందులు, అవసరమైన వినియోగ వస్తువులు, ఉచిత రోగ నిర్థారణ పరీక్షలు, ఉచితంగా రక్తం ఏర్పాటు, యూజర్ చార్జీల నుంచి మినహాయింపు, ఆసుపత్రికి రావడానికి-పోవడానికి ఉచిత రవాణా సౌకర్యం కలిగించే "జనని-శిశు సురక్ష" పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు పరిచే కార్యక్రమానికి జాతీయ సలహా మండలి చైర్ పర్సన్ సోనియా గాంధి, కేంద్ర ఆరోగ్యామాత్యుల సమక్షంలో, జూన్ ఒకటవ తేదీన లాంఛనంగా హర్యానా రాష్ట్రంలో ప్రారంభించారు. ఇంతవరకు వీటిలో కొన్నన్నా- కొన్ని రాష్ట్రాలలో నన్నా అమలు జరగడం లేదనడానికి, దేశవ్యాప్తంగా ఈ సౌకర్యం కలిగించాలన్న ఆలోచన ప్రభుత్వానికి రావడమే నిదర్శనం. ఏదేమైనా, ఇలాంటి కార్యక్రమం లేనందువల్లే, దేశవ్యాప్తంగా శిశు మరణాల సంఖ్య, ఆందోళన కలిగించే రీతిలో చేరుకుంటోంది.
హైదరాబాద్ నగరం నడి బొడ్డులో-రెడ్ హిల్స్ ప్రాంతంలో వున్న నిలోఫర్ దవాఖాన, ఆసియా ఖండంలోనే ప్రఖ్యాతిగాంచిన చిన్న పిల్లల ఆసుపత్రి. ఏనాడో, సుమారు ఆరు దశాబ్దాల క్రితం, తల్లీ-పిల్లల ఆరోగ్య అవసరాలకు, వంద పడకల ఆసుపత్రిగా వెలసిన నిలోఫర్ ఆసుపత్రి ఆదినుంచీ దానికి రెట్టింపు రోగులతో నిండిపోతోంది. దక్షిణ భారత దేశంలో అత్యంత ఆధునిక సదుపాయాల "పీడియా ట్రిక్ సంస్థ" గా పేరు తెచ్చుకున్న నిలోఫర్ ఆసుపత్రి విద్యార్థులు, జాతీయ-అంతర్జాతీయ స్థాయిలలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రసవ, చిన్నపిల్లల, శిశువుల, గర్భస్థ శిశు సంబంధమైన నాలుగు రకాల ప్రాముఖ్యత విభాగాలకు చెందిన ఆరోగ్య-వైద్య చికిత్సలకు నిలోఫర్ ఆసుపత్రి ప్రధాన కేంద్రం. ఈ తరహా ఆసుపత్రులలో, ఆసియా ఖండంలోని అతి పెద్ద వాటిలో నిలోఫర్ ఒకటి. నిలోఫర్ శిశు వైద్య విభాగం, భారత దేశంలో, అన్నింటి కంటే ముందర ఆధునీకరణ చేయబడింది. ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలందించడం, నిత్యం వ్యాధి నిరోధక టీకాలు వేయడం, చిన్న పిల్లల పౌష్టికాహార సేవలందించడం, పాఠశాలల విద్యార్థులకు ఆరోగ్య సహాయక సేవలందించడం, వీటికి అనుబంధంగా అవసరమైన దంత-నేత్ర-చెవి, ముక్కు, గొంతు సంబంధ చికిత్సలు సమకూర్చడం, నిలోఫర్ ఆసుపత్రి ప్రత్యేకత. ఇంత గొప్ప సేవలందిస్తున్న, ఈ ఆసుపత్రిలో, దురదృష్ట వశాత్తు, అను నిత్యం, అప్పుడే పుట్టిన పిల్లలతో సహా, శిశు మరణాల సంఖ్య పది నుంచి పదిహేను దాకా వున్నాయంటే, అదో తరహా "సామూహిక శిశు హత్యాకాండ" కాక ఇంకేమౌతుంది?
నిలోఫర్ ఆసుపత్రిలో నిత్యం చేరే రోగుల సంఖ్య సుమారు రెండు వందల వరకుంటుంది. ఐదువందల పడకలకే అనుమతి కలిగిన ఇక్కడ, ఎల్లప్పుడూ, రెట్టింపు సంఖ్యలో-వేయి మంది దాకా ఇన్-పేషంట్లు వుంటారు. ఇంత మందికి చేయాల్సిన వైద్య సపర్యలకు అందుబాటులో వున్న నర్సుల సంఖ్య అత్యంత స్వల్పం. వైద్య విద్యను అభ్యసించి బయట కాలిడే ముందు ప్రతి మెడికో చేసిన "హిప్పోక్రాటిక్ ప్రమాణం" కు కట్టుబడి పని చేసేందుకు, నిలోఫర్ లో పని చేస్తున్న ఏ ఒక్క డాక్టరుకు అవకాశం లేని రీతిలో ఆసుపత్రి భౌతిక-నైతిక నిబంధనలున్నాయక్కడ. నూటికి ఏబై శాతం అవకాశంతో బ్రతికే అవకాశం వున్న శిశువులను కాపాడే చర్యలు తీసుకోవాలా? లేక నూటికి తొంభై శాతం వున్న వారి వ్యవహారం చూడాలా? అన్న మీమాంసలో పడిపోతారిక్కడి వైద్యులు. అత్యవసర వైద్య సేవలకు అవశ్యం కావాల్సిన వెంటిలేటర్లు, మోనిటర్లు, ఇన్ ఫ్యూజన్ పంపులు, ఎమర్జెన్సీ మందులు అసలు లేకపోవడమో, వున్నా అవసరానికి చాలినంత మోతాదులో లభ్యం కాకపోవడమో ఇక్కడి ఆనవాయితీ. అత్యవసర వైద్య పరీక్షలైన బ్లడ్ గాస్ అనాలసిస్, ఎలెక్ట్రొలైట్స్, లివర్ ఫంక్షనింగ్ పరీక్షల లాంటి వాటికి సదుపాయం లేదు. వైద్య పరంగా ప్రామాణిక చికిత్సా విధానం అవలంభించడానికి వనరులు లేవు. ఫలితం ఎలా వుంటుందోనని ఆలోచించకుండా, ఎలాగైనా శిశువుల ప్రాణాలను కాపాడాలన్న పట్టుదలతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో, ఇక్కడ పనిచేసే వైద్యులు, ప్రత్యామ్నాయ నివారణ విధానాలను అవలంబిస్తున్నారు. అతి చిన్న ఆసుపత్రిలో కూడా ఇటీవల కాలంలో లభ్యమయ్యే డిజిటల్ ఎక్స్-రే సదుపాయానికి నిలోఫర్ నోచుకోలిదింకా. అందుబాటులో వున్న అత్యంత ఆధునిక అల్ట్రా సౌండు సిటీ స్కాన్ యంత్రాన్ని ఉపయోగించేందుకు సరైన సంఖ్యలో రేడియాలజీ డాక్టర్లు కాని, సాంకేతిక నిపుణులు కాని లేరు. ప్లేట్ లెట్స్, ఇమ్యునోగ్లోబులిన్, అల్బుమిన్, యాంటీ బయోటిక్ ఏ నాడూ సమకూర్చలేదిక్కడ. సరైన యాజమాన్య నియంత్రణా పద్ధతులు లేకుండా రోగులపై డ్రగ్స్ పరీక్షలు నిర్వహించే కార్యక్రమం యదేఛ్చగా కొనసాగుతోంది. వీరి వాక్సిన్లు ఉపయోగ పడుతున్నాయా? రోగులకు ప్రాణాంతకంగా మారుతున్నాయా అని పర్యవేక్షణ జరిపేవారే లేరు. వీటికి తోడు సహజంగా చోటు చేసుకున్న పౌష్టికాహార లోపం, యాంటీ నేటల్ పరీక్షలు జరపక పోవడం లాంటివి కూడా శిశు మరణాలకు, చిన్న పిల్లల మరణాలకు దోహద పడుతున్నాయి.
బీదల పట్ల, అస్వస్థులపట్ల, లోకోపకార దాతృత్వ బుద్ధి-సహానుభూతి మెండుగా వున్న, నిలోఫర్ రాజకుమారి, తన ఆలోచనలకు-భావాలకు అనుగుణంగా స్థాపించిన నిలోఫర్ దవాఖాన, ఆరు శతాబ్దాల సుదీర్ఘ ప్రస్తానంలో, ఎందరో అభాగ్యులకు-రోగులకు-మరణావస్తలో వున్న శిశువులకు, చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఎనలేని ఆరోగ్య-వైద్య సేవలందించింది. సాధ్యమైనంత మేరకు, ఇంకా అందించే ప్రయత్నంలో వుంది. టర్కీ దేశ రాజ వంశంలో జన్మించిన చిట్ట చివరి రాకుమారైన ప్రిన్సెస్స్ నిలోఫర్, హైదరాబాద్ ను ఏలిన ఆఖరు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రెండో కోడలు. ఎన్నో సంవత్సరాల వైవాహిక జీవితంలో పిల్లలు పుట్టని నిలోఫర్ యూరోప్ దేశంలోని పలువురు వైద్య నిపుణులను సంప్రదించినా ఫలితం కనిపించలేదు. అమెరికా కూడా వెళ్దామనుకుంటున్న సమయంలో, ఆమె దగ్గర పనిచేసే సేవకురాలు, ప్రసవ సమయంలో ఇబ్బందులకు గురై చనిపోయింది. ఆ రోజుల్లో, చిన్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడేందుకు, ప్రత్యేక వైద్య సేవలందించగల ఆసుపత్రి లేని విషయం నిలోఫర్ దృష్టికి వచ్చింది. అలాంటిది ఒకటి వుండి తీరాలన్న నిలోఫర్ పట్టుదల ఫలితమే 1953 లో హైదరాబాద్ రెడ్ హిల్స్ లో స్థాపించిన నిలోఫర్ ఆసుపత్రి.
ముప్పై రోజుల వయసు లోపు శిశువులు-అందునా అత్యంత ప్రమాదకర అనారోగ్య స్థితిలో వున్న శిశువులు, తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల నుంచి, ఆంధ్ర ప్రాంతానికి చెందిన గుంటూరు-వైజాగ్ జిల్లాల నుంచి, పొరుగు రాష్ట్రాలైన కర్నాటక-మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల నుంచి, ప్రతి రోజు భారీ సంఖ్యలో, వైద్య-శస్త్ర చికిత్సల కొరకు నిలోఫర్ ఆసుపత్రికి వస్తుంటారు. వీరే కాకుండా, పది-పన్నెండేళ్ల వయసు లోపు పిల్లలు, గర్భిణీ స్త్రీలు కూడా చికిత్స కొరకొస్తారక్కడకు. ప్రతి నెలా ఆసుపత్రిలో చోటు చేసుకునే సుమారు 500 ప్రసవం కేసులలో, ఎక్కువ భాగం క్లిష్టమైన వే వుంటాయి. వీటిలో మూడో వంతు సిజేరియన్ శస్త్ర చికిత్సై వుంటాయి. సాధారణ వార్డు, నెల నిండని శిశువుల వార్డు, గర్భిణీ స్త్రీల వార్డు, పిల్లల వార్డు, ఇతర ప్రత్యేక వార్డులు ఎల్లప్పుడూ కిక్కిరిసి పోయి కిటకిటలాడుతుంటాయి. వెయ్యి మందికి తక్కువ కాకుండా ఇన్-పేషంట్లుంటారు నిత్యం.
ఒక్క నెల నిండని శిశువుల వార్డులోనే 200 దాకా పడకలు నిండి పోతాయి. అంటు వ్యాధులు సోకకుండా వుండేందుకు, ఆసుపత్రిలో పుట్టిన పిల్లలకు, బయటి నుంచి వచ్చి చేరిన పిల్లలకు వేర్వేరు వార్డులుంటాయి. ఇందులోనూ, అతి తక్కువ బరువు తో పుట్టిన పిల్లలకు, మూర్ఛ వ్యాధికి లోనైన పిల్లలకు, శ్వాస పీల్చుకోవడం కష్ట తరమైన పిల్లలకు, కామెర్లు సోకిన పిల్లలకు, పాలు తాగలేని పిల్లలకు ప్రత్యేకించి, వేరే పడకల ఏర్పాటుంటుంది. సీరియస్ ఆనారోగ్యంతో వున్న శిశువులకు, "లెవెల్ మూడు" గా పిలువ బడే "నెల నిండని శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్" లో వుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు డాక్టర్లు. వీరిలో ఎవరి కన్నా పుట్టుకతోనే అంగవైకల్యం వుంటే, అది సరి చేసేందుకు, పీడియా ట్రిక్ శస్త్ర చికిత్స వార్డుకు పంపుతారు. ఇలా ఈ 200 పడకలలో వున్న శిశువులలో, అను నిత్య, రకరకాల రుగ్మతల వల్ల, రకరకాల ఇతర కారణాల వల్ల, పది-పదిహేను మంది చనిపోతుంటారని లెక్కలు చెపుతున్నాయి. దేశంలోని శిశుమరణాల సంఖ్య- పుట్టిన ప్రతి 1000 మందిలో 48 మంది-తో దాదాపు సమానం.
పీడియా ట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పన్నెండు పడకలు, నెల నిండని శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మరో ఆరు పడకలున్నాయి. పీడి యాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో నర్సింగ్ కేర్ అందించడానికి, ప్రతి ఇద్దరికి కనీసం ఒక్కరన్నా నర్స్ అవసరం. మూడు షిఫ్టులకు, ఆకస్మిక అవసరాలకు కలిపి మొత్తం పాతిక మంది నర్సులు ఇక్కడ కావాల్సి వుండగా ప్రభుత్వం నియమించింది ప్రస్తుతానికి ఆరుగురే! అలానే, ఇలాంటి నిష్పత్తిలో చూస్తే, నెల నిండని శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మరో పాతిక-ముప్పై మంది అవసరం వుంటే, నియమించింది ముగ్గురే! అలాంటప్పుడు శిశువుల ప్రాణాలు పోక ఏమవుతుంది? ఇక ఆ వార్డుల్లో డ్యూటీలో వున్న డాక్టర్ల పరిస్థితి అగమ్య గోచరం. అక్కడ చేర్పించిన పసికందుల్లో అందరినీ బ్రతికించగలుగాతమన్న ఆలోచన చేసే పరిస్థితులు వైద్యులకు లేవు. వైద్య కళాశాలలో చేసిన "హిప్పోక్రాటిక్ ప్రమాణం?, ఆరోగ్య-వైద్య వృత్తికి సంబంధించిన నైతిక విలువలకు కట్టుబడి పని చేస్తామని చెప్పిన మాటలు వారు పాటించే అవకాశమే లేదు. "అందరినీ కాదు-వీలైనంత మందినన్నా కనీసం బ్రతికించుదాం" అని రాజీ పడాల్సిన పరిస్థితులున్నాయక్కడ. అత్యంత ఎమర్జెన్సీ పరిస్థితుల్లో చేర్చబడిన అనారోగ్య పసి కందు ప్రాణాలను కాపాడాలంటే, వైద్య పరంగా కనీసం ఇరవై నిమిషాలు ఒకే శిశువు దగ్గర గడపడానికి డాక్టర్ల సంఖ్య సరిపోదు. అందుకే అక్కడ పని చేస్తున్న డాక్టర్లు, ఏబై శాతం బ్రతికే అవకాశం వున్న పిల్లలను వదిలి, తొంభై శాతం బ్రతికే అవకాశం వున్న పిల్లలకు వైద్యం చేస్తున్నారు. అంతకంటే గత్యంతరం లేదంటున్నారు వారు.
అసలున్నవే పదహారు వెన్టిలేటర్లు. వాటిలో పని చేసేవి నాలుగే! అంతర్జాతీయ వైద్య ప్రమాణాల ప్రకారం, ప్రతి వంద పడకల జనరల్ ఆసుపత్రికి, అధమ పక్షం ఐదన్నా పని చేసే వెంటిలేటర్లుండాలి. ఆసుపత్రికి అనుమతిచ్చిన 500 పడకలకు పాతిక వెన్టిలేటర్ల అవసరముంది. కాని ఎప్పుడూ 1000 పడకలు భర్తీ అవుతున్నాయిక్కడ. అంటే కనీసం 50-55 వెన్టిలేటర్ల అవసరముంది. ఇప్పుడు పని చేస్తున్నవేమో నాలుగే. శిశు మరణాలు సంభవించక ఏమౌతుంది? అలానే మానిటర్లు కాని, ఇతర అవసరమైన వైద్య పరీక్షలు కాని సక్రమంగా లేవిక్కడ. ఆర్థికంగా, చికిత్స చేయించే పరిస్థితిలో లేని ఒక తల్లి, చావుకు సిద్ధంగా వున్న తన పసి గుడ్డును ఆసుపత్రిలో వదిలి వెళ్లినప్పుడు, బ్రతికే అవకాశముండి కూడా తన కళ్ల ముందరే చనిపోబోతున్న పరిస్థితుల్లో, ఆ శిశువుకు కావాల్సిన "ప్లేట్ లెట్స్" ఆసుపత్రిలో లభించనందుకు ఒక డాక్టర్ పడ్డ బాధ వర్ణనాతీతం. అలానే మిగతావి కూడా.
గ్రామీణ స్థాయి నుంచి, రాజధాని స్థాయి వరకూ, నిరంతరం మాతా శిశు సంరక్షణకు, ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే జరిగే దారుణం ఇలానే వుంటుంది. ఉదాహరణకు, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో, ఇటీవలి వరకు నిర్వహించబడిన నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవల వల్ల, గ్రామీణ ప్రాంతాలలో, సుమారు పదమూడు లక్షల మందికి పైగా గర్బ్జిణీ స్త్రీలు ప్రసవానికి ముందు, ప్రసవం అనంతరం సరైన సమయంలో సరైన వైద్య పరీక్షలు చేయించుకుని, సరైన చికిత్స పొందారు. దాని మూలంగా కొంతలో కొంతైనా శిశు మరణాలు సంభవించకుండా నిరోధించే వీలైంది. ఇలాంటివే, ప్రభుత్వం చేపట్టి కొనసాగించితే బాగుంటుందేమో!
bluesoleil activation key
ReplyDeleteCrack
reimage license key 100 working