సూర్య దిన పత్రిక (23-06-2011)
వనం జ్వాలా నరసింహా రావు
డోలాయమానంలో రాష్ట్ర ("భారత ఉక్కు వ్యవస్థ") ఐఏఎస్ లు?
వనం జ్వాలా నరసింహా రావు
రాష్ర్ట ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసిన సుమారు ఏబై మంది ఐఏఎస్ అధికారులలో పలువురు తమకు ప్రాధాన్యత పోస్టులు లభించలేదన్న అసంతృప్తితో వున్నారని వార్తలొస్తున్నాయి. వారిలో కొందరు తమ సీనియారిటీని పరిగణలోకి తీసుకోలేదని, మరి కొందరు తమను అంతగా ప్రజలతో సంబంధం లేని పదవులకు పంపారని-తామెంత బాగా పనిచేస్తున్నప్పటికీ తమ సమర్థతకు తగిన గుర్తింపు రాలేదని, ఎవరికి తోచిన రీతిలో వారు తమ అసంతృప్తులను బహిరంగంగానే వెల్లడి చేస్తున్నారట. వీరిలో కొందరు గతంలో పదవిలో వున్న ముఖ్య మంత్రుల దగ్గర వ్యక్తిగతంగా పలుకుబడి ఉపయోగించు కోగలిగిన వారైతే, ఇంకొందరు తెలుగు దేశం హయాంలో-రాజశేఖర రెడ్డి, రోశయ్యల కాలంలో, చాలా కాలం ఒకే పోస్టులో వుంటూ అధికారం-పెత్తనం పరోక్షంగా చెలాయించిన వారు కావడంతో ప్రస్తుతం బదిలీ చేసిన పోస్టులోకి వెళ్లాలన్న ఆలోచనను జీర్ణించుకొన లేక పోతున్నారు. ఇదిలా వుంటే, కొందరు మంత్రుల శాఖలకు సంబంధించి, సంబంధిత కాబినెట్ మంత్రికి కనీస సమాచారం కూడా లేకుండానే, అక్కడ పనిచేస్తున్న ఐఏఎస్ లందరినీ "మూకుమ్మడిగా" గా బదిలీ చేసింది ప్రభుత్వం. ఏదేమైనా, ప్రభుత్వ యంత్రాంగంలో-అందునా ఐఏఎస్ స్థాయిలో, ఫలానా పోస్టు ప్రాధాన్యతకలదని, మరోటి మామూలుదని, ఎవరైనా ఐఏఎస్ అధికారి భావించడమంటే, ఆ సర్వీసులో ఇంతకాలం పనిచేస్తున్న వారి అవగాహనా లోపమే అనాలి. సమర్ధుడైన అధికారికి ఏ బాధ్యతలను ఇచ్చినా, గతంలో పని చేసిన శాఖను అభివృద్ధి చేసినట్లే, అక్కడ కూడా రాణించగలరు. అసమర్థులకు ఏమిచ్చినా ఒకటే.
వివాదాల్లో చిక్కుకోవడం, రాజకీయ ప్రభావాలకు లోను కావడం, తమ పబ్బం గడుపు కోవడానికి సంబంధిత మంత్రులకు వంత పాడడం, కావాలనుకున్న పోస్టింగులను పొందడం, పక్షపాత వైఖరితో ఉద్యోగ ధర్మాన్ని విస్మరించడం, నైతిక విలువలను పాటించకపోవడం, కొందరు ఐఏఎస్ అధికారులకు అలవాటుగా మారిందన్న అపవాదు ఇటీవలి కాలంలో సాధారణ విషయమైపోయింది. పదవిలో వున్నా-విరమణ చేసినా, శతృవులు సహితం తప్పు బట్ట వీలులేని స్వర్గీయ ఎస్ ఆర్ శంకరన్, డాక్టర్ వి చంద్రమౌళి, పి వి ఆర్ కే ప్రసాద్, డాక్టర్ జయప్రకాశ్ నారాయణ లాంటి అధికారుల సంఖ్య క్రమేపీ తగ్గుతుందని అనాలి. అంతెందుకు.. ఇప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్, స్వర్గీయ ఎన్ టీ రామారావు ముఖ్య మంత్రిగా వున్నప్పటినుంచి, ప్రస్తుత ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వరకు, తెలుగు దేశం అధికారంలో వున్నా-కాంగ్రెస్ అధికారంలో వున్నా, కీలకమైన బాధ్యతలు అత్యంత సమర్థవంతంగా నిర్వహించుకుంటూ, ఒకే రకమైన అనామికతో పని చేస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన లాగా కేంద్రంలోను, రాష్ట్రాలలోను పనిచేసిన-చేస్తున్న ఐఏఎస్ అధికారులున్నప్పటికీ అలాంటి వారు కొందరే వున్నారనక తప్పదు. దీనికి అనేక కారణాలుండవచ్చు. అత్యంత బాధ్యతతో కూడుకున్న పాలనాపరమైన పదవులు అతి పిన్న వయసులోనే వీరు పొంద గలగినందువల్లనో, అనుక్షణం మారుతున్న రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్లో, సివిల్ సర్వీసెస్ ప్రస్థానంలో సత్ సంప్రదాయాలు నెలకొన నందువల్ల నో, సంస్కరణలు కాగితాలపైన మాత్రమే కాని-ఆచరణలో నామ మాత్రమే ఐనందువల్లనో ఇలా జరుగుతుండవచ్చు. ఐఏఎస్ అధికారులను తమ గుప్పిట్లో వుంచుకుని, తమ పనులను చక్కబెట్టుకోవాలనే ఆలోచనలో కొందరు మంత్రులుండడం కూడా ఐఏఎస్ ల బాధ్యతారాహిత్యానికి కారణం కావచ్చు. ఈ నేపధ్యంలో, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు అవసరం, దాని ఆవిర్భావం, పరిణామక్రమం, భవిష్యత్ లో కొన సాగింపు ఎంతవరకు సమంజసం అనేవి చర్చనీయాంశమైన అంశాలు.
"భారత ఉక్కు వ్యవస్థ" గా సర్దార్ వల్లభాయ్ పటేల్ అభివర్ణించిన, "ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)", భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, అప్పటి వరకు, బ్రిటీష్ వారి పాలనలో అధికార స్వామ్యానికి ప్రతీకైన "ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసీఎస్)" స్థానంలో ఆవిర్భవించింది. ఐఏఎస్ కు ఎంపికైన వారందరూ, సాహిత్యం నుండి వైద్య శాస్త్రం వరకు, ఒకటికి మించిన విభిన్న విద్యల్లో, తమదంటూ, ఒక ప్రత్యేకత వుందని నిరూపించుకున్న అసాధారణ తెలివితేటలు గల వ్యక్తులై వుంటారు. వీరిని ఆ సర్వీసులకు ఎంపిక చేసే విధానం కూడా, పలు రకాల వడపోత పద్ధతులను అవలంబించి, విస్తృతమైన-కఠినమైన రాత-మౌఖిక పరీక్షా విధానం ద్వారా, రాగద్వేషాలకు అతీతమైన కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుల నిర్ణయం ఆధారంగా జరుగుతుంది. వీరి ఉద్యోగాలకు రాజ్యాంగ పరమైన రక్షణ వుంటుంది. కర్తవ్య నిర్వహణలో, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాల్సిన ఆగత్యం లేదు. ఎవరికీ భయపడాల్సిన అవసరం కాని, ఒత్తిడులకు లోను కావడం కాని, ఏ మాత్రం లేదు. భారత్ దేశ భవిష్యత్ ఈ వ్యవస్థపై ఆధార పడి వుందని పటేల్ అనేవారు.
ప్రిలిమినరీ, మెయిన్స్, మౌఖిక పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులలో, పరీక్షల నిర్వహణకు ముందు, వివిధ రాష్ట్రాలలో, ఆ రాష్ట్ర ప్రభుత్వాల అవసరాల మేరకు, భర్తీచేయాల్సిన ఐఏఎస్ అధికారుల సంఖ్యకు అనుగుణంగా, అంత మందినే, రాంకుల వారీగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆ సంవత్సరానికి ఎంపికచేస్తుంది. అలా ఎంపికైన వ్యక్తులకు, ఏడాదిపాటు మసోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో అన్నిరంగాలకు చెందిన అంశాలలో కూలంకషమైన శిక్షణ ఇప్పిస్తుంది ప్రభుత్వం. ఏడాది తర్వాత, ఆయా అభ్యర్థులకు కేటాయించిన రాష్ట్రాలకు మరో ఏడాదిపాటు శిక్షణ నిమిత్తం పంపుతారు. ఒక్కొక్కరి ని ఒక్కో వెనుకబడిన జిల్లాకు పంపి, సంబంధిత కలెక్టర్ ఆధ్వర్యంలో, అన్ని శాఖలకు చెందిన అన్ని రకాల స్థాయి ఉద్యోగాలలో అవగాహన పొందే వీలుగా శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. వారందరినీ ఆ ఏడాది వరకు "శిక్షణలో వున్న అసిస్టెంటు కలెక్టర్" గా సంబోధించు తారు. ఏడాది మధ్యలో, మూడు-నాలుగు పర్యాయాలు, రాష్ట్ర రాజధానులలో వున్న ప్రభుత్వ అడ్మినిస్ట్రేటివ్ శిక్షణా సంస్థ (హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లాంటిది) లకు పంపి, రాష్ట్రానికి సంబంధించిన వివిధ సామాజిక-చారిత్రాత్మక-భౌగోళిక-రాజకీయ, తదితర అంశాలపై శిక్షణ ఇప్పించుతుంది ప్రభుత్వం. రాష్ట్రాలకు చెందిన అధికార భాషను (తెలుగు లాగా) వీరు నేర్చుకోవడం తప్పనిసరి కాబట్టి, అందులోను శిక్షణ ఇప్పించి, పరీక్షలు కూడా నిర్వహిస్తుంది ప్రభుత్వం.
సచివాలయంలో వివిధ స్థాయిలలో జరిగే కార్యకలాపాలపై కూడా అవగాహన కలిగించేందుకు వారం-పది రోజుల పాటు సెక్రెటేరియట్ అనుబంధ శిక్షణ కూడా వుంటుంది. ప్రాజెక్టుల సందర్శన, సర్వే క్షణ శాఖతో అనుబంధం లాంటివి కూడా పూర్తైన తదుపరి, చివరగా, రెండు వారాల పాటు మరో మారు మసోరికి వెళ్లి, తిరిగొచ్చేసరికి, వారికి కేటాయించిన రాష్ట్రాలలోని ఏదో ఒక సబ్ డివిజన్ లో, సబ్ కలెక్టర్ గా మొట్టమొదటి పోస్టింగు దొరుకుతుంది. అసలు-సిసలైన అధికార రుచి చవి చూసే అవకాశం అలా లభిస్తుంది వారికి. దాంతో పాటే, ప్రజాసేవ చేసే అవకాశం కూడా ప్రప్రధమంగా కలుగుతుంది. సబ్ కలెక్టర్ గా పనిచేసిన కొందరిని, అక్కడి ప్రజలు ఎన్నటికి మరవ లేని స్థాయికి ఎదిగిన ఐఏఎస్ అధికారులు చాలా మంది వున్నారు. సబ్ కలెక్టర్ తర్వాత సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి గా-జాయింటు కలెక్టరు గా పదోన్నతి పొంది మరో మెట్టుకు ఎదుగుతారు. ఇక ఆ తర్వాత - సుమారు ఏడెనిమిది ఏళ్లకు, జిల్లా కలెక్టర్ గా నియామకం దొరుకుతుంది. ఈ అన్ని పదవుల కుండే మెజిస్టీరియల్ అధికారాలు, ఇక ఆ తర్వాత, ఎన్ని పదోన్నతులొచ్చినా వుండవు. కొందరు దురదృష్ట వంతులకు (రకరకాల కారణాల వల్ల) వీటిలో కొన్ని పదవులు దక్కకుండా, వాటికి సమానమైన పదవులు (ఉదాహరణకు, డిప్యూటీ కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శిగా, కార్పొరేషన్లలో ఉన్నతాధికారిగా, మునిసిపల్ కమీషనర్లుగా) దొరుకుతాయి. ఇలా లూప్ లైనులలోకి మళ్లించబడే అలాంటి ఐఏఎస్ అధికారుల ఎదుగుదల సాదా-సీదాగా సాగుతుంది. వారికి ఏ పోస్టు ఇచ్చినా సర్దుకుని పోతుంటారు.
అఖిలభారత సర్వీసులలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకున్న ప్రత్యేకత, దానికి ఎంపికైనవారికి ఒక "జిల్లా కలెక్టర్" గా పని చేయడమే. ఆ పదవిలో వుండగా, కేవలం రెవెన్యూ సంబంధిత బాధ్యతలే కాకుండా, పలు అభివృద్ధి-సంక్షేమ పథకాల అమలులో, పర్యవేక్షణలో, కలెక్టర్ అంచనాలకు మించిన బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. 73, 74 రాజ్యాంగ సవరణలతో కలెక్టర్ల బాధ్యతలు ఇంకా రెట్టింపయ్యాయి. దాదాపు నూటికి పైగా జరిగే జిల్లా స్థాయి సమీక్షా సమావేశాలకు కలెక్టరే చైర్మన్. అనేక జిల్లా స్థాయి కమిటీలకు అధ్యక్షుడుగా వ్యవహరిస్తూ, తాము తీసుకున్న నిర్ణయాలను తామే గుర్తుంచుకోలేని పరిస్థితుల్లో వుంటారు కొందరు. జిల్లా వ్యాప్తంగా పర్యటనలు, వారానికొక సారి ఏదైనా గ్రామంలో నిద్ర చేయడం లాంటివి కలెక్టర్ల అదనపు కర్తవ్యాలు. అంతులేని ఈ పని భారాన్ని మోసేటప్పుడు, ఎంత విస్తృత స్థాయిలో శిక్షణ పొందినా సహజంగా తప్పులు దొర్లడం సహజం. ఇక అడపదడప ముఖ్య మంత్రి, సంబంధిత శాఖ మంత్రి నిర్వహించే సమీక్షా సమావేశాలకు, వీడియో కాన్ఫరెన్సులకు విధిగా హాజరవ్వాలి.
కలెక్టర్ పదవిని సుమారు పది సంవత్సరాల పాటు, వివిధ జిల్లాలలో చేపట్టి (అందరూ కాకపోయినా కొందరైనా) శాఖాధిపతులుగా నో, కార్పొరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లుగా నో, సచివాలయంలో వివిధ స్థాయిలలో సచివులుగా నో పని చేసేందుకు రాజధానికి చేరుకుంటారు. వారి-వారి సామర్థ్యాన్ని బట్టి, చాక చక్యాన్ని బట్టి, పలుకుబడిని బట్టి, జిల్లా కలెక్టర్లుగా పని చేసినప్పుడు రాజకీయ నాయకులతో పెంపొందించుకున్న సాన్నిహిత్యాన్ని బట్టి, మరి కొన్ని ప్రత్యేక తరహా నైపుణ్యాలను బట్టి వారికి పదవులు లభిస్తాయి. దేశ వ్యాప్తంగా వున్న సుమారు ఆరువందలు మంది జిల్లా కలెక్టర్లు, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు పునాది లాంటివారని, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అన్నారొకసారి. ఐఏఎస్ అధికారులకు పదవీ భద్రత వుందనీ, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో-అమలులో, దూరదృష్టితో వ్యవహరించడం వారి విద్యుక్త ధర్మమనీ, ప్రతి ఐఏఎస్ అధికారి ఒక రోల్ మోడల్ కావాలని కూడా మన్మోహన్ అన్నారు. ఒక ఐఏఎస్ అధికారి జిల్లా కలెక్టర్ పదవి నుంచి, రాష్ట్ర రాజధానికి చేరుకున్న తర్వాత-అటు పిమ్మట సొంత రాష్ట్రానికో, కేంద్ర సర్వీసులకో, విదేశాలలో పదవులకో వెళ్లిన తర్వాత, ఒక వైపు అట్టడుగు స్థాయి సేవలకు దూరమవడం, మరో వైపు అసలు-సిసలైన అధికారానికి దూరం కావడం జరుగుతుందనాలి. కలెక్టర్ పదవి తర్వాత అంత ప్రాధాన్యత కలిగిన ఏకైక పదవి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నో, కేంద్ర కాబినెట్ కార్యదర్శిగా నో నియామకం కావడం. ఆ అవకాశం అతి కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. అందుకే, ఇటీవల బదిలీ ఐన ఐఏఎస్ అధికారులలో కొందరు తమకు అ ప్రాధాన్యత పోస్టింగులు ఇచ్చారనడం సరైంది కాదు.
అలా భావించే ఐఏఎస్ అధికారులున్నారంటే, ప్రభుత్వ శాఖల్లో కొన్ని "అ ప్రాధాన్యత" గా చేసిన సచివులను, వారి సలహాలు తీసుకుంటున్న మంత్రులను తప్పు బట్టాలి!
No comments:
Post a Comment