Sunday, June 5, 2011

గాంధి, వినోబా, భన్సాలీల స్ఫూర్తి లేని రాందేవ్ బాబా “సర్కారీ“ లీలలు:వనం జ్వాలా నరసింహా రావు

గాంధి, వినోబా, భన్సాలీల స్ఫూర్తి లేని

రాందేవ్ బాబా సర్కారీలీలలు

వనం జ్వాలా నరసింహారావు

బాబా రాందేవ్ అన్నంత పనీ చేశాడు. ఆమరణ నిరాహార దీక్షకు దిగనే దిగాడు. సామ-దాన-భేద-దండోపాయాలను ప్రయోగించింది ప్రభుత్వం వ్యూహాత్మకంగా. ఐనా... అవినీతి అలానే వుంది..పది కాలాల పాటు వుంటుంది....దాని పునాదులు, గోడలు అంత పటిష్టమైన వి. అవినీతి నిర్మూలన అంటూ గొంతు చించుకునే వారికి కూడా ఆ పాపంలో కాస్తో-కూస్తో భాగం లేదనలేం. రాందేవ్ లాంటి వారు, ఒక లక్ష్యం-ధ్యేయం లేకుండా, ఆచరణ సాధ్యం కాని కోరికలు కోరుతుంటే, అమలు పరచటం వీలు కాని కాల వ్యవధిలో నెరవేరాలంటుంటే, దానర్థం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమా? లేక ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యకలాపాలకు పరోక్షంగా సహకారం అందించడమా? కోట్లాది రూపాయల విలువ కలిగిన ఒక ద్వీపాన్నే (ఒక దేశంతో సమానం) భారత దేశం వెలుపల, తన కంటూ సొంతం చేసుకోగల సమర్థుడికి, (విదేశ బాంకుల్లో దాచుకున్న) సహచర భారతీయుల నల్ల ధనాన్ని జాతీయం చేయమని అడిగే నైతిక హక్కు ఎవరిచ్చారు? అలానే, ఆయన చేసిన డిమాండును అంగీకరించే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారు? జవాబు దొరకని ప్రశ్నలు.

అవినీతికి, నల్లధనానికీ వ్యతిరేకంగా జూన్ నాలుగు నుంచి నిరవధిక నిరాహారదీక్ష మొదలుపెడతానన్న రాందేవ్ బాబా, తన లక్ష కిలోమీటర్ల "భారత స్వాభిమాన యాత్ర" ను ఉజ్జయినిలో ముగించుకుని, ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరి అక్కడి విమానాశ్రయం చేరుకోవడానికి ముందే, ఆయన అనుగ్రహం కోసమా అన్న చందాన, ఆయనతో చర్చించే నెపంతో, కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్‌ సిబాల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పవన్‌ కుమార్ బన్సాల్, పర్యాటక శాఖ మంత్రి సుబోధ్‌ కాంత్ సహాయ్ క్యాబినెట్ సెక్రటరీ కే ఎం చంద్రశేఖర్ వంటి అతిరథ-మహారథులు అక్కడకు వెళ్లడం కంటె విడ్డూరం ఇంకో టి లేదే మో! అంత కంటే మరీ హాస్యాస్పదం, ఆయనతో చర్చలు జరిపిన అనంతరం కపిల్ సిబాల్ ఆయనగారికి ఇచ్చిన "టెస్టిమోనియల్". "రాందేవ్ దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తారు. అవి చాలా ముఖ్యమైన జాతీయ అంశాలు. వాటి పరిధి చాలా విస్తృతం. వాటికి మేం ప్రాథమికంగా స్పందించాం" అన్నది దాని సారాంశం. తనను తాను సాక్షాత్తు దైవాంశ సంభూతుడుగా, ఒక దేవ దూతగా భావిస్తున్న బాబా రాందేవ్ మరో టెస్టిమోనియల్ ను మీడియాకు చూపించారు. నిరాహార దీక్ష విరమించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారని, ఐనా, దేశాన్ని రక్షించడం కోసం నిరశన ప్రారంభించాలనే నిర్ణయానికొచ్చానని, విదేశాల్లో ఉన్న మొత్తం నల్లధనాన్ని స్వదేశానికి తిరిగి తీసుకు రాగలననే పూర్తి ఆత్మ విశ్వాసం తనకున్న దని దాని సారాంశం.

బాబా గారి డిమాండ్లు మాములు వి కావు... విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న కోట్లాది రూపాయల నల్ల ధనాన్ని వెనక్కి తెప్పించాలని, దేశంలో అవినీతిని నిర్మూలించడానికి బలమైన లోక్‌ పాల్ బిల్లును రూపొందించాలని, ప్రజా పంపిణీ చట్టం పటిష్టంగా అమలు కావాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా అవినీతి కేసుల విచారణ పూర్తిచేసి శిక్షార్హులకు ఏకంగా ఉరిశిక్ష విధించాలని, స్వతంత్ర భారత దేశంలో ఇంకా అమలవుతున్న బ్రిటిష్ కాలం నాటి చట్టాలను రద్దు చేయాలని...ఇలాంటివే మరి కొన్ని కావాలని, ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారాయన. సర్కారీ రాందేవ్ బాబా సత్యాగ్రహం కోసం రాంలీలా మైదానంలో ఏర్పాట్లు కూడా ప్రభుత్వమే చేసింది. తాగునీరు, విద్యుత్, పారిశుధ్య వసతులు కల్పించే ఏర్పాట్లు కూడా చేసింది. మైదానం ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టడం కూడా జరిగింది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా?

ఈ లోపు కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశమై పరిస్థితి చక్కదిద్దే చర్యల గురించి చర్చించింది. చర్చలు జరుపుతూనే... దీక్షను విరమింప చేసేందుకు మధ్యవర్తులను పురమాయించింది. అవకాశం దొరికినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వెనుకాడని భారతీయ జనతా పార్టీ బాబా రాందేవ్‌ కు తన పూర్తి మద్దతు ప్రకటించింది. జన లోక్‌పాల్ బిల్లు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రభుత్వం నుంచి హామీ తీసుకుని దీక్ష విరమించిన అన్నాహజారే సహచరులైన శాంతిభూషన్ ప్రభృతులు కూడా రాందేవ్‌ బాబాకు మద్దతు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సహితం తన సంఘీభావం తెలిపారు. ద్వంద్వ నీతికి పర్యాయపదమైన కాంగ్రెస్ పార్టీ, తమ పార్టీకి చెందిన కొందరు నాయకుల ద్వారా రాందేవ్ దీక్షకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లు ఒక వైపు కన్పించుతూనే, మరో వైపు బాబా దీక్షపై తొలినుంచీ నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్ తో ఆయన పై విమర్శలను గుప్పించింది. బాబా సన్యాసి కాదనీ, వ్యాపార వేత్తనీ ఆయనతో అనిపించింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) హస్తం గురించి కూడా దిగ్విజయ్‌ సింగ్ ప్రస్తావించారు.

చివరకు రాందేవ్ దీక్షను విరమింప చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన విశ్వప్రయత్నం విఫలం కావడంతో, తమ మధ్య ఇంకా రాజీ కుదరలేదని, జూన్ నెల నాలుగో తేదీ నుంచి దీక్ష చేస్తానని, ఆయన ప్రకటించారు. "ఏ విధమైన ఒప్పందం రాందేవ్ కు, ప్రభుత్వానికి మధ్య" కుదిరిందో కాని, తమ మధ్య "ఏకాభిప్రాయం కుదురుతోందని" మాత్రం ఒకానొక సందర్భంలో ఆయనన్నారు. అంతా గోప్యమే! "అవినీతిని నిర్మూలించండి, నల్ల ధనాన్ని వెనక్కి తీసుకురండి" అంటు, ఉద్యమ నినాదాన్ని ఆయన ప్రకటించారు. రాందేవ్ బాబాకు ఎందుకంత ప్రాధాన్యతివ్వాలో కాని, రాందేవ్‌ తో కేంద్ర మంత్రుల చర్చల పర్యవసానాన్ని సాక్షాత్తు ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ కు వివరించే దాకా వెళ్లింది. రాందేవ్‌ తో చర్చించేందుకు ఆర్ధిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ స్థాయి నాయకుడు తన కోల్‌ కత పర్యటనను వాయిదా వేసుకున్నారు. మరో మంత్రి వీరప్ప మొయిలీ కూడా మంగళూరు పర్యటనను వాయిదా వేసుకున్నారట. ఇవన్నీ రాందేవ్ బా "సర్కారీ లీలలు" కాక మరేంటి?

అంతా అందరనుకున్నట్లుగానే "మధ్యంతరం" అయింది. బాబా రామ్‌ దేవ్ జూన్ నాలుగో తేదే శనివారం తెల్లవారు జామున చేపట్టిన ఆమరణ దీక్ష ఒక రోజన్నా గడవక ముందే భగ్నమైంది. ఆయనను అరెస్టు చేశారా? కిడ్నాప్ చేశారా? చేయించింది ప్రభుత్వమా? కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి? అన్నవి ప్రశ్నార్థకంగా వుండి పోయాయి. వ్రతం చెడింది...ఫలితం దక్కలేదు. సర్కారు అనుకున్న ది సాధించింది...రాందేవ్ బాబా కూడా అన్న పని చేశాడు. అవినీతి మాత్రం తనను ఎవరూ, ఏమీ చేయలేరని అపహాస్యం చేస్తూ, మందహాసం చేసింది.

ఈ నేపధ్యంలో, మన రాష్ట్రంలో, ఖమ్మం జిల్లా-ముదిగొండ మండలం లోని వల్లభి గ్రామంలో, సుమారు నాలుగున్నర దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనను జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అప్పట్లో టైమ్, న్యూస్ వీక్ లాంటి అంతర్జాతీయ పత్రికలు, బ్రిడ్జ్, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ లాంటి జాతీయ ప్రముఖ పత్రికలు ఆ గ్రామంలో జరిగిన సంఘటనలను పూస గుచ్చినట్లు ప్రచురించాయి. ఇక స్థానిక రాష్ట్ర స్థాయి పత్రికలు సరే సరి. సంఘసంస్కర్త-స్వాతంత్ర్య సమరయోధుడు-జాతిపిత మహాత్మాగాంధీ ఆధ్యాత్మిక వారసుడు-శాంతి, గ్రామ స్వరాజ్యం, హరిజనోద్ధరణే ధ్యేయంగా పెట్టుకున్న పవనార్‌ ఆశ్రమవాసి ఆచార్య వినోబా బావే, అనుంగు శిష్యుడు, ఆయనంతటి ప్రముఖుడుగా పేరొందిన ఆచార్య భన్సాలి, ఆ గ్రామానికొచ్చి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అది కూడా రాందేవ్ బాబా లాగా, అట్టహాసంగా, సర్కారు చేసిన భారీ ఏర్పాట్ల మధ్య, తెచ్చి పెట్టుకున్న లక్షలాది మంది మద్దతు దార్ల మధ్య కాదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక దళితుడు పూజారిగా పనిచేస్తున్న స్థానిక రామాలయంలో దీక్షకు దిగారు. ఆయనకు అంతకు ముందు ఆ గ్రామం గురించి ఏ మాత్రం తెలియదు. ఆయనకు తెలియ చేయబడిందల్లా, ఆ గ్రామంలో, అగ్రవర్ణాల భూస్వాములకు-దళిత వర్గాల బీద వారికి మధ్య జరిగిన ఘర్షణలో, దళితులు గ్రామ బహిష్కరణకు గురయ్యారని, వారు గ్రామంలోకి రావడానికి తాను పూనుకోవాలని మాత్రమే. అంతే, వెనుకా-ముందు చూడ కుండా, హుటాహుటిన బయల్దేరి, ఏ ఆర్భాటం చేయకుండా, గ్రామానికొచ్చి దేవాలయంలో నిరాహార దీక్షకు దిగారు. ఆయన డిమాండు నెరవేరింది. ఆ దీక్షకు, ఒక నిర్దుష్టమైన-సహేతుకమైన కారణం వుంది.

అప్పట్లో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ ముఠా రాజకీయాలకు వల్లభి గ్రామం దళితులు బలయ్యారు. నీలం సంజీవ రెడ్డి గ్రూపుకు చెందిన జలగం వెంగళ రావు పక్షాన వున్న గ్రామ అగ్ర వర్ణాల వారికి, కాసు బ్రహ్మానంద రెడ్డి గ్రూపుకు చెందిన శీలం సిద్దారెడ్డి పక్షాన వున్న దళితులకు "వల్లభి" గ్రామం ఒక భూ పోరాటానికి" వేదికైంది. దళితుల భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేసిన అగ్ర వర్ణాల వారికి, దళితులకు మధ్య వివాదం ఘర్షణలకు దారితీసింది. దళితులను భయబ్రాంతులను చేసే ప్రయత్నంలో, అగ్రవర్ణాలకు చెందిన కొందరు, పరిసర గ్రామాలలోని తమ మద్దతు దార్లను కూడగట్టుకుని, దళిత వాడపై దాడి చేయడంతో, పిల్లా పాపలతో-కుటుంబాలన్నీ గ్రామం విడిచి పోవాల్సిన పరిస్థితి కలిగింది. అలా వెళ్ళిన వారి ఇళ్లను కూడా సర్వ నాశనం చేశారు. వారి పశువులను తరిమి వేశారు. గృహోపకరణాలను పాడు చేశారు. మొత్తం మీద దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు. దళితులకు అండగా నలిచిన గ్రామ పెద్ద, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తామ్ర పత్ర గ్రహీత అయితరాజు రాం రావు కూడా గ్రామం విడిచి కొంత కాలం ఖమ్మంలో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దళితులకు ఇబ్బందులు తొలగ లేదు. దేశ వ్యాప్తంగా పత్రికలు జరిగిన అన్యాయాన్ని ప్రచురించాయి. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం వరకూ తెలిసింది. బ్రహ్మానంద రెడ్డి తన మంత్రివర్గ సహచరులైన వల్లూరు బసవ రాజు ప్రభృతులను వల్లభి గ్రామానికి పంపినా ఫలితం కనిపించలేదు. గ్రామంలో రిజర్వుడు పోలీసులు, ఉన్నతాధికారులు కూడా మకాం వేశారు. అయినా మార్పు కానరాలేదు.

సమస్యకు పరిష్కారం గాంధేయ మార్గంతప్ప మరోటి కాదని గ్రామ పెద్ద అయితరాజు రాం రావు భావించారు. స్నేహితుల సహాయంతో గాంధి-వినోబా బావేల శిష్యుడైన ఆచార్య భన్సాలిని ఆశ్రయించాడు. పోరాటం కన్నా శాంతే మేలని, భన్సాలి తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా, సరిగ్గా నడవలేని స్థితిలో వుండి కూడా, వల్లభి గ్రామానికి వచ్చారు. భన్సాలీ వచ్చిన మరుక్షణమే, దళిత వాడ చేరుకుని, దళితులు నిర్మించుకున్న దేవాలయంలో మకాం వేశారు. శాంతి యత్నాలు ప్రారంభించారు. దళితులను గ్రామానికి రప్పించాలని, వారిని వెళ్లగొట్టిన అగ్రవర్ణాల వారిని కోరాడు. అంతే కాకుండా శాంతియుత వాతావరణంలో సహజీవనం సాగించాలన్న నిబంధననూ విధించాడు. ఆయన మాట వినని పరిస్థితులున్నాయని గ్రహించి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. చిట్ట చివరి దళితుడు గ్రామంలోకి వచ్చి ఇతరులతో సహజీవనం సాగించేంతవరకు తన దీక్ష విరమించేది లేదని శపధం చేశారు. ఒకటి రెండు రోజుల్లో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లో కదిలిక వచ్చింది. నాటి గవర్నర్‌ ఖండూభాయ్ దేశాయి, ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి, ఆఘమేఘాల మీద సంధి ప్రయత్నాలు మొదలెట్టారు. సంధికి అంగీకరించాల్సిందెవరో కాదు- కాంగ్రెస్‌లోని రెండు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖ నాయకులు-జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి. జిల్లా మంత్రుల సమక్షంలో గవర్నర్‌, ముఖ్యమంత్రి భన్సాలి దీక్షను విరమింప చేసారు. నాటి నుంచి ఆ గ్రామంలో కొట్లాటలు జరిగిన దాఖలాలు లేవు.

వినోబా శిష్యుడు ఆచార్య భన్సాలీ అల నాడు చేపట్టిన ఆ మరణ దీక్షకు-దానికి లభించిన సమస్య పరిష్కారానికి, మొన్న ఆర్భాటం హంగులతో రాందేవ్ బాబా అరంభించి విరమించిన (విరమింప చేసిన) ఆ మరణ దీక్షకు పోలికే లేదు. ఒక సమస్యకు భన్సాలీ కనుక్కున్న పరిష్కార మార్గాన్ని, ఆయన అనుసరించిన మార్గంలో అవలంబిస్తే, బహుశా అవినీతి అంతం కాకుండా వుండే ప్రశ్నే లేదు. వచ్చిన చిక్కల్లా భన్సాలీ లాంటి వారు లభించక పోవడమే! ఆ నాడు ఆచార్య భన్సాలీ వల్లభి చేరుకోవడానికి, సాదా-సీదాగా, ప్రయాణం చేసారు తప్ప ప్రత్యేక విమానం కాని, కనీసం ప్రత్యేక కారుకాని ఉపయోగించుకోలేదు!

2 comments:

  1. అత్యంత వాస్తవికంగా ఆచరణీయంగా ఉంది మీ వ్యాసం.అభినందనలు.

    ReplyDelete
  2. వ్యక్తిగత పబ్లిసిటీ కావాలనుకుంటే సినిమా హీరో అవ్వక్కరలేదు. రాందేవ్‌లాగ డబ్బు ఉండి మంది, మార్బలం ప్రదర్శించగలిగితే చాలు.

    ReplyDelete