Wednesday, June 15, 2011

బొత్స రాజశేఖరీయం:వనం జ్వాలా నరసింహారావు

బొత్స రాజశేఖరీయం

సూర్య దిన పత్రిక (16-06-2011)

(సమన్వయ) కర్తవ్యం దిశగా వడి వడి అడుగులు

వనం జ్వాలా నరసింహారావు

అధిష్ఠానానికి మింగుడు పడని సమస్యలు! ... పట్టు బిగించడం కోసమే పదవుల పంపకం... బొత్స స్వామి కార్యం, స్వ కార్యం నిర్వహించగలరా? ... సీఎంకు హెచ్చరికలు, చురకలు!... ఇకనైనా బడుగులకు పాలనా పగ్గాలు లభించేనా!

బొత్స సత్యనారాయణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియామకం కావడంతో, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత, ఆ పార్టీలో తలెత్తిన విభేదాలు-వైషమ్యాలు-ధిక్కార స్వరాలు-నాయకత్వ లోపాలు-బహిరంగ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, అధిష్టానానికి తల బొప్పి కట్టించాయి. గత్యంతరం లేని పరిణామాల మధ్య జగన్మోహన్ రెడ్డి అధిష్టానానికి ఎదురు తిరిగారు. రోశయ్యను దింపి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్య మంత్రి పీఠంలో కూచోబెట్టడంతో, దింపుడు కళ్లెం ఆశ సహితం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి, పార్టీకి-పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి, తల్లి విజయమ్మతో శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయించి, వైఎస్సార్ కాంగ్రెస్ ను స్థాపించి, తండ్రి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ టికెట్ సంపాదించి ఎమ్మెల్యేలైన కొందరిని తన శిబిరానికి తెచ్చుకోవడం మొదలెట్టారు. కడప-పులివెందుల ఎన్నికలలో అఖండ విజయం, ఎమ్మెల్యేలు ఒకరి వెంట మరొకరు జగన్ శిబిరంలో కొంత రహస్యంగా-కొంత బహిరంగంగా చేరడం, కాంగ్రెస్ అధినాయకత్వానికి మింగుడు పడని సమస్యై పోయింది. ఈ లోపు దిగ్విజయ్ స్థానంలో పాత కాపు గులాం నబీ ఆజాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించి, తనదైన శైలిలో కాయ కల్ప చికిత్స మొదలెట్టాడు. ఆ క్రమంలోనే కిరణ్ కుమార్ రెడ్డిని పాలనాపరంగా-పార్టీ పరంగా బలోపేతం చేయడానికి రంగం సిద్ధం చేసింది అధిష్టానం. నాలుగు నెలల పైగా పెండింగులో పెట్టిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఉప ముఖ్య మంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పదవులను భర్తీ చేయడం జరిగింది.

తన జీవితాశయం రాష్ట్ర ముఖ్య మంత్రి కావడం అని కుండ బద్దలు కొట్టి చెప్పుతున్న బొత్స సత్యనారాయణ, గతంలో ఏ పిసిసి అధ్యక్షుడు చేయడానికి సాహసించని విధంగా, సమాంతరంగా "మంత్రి వర్గ సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు" నిర్వహించడం ఆరంభించారు. ప్రభుత్వ పథకాలను, కాంగ్రెస్ పార్టీ పథకాలుగా ప్రచారం చేయడంలోనే పార్టీకి లాభముంటుందని ఆయన గ్రహించడం వెనుక ఒక వైపు రాబోయే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడం, మరో వైపు పార్టీ అధ్యక్షుడుగా తాను బలపడడం, ఆయన జీవితాశయం నెరవేర్చుకోవడం కారణమై వుండాలి. సహచర మంత్రుల వద్దకు కూడా వెళ్ళి, సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీస్తున్నారు. గ్రేట్ బొత్స గారు అనిపించుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి పథకాలకు పునరుజ్జీవనం పోసే దిశగా బొత్స అడుగు వేయడం కూడా గమనించాల్సిన విషయం. ఉదాహరణకు, ఆరోగ్య-వైద్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డిని కలిసి, రాజీవ్ ఆరోగ్య శ్రీ-104-108 పథకాలకు నిధులు పెంచాలని, పటిష్టంగా అమలు చేయాలని కోరడం, కాంగ్రెస్ పట్ల ప్రజలకు సడలుతున్న నమ్మకాన్ని పునరుద్ధరించడమే కావచ్చు.

భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటలు, సూర్యుడి చుట్టూ తిరగడానికి మున్నూట అరవై ఐదు రోజులు పడుతుంది. "భూ భ్రమణం", "భూ పరిభ్రమణం" అని భౌగోళిక శాస్త్రవేత్తలు పిలిచే ఈ ప్రక్రియ ఏక కాలంలో జరుగుతుంది. ఇలాంటిదే మన సత్తిబాబు, పిసిసి అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు నిర్వహించి నన్ని రోజులు (పోనీ నిర్వహించడానికి అధిష్టానం అవకాశం ఇచ్చి నన్ని రోజులు) చేయాల్సిన పని. రాష్ట్రంలోని బడా-చిన్న నేతలను కలవడానికి, కలిసి వారి మద్దతు కూడగట్టుకోడానికి, కట్టుకుని అధిష్టానం తనకు అప్పగించిన స్వామికార్యం-స్వకార్యం నెరవేర్చడానికి, జిల్లాల-మండలాల స్థాయిలో తిరగడానికి రోజుకున్న ఇరవై నాలుగు గంటలు సరిపోతాయో? లేదో? అలానే, తనను పిసిసి పీఠం మీద కూచోబెట్టిన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి-వారి కోరికలు (ఏమన్నా వుండక పోతాయా!) తీర్చడానికి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. భూ భ్రమణం-పరిభ్రమణం లాగా ఇటు రాష్ట్రంలోను, అటు ఢిల్లీ చుట్టూ చేయాలి. ఈ క్రమంలో ఆయన నుంచి అధిష్టానం ఆశించింది జరగకపోతే, అది మరో ప్రహసనంగా మారి పోవచ్చు కూడా.

"రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లు-చెవులు కాంగ్రెస్ పార్టీనే సుమా!" అని పీసీసీ అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టిన మరు క్షణంలోనే, బొత్స సత్యనారాయణ, ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఒక హెచ్చరిక లాంటిది చేయడం వెనుక, ఎటువంటి ని గూడార్థం ఇమిడుందని రాజకీయ విశ్లేషకులు శోధిస్తున్నారు. అసలింతకీ, ఆ విషయం ముఖ్య మంత్రికి తట్టిందో-లేదో మరి. పార్టీ పరంగా ప్రభుత్వానికి కళ్లు-చెవులు ఇప్పుడే పుట్టుకొచ్చాయా? లేక భూత-భవిష్యత్-వర్తమాన కాలాలలో ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో అధికారంలో వున్నా, పార్టీనే ప్రభుత్వపు కళ్ళు-చెవులుగా, ఆయా సందర్భాలలో ముఖ్య మంత్రులుగా పనిచేసిన వారు భావించారా? లేదా? ఇవన్నీ సమాధానం దొరికీ-దొరకని భేతాళ ప్రశ్నలు. ఆయన మనసులోని భావాలే వైనా, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డితో చెట్టా-పట్టాలేసుకుని, కలిసి-మెలిసి పని చేసుకుంటూ, పార్టీని "మరింత బలోపేతం చేస్తాను" అని బొత్సా స్పష్టం చేయడం మాత్రం, (కిరణ్ కుమార్ రెడ్డి అనుకున్నా-అనుకోక పోయినా, పత్రికల వారందరు అనుకుంటున్నట్లు) ముఖ్య మంత్రికి కొంత రిలీఫ్ గానే భావించాలి! బొత్స మార్కు వ్యాఖ్య మరొక టి కూడా ఆశ్చర్యకరంగానే వుందనాలి. తాను ఎవరికీ చీఫ్ కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ కార్య కర్తలకు, ఢిల్లీలో అధిష్టానానికి సంధాన కర్తగా మాత్రమే వ్యవహరిస్తానని శలవిచ్చారాయన. పనిలో పనిగా, తననింతవాడిని చేసిన "దైవం" సోనియా గాంధీకి, "పూజారి" గులాం నబీ ఆజాద్‌ కు, ఈ ఇరువురి మధ్య సమన్వయ కర్తలుగా వ్యవహరించి తనకు ఆ పదవి కట్టబెట్టడంలో తోడ్పడిన జాతీయ-రాష్ట్ర స్థాయి ప్రముఖ నాయకులందరి కీ, పేరు-పేరునా కాకపోయినా, ప్రత్యేకమైన తరహాలో సభా ముఖంగా ధన్యవాదాలు తెలియ చేసుకున్నారు.

పార్టీ అభివృద్ది కోసం కాంగ్రెస్‌ పెద్దలు చెప్పినవి వింటానని-సూచనలు పాటిస్తానని, సీనియర్లతో అహర్నిశలు చర్చించి-పార్టీకి "పూర్వ వైభవం" తీసుకొస్తానని, ముఖ్యమంత్రితో కలసి "పార్టీని బలోపేతం చేస్తానని" కూడా బొత్స అంటున్నారు. తనకు "ఎలాంటి సొంత ఆలోచనలు లేవు" అని, "పార్టీ అధినేత్రి నిర్ణయమే తనకు శిరోధార్యం" అని, అనడంతో అధినేత్రి దృష్టిలో మరికొన్ని మార్కులు అదనంగా తెచ్చుకున్నారు. టీవీలు, పేపర్లలో ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వం చేస్తోన్న పథకాలు జనం లోకి పోవని, పరోక్షంగా ముఖ్య మంత్రికి ఒక "అఫెన్సివ్" చురక అంటించారు. అలా అంటూనే, మళ్లీ "డిఫెన్సివ్" గా, ముఖ్య మంత్రితో తనకు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, ఇద్దరం కలిసి పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని స్పష్టం చేశారు. బొత్స "అఫెన్సివ్" చురకలకు, "డిఫెన్సివ్" స్నేహ హస్తానికి అదే మోతాదులో ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా స్పందించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు తనకు మధ్య ఎటువంటి భేదాభి ప్రాయ లేవని, భవిష్యత్తులోనూ ఉండవని (?) ఆయన స్పష్టం చేశారు. వారిరువురు తాము చెప్పిన దానిని ఆచరణలో చూపబోతున్నామని చెప్పడానికి సంకేతంగా, ఇద్దరూ కలసి గద-కత్తిని ఎత్తారు. మరో అడుగు ముందుకు వేసి, క్రికెట్ ఆటగాడైపోయారాయన కొంచెం సేపు. తాను, బొత్స, రాజ నరసింహ, స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, డిప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టి విక్రమార్క (ఎవరు కెప్టెన్, వైస్ కెప్టెన్, ఓపెన్ బౌలర్, ఓపెన్ భాట్స్ మెన్? అనేది చెప్పలేదు) 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం కోసం, "సెలెక్టర్" సోనియా గాంధీ ఎంపిక చేసిన ట్వెన్టీ-ట్వెన్టీ క్రికెట్ టీం సభ్యుల లాంటి వారమని అన్నారు. ముఖ్య మంత్రి తన టీంను క్రికెట్ టీంతో పోల్చడాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేశవ రావు తప్పుబట్టారు. 2014 ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాకుండా, "రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసేందుకు" కూడా కృషి చేస్తామని సీఎం కిరణ్‌ చెప్పారు. మన్మోహన్ సింగ్ ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా దేశ ప్రధానిగా వున్నారు కదా! ఆయనతో సంప్రదించి ముఖ్య మంత్రి ఆ ప్రకటన చేశారా? లేక, స్వయంగా ఆయన నిర్ణయమా అది? గతంలో రోశయ్యను, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని, వారింకా ముఖ్య మంత్రులుగా వుండగానే, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్య మంత్రిని చేయాలని కొందరు కాంగ్రెస్ సభ్యులు (జగన్ ఇంకా కాంగ్రెస్ సభ్యుడుగా వున్నప్పుడు) డిమాండు చేయడంలో తప్పులేదే మో!

బొత్స సత్యనారాయణ, తెలంగాణ సమస్య విషయంలో ఆచి-తూచి మాట్లాడారు. తెలంగాణపై తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన చెప్పిన దాంట్లో నిజాయితీ ఒకింత కనిపించినా, అదే వేదికపై, అఖిల తెలంగాణ ప్రజలు అసలు-సిసలు తెలంగాణ వాదిగా భావిస్తున్న కేంద్ర మంత్రి, మేధావి జైపాల్ రెడ్డి మాత్రం, తన మనసులో మాట బయట పెట్టారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నవాళ్లు ప్రాంతీయ వాదులు-ఉప ప్రాంతీయ వాదులు కాదని, ప్రపంచంలోనే కాంగ్రెస్‌ అతిపెద్ద జాతీయ పార్టీ అని (?), భారతీయ జనతాపార్టీ (తెలంగాణ ఏర్పాటుకు మద్దతిస్తున్న) కి సైద్దాంతిక-భౌగోళిక శక్తి లేదని, కమ్యూనిస్టు పార్టీలకు భౌగోళిక శక్తి ఉంది కాని సైద్దాంతిక శక్తి లేదని, తన మేధ మధనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలకు వెల్లడి చేశారు. సరిగ్గా ఆరు నెలల క్రితం, కాంగ్రెస్ అధిష్టానం, రోశయ్య స్థానంలో ముఖ్య మంత్రిగా జైపాల్ రెడ్డి పేరును పరిశీలించిందన్న వార్తల నేపధ్యంలో, ఆయన అన్నట్లుగా ఢిల్లీ పత్రికల్లో వచ్చిన వ్యాఖ్యలకు (అధిష్టానం తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రదర్శించి తేనే తాను ముఖ్య మంత్రి పదవిని ఒప్పుకుంటానని జైపాల్ రెడ్డి అన్నట్లుగా!) నేటి వ్యాఖ్యలకు పొంతనే లేదు. సహజంగానే, జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో దుమారం లేపడం, ప్రత్యేకంగా ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం, వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం, మరో మారు పరోక్షంగా ప్రత్యేక తెలంగాణ అంశం ఇప్పట్లో తేలేదికాదని చెప్పడం, అసలింతవరకు కేంద్ర మంత్రివర్గంలో దీని గురించి చర్చకూడా జరగలేదనడం, చిదంబరం డిసెంబర్ తొమ్మిది ప్రకటన వెనుక తన బాధ్యత ఏమీ లేదనడం, కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్న మరో నాటకంలో ప్రధానాంశాలుగా పరిగణించాలి. తెలంగాణ ఏర్పాటు కావాలని కోరుకునేవారి వాదన సమంజసమా? కాదా? అనే విషయం కాసేపు పక్కన పెడితే, జైపాల్ రెడ్డి ది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను జాతీయ వాదం కానే కాదని, నిఖార్సైన అవకాశ వాదమని, ఆయన ఎంత వేగంగా పార్టీలు మార గలరో అంతే వేగంగా మాటలను కూడా మార్చగలరని అనక తప్పదు. బోఫోర్సు కుంభకోణంలో అయన వేసిన రంకెలను కాంగ్రెస్ పార్టీలో చేరాక ఆశీర్వచనాలుగా మార్చ గలిగిన సత్తా ఆయన కుంది. ప్రత్యేక రాష్ట్రం కోరడం జాతీయ వాదానికి ఎలా వ్యతిరేకమవుతుందో జైపాల్ రెడ్డే చెప్పాలి. భారత దేశం ఒక వైపు "ఏక కేంద్రక ప్రభుత్వమైతే", మరోవైపు "సమాఖ్య తరహా ప్రభుత్వం" కూడా. ఆ విషయం ఆయనకు తెలియదా?

ఈ నాటకీయ పరిణామాల మధ్య, రాబోయే రోజుల్లో ఏం జరుగబోతుంది? కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన ఏంటి? బొత్సను అధ్యక్షుడుగా చేయడం వెనుక రహస్యం ఏంటి? అధిష్టానం ఆయనకు అప్పగించిన పనిని నెరవేర్చగల సామర్థ్యం వుందా? ఒకవేళ వున్నా ఆయనను సజావు గా పనిచేయనిస్తారా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నినాదం ఒక వైపు, జగన్ సవాళ్లు మరో వైపు బొత్సకు తలనొప్పిగా మారుతాయా? 2004 ఎన్నికలలో ఓడిపోయి, అంచలంచలుగా, రాజకీయ వ్యూహంలో తన చతురతను ప్రదర్శించుకుంటూ, 2009 ఎన్నికలలో గతంలో కంటే రెట్టింపు స్థానాలను సాధించి, 2014 ఎన్నికలొచ్చేసరికి అధికారం చేజిక్కించుకునే ధీమాతో ముందుకు సాగుతున్న తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడిని ఎదుర్కునేందుకు బొత్స సరిపోతా రా? ఇవన్నీ రాజకీయ విశ్లేషకుల ముందున్న ప్రశ్నలు.

పూర్వ వైభవం తెస్తానని బొత్స అంటున్నారు. పూర్వ వైభవం అంటే, 2004 కు ముందున్న వైభవమా? 2009 ముందు వైభవమా? అంత కంటే మరోటా? 1999 ఎన్నికలలో పిసిసి అధ్యక్షుడుగా చేసిన వ్యూహాత్మకమైన తప్పులను, శాసన సభలో ప్రతి పక్ష నాయకుడుగా 2004 ఎన్నికలలో సరిదిద్దుకుని-తనకిష్టం లేకపోయినా తెలంగాణ రాష్ట్ర సమితితో ఒప్పందం కుదుర్చుకుని, ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాల ఆధారంగా ఘన విజయం సాధించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు రాజశేఖర రెడ్డి. అప్పట్లో పిసిసి అధ్యక్షుడుగా వున్న డి. శ్రీనివాస్ ను కాదని, ఆనవాయితికి విరుద్ధంగా రాజశేఖర రెడ్డిని ముఖ్య మంత్రిని చేసింది అధిష్టానం. ఆయన చేసిన వాగ్దానాలను నమ్మి గెలిపించిన ఓటర్లు, అవి ఆయన అమలు పరిచి ధీమాగా 2009 ఎన్నికలలో కొత్త వాగ్దానాలేవీ చేయకుండా పోటీ చేసినప్పుడు, అదే ఓటర్లు అత్తెసరు మార్కులతో గెలిపించారు తప్ప అఖండ విజయం చేకూర్చలేదు. దాదాపు కాంగ్రెస్ పార్టీని ఓడించినట్లే ఒక విధంగా! అప్పట్లో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ నాయకుడు. ఇక ఇప్పుడు-భవిష్యత్ లో ఆయన నాయకత్వానికి వారసుడు జగన్మోహన్ రెడ్డి అయిపోయారు. కడప ఎన్నికలలో అది నిరూపణ ఐంది కూడా. రెడ్డి నాయకులంతా ఆయన వెంట వెళ్దామంటున్నారు. అందుకే, కాంగ్రెస్ వల పన్నింది. ఆ వలలో చిరంజీవి పడ్డారు మొదలు. ఇప్పుడున్న వారిలో బొత్సకున్న నాయకత్వ లక్షణాలను గ్రహించిన అధిష్టానం ఆయనను అందలం ఎక్కించింది. వెనుకబడిన వర్గాల వారితో సహా, అన్ని వర్గాల వారిని, తన వెంట తిప్పుకోగల సమర్థుడాయన అని నమ్మింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఇంతవరకు అగ్ర కులాలకు చెందిన నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, పివి నరసింహారావు, జలగం వెంగళ రావు, కొణిజేటి రోశయ్య, భవనం వెంకటరాం, ఎన్ టీ రామా రావు, నాదెండ్ల భాస్కర రావు, చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి కాగలిగారు. తన తర్వాత ముఖ్య మంత్రి కాగలిగిన అవకాశాలున్న అల్లూరి సత్యనారాయణ రాజును కాకుండా చేసే వ్యూహంలో భాగంగా దళిత కులానికి చెందిన వ్యక్తి దామోదరం సంజీవయ్యను, ముఖ్య మంత్రి అయ్యేందుకు సంజీవరెడ్డి మద్దతిచ్చారు. అలానే రాజారాం అవకాశాలను దెబ్బ తీశారు. కాకపోతే ఇందిరా గాంధి అండ దండలతో ఒక సారి టంగుటూరి అంజయ్య ముఖ్య మంత్రి కాగలిగారు. కాపులకు ఇంకా అవకాశం రానే రాలేదు. ఇకనైనా కాపు నాయకుడు బొత్సకు ఆ దిశగా భవిష్యత్ వుందేమో వేచి చూడాలి.

బొత్స సమర్థత, కార్య దక్షత నిరూపించుకోవాలంటే, రాష్ట్రంలో అందరినీ కలుపుకు పోయి, ఢిల్లీలో అందరి మన్ననలను పొందాలి. అందుకే రాష్ట్రంలో "భ్రమణం", ఢిల్లీ చుట్టూ "పరి భ్రమణం" తప్పదు. 2014 ఎన్నికలు-లేదా అంతకన్నా ముందే జరిగే అవకాశం వున్న ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీని గెలిపించు తాయా? గెలిపించినా బొత్సకు ముఖ్య మంత్రి పీఠం దక్కుతుందా? దక్కనిస్తారా? ఏమో! ఆల్ ద బెస్ట్!

No comments:

Post a Comment