మంత్రివర్గ మార్పుల వేళ సీఎం వ్యూహం…ప్రత్యర్థులతో కలిసి కాపురం ?
సూర్య దిన పత్రిక (01-07-2011)
వనం జ్వాలా నరసింహారావు
బొత్స, రాజ నరసింహ తీరుతో ధోరణిలో మార్పు, పట్టు కోసం మంత్రివర్గ విస్తరణ ఆయుధం, చిరంజీవి విందు రాజకీయం ఆంతర్యం?, వ్యతిరేకులకు మంత్రివర్గంలో స్థానం?, కిరణ్ సవాళ్ళు ఎదుర్కొంటారా?
పిసిసి అధ్యక్షుడుగా బొత్స సత్యనారాయణ నియామకం-పార్టీపై ప్రత్యక్షంగా-పాలనపై పరోక్షంగా ఆయన పట్టు సాధించే ప్రయత్నాలు, ఉప ముఖ్య మంత్రిగా దామోదర రాజ నరసింహ రంగ ప్రవేశం-తెలంగాణ కాంగ్రెస్ నేతగా గుర్తింపు దిశగా ఆయన పయనం-ఢిల్లీ స్థాయిలో పలుకుబడి పెంచుకునే ప్రయత్నాలు, ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచనా ధోరణిలో కొంత మార్పుకు దారి తీశాయనక తప్పదు. అపారమైన రాజకీయానుభవంతో, బలీయమైన సామాజిక వర్గం అండ దండల నేపధ్యంతో, సహజ సిద్ధమైన చొరవతో-పలుకుబడితో, బొత్స తన నియామక ప్రకటన వెలువడిన మరు నిమిషం నుంచే, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలలో తనదైన శైలిలో-తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని వేగంగానే సంపాదించు కుంటున్నాడనాలి. తెలంగాణ ఏర్పాటుపట్ల సానుభూతి అపారంగా వున్న ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుడి వ్యవహార శైలి ఇలా వుంటే, దానికి ఒకింత భిన్నంగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉప ముఖ్య మంత్రి రాజ నరసింహ ఢిల్లీలో చక్రం తిప్పిన ధోరణి వుందనాలి. బొత్స సరాసరి, తానే భవిష్యత్ ముఖ్య మంత్రినన్న రీతిలో, పూర్తి స్థాయి కాకపోయినా, కొందరు మంత్రులతో కూడిన పరోక్ష కాబినెట్ సమావేశాలను జరుపుతున్న తీరు కూడా కిరణ్ కుమార్ రెడ్డికి నచ్చడం లేదంటున్నారు. రాజ నరసింహ తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు పలువురు ఇతర సీనియర్ నాయకులను కలుసుకుని రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు, ప్రభుత్వం పనితీరు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై సమాలోచనలు జరపిన తీరు-ఆ తర్వాత వెలువడిన పత్రికా ప్రకటనల తీరు గమనిస్తే, అధిష్టానం ఆలోచనా ధోరణికి అనుగుణంగా రాష్ట్ర రాజకీయాలలో బొత్స, కిరణ్ కుమార్ రెడ్డిలతో పోటా-పోటీగా ఎదిగే పనిలో నిమగ్నమైన ట్లు అనుకోవాలి. ఈ పరిణామాల మధ్య, ఆర్నెల్ల క్రితం అధిష్టానం ఆశీస్సులతో, ముఖ్య మంత్రి పీఠాన్ని అధిష్టించిన కిరణ్ కుమార్ రెడ్డి, ఆదిలో ఎదురైన ఆటుపోట్లను అధిగమించి, పార్టీ పైన-పాలన పైన అంతో-ఇంతో గట్టి పట్టు సాధించి, ఆ పట్టు కోల్పోకుండా మరింత బలం కూడగట్టుకోడానికి, ఆయనకు రాజ్యాంగ పరంగా సంక్రమించిన "మంత్రి వర్గ విస్తరణ" ఆయుధాన్ని ఉపయోగించుకునే ప్రయత్నంలో వున్నారు.
బొత్స సత్యనారాయణ బలమైన ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి ఆయన వీరాభిమాని. వాస్తవానికి బొత్సను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా అధిష్టానం ఎంపిక చేయడంలో చిరంజీవి పరోక్ష పాత్ర-సహకారం కూడా వుందంటారు. అందుకేనేమో, బొత్స తన నియామకం అయిన వెంటనే కలిసిన ప్రముఖులలో ముందు వరుసలో వున్న వారిలో చిరంజీవి ఒకరు. అదలా వుంటే, చాలా కాలం తన నియోజక వర్గానికి దూరంగా వుంటున్న, చిరంజీవి, హఠాత్తుగా, బొత్స నియామకం తర్వాత, తిరుపతి పర్యటనకు వెళ్లారు. అంతవరకు ఆశ్చర్యం లేదు. ఆ పర్యటనలో భాగంగా, ముఖ్య మంత్రి బద్ధ విరోధిగా అందరూ భావించే, చిత్తూరు జిల్లాకు చెందిన శాసనసభ సభ్యుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటికి విందు భోజనానికి వెళ్లారు. విందు రాజకీయాలలో, చిరంజీవి పాత్ర కిరణ్ కుమార్ రెడ్డికి అనుకూలంగా పెద్దిరెడ్డిని మార్చడానికా? లేక, ప్రతికూలంగా-మరింత ఘాటుగా ఆయన వుండేందుకు, ఆయనను బొత్స సరసన చేర్చడానికా? అన్నది బయట పడాల్సి వుంది. మధ్యలో, చిరంజీవి మరో సంచలన ప్రకటన చేసి వార్తల్లోకి ఎక్కారు. తానిక సినిమాలలో నటించనని, అది కూడా ముఖ్య మంత్రి పాత్రలో అసలే నటించనని, నిజ జీవితంలోనే ముఖ్య మంత్రిగా తనను చూడాలనుకుంటున్న ప్రజల కోరిక తీరుస్తానని దాని సారాంశం! ఇదిలా వుంటే, దివంగత ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి మలి విడత మంత్రివర్గంలో పెద్దిరెడ్డిని చేర్చడానికి కారణ భూతుడైన అపర రాజకీయ చాణక్యుడు కెవిపి రామచంద్ర రావు ఇంటికెళ్లి మంతనాలు జరిపారు ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. అప్పట్లో, పెద్దిరెడ్డిని మంత్రి వర్గంలో తీసుకున్నందుకు కిరణ్ కుమార్ అలిగారని, స్పీకర్ పదవి చేపట్టడానికి విముఖత కూడా చూపారని వార్తలొచ్చాయి. నిజా-నిజా లేమైనా, ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో, తన బద్ధ శత్రువు పెద్దిరెడ్డిని, త్వరలో జరుగనున్న మంత్రివర్గ విస్తరణలో, కిరణ్ కుమార్ రెడ్డి స్థానం కలిగించనున్నట్లు వార్తలొచ్చాయి. మంత్రి వర్గ విస్తరణకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడానికి గవర్నర్ నరసింహన్ ను కలిసిన ముఖ్య మంత్రి అధిష్టానం అనుమతి కోసం ఢిల్లీ వెళ్లారని అనుకుంటున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలలో, తన మంత్రి వర్గంలో, పూర్తిగా తనకు అనుకూలురైన వారిని మాత్రమే చేర్చుకోవాలని కాని-వ్యతిరేకులను పూర్తిగా దూరం పెట్టాలని కాని గతంలో ఏ ముఖ్య మంత్రి భావించలేదు. కొందరు సీజన్డ్ ముఖ్య మంత్రులు, తమకు అనుకూలంగా లేనివారిని, తమవైపు తిప్పుకోవడానికో-తమ గుప్పిట్లో పెట్టుకోవడానికో, తప్పకుండా తమ మంత్రివర్గంలో చేర్చుకున్న దాఖలాలున్నాయి. తండ్రి, దివంగత అమర్ నాథ్ రెడ్డి కాలంలో, రాజకీయాలను అంతో-ఇంతో దగ్గరగా గమనించే అవకాశమున్న ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పూర్వ కాలపు కాంగ్రెస్ ముఖ్య మంత్రుల తరహాలో వ్యవహరించడానికి, తనను వ్యతిరేకించేవారికి కూడా మంత్రి వర్గంలో స్థానం కలిగించి, పాత సాంప్రదాయాలను పునరుద్ధరించడం మంచిది.
1956 లో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పార్టీ నాయకుడిగా పోటీ పడిన నీలం సంజీవ రెడ్డి, బెజవాడ గోపాల రెడ్డి, ఆ తర్వాత విభేదాలున్నా కలిసి మెలిసి పనిచేశారు. నీలం సంజీవరెడ్డి ముఖ్య మంత్రిగా, తనను ఎదిరించిన గోపాల రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు-ఉప ముఖ్య మంత్రిని కూడా చేశారు. అంతకు ముందున్న మంత్రివర్గంలో, బెజవాడ ముఖ్య మంత్రైతే, నీలం కాబినెట్ మంత్రిగా-ఉప ముఖ్య మంత్రిగా పని చేశారు. ఇద్దరికీ పడక పోయినా, సహచర మంత్రులుగా, ఒకరి కింద మరొకరు పని చేసిన మొదటి ఉదాహరణ ఇదే. సంజీవ రెడ్డి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు, ఆయన స్థానంలో ముఖ్య మంత్రి పదవి పొందిన దామోదరం సంజీవయ్య, తన మంత్రి వర్గంలో, ఆయన బద్ధ విరోధి ఏసి సుబ్బారెడ్డికి స్థానం కలిగించారు. అదే విధంగా మలి విడత ముఖ్య మంత్రిగా నీలం సంజీవ రెడ్డి రాజీనామాచేసిన తర్వాత, ఆయన వారసుడుగా వచ్చిన కాసు బ్రహ్మానందరెడ్డి సహితం తన వైరి వర్గానికి చెందిన ఏసి సుబ్బారెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఆయన స్థానంలో ముఖ్య మంత్రైన పివి నరసింహా రావు, బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో వుండగా, తనను ఆసాంతం వ్యతిరేకించిన జలగం వెంగళ రావుకు, మొదట్లో చోటివ్వక పోయినా, రెండవ పర్యాయం ముఖ్య మంత్రి అయిన తర్వాత మంత్రి పదవి ఇచ్చారు. సీమాంధ్ర ప్రాంతం నుంచి, తనను వ్యతిరేకించే పలువురు కాంగ్రెస్ నాయకులకు కూడా మంత్రి వర్గంలో చోటిచ్చారు. అలానే, జలగం వెంగళ రావు తన వ్యతిరేకులైన రాజమల్లు, రాజారాంలకు తన మంత్రి వర్గంలో స్థానం కలిగించారు. మర్రి చెన్నారెడ్డి మొదటి విడత ముఖ్య మంత్రిగా వున్నప్పుడు, ఆయన పదవి నుంచి వైదొలగడానికి కారణమైన రాజారాం, రాజమల్లు, గోకా రామస్వామిలను తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఇక ఆ తర్వాత ముఖ్య మంత్రులైన వారందరూ, అధిష్ఠానం సూచించిన వారికే సింహభాగం మంత్రి పదవులిచ్చినప్పటికీ, తన వారనుకున్న వారిని మంత్రులుగా చేసేందుకు వెనుకాడ లేదు-తనను వ్యతిరేకించిన వారికి పదవులు దక్కకుండా చూసేందుకు శాయశక్తులా కృషి చేశారు. తెలివిగల నాయకుడు తన ప్రత్యర్థులనుకునే వారికి కూడా పదవులిచ్చి, వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా అలానే చేస్తే బాగుంటుందేమో!
ఇదిలా వుంటే, డి శ్రీనివాస్ స్థానంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కావాలని ఆశించి-కాలేక పోయిన కన్నా లక్ష్మీనారాయణ, ఆ పదవి దక్కించుకున్న బొత్స సత్య నారాయణ, చిరంజీవి నిజ జీవితంలో ముఖ్య మంత్రి కావాలనుందని చెప్పిన మాటల లోని గూఢార్థాన్ని విశ్లేషణ చేసే ప్రయత్నంలో సమావేశమైనట్లు వార్తలొచ్చాయి. వీరిలో ఎవరినుంచి-ఎటువైపు నుంచి తనకు ముప్పు, ఏ విధంగా రాబోతున్నదోనని అంచనా వేసే ప్రయత్నంలో-ఆ తర్వాత తన అంచనాలకు అనుగుణంగా వారికి చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగా, ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారా, లేక, మంత్రి వర్గ విస్తరణకే వెళ్లారా తెలుసుకోడానికి కొంత సమయం పట్టవచ్చు. బొత్స-కన్నా-చిరంజీవిల కలివిడి, విడి విడి ప్రకటనల పరిణామాలు; రాజ నరసింహ తన కంటూ ఒక ప్రత్యేక నాయకత్వ స్థానాన్ని దక్కించుకునేందుకు మొదలెట్టిన ప్రయత్నాలు; ముఖ్య మంత్రి పదవి ఆశించి ఉప-ముఖ్య మంత్రి పదవిని కూడా పొందలేక పోయిన తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో మంత్రి గీతారెడ్డి పరోక్ష హెచ్చరికలు; తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఉధృతం విషయంలో టీ ఆర్ ఎస్ అధినేత చంద్ర శేఖర రావు-జానారెడ్డిల సమావేశం-తదనంతర పరిణామాలు-రాజకీయ ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేసి ఉమ్మడి పోరాటం చేయాలన్న నిర్ణయం; మరో వారం రోజుల్లో జరుగనున్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలు-అందులో ఆ పార్టీ అధినేత తీసుకో బోయే కీలక (తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా?) నిర్ణయాలు; మధ్య-మధ్య బిజెపి, కమ్యూనిస్టు పార్టీల ప్రతిఘటనలు; వీటన్నిటినీ మించి ప్రతి పక్ష నేత-తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనుక్షణం విసురుతున్న సవాళ్లు; ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆద్య తన భవిష్యత్ లో ఎదుర్కోనున్న క్లిష్టమైన సమస్యలు. వీటిని ఆయన వ్యూహాత్మకంగా అధిగమించి, ఢిల్లీ అధిష్టానం అండ దండలతో, తన స్థానాన్ని పదిలపరచుకుంటారో, లేక, మంత్రి వర్గంలో మార్పులు-కూర్పులు చేసి, తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా తన నాయకత్వాన్ని సవాలు చేస్తున్న వారికే ప్రతి సవాలు విసురుతారో చూడాలి.
No comments:
Post a Comment