Tuesday, June 28, 2011

మూర్ఖుని మనసు మార్చగల మా?

మూర్ఖుని మనసు మార్చగల మా?

సేకరణ: వనం జ్వాలా నరసింహారావు

తెలిసిన వాళ్లకు చెప్పవచ్చు. తెలియని వాళ్లకూ చెప్పవచ్చు. తెలిసీ తెలియని వాళ్లకు చెప్పడం చాలా కష్టమంటారు. ఇదిలా ఉంటే, మరి కొంతమంది ది తాను మునిగింది గంగని, తాను వలచింది రంభని భావించే తత్త్వం. ఇటువంటి వాళ్లకు కూడా ఏమీ చెప్పలేం. అంటే మూఢులైన వాళ్లకు ఎంత చెప్పినా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టే అవుతుంది తప్ప ఎంతమాత్రం చెవికెక్కదు. ఈ విషయాన్ని భర్తృహరి చక్కటి ఉదాహరణలతో తేల్చి చెప్పేసాడు. మధురమైన భావయుక్తమైన ఆ సంస్కృత శ్లోకాన్నీ, దానికి అంతకంటే రమ్యంగా తెనిగించిన ఏనుగు లక్ష్మణ కవి రాసిన తెలుగు అనువాదాన్ని అందరూ చదవాల్సిందే.

భర్తృహరి శ్లోకం:

"లభేత సికతాసు తలమపి యత్నతః పీడయన్‌

పిబేచ్చ మృగతృష్ణ కాస సలిలం పిపాసార్దితః

కదాచిదపి పర్యటన్‌శశ విషాణ మాసాదయే

న్నతు ప్రతిని విష్ట మూంå జన చిత్త మారాదయేత్‌"

ఏనుగు లక్ష్మణకవి తెలుగు అనువాదం:

తివిరి యిసుమునఁ దైలంబుఁ తీయవచ్చు

దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుఁ

దిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చుఁ

జేరి మూర్ఖుల మనసు రంజింప రాదు.

మూర్ఖుల మనస్సును మార్చలేమన్న విషయాన్ని ఇంత చక్కగా చెప్పగలిగిన వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. అందుకేనేమో, ఈ పద్యాలు ఇంతకాలమైనా మనందరి నోటిలో నానుతూనే ఉన్నాయి. ఇందుకోసం వారు ఎన్నుకున్న ఉపమానాలు అద్భుతం.

సాధ్యం కాకపోయినా రోజుల తరబడి శ్రమించి ఎడారిలోని ఇసుకను గట్టిగా పిండి నూనెను తీయవచ్చట. అలాగే, ఎండమావుల (కంటికి అందినంత దూరంగా చూస్తే అక్కడ నీరు పారుతున్నట్టు భ్రమ కలగడం. అది చూసి మనం అక్కడ నిజంగా నీరు ఉందనే అనుకుంటాం. కానీ అక్కడ ఉండదు) లో తిరిగి తిరిగి నీటిని సంపాదించవచ్చు. అలాంటి చోట్ల కూడా ఏదో చేసి నీటిని సృష్టించవచ్చు. సాధు జంతు వైన కుందేలు తలకు కొమ్మే ఉండదు. ఆవులకూ, గేదెలకూ, దుప్పులకూ, మరి కొన్ని జంతువులకు కొమ్ము ఉంటుంది కానీ, కుందేలుకు మాత్రం కొమ్ము ఉండదు. కాబట్టి కుందేటి కొమ్ము లభ్యం కావడం అసాధ్యం. అయినప్పటికీ ఎంతో ప్రయత్నం చేసి కుందేటి కూడా సాధించవచ్చట!

ఇన్ని అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చు కానీ, మూర్ఖుని మనస్సును మాత్రం ఎంత ప్రయత్నించినా మార్చలేమన్నది దీని తాత్పర్యం.

(ఇన్ టర్ నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా...)

No comments:

Post a Comment