Monday, March 14, 2016

అణగారిన బ్రాహ్మణులకు ఆసరా : వనం జ్వాలా నరసింహారావు

అణగారిన బ్రాహ్మణులకు ఆసరా
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర భూమి దినపత్రిక (15-03-2016)

        సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, అట్టడుగు వర్గాలకు, అసహాయులకు, అన్నార్తులకు అండగా నిలుస్తూ, స్వార్థం, దోపిడీ, సంకుచిత తత్వాలను దరిచేరనీయకుండా ధృఢ సంకల్పంతో నిజమైన అభివృద్ధిని సాధించే దిశగా, అనేక రకాల సంక్షేమ పథకాలను గత ఇరవై నెలలుగా రూపకల్పన చేసి అమలు చేస్తున్నది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించడానికి డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, షెడ్యూల్డ్ కులాల-తెగల-వెనుకబడిన తరగతుల-మైనార్టీల సంక్షేమం కొరకు వరుస బడ్జెట్ లలో పెద్ద మొత్తంలో నిధుల కేటాయింపు, ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ లాంటి పథకాలు, మహిలా శిశు సంక్షేమానికి కార్యక్రమాలు....ఇలా ఎన్నో రూపొందించిన తెలంగాణ ప్రభుత్వం, మరో అడుగు ముందుకు వేసి, ఈ బడ్జెట్ లో బ్రాహ్మణ సంక్షేమం కొరకు నిధులను కేటాయించడం అభినందించాల్సిన విషయం. రాష్ట్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ..."కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాల వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. సమాజంలో ఇతర వర్గాల లాగానే, బ్రాహ్మణ సామాజిక వర్గంలో పేదలున్నారని ప్రభుత్వం భావిస్తున్నదిఅందుకే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బ్రాహ్మణ సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తూ అందుకోసం  రూ. 100 కోట్లు 2016-2017 బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. బ్రాహ్మణ సంక్షేమ నిధి విధి విధానాలను ఖరారు చేస్తాం". అని అన్నారు.

          బ్రాహ్మణుల పరిస్థితి గతులు రోజు-రోజుకూ క్షీణించి పోతున్న నేపధ్యంలో; ఆర్థికంగా బ్రాహ్మణులు బాగా చితికి పోయిన నేపధ్యంలో; వ్యవసాయం మీద, భూమి మీద ఆధారపడే అవకాశాలను బ్రాహ్మణులు దాదాపు కోల్పోయిన నేపధ్యంలో; కొందరు బ్రాహ్మణులకు రోజు గడవడం కూడా కష్టమై పోతున్న నేపధ్యంలో; ఒక నాటి పౌరోహిత్యం, పూజారి జీవితం, ఆయుర్వేద వైద్యం బ్రాహ్మణుల బ్రతుకు తెరువుగా కొనసాగడం కష్టమై పోయిన నేపధ్యంలో; పూర్తిగా దిగజారుతున్న బ్రాహ్మణుల ఆర్థిక స్తోమత నేపధ్యంలో, అనాథ బ్రాహ్మణుల సంఖ్య రోజు-రోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో; కడు బీదరికంతో అల్లల్లాడి పోతున్న పలువురు బ్రాహ్మణులు, పల్లెల నుంచి పట్టణాలకు ఉపాధి కొరకు వలసపోయే పరిస్థితుల నేపధ్యంలో; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎందరో బ్రాహ్మణులకు ఆసరాగా వుండబోతుందనడంలో సందేహం లేదు. నాలుగు విభాగాలుగా వున్న బ్రాహ్మణులు...అర్చకులు, పురోహితులు, ఉద్యోగులు, స్వయం ఉపాధి వున్న వారు….వీరిలో వైదిక బ్రాహ్మణులు, నియోగులు, అయ్యవార్లు, ఆరాధ్యులు, మధ్వలు, వైఖానసలు తదితరులు వున్నారు...వీరందరికీ ప్రభుత్వ నిర్ణయం ద్వారా లాభం చేకూరుతుంది. పేద బ్రాహ్మణుల జీవన స్థితిగతులపై ఒక అధ్యయన కమిటీ ఏర్పాటు చేసి, సరైన డేటా కొరకు సమగ్ర సర్వే చేస్తే, అందులో...కుటుంబాలు, జనాభా, సామాజిక-ఆర్థిక స్థితి గతులు, ఆదాయ వివరాలు, ఆరోగ్య వివరాలు, విద్యా విషయక వివరాలు దొరికే అవకాశాలున్నాయి.


ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చూస్తే బ్రాహ్మణుల సంక్షేమం కోసం రు. 100 కోట్లతో నిధిని ఏర్పాటు చేయడం ఆహ్వానించ దగ్గ పరిణామంసమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఆలోచిస్తున్నదని ఈ చర్య మరో మారు నిరూపించింది. సామాజిక ప్రగతికి నిజమైన అర్థం పేదరిక నిర్మూలనపేదరికంలో మగ్గుతున్న  ఏ వర్గానికైనా సరే చేయూతనందించడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం. నిన్నటి వరకు గుర్తించని వర్గాల లోని పేదరిక సమస్యను గుర్తించి వారి సంక్షేమం కోసం  ముందడుగు వేయటం ద్వారా ప్రభుత్వం అభివృద్ది పట్ల తనకున్న సమగ్ర దృక్పథాన్ని చాటుకున్నది. అనూచానంగా  బ్రాహ్మణులు పురోహితులుగా, అర్చకులుగా జీవనం సాగిస్తున్నారు. గ్రామీణ సమాజం సమృద్దితో, స్వావలంబనతో సాగినంతకాలం అన్ని వృత్తుల వారి మాదిరిగానే తమ కుల వృత్తి ద్వారా బ్రాహ్మణులు జీవనం గడిపారు. కాలం గడుస్తున్న కొద్ది వచ్చిన మార్పులు, నూతన ఆర్థిక విధానాల ప్రభావం, వ్యవసాయంలో నెలకొన్న సంక్షోభంతో గ్రామీణ సమాజం చెదిరి పోయిందికుల వృత్తులు దెబ్బతిన్నాయిఈ పరిణామాలు బ్రాహ్మణుల జీవితాల మీద కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపెట్టాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే  పెద్ద, మధ్య తరగతి రైతులు తదితరుల ఇండ్లల్లో జరిగే శుభా శుభ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయంతో పురోహితులు జీవిస్తూ వస్తున్నారుకొంతమంది గ్రామంలో ఉండే దేవాలయంలో అర్చక వృత్తిని కొనసాగిస్తూ ఆ గుడికి వుండే కొద్దిపాటి భూమిలో పండే పంట ద్వారా వచ్చే ఆదాయంలోంచి కొంత వేతనంగా పొందుతూ జీవిస్తూ వస్తున్నారువ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోవడంతో  రైతుల జీవితం రోజు రోజుకు దిగజారి పోయింది.   వారిని ఆశ్రయించి పురోహితంతో జీవించే  బ్రాహ్మణుల పరిస్థితి అంతే దిగజారింది.

తెలంగాణ ప్రాంతం నదీ జలాల్లో న్యాయమైన వాటా పొందకపోవడం, సాంప్రదాయిక  జల వనరులైన చెరువులు నాశనమై పోవడం వంటి పరిణామాలతో  భూములు పడావు పడ్డాయి. దాంతో దేవాలయ భూముల మీద బ్రతికే అర్చకులకు ఆ కొద్దిపాటి ఆదాయం కూడా లేకుండా పోయిందిదీంతో బ్రాహ్మణులు జరుగుబాటు కూడా దిక్కులేని  పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. అనాదరణకు గురవుతున్న దేవాలయాల్లో భక్తులు హారతి పళ్లెంలో వేసే డబ్బుల కొసరం దీనంగా చూసే బ్రాహ్మణులు ఎందరోఆషాడం వచ్చినా, మూఢం వచ్చినా ముహూర్తాలు లేకపోయినా బ్రాహ్మణుల వంటింట్లో పిల్లి లేవదు. శుక్రవారమో, శనివారమో తప్ప మిగతా రోజుల్లో దేవాలయానికి భక్తులు రారుదాంతో ఎటువంటి ఆదాయం వుండదు. ఆకలిని, దారిద్ర్యాన్ని బయటికి చెప్పుకోలేని ఆత్మాభిమానంతో కుమిలి పోతున్నారురేషన్ కార్డు మీద వచ్చే బియ్యం కోసం ఎదురు చూసే కుటుంబాలు ఎన్నో... పురోహిత వృత్తి చేసే వారికి పిల్ల నివ్వడానికి ఆడపిల్లల తల్లి దండ్రుల ముందుకు రావడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.   ధోతి కట్టుకుని ఇంటింటికీ పురోహితం కోసం తిరగడం వెనుకబాటు తనంగానే నేటి తరం ఆడపిల్లలు భావిస్తున్నారు. ఉద్యోగం ఉన్న వారు మాత్రమే భర్తలుగా రావాలని కోరుకుంటున్నారు.  

60 ఏండ్ల  ఆంధ్రా వలస పాలనలో తెలంగాణ ప్రజలకు దక్కవలసిన ఉద్యోగాలు దక్కకుండా పోయినయి. అష్టకష్టాలు పడి చదువుకున్న వాళ్లకి అర్హతకు తగిన ఉద్యోగాలు లభించలేదు. ఈ పరిణామం  సమాజంలోని  అన్ని వర్గాల ప్రజలతో పాటు బ్రాహ్మణుల మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపించింది.   ఇప్పటికీ 60 శాతం బ్రాహ్మణులు అరకొర చదువులు  చదివి పురోహితం మీద ఆధారపడి అంతంత మాత్రం బతుకులే గడుపుతున్నారుసినిమా, టీవీ తదితర సాంస్కృతిక రంగాలలో తెలంగాణ  బ్రాహ్మణులు కనిపించరువ్యాపార  రంగంలో బ్రాహ్మణుల భాగస్వామ్యం నామమాత్రంగా కూడా లేదు. రాజకీయాలలో అక్కడొక్కరు ఇక్కడొక్కరు తప్ప పెద్దగా కనిపించరుసామాజిక గౌరవం కొద్దో గొప్పో ఉన్నవారు కావడంతో ఇటు చిన్న వృత్తులలో ఇమడలేక, పురోహితం, అర్చక వృత్తులు తప్ప వేరే మార్గం లేక సతమతమవుతున్నారు.   పట్టణ ప్రాంతాల్లోకి వలస వచ్చినవారు అక్కడి దేవాలయాల్లో నెలకు నాలుగైదు వేల  రూపాయలు వేతనంగా పొందుతున్నారంటే పరిస్థితులు ఊహించుకోవచ్చుబాగా ఆదాయం ఉన్న దేవాలయాల్లో  రు. 10 వేలు అంతకు మించి ఆదాయం లభించని పరిస్థితిపెరిగిపోతున్న జీవన వ్యయం, ఆడపిల్లల పెండ్లిళ్ల ఖర్చు, అనారోగ్యం పాలయితే హాస్పిటల్ల ఖర్చులు జీవితాలను మరింత కుంగ దీస్తున్నాయి. మరో వైపు ఓట్ల రాజకీయాల్లో భాగంగా జనాభా తక్కువగా ఉన్న బ్రాహ్మణులు ఎవరికీ పట్టరు. అందులోనూ అగ్రవర్ణాల గురించి  ఆలోచించవలసిన అవసరం లేదనే యాంత్రిక వైఖరిగొంతెత్తి సమస్యలు చెప్పుకునే చైతన్యం లేకచెప్పుకున్నా వినే నాథుడు లేక బ్రాహ్మణలకు సమాజంలో ఊపిరాడని పరిస్థితిఎవరికీ పట్టని, ఎన్నికల్లో లాభించని బ్రాహ్మణ సమాజం గోడు అర్థం చేసుకున్నందుకు తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం విశాల దృక్పథాన్ని అభినందించి తీరవలసిందేఈ పరిణామం తప్పకుండా పేద బ్రాహ్మణులకు గొప్ప ఊరటనిస్తుంది..వారిలో ప్రభుత్వం పట్ల గౌరవం పెరుగుతుంది. బ్రాహ్మణ సంక్షేమం కోసం 100 కోట్ల నిధులతో ఎన్నో చర్యలు చేపట్టవచ్చు.

          ఏం చేస్తే బ్రాహ్మణుల స్థితిగతుల్లో మార్పు రావచ్చని ఆలోచన చేస్తే రకరకాల సలహాలు-సూచనలు వచ్చాయి. అసలింతకీ....రాష్ట్రంలో బ్రాహ్మణులెంతమంది వున్నారనేది ఇదమిద్ధంగా లెక్కలు లేనే లేవు. బహుశా 6 నుంచి 12 లక్షల వరకుండ వచ్చని ఒక అంచనా.... మెజారిటీ దాదాపు 85-90% వరకు 50 కి పైగా వున్న నగరాలలో వుంటే, మిగిలిన ఏ కొద్దిమందో ఇంకా గ్రామాలను అంటిపెట్టుకుని  వున్నారు. సాధారణంగా గ్రామానికి ఒకటి-రెండు కుటుంబాల కన్నా ఎక్కువ లేరు. ఒక అంచనా ప్రకారం సుమారు 10% కి పైగా 65 ఏళ్ల వయసు పైబడిన వారే. వయసు పైబడిన, ఏ సహాయం పొందలేని స్థితిలో వున్న, 65 ఏళ్ల వయసు పైబడిన బ్రాహ్మణులకు వృద్ధాశ్రమం లాంటిది నెల కొల్పడం మంచిదని కొందరు సలహా ఇచ్చారు.

          ప్రభుత్వ పథకాలలో బ్రాహ్మణులకు భాగస్వామ్యం, బ్రాహ్మణ విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సులు, వేద పాఠశాలల ఏర్పాటు, బ్రాహ్మణ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, అపర కర్మలు నిర్వహించడానికి మౌలిక వసతుల ఏర్పాటు, బ్రాహ్మణుల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం-నిర్వహణకు ట్రస్ట్ ఏర్పాటు, సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు అవకాశం-దానికి కావాల్సిన మౌలిక వసతుల కల్పన, వైద్య సౌకర్యం-ఆరోగ్య భీమా సౌకర్యం-హెల్త్ కార్డులు ఇవ్వడం, శాస్త్ర-సాంకేతిక విద్యను అభ్యసించ దల్చుకున్న పేద బ్రాహ్మణులకు ప్రభుత్వ తోడ్పాటు అందించడం, ఒక కాలం నాటి "పంచాంగం" రూపొందించడంలో ప్రత్యేక శిక్షణ...తద్వారా కొందరికి ఉపాధి కలిగించడము, ప్రత్యేకించి బ్రాహ్మణుల కొరకు ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం, పోటీ పరీక్షలకు అవసరమైన కోచింగ్, శిక్షణ ఇవ్వడం, గతంలో లాగా ప్రతి గ్రామంలో ఒకరిద్దరు పురోహితులుండేలా వృత్తి పరమైన శిక్షణ ఇచ్చి, ఉపాధి కలిగించడం, ప్రతి గ్రామంలోని దేవాలయాలలో బ్రాహ్మణ పూజారి నియామకం...ధూప దీప నైవేద్యానికి తగు ఏర్పాట్లు చేయడం, బీద బ్రాహ్మణులకు అవసరమైన రుణ సౌకర్యం-స్వయం ఉపాధి పథకాలకు ప్రభుత్వ మద్దతు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం,.....ఇలా ఎన్నో కార్యక్రమాలను అమలు చేయడానికి ముందుముందు బడ్జెట్ కేటాయింపులతో ప్రభుత్వం తీసుకున్న బ్రాహ్మణ సంక్షేమ నిధి నిర్ణయం తోడ్పడుతుందనడంలో సందేహం లేదు.  


సంక్షేమానికి వారూ-వీరూ అనే తారతమ్యం చూపించకుండా, పేదవారెవరైనా సరే, ఆదుకోవాల్సిందే అన్న దృక్ఫధంతో, సరికొత్త సామ్యవాద భావనతో, బ్రాహ్మణులకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు అభినందనీయులు. End  

బాలకాండ మందరమకరందం : బాల కాండ చివరి పద్యాలు-గద్యం : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
బాల కాండ చివరి పద్యాలు-గద్యం
వనం జ్వాలా నరసింహారావు

          కం:     ఓంకారాత్మక రామా ! శంకరగిరిజావిరించి జపితసునామా !
                   సంకటనిచయవిరామా ! పంకజమిత్రాన్వయ  వారిధిసోమా !

          కం;     సర్వాధిక  సర్వాత్మక ! సర్వ జగత్కారణా ప్రశస్తగుణాఢ్యా !
                      సర్వాదిమకారణ హరి ! సర్వ శరణ్యా మాహత్మ సర్వస్తుత్యా !

          తరలం: జలజవైరిమహీధరాగ్ని  శశాంకపద్యనిరూపితా
                   తులితబాల్యవినోదఖేలన  తోయజాక్ష ! రమాధవా !
                   కలశవారిధితుల్యసజ్జన  కాండ  చిత్తనివాసకా !
                   కలుషసంహార ! యొంటిమిట్టని కాయి ! జానకి వల్ల భా !



          జలజవైరి అంటే చంద్రుడు = 1 , మహీధరఅంటే పర్వతాలు= 7, అగ్ని అంటే త్రేతాగ్నులు= 3, శశాంక అంటే చంద్రుడు= 1. బాల కాండలో వాసుదాసుగారు ఎన్ని పద్యాలు రాసారో ఈ చివరి పద్యంలో పరోక్షంగా చెప్పారు. ఈ కాండలో మొత్తం 1371 పద్యాలున్నాయి.

          ఇది శ్రీమద్రామచంద్ర చరణారవిందమిళిందాయమాన మానసత్వ మహావైభవ
                      వావిలికొలను రామచంద్ర రాయతనూభవ సుజనవిధేయ
                                  సుబ్బరాయ నామధేయ ప్రణీతం బైన
                                  శ్రీ మదాంధ్ర వాల్మీకిరామాయణ మను
                                  మహాకావ్యంలో బాలకాండ మందరం

                    అనువక్త-వాచవి
                   వనం జ్వాలా నరసింహారావు

                      నమోస్తు  రామాయ  సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై

          నమోస్తు  వాతాత్మభువే  వరాయ, నమోస్తు  వల్మీక భవాయ తస్మై.

(ఇంతటితో బాల కాండ మందర మకరందం సమాప్తం)

Sunday, March 13, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-77 : పరశురాముడు పోయిన సంగతి దశరథుడికి చెప్పి ప్రయాణం కొనసాగించమన్న శ్రీరాముడు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-77
పరశురాముడు పోయిన సంగతి దశరథుడికి చెప్పి
ప్రయాణం కొనసాగించమన్న శ్రీరాముడు
వనం జ్వాలా నరసింహారావు

            పరశురాముడు వెళ్లిపోగానే, ధనుస్సును-బాణాన్ని అదృశ్యుడై వచ్చి వున్న వరుణుడిచేతికిచ్చి, వశిష్ఠాదులకు మొక్కి, భయంతో అవయవాలు స్వాధీనం తప్పిన తండ్రిని సమీపించాడు శ్రీరామచంద్రుడు. పరశురాముడు పోయాడని, సుఖంగా అందరం అయోధ్యకు పోవచ్చని, సేనంతా బయల్దేరడానికి సిద్ధమై, ఆయన ఆజ్ఞకొరకు ఎదురుచూస్తున్నదని అంటాడు తండ్రితో. శ్రీరాముడు చెప్పిన వార్తతో ఉప్పొంగి పోయిన దశరథుడు, కొడుకును దగ్గరకు తీసుకొని, రెండు చేతులతో రొమ్ముకు హత్తుకొని, శిరస్సు వాసన చూసి, సైన్యాన్ని బయలుదేరమని ఆజ్ఞాపించాడు.

అయోధ్య ప్రవేశించిన దశరథుడు

          రాజు కొడుకులతో, కోడళ్లతో వస్తున్నాడని విన్న అయోధ్యా నగర వాసులు, రంగు రంగుల పూల తోరణాలు కట్టి, మంగళ వాద్య ధ్వనులు మారుమోగించుకుంటూ, దారంతా నీళ్లతో తడిపి, ఆ స్థలంలో పుష్పాలు వెదజల్లి, చూడగానే మనస్సుకు సంతోషం కలిగే రీతిలో తోరణాలు కట్టి, రంగు రంగుల రంగవల్లులు తీర్చిదిద్ది, పౌరులందరు బంగారు ఆభరణాలు ధరించి, మంగళ వాయిద్యాలతో తమకు ఎదుర్కోలుపల్కి-వెంట వస్తుంటే, కొడుకులు-కోడళ్ళతో దశరథుడు తన మేడలో సంతోషంతో ప్రవేశించాడు. కౌసల్య-సుమిత్ర-కైక, మొదలైన రాజ భార్యలు, మహానుభావ గు సీతను-యశోవతైన ఊర్మిళను-మాండవీ, శృతకీర్తులను, మంగళ వాద్య ధ్వనులు మోగుతుంటే, అంతఃపురంలో ప్రవేశ పెట్టారు. తెల్లటి వస్త్రాలతో అలంకరించారు. మంచిగందం పూసుకొని, సుందరమైన దేహాలు రమ్యంగా అవుతుంటే, శుభ వాక్యాలు పలుకుతూ, తమ ఇలవేల్పు మందిరాలకు అర్చనలు చేసి, పెద్దలకు మొక్కారు కోడళ్లు. ధనధాన్యాలతో-ఆవులతో బ్రాహ్మణులను తృప్తి పరిచారు. ఆతర్వాత భర్తలతో సౌధాంతరాలలో కొత్త-కొత్త సంతోషాలు కలిగే విధంగా సుఖపడ్డారు.

          వీరులు-భార్యలుగలవారు-సుకుమారులు-సౌందర్యంతో మన్మథుడునే అపహసించగలవారు-హితమైన నడవడిగలవారు-మనోహరులైన దశరథుడి కుమారులు, తండ్రికి ఇష్టమైన రీతిలో తిరుగుతూ అందరినీ ఒప్పించారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత, దశరథుడు , భరతుడితో ఆయన మేనమామ అతడిని తీసుకొని పోయేందికొచ్చి పెళ్లినాటినుండి వేచివున్నాడని అంటాడు. మేనమామ ఇంటికి వెళ్లమని చెప్పగా, తండ్రి ఆజ్ఞ ప్రకారం శత్రుఘ్నుడితో కలిసి, తండ్రికి-తల్లులకు నమస్కారం చేసి అనుమతి తీసుకుని పోయాడు. భరతుడు వెళ్లిన తర్వాత సీతా నాధుడైన శ్రీరామచంద్రమూర్తి, తమ్ముడు లక్ష్మణుడు, మంచి గుణాలలో ఆసక్తి కలిగి, జనకుడే దేవుడని తలుస్తూ, ఆయనకు సంతోషాన్ని భక్తితో కలిగించారు. తండ్రి ఆజ్ఞ ప్రకారం శ్రీరామచంద్రమూర్తి ప్రజలకు మేలైన, సంతోషకరమైన కార్యాలను చేస్తుండేవాడు. తల్లికి, తండ్రికి, గురువులకు ఏ వేళ-ఎలా నడచుకుంటే వారికి సంతోషంగా వుంటుందో అలానే నడుచుకుంటూ, సంతోషం కలిగిస్తుండేవాడు. సమస్త గుణాలలో రమించేవాడై, మంచి నడవడితో అభిరాముడై, మంచి బలంతో అధికుడై, కీర్తి స్థానాన్ని పొందిన రామచంద్రమూర్తిని చూసి, బ్రాహ్మణులు-వైశ్యులు, అన్నిజాతులవారు, చాలా సంతోషించారు.

స్వపురంలో సుఖాలనుభవించిన శ్రీ సీతారాములు

          శ్రీరామచంద్రుడు సీతతో కలిసి, అనేక ఋతువులు, మనోహరమైన విహార క్రీడల్లో ప్రియంగా గడిపారు. సర్వదా మనస్సును ఆ స్త్రీ రత్నం మీదే కొరతలేని ప్రేమతో నిలిపాడు. ఆమె కూడా సర్వదా, కూరిమి అతిశయంతో, మనస్సును హృదయేశ్వరుడైన రామచంద్రుడిపైనే నిలిపింది. దేవతల నమస్కారాలందుకునే శ్రీరామచంద్రమూర్తికి, స్త్రీ రత్నమైన సీతను, తండ్రి మెచ్చి భార్యగా ఇచ్చాడు కాబట్టి, ఆయన మనస్సులో ఆమె మిక్కిలి ప్రియురాలైంది. రాముడిలో ఏ మంచి గుణాలు వున్నాయో, అలాంటి గుణాలే సీతలో కుప్పలుగా వున్నాయి. ఇంకా చెప్పాలంటే, రామచంద్రుడికున్న సద్గుణాలకంటే, సీతలో ఎక్కువగానే వున్నాయి. ఆమెలో సౌందర్య, సౌశీల్య, సౌజన్య, సౌభాగ్యాది గుణాలున్నాయి. అందుకే ప్రీతికి మిక్కిలి పాత్రురాలైంది. రామచంద్రమూర్తికి సీతమీద మనస్సులో ఎంత ప్రేమ వుందో, అంతకు ఇబ్బడి ప్రేమ రామచంద్రుడిమీద సీత హృదయంలో దాగి వుంది. సీత అభిప్రాయం ఎంత కొంచమైనా, దానిని రామచంద్రుడు, ఆమె మనస్సులో కలిగీ-కలగక ముందే పసిగట్టి స్పష్టంగా తెలుసుకునేవాడు.


          ప్రత్యక్ష లక్ష్మి అయి, సౌందర్యంలో దేవతా స్త్రీవలె అందమైన సీతాదేవి, తన భర్త హృదయాన్ని, తన హృదయాన్ని భర్త తెలుసుకున్నదానికంటే ఎక్కువగా తెలుసుకునేది. సీత హృదయంలో అభిప్రాయం పుట్టిన తర్వాత, తెలుసుకునేవాడు శ్రీరాముడు. రామచంద్రుడు ఫలానా కోరిక కోరబోతున్నాడని ముందే పసిగట్టేది సీత.

దశరథ రాజకుమారుడు రామచంద్రమూర్తి, రాజితకాముడై, మహాయోగి-మహాజ్ఞాని-జీవన్ముక్తుడని ప్రసిద్ధికెక్కడంవల్ల, రాజులందరిలో ఉత్తముడైన జనకరాజు కూతురిని-తనకంటే ఎక్కువగా రమింప చేయగలది-తనకంటె అత్యధిక ప్రీతికలదైన సీతతో, ఆలింగనంలో ఏక భావం పొందినవాడై-స్వయం గ్రహ శ్లేషానికి విషయభూతుడై కలిసి, ప్రత్యాలింగన సమర్థుడై, విష్ణువు, చంద్ర సోదరైన లక్ష్మితో కలిసి అనురాగంతో ప్రకాశించే విధంగా రంజిలుతుండేవాడు.

            (అయోధ్యా నగరంలో శ్రీ సీతా రాములు సర్వ సుఖాలు అనుభవించారని చెప్పడంలో వారిద్దరి అన్యోన్యత, అనురాగం, అవతార నేపథ్యం లాంటి అనేక విషయాలు భావగర్భితంగా దర్శనమిస్తాయి. సీతను గూడి శ్రీరామచంద్రుడు ప్రియంగా గడిపాడు అనిచెప్పడంలో, భోగానుభవంలో ప్రాధాన్యం శ్రీరామచంద్రమూర్తికేనని చెప్పబడింది. సీత భోగ్య-రామచంద్రుడు భోగి. భోగ్యకంటే భోగి ప్రధానం. "సీతనుగూడి ప్రియంగా", అనడమంటే, సీత దగ్గరలేని సమయం దుఃఖకరమే కాని ప్రియంకాదని-కాజాలదని భావం. అయితే, సీతారాముల విహారంవలన కలిగే సంతోషం, సీతకే చెందాలని రామచంద్రమూర్తి అభిప్రాయం. ఇరువురి విషయంలోనూ, "కూరిమి" శబ్దాన్ని ప్రయోగించడమంటే, వారిరువురు పరస్పరం సమానమైన ప్రేమ కలవారై వున్నారని భావం. కూరిమి చెప్పబడిందే కాని, కామం గురించి చెప్పలేదు. అంటే, వారి ఐకమత్యానికి-పరస్పరానురాగానికి కారణం కూరిమిగాని, కామంకాదే. వారలా అనేక "ఋతువులు" గడిపారని వుంది గాని, అనేక సంవత్సరాలని లేదు. దానర్థం-వారు ఏ ఏ ఋతువుల్లో ఎలా సుఖపడాల్నో అలానే సుఖపడ్డారని.


            రామచంద్రమూర్తి కోరిక కోరబోతున్నాడని ముందుగానే సీత ఎలా పసిగట్టగలదన్న సందేహం రావచ్చు. ఆమెకు అంత శక్తెలా వచ్చిందంటే, ఆమె మైథిలికన్య-మహా జ్ఞాని, మహాయోగైన జనక రాజు కూతురు కనుక. దేశ స్వభావం-వంశ స్వభావం బట్టీ, దేవతతో సమానమైనందున ప్రాగల్భ్యాన్ని బట్టీ, సాక్షాత్తు లక్ష్మి కాబట్టి సహజ బుద్ధి విశేషాన్ని బట్టీ అమెకు ఆ శక్తి వచ్చిందనాలి. సీతారాముల భోగ విషయంలో ఇక్కడ చెప్పబడిన లక్ష్మి నారాయణ ఉపమానం పద్మ పురాణంలో కూడా వుంది. ఇక్కడ చెప్పింది దివ్యదంపతి భోగమే. ప్రాకృత కామ ప్రేరిత సంభోగం గురించి ఎక్కడా చెప్పలేదు. అప్రాకృత దివ్య మూర్తులలో ప్రాకృత కామం వుండే అవకాశం లేనేలేదు. వివాహం అయ్యేటప్పటికి తనకు ఆరు సంవత్సరాల వయస్సని సీతే స్వయంగా-పరోక్షంగా రావణుడికి వనవాస కాలంలో చెప్పింది. ఆ వయస్సులో ఆంతర సంభోగానికి అవకాశం లేదు). 

Saturday, March 12, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-76 : పరశురాముడిని ధిక్కరించి నిస్తేజుడిని చేసిన శ్రీరాముడు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-76
పరశురాముడిని ధిక్కరించి 
నిస్తేజుడిని చేసిన శ్రీరాముడు
వనం జ్వాలా నరసింహారావు

            పరశురాముడిలా మాట్లాడుతుంటే కోపం తెచ్చుకున్న శ్రీరామచంద్రమూర్తి, సమీపంలో తండ్రి వున్నాడన్న కారణంతో-పెద్దవారి ఎదుట గట్టిగా మాట్లాడకూడదన్న నీతిననుసరించి-ఆయనమీదున్న గౌరవంతో, మెల్లని స్వరంతో, "ఏమన్నావు పరశురామా? నీకథంతా విన్నాను. శూరుడు పగ తీర్చుకోవడం న్యాయమే కాబట్టి జనకుడి ఋణం తీర్చుకునేందుకు నీవు చేసిన పని సరైందనే అంగీకరిస్తున్నాను. అంతవరకు బాగానే వుంది. కాకపోతే నేను దుర్బలుడని తలుస్తున్నావు నువ్వు. క్షాత్రధర్మంలో నేను తక్కువన్నట్లుగా నువ్వన్నమాటలను సహించను. నా తేజస్సు నువ్వు తెలుసుకోలేక పోతున్నావు. నా బలాధిక్యాన్ని చూపిస్తాను-చూడు" అని అంటూ, పరశురాముడి చేతిలోని భయంకరమైన వింటిని లాక్కున్నాడు. దాన్ని లాగి, ఎక్కుపెట్టిన బలశాలి రామచంద్రమూర్తి, ఒక బాణాన్ని సంధించి, కళ్లెర్రచేసి అమితమైన కోపంతో పరశురాముడిని చూసి "బ్రాహ్మణుడవైకూడా, శస్త్రాన్ని ధరించి వచ్చిన నిన్ను చంపవచ్చని శాస్త్రం అనుమతించినా, నీవు నా గురువైన విశ్వామిత్రుడి బంధువైనందున, నీమీద కోపంతో నీపై సంధించి-నిన్ను చంపగలిగిన ఈ బాణాన్ని నీమీద ప్రయోగించడానికి మనసొప్పుకోవడంలేదు. అందువల్ల, నువ్వింక ఎంతమాత్రం నడవ లేకుండా, ఒక దిక్కున పడే విధంగా నీ కాళ్ల గమనవేగాన్నిగానీ, నువ్వు తపస్సు చేసి సంపాదించిన పుణ్యలోకాలనుగానీ-ఏదికోరుకుంటే దాన్ని-ఈ బాణంతో ఖండిస్తాను. ఈ బాణం వృధాగా పోదు. ఇది విష్ణు సంబంధమైంది కనుక సంధించిన తర్వాత వ్యర్థంగా పోదు. సార్థకంగా లక్ష్యాన్ని భేదించిన తర్వాతే శాంతిస్తుంది. దీనిని ఖండించాలో చెప్పు" అంటాడు.


          దశరథరాముడిలా పరశురాముడిని భయపడేటట్లు మాట్లాడడం చూసిన దేవతలు-మునులు ఆకాశంలో గుంపులుగా చేరి అద్భుతమని అన్నారు. భయంకరాకారుడైన వీరుడు-రాముడిని, తీక్షణమైన బాణాలను ధరించినవాడిని చూసేందుకు బ్రహ్మ, చారణ-కిన్నెర సమూహంతో అక్కడకు చేరుకున్నాడు. భయంకరమైన రామబాణ వేగాన్ని చూసి, జగమంతా మొద్దుబారిపోయింది. పరశురాముడు జడపదార్థమై-వీర్య విహీనుడై-బొమ్మలాగా శ్రీరామచంద్రమూర్తిని చూడసాగాడు. శ్రీరామచంద్రుడి తేజంతో, పరాక్రమం నశించి-బలం పోయి-జడుడైన పరశురాముడు, మునుపటిలా కాకుండా-గౌరవంతో మెల్లగా ఇలా అన్నాడు రాముడితో.

తన పుణ్యలోకాల మీద అస్త్రం వేయమని
శ్రీరాముడిని ప్రార్థించిన పరశురాముడు

          "పుండరీకాక్షా, భూమినంతా కశ్యపుడికి దానంగా ఇచ్చాను. తనకిచ్చిన భూమిలో నేనుంటే, దానమిచ్చిన దానిని అనుభవించినట్లవుతుందని-వుండొద్దని ఆయన ఆజ్ఞాపించడంతో, పగలంతా తిరిగినా రాత్రివేళల్లో ఇక్కడుండకుండా వెళ్లిపోతుంటాను. మహానుభావా, నా నడకను నరకొద్దు. మనోవేగంతో పోయి మహేంద్ర పర్వతాన్ని చేరుకుంటాను. నా తపస్సుతో నేను సంపాదించుకున్న పుణ్య లోకాలను నీ బాణంతో ధ్వంసం చేయి. ఆ పుణ్యలోకాల అనుభవం నాకు లేకుండా చేయి. అజ్ఞానంతో తప్పుచేసాను. తెలివిలేక, నీవు రాజమాత్రుడవని అన్నానుగాని, నీవంతకంటే చాలా గొప్పవాడివి. నీ సత్తా తెలుసుకోలేక, అందరి లాగే నేను కూడా నిన్ను రాజమాత్రుడవనుకున్నాను. ఎప్పుడైతే నువ్వు నా చేతిలో వున్న విల్లు లాక్కొని బాణం సంధించావో, అప్పుడే, ఇతరులకెవరికీ సాధ్యంకాని పని నువ్వు చేసావనుకున్నాను. కాబట్టి నువ్వు నిర్వికారుడవు-అపరాజితుడవు, మధు వైరివైన శ్రీమన్నారాయణుడివి అని తెలుసుకున్నాను. నేను తెలివి మరిచి అపరాధం చేసాను. క్షమించు. నీకు శుభం జరగాలి. నీ ప్రతాపాన్ని దేవతలందరు చూసారు. నాకింతవరకు పరాభవమంటే ఏంటో తెలియదు. నా జన్మలో మొదటిసారి రాచబాలుడవైన నీచేతిలో ఓడిపోయానని బాధపడడంలేదు. అవమానంగా భావించడంలేదు. ఎందుకంటే, నువ్వు ముల్లోకాలను పాలించే ముఖ్యదేవుడివి. మనోహరమైన దయతో, హృదయ సమ్మతమైన దశరథ రామా, అసమానమైన వ్యర్థంగాని నీ బాణాన్ని విడువు. నా కీర్తి నాశనం కావడం-గతులు తప్పడం కళ్లారా చూసి, సమయం దాటకుండా మహేంద్ర పర్వతానికి పోతాను". పరశురాముడిలా చెప్పగానే, రామచంద్రమూర్తి బాణాన్ని విడవడంతో, తన పుణ్య గతులన్నీ దగ్దమై పోవడం చూసి, ఆయనకు ప్రదక్షిణ చేసి మహేంద్ర పర్వతానికి పోయాడు. పరశురాముడు పోగానే, కమ్ముకున్న చీకట్లు మాయమైనాయి. పరిమాణం చెప్పనలవికాని బలంగల శ్రీరాముడిని దేవతలు శ్లాఘించారు. సైనికులందరికీ తెలివొచ్చింది.


(పరమార్థ జ్ఞానం దేవతలు క్రియా రూపంగా తెలిపేందుకు బ్రహ్మ శివకేశవుల మధ్య పరస్పర ద్వేషం కలిగించి యుద్ధం చేయించాడు. ఒకరు చూసి చెప్పినదానిలా కాకుండా, కళ్లార చూసి, ఎవరెక్కువ బలవంతులో దేవతలు స్వయంగా తెలుసుకున్నారు. ఈ వాస్తవాన్ని తెలుసుకోకుండా, విష్ణువు ఎక్కువా-శివుడెక్కువా అని, తత్పక్షపాతులు విరివిగా గ్రంథాలు రాసారు. శివ కేశవులకు భేదం లేదని పురాణాలు ఘోషించాయి. భగవంతుడు-జనార్ధనుడు ఒకడే. సృష్టి-స్థితి-నాశనం చేసేందుకు బ్రహ్మని, విష్ణువని, శివుడని పేర్లు పెట్టుకున్నాడు. విష్ణువు అధికుడని దేవతలు గ్రహించారని పరశురాముడు శ్రీరాముడికి చెప్పాడు. వింటిని లాక్కుంటూ పరశురాముడిలో వున్న వైష్ణవ తేజస్సును కూడా శ్రీరామచంద్రమూర్తి లాక్కున్నాడని అర్థంచేసుకోవాలి. పరశురామావతారం ఆవేశావతారం. కార్యార్థమై, జీవుడిలో తత్కాలంవరకు, భగవంతుడి తేజస్సు ఆవహిస్తే అది ఆవేశావతారమవుతుంది. ఇక్కడ దేహం ప్రాకృతం. జీవుడు బద్ధుడు. ఇలాంటి ప్రకృతి సంబంధమైన అవతారాలు పూజ్యమైనవికావు-మోక్షమిచ్చేవీ కావు. శ్రీరామావతారం పూర్ణావతారం. ఈ రెండు అవతారాలు కలిస్తే, తక్కువ తేజస్సు, ఎక్కువ తేజస్సులో కలిసిపోతుంది. పరశురాముడిలోని వైష్ణవ తేజం బయటికొచ్చి దేవతలందరు చూస్తుండగా శ్రీరాముడిలో ప్రవేశించింది).

Friday, March 11, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-75 : పరశురాముడిని శాంతించమని ప్రార్థించిన దశరథుడు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-75
పరశురాముడిని శాంతించమని ప్రార్థించిన దశరథుడు
వనం జ్వాలా నరసింహారావు

          "రామా, దశరథ రామా! అద్భుతమైన నీ గొప్పబలాన్ని గురించి విన్నాను. నువ్వు శివుడి ధనుస్సును విరచడం గురించి కూడా లోకులందరు చెప్పుకుంటుంటే విన్నాను. శివుడి విల్లు విరచడం ఆశ్చర్యకరమైన విషయమే. ఇంత గొప్పదని చెప్పలేందది. ఇదివిన్న నేను, ఆ విల్లుకంటే గొప్పదైన మరోదాన్ని, నీ బలం పరీక్షించేందుకు తీసుకొచ్చాను. ఇదిగో-ఇదే పరశురాముడి విల్లు. దీన్ని చూస్తుంటేనే గుండెలు ఝల్లుమంటాయి. దీన్ని నువ్వు ఎక్కుపెట్టి, భయపడకుండా, నీబలమెంతో-వీర్యమెంతో చూపించు. ఈ విల్లు నువ్వు ఎక్కుబెట్టితే, నీ పరాక్రమం ఎంతో చూసి, నీతో ద్వంద్వ యుద్ధంచేస్తాను" అని శ్రీరాముడితో అంటాడు పరశురాముడు.

          పరశురాముడి మాటలు విన్న దశరథుడు, వెలవెలబోయిన ముఖంతో-దీనంగా, కాళ్లల్లో వణుకుపుట్తుంటే, మాటలు తడబడుతుంటే పరశురాముడిని ప్రార్థించాడీవిధంగా: "అయ్యా, మహాత్మా. నువ్వు జాతిబ్రాహ్మణుడివి. రాచజాతిమీద కోపం మాని శాంతించావు. అస్త్రం పట్టనని ఇంద్రుడికి మాటిచ్చావు. ఇప్పుడిలా అనడం న్యాయమేనా? ఈ నా కొడుకులు బాలులు. ఇంకా ఆటలాడడంలోనే ఆసక్తిగలవారు. ఏదో పిల్లతనంతో శివుడి విల్లు విరిచాడు. నువ్వా తప్పును క్షమించు. భృగువంశంలో పుట్టి, వేదాధ్యయన వ్రతంబూని, శీలంగలిగిన నీలాంటివారు శాంతం వహించాలి గాని కోపబడవచ్చా? భూమంతా కశ్యప మహర్షికి ధర్మ మార్గంలో దానం చేసి, ఈ దేశంలోనే వుండకుండా, మహేంద్ర పర్వతాన్ని నివాసంగా చేసుకొని వుంటున్న నీవు కోపించవచ్చా? ఓ మునీశ్వరా, నా గొప్ప పురుషార్థాలన్నీ నాశనం చేయడానికి వచ్చావా? రామచంద్రుడిని ఒక్కడిని చంపితే, మేమందరం అతడితో పోవాల్సినవాళ్లమే". ఇలా అంటున్న దశరథుడి మాటలు వినిపించుకోకుండా-పెడచెవిన పెట్టిన పరశురాముడు, శ్రీరామచంద్రమూర్తికి ధనుస్సుల వృత్తాంతాన్ని చెప్పసాగాడు.




శైవ వైష్ణవ ధనుస్సుల వృత్తాంతం

          "నీవు విరిచిన విల్లు, ఇప్పుడు నాచేతిలో వున్న విల్లు-రెండు కూడా- మిక్కిలి బలిష్ఠమైనవి. దేవతలు చెప్పి చేయించినవి. మిగుల శ్రేష్ఠమైనవి. మిక్కిలి దృఢమైనవి. గొప్ప ప్రయత్నంతో విశ్వకర్మ వీటిని తయారుచేశాడు. అందులో ఒకదాన్ని, త్రిపుర సంహార సమయంలో శివుడికి దేవతలిచ్చారు. నువ్వు విరిచింది దాన్నే. ఇది రెండోది. దీన్ని దేవతలు విష్ణువుకిచ్చారు. ఇదీ మిక్కిలి బలిష్ఠమైనదే. బలంలో శైవచాపంతో సమానమైంది. ఇలా కొంతకాలం జరిగింతర్వాత దేవతలు బ్రహ్మ దగ్గరకు పోయి, శివకేశవులలో ఎవరు బలవంతులని ప్రశ్నించారు. వారి అభిప్రాయం తెలుసుకున్న బ్రహ్మ, క్రియా రూపంలో వారి సందేహం తీరుస్తానని చెప్పి, శివుడికి, విష్ణువుకు విరోధం కలిగించాడు. శివుడు దగ్గరకు పోయి, త్రిపురాలను నాశనం చేసిందెవరని అడిగాడు బ్రహ్మ. తానేనని జవాబిచ్చిన శివుడితో, చేతగాని ప్రగల్భాలు పలకొద్దని, విష్ణువు బాణమై పోయినందున కదా త్రిపురాలను కాల్చిందని అంటాడు. ఆయన చేసిందేమీ లేదని-త్రిపురాలను కాల్చి బూడిద చేసింది తానేనని-శివుడు నిమిత్తమాత్రుడేనని విష్ణువంటున్నాడని రెచ్చగొట్టాడు శివుడిని బ్రహ్మ. కార్యం చేసేవాడిని కర్తని చెప్పాలా?-లేక-సాధనాన్ని చెప్పాలా? అని అడిగిన శివుడు, విష్ణువుకు ఆ శక్తి వుంటే తనకు బాణంగా ఎందుకు నిలిచాడు? అని, శివుడు ఎదురు ప్రశ్న వేశాడు బ్రహ్మను. శివుడన్న మాటలను విష్ణువుకు చెప్పి, పరస్పర ద్వేషం కలిగించి, ఇరువురినీ యుద్ధానికి సిద్ధంచేశాడు బ్రహ్మ. ఒకరిపై మరొకరు కోపించి, వారిద్దరూ భయంకరమైన యుద్ధంచేశారు. ఆ యుద్ధంలో శివుడికి నువ్వు విరిచిన వింటిని, విష్ణువుకు నాదగ్గరున్న వింటిని ఇచ్చారు దేవతలు. ఆయుధాలలో తేడాలుంటే, ఇరువురి బలాబలాలు నిర్ణయించడం సాధ్యంకాదని, సరిసమానమైన ధనుస్సులను ఇచ్చారిద్దరికి. ఇద్దరూ జయించాలనే యుద్ధంచేశారు. యుద్ధంలో విష్ణువు హుంకరించగానే, ఆగాలి దెబ్బకు, శివిడివిల్లు పెట్లిపోయింది. ముక్కంటి-మహా దేవుడైన శివుడు పౌరుషం చెడి స్తబ్దుడయ్యాడు. ఇదంతా చూస్తున్న దేవతలు-మునులు-చారణులు, వృథా కలహం మాని, హరిహరులిద్దరు యుద్ధం ఆపు చేయమని ప్రార్థించారు. వారుకూడా శాంతించారు. విష్ణువు బల వేగంతో శివుడి విల్లు పెట్లిపోవడం చూసిన దేవతలు-మునులు, విష్ణువే శివుడికంటే బలవంతుడని తమ మనస్సులో అనుకున్నారు".


          "దేవతల అభిప్రాయాన్ని గ్రహించిన రుద్రుడు, ధనుస్సుపై కోపంతో, బాణాలతో సహా దాన్ని దేవరాతుడికిచ్చాడు. విష్ణువు ధరించిన వింటిని ఆయన, భృగువంశభవుడైన ఋచీకుడికిచ్చాడు. ఋచీకుడు తన కొడుకైన జమదగ్నికి ఇచ్చాడు. ఆ జమదగ్ని నా తండ్రి. జమదగ్ని శస్త్ర సన్యాసం తీసుకొని తపస్సు చేస్తున్నప్పుడు, గర్విష్ఠుడైన కార్త్యవీర్యార్జునుడు, నీచ బుద్ధితో, నా తండ్రిని చంపాడు. దారుణమైన పితృమరణవార్త విన్న నేను క్రూరుడనై, రాజులను పలుమార్లు వధించాను. రాజులందరినీ చంపి, యజ్ఞం చేసి, యజ్ఞాంతంలో భూమినంతా కశ్యపుడికి దానం చేసి, మహేంద్ర పర్వతం నా నివాసంగా చేసుకొని, తపస్సు చేసుకుంటూ సుఖంగా దేవతా సంఘసేవితుడనై వున్నాను. నువ్వు, నీ మహాబలంతో, శివుడి విల్లు విరిచావని విని పరుగెత్తుకుంటూ వచ్చాను. ఆ వైష్ణవ చాపం ఇదే. నువ్వు క్షత్రియ వంశంలో పుట్టినవాడివైతే, నీ తండ్రి-తాతల క్షాత్రం స్మరించి, ఈ విల్లు ఎక్కుపెట్టి నీ భుజబలం చూపించు. నువ్వు విల్లెక్కుబెట్టి, బాణం సంధించగలిగితే, నీతో ద్వంద్వ యుద్ధం నేనొక్కడినే చేస్తాను. త్వరగా కానివ్వు" అని పరశురాముడన్న మాటలకు శ్రీరాముడు కోపించాడు.

Thursday, March 10, 2016

కంటోన్మెంట్ భూములపై కొత్త వెలుగు : వనం జ్వాలా నరసింహారావు

కంటోన్మెంట్ భూములపై కొత్త వెలుగు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (11-03-2016)

            సికిందరాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో వున్న గఫ్ రోడ్ నుండి రాకపోకలు నిలుపుదల చేయాలని ఏవోసీ అధికారులు నిర్ణయం తీసుకున్నప్పుడు, దాని వల్ల అక్కడ నివసిస్తున్న సాధారణ పౌరులు ఇబ్బందులకు గురవుతారని, ఆ నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరుతూ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కేంద్ర రక్షణ మంత్రికి లేఖ రాశారు. నిర్ణయం తాత్కాలికంగా నిలుపుదల చేసినా సమస్య అంతే వుందింకా. అలానే, రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు, ముఖ్యంగా నూతనంగా నిర్మించ తలపెట్టిన సచివాలయానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బైసన్ పోలో గ్రౌండ్స్ అనువుగా ఉంటుందని భావించి కేంద్రంతో పలు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ప్రత్యామ్నాయంగా గోల్కొండ ఖిల్లా వద్ద తగినంత స్థలం కేటాయిస్తామని కూడా చెప్పింది. అయితే రక్షణశాఖ సానుకూలంగా స్పందించిన దాఖలాలు లేవు. వాస్తవానికి హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం అయిన సమయంలో అప్పటి అవసరార్థం కంటోన్మెంట్ ఏర్పాటైంది. ఇపుడు ఈ కంటోన్మెంట్ అవసరం కూడా లేదన్న చర్చ ఉంది. ఒకవేళ దేశ రక్షణ రంగానికి భాగ్యనగరం ఒక వ్యూహాత్మక ప్రాంతంగా భావిస్తే దాన్ని మరో శివారు ప్రాంతానికి తరలించవచ్చనే వాదనలు ఉన్నాయి.

ఈ నేపధ్యంలో, అక్టోబర్ 10, 1926 , సికిందరాబాద్ కంటోన్మెంట్ భూములకు సంబంధించిన పలు అంశాలను, హైదరాబాద్ మాజీ రెసిడెంట్ సిర్ విలియం బార్టన్, లండన్ లోని ఇండియా ఆఫీస్ లైబ్రరీలో నమోదు చేసినట్లు వెలుగులోకి వచ్చాయి. బహుశా ఈ వ్యవహారంతో అంతో-ఇంతో సంబంధం వున్నవారికి ఇవన్నీ ఆసక్తికరంగా వుండవచ్చేమో! ఈ వివరాల వల్ల ఒక విషయం చాలా స్పష్టంగా బయట పడింది....భారత ప్రభుత్వం, ఏనాడు కూడా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాని, పూర్వపు హైదరాబాద్ నిజాం ప్రభుత్వం నుంచి కాని, ఏ రకమైన భూమిని సికిందరాబాద్ కంటోన్మెంట్ స్థాపించడానికి, కొనుగోలు చేయడం కాని, మరే రూపంలోనైనా స్వంతం చేసుకోవడం కాని అసలే జరగ లేదనేది దాని సారాంశం. దీనర్థం...సికిందరాబాద్ లోని సైనిక అవసరాలకుపయోగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ, ప్రయివేట్ వ్యక్తుల భూములు, సరైన యాజమాన్య హక్కులు లేకుండా, వారి అధీనంలో వున్నాయని. నిజాం నుంచి సహితం, ఏ విధమైన యాజమాన్య హక్కులను, అలనాటి బ్రిటీష్ ప్రభుత్వానికి బదలాయించలేదని కూడా, బార్టన్ నివేదిక స్పష్టం చేసింది. ఈ వివరాలన్నీ అంతర్ జాలంలో చాలా స్పష్టంగా లభ్యమవుతాయి.  

సంపూర్ణ హక్కులతో చెందిన భూమి అనేదేదీ సికిందరాబాద్ లో భారత ప్రభుత్వానికి లేనే లేదు. మిలిటరీ తాత్కాలిక అవసరాలకు మాత్రమే ఉపయోగ పడేందుకు, అప్పట్లో నెలకొన్న భౌగోళిక హద్దుల ఆధారంగా రూపొందించిన బాహ్య సరిహద్దుల పరిధిలోకి వచ్చే, సరిపడిన భూమిని నిజాం ప్రభుత్వం ఇచ్చింది. మిలిటరీ అధీనంలో వున్న బారక్స్, పరేడ్ గ్రౌండ్స్ కూడా, తాత్కాలిక అవసరాలకు బ్రిటీష్ ప్రభుత్వానికి నిజాం ఇచ్చినప్పటికీ, ఆ అవసరాలు తీరిన మరు క్షణమే నిజాం స్వాధీనంలోకి వస్తాయని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. భూమికి చెందిన హక్కు అధికారిక పత్రం నిజాం పేరు మీదే వుండిపోతుంది.


1806 వ సంవత్సరంలో రూపు దిద్దుకున్న సికిందరాబాద్ లో, బ్రిటీష్ కంటోన్మెంట్ ఏర్పాటు చేసుకునేందుకు, హుస్సేన్ సాగర్ కు ఉత్తర దిక్కున తాత్కాలిక ప్రాతిపదికపై నిజం నవాబు కొంత భూమిని కేటాయించారు. బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో జరిగిన యుద్ధంలో రెండవ నిజాం ఆసఫ్ ఝా ఓటమి పాలైన దరిమిలా, ఇరు పక్షాల మధ్య 1798 లో కుదిరిన సబ్సిడియరీ ఒప్పందానికి అనుగుణంగా బ్రిటీష్ కంటోన్మెంట్ స్థాపన జరిగింది. క్రమేపీ, రెజిమెంటల్ బజార్, జనరల్ బజార్ లాంటి మార్కెట్లు ఏర్పడ్డాయి. ఇప్పుడు రాష్ట్రపతి నిలయంగా పిలువబడుతున్న రెసిడెన్సీ హౌజ్ నిర్మాణం 1860 లో జరిగింది. భారత దేశంలోనే అత్యంత పెద్దదైన కంటోన్మెంట్ గా ప్రసిద్ధికెక్కిన సికిందరాబాద్ స్థావరంలో భారీ సంఖ్యలో సైనిక, వాయు సేనకు చెందిన సిబ్బంది వుంటుంది. సికిందరాబాద్ పరిసరాల్లో వున్న ప్రాంతమంతా వివిధ పాలకుల చేతుల్లోకి మారుతూ పోయి, 18 వ శతాబ్దంలో, నిజాంకు చెందిన హైదరాబాద్ లో అంతర్భాగమైంది.

భారత దేశం నలుమూలలా, సామ్రాజ్యవాద అధికారం సుదీర్ఘంగా మనుగడ సాగించిందనడానికి బలీయమైన గుర్తులుగా, బ్రిటీష్ కంటోన్మెంట్ స్థావరాలు రూపొందాయని, ప్రముఖ రచయిత నరేంద్ర లూథర్ తన గ్రంథం "లష్కర్" (అంటే ఆర్మీ కాంప్) లో పేర్కొన్నారు. అసలా మాట కొస్తే, కంటోన్మెంటులను నెలకొల్పిన స్థలాలన్నీ ఒక రకమైన మినీ కోట బురుజుల్లాగా, బ్రిటీష్ అధికారులు దేశంలోని స్థానికులకు దూరంగా, దాదాపు సాంఘిక వేర్పాటు ధోరణిలో వుంటూ వచ్చాయి. సికిందరాబాద్ కంటోన్మెంట్ కూడా ఆ కోవకు చెందినదే. దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత కూడా వారి ధోరణిలో, ఆలోచనా విధానంలో మార్పు రాలేదు. అదే వైఖరి కొనసాగింది. కాల క్రమేణ, ఒకప్పుడు కేవలం ఒక కాంపుగానే వుండే ఆ ప్రాంతం, విస్తరించుకుంటూ పోయి, ఒక భారీ స్థాయి కంటోన్మెంటుగా రూపాంతరం చెంది, దక్షిణాదిలో బ్రిటీష్ సైనికుల నివాస-కార్యాలయ వసతిగా మారిపోయింది. అధికారులకోసం నిర్మించిన ఇళ్లు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటైన "ద రిట్రీట్" అనే ఓ పెద్ద అధికారిక నివాసంలో, కొన్నాళ్లు మాజీ బ్రిటీష్ ప్రధాన మంత్రి విన్ స్టన్ చర్చిల్, 1896 లో, అక్కడ సెకండ్ లెఫ్టినెంటుగా పని చేస్తున్న రోజుల్లో నివసించాడట. ఇప్పటికీ చెక్కు చెదరకుండా వున్న ఆ ఇంట్లో ఒక కల్నల్ స్థాయి అధికారి వుంటున్నట్లు సమాచారం.

1945 లో ఏర్పాటైన సికిందరాబాద్ మునిసిపాలిటీ, హైదరాబాద్ మునిసిపాలిటీలో కలిపి, 1960 లో హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ను నెలకొల్పింది నాటి ప్రభుత్వం. ప్రస్తుతం సికిందరాబాద్ కూడా హైదరాబాద్ జిల్లాలో అంతర్భాగం. దరిమిలా 2007 లో ఏర్పాటైన హైదరాబాద్ మహా నగర మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచెంసీ) సికిందరాబాద్ ప్రాంత పాలనను కూడా నిర్వహిస్తుంది. ఇదే కాకుండా, స్వతంత్రం వచ్చిన తరువాత, సికిందరాబాద్ కంటోన్మెంట్ బోర్డ్, భారత సైన్య అధికార పరిధిలోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ప్రస్తుతం సికిందరాబాద్, హైదరాబాద్ లలో వున్న సైనిక స్థావరాలు, ఇళ్లు సికిందరాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ పాలనా పరిధిలోకి వస్తాయి. ఇక్కడున్న మౌలిక సదుపాయాల యాజమాన్యం, పౌర పరిపాలన కూడా కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో వున్న ఈ బోర్డే నిర్వహిస్తుంది.

1768 లో కుదిరిన ఒప్పందం దరిమిలా, బ్రిటీష్ ప్రభుత్వం, రెండు బెటాలియన్ల (పటాలాలు) సిపాయులను నిజాంకు సమకూర్చడానికి అంగీకరించింది. ఆ తరువాత హైదరాబాద్ లో ఒక రెసిడెంటును నియమించింది. బెటాలియన్ల సంఖ్యను ఏటేటా పెంచుకుంటూ ఎనిమిదికి చేసింది. 1806 కల్లా, పటాలాల స్థానంలో దళాలను (ట్రూప్స్) ఏర్పాటుచేయడానికి నిశ్చయించింది. 1903 లో బొలారం కంటోన్మెంటును రద్దు చేసి, సికిందరాబాద్ లో విలీనం చేసింది. బొలారం కంటోన్మెంట్ అధీనంలో వున్న భూమిని కూడా కొనుగోలు చేయకుండా ఉచితంగా స్వాధీనంలోకి తెచ్చుకుంది. నిజాం నుంచి ఆ భూముల చట్టబద్ధ హక్కులను మిలిటరీ అధికారులకు ధారాదత్తం చేస్తూ ఎలాంటి పత్రం రాసుకోలేదు. 1806 నుంచి మొదలు పెట్టి, వివిధ సందర్భాలలో, మిలిటరీ అధికారుల అవసరాల కోసం, చాలా మొత్తంలో భూమిని నిజాం వారికి అవసరార్థం ఇవ్వడం జరిగింది. బ్రిటీష్-భారత ప్రభుత్వానికి, నిజాం ప్రభుత్వం భూమి హక్కులను మాత్రం బదలాయించ లేదనే విషయాన్ని బార్టన్ నివేదిక స్పష్టం చేసింది. అలాగే, పదమూడు మొఘలాయీ గ్రామాలైన చిన్న తోకట్ట, పెద్ద తోకట్ట, సీతారాంపూర్, బోయినపల్లి, బాలంరాయ్, కాకాగూడ, సిక్ విలేజ్, ఆల్వాల్, మారేడ్ పల్లి, రసూల్ పూర, బూసారెడ్డి గూడ, బొలారం, ట్రిమల్ ఘిరి, లాలాపేట్ కూడా మిలిటరీకి చెందినవి కావంటాడాయన. నిజాం నుంచి ఎప్పుడు కూడా భూ బదలాయింపు చట్టబద్ధంగా జరగలేదు.

వాస్తవానికి తాత్కాలిక ప్రాతిపదికపై నిజాం ప్రభుత్వం నుంచి, రెండవ ప్రపంచ యుద్ధానంతర పరిణామాల నేపధ్యంలో, ఒక ఆరు నెలల కాలం పాటు అవసరమని చెప్పి, బ్రిటీష్ సైన్యం కొరకు ఈ భూములను తీసుకోవడం జరిగింది. ఇదిలా వుండగా, 21, జూన్ 1968 న జరిగిన సికిందరాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ సమావేశంలో భూములకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. ఆ సమావేశానికి రక్షణ శాఖ ఉన్నతాధికారులతో పాటు, సికిందరాబాద్ సబ్ ఏరియా అధికారులు కూడా హాజరై దాంట్లో చేసిన తీర్మానంపై సంతకాలు కూడా చేశారు. డిఫెన్స్ అధికారులేనాడూ సికిందరాబాద్ కంటోన్మెంట్ భూములపై హక్కు కలిగి వుండ లేదనీ, తాత్కాలికంగా వారికిచ్చిన భూములన్నీ వారి అవసరాలు తీరిన తరువాత, డిసెంబర్ 1, 1945 న నిజాం ప్రభుత్వానికి అప్ప చెప్పారని, ఆ తీర్మానం సారాంశం. ఆ తీర్మానంలోనే మరో ప్రధానమైన అంశం కూడా పేర్కొనడం జరిగింది. సికిందరాబాద్ కంటోన్మెంటుకు, దేశంలోని ఇతర కంటోన్మెంటులకు చాలా భేదం వుందని, సికిందరాబాద్ కంటోన్మెంటుకు బ్రిటీష్ చట్టాలు వర్తించవని, అవి నిజాం ప్రభుత్వ చట్టాలు, జాగీరు చట్టాలకు లోబడి వుంటాయని తీర్మానంలో వుంది. ఆ క్రమంలోనే కంటోన్మెంటులో భాగమైన సికిందరాబాద్ పట్టణం నిజాం ప్రభుత్వ ఆధీనంలోకి తేవడం జరిగింది.


హైదరాబాద్ నిజాం సార్వభౌమాధికార తీరుతెన్నులను ఉటంకిస్తూ, అమీరున్నిస్సా బేగం-మహబూబ్ బేగంల కేసులో సుప్రీం కోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. భారత యూనియన్ లో హైదరాబాద్ రాష్ట్రం విలీనం కాక పూర్వం, భారత రాజ్యాంగం అమల్లోకి రావడానికి పూర్వ రంగంలో, హైదరాబాద్ నిజాంకున్న అధికారాలకు హద్దుల్లేవంది. నిజాం నవాబ్, చట్ట సభలకు, న్యాయ స్థానాలకు, కార్య నిర్వహణకు సర్వోత్తమ అధికారి. ఆయనపై రాజ్యాంగపరమైన పరిమితులు లేవు. తనకున్న అధికారాలను వాడుకోవడంలో ఆయనకు తిరుగు లేదు. ఆయన ఫర్మానాలంటే నిజాం సార్వభౌమాధికార వ్యక్తీకరణ అనాల్సిందే. ఆదే చట్టం...అదే న్యాయం...ఆ ఫర్మానాలకు విరుద్ధంగా వున్న చట్టాలన్నీ వీటి ముందు దిగదుడుపే. ఒక సారి ఒక ఫర్మానా జారీ అయిందంటే, అది అమల్లో వున్నంతవరకు, దానికి సంబంధించిన వారందరూ దానికి లోబడి వ్యవహరించాల్సిందే. ఆ ఫర్మానా సవరించేంత వరకు అదే చట్టం...దానిని మించింది ఏదీ లేదు. హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్ లో విలీనం అయిన తరువాత, మిలిటరీ అవసరాలకు నిజాం నవాబు ఇచ్చి, ఆ అవసరాలు తీరిన తరువాత తన ప్రభుత్వ పరం చేసుకున్న భూములన్నీ, రాష్ట్ర ప్రభుత్వ హక్కు భుక్తంలోకి, పరిపూర్ణంగా వచ్చినట్లే. సికిందరాబాద్ - హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలో వున్న భూములన్నీ, ఆ విధంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానివే. ఆ భూములను ఎలా ఉపయోగించుకోవాలనే విషయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. అలాంటప్పుడు....మిలిటరీ అధికారులకు కాని, భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు కాని, అన్ని భూములు కాకపోయినా, అవసరం కోసం అడిగిన కొంత భూమైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి అభ్యంతరం ఎందుకుండాలి? కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సరైన ఆలోచన చేయడం ఉభయ తారక మేమో! End

బాలకాండ మందరమకరందం సర్గ-74 : అయోధ్యకు వెళుతున్న దశరథుడికి మార్గంలో అపశకునాలు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-74
అయోధ్యకు వెళుతున్న దశరథుడికి 
మార్గంలో అపశకునాలు
వనం జ్వాలా నరసింహారావు

            వివాహమైన మర్నాటి ఉదయం, నిద్రలేచిన అనంతరం, దశరథుడి సమ్మతితో, రాజకుమారులకు మంచిదీవెనలిచ్చి హిమాచలానికి వెళ్లిపోయాడు విశ్వామిత్రుడు. ఆయనలా వెళ్లగానే, అయోధ్యకు పోయేందుకు తమకు అనుమతినివ్వమని జనకుడిని కోరాడు దశరథుడు. కూతుళ్లంటే అమితమైన ప్రేమాతిశయం వున్న జనక మహారాజు, తన ముద్దుల కుమార్తెలకు ఒక్కొక్కరికి లక్ష గోవులు-మంచి మంచి రంగులతో అలంకరించిన కంబళ్లు-శుభ వస్త్రాలు-అలంకారయుతమైన దాసికలు-విశేషకాంతిగల రథాలు-ఏనుగులు-తీవ్ర వేగంతో పరిగెత్తగల గుర్రాలు-శూరులైన భటులు-మంచి శ్రేష్ఠమైన ఆణిముత్యాలు-బంగారు పగడాలు, అరణంగా ఆడబిడ్డలకిచ్చాడు. ఇలా బిడ్డలకు అరణం ఇచ్చింతర్వాత, దశరథ మహారాజుతో కలిసి, వారితో తాను కొంతదూరం ప్రయాణంచేసి-వారందరిని సాగనంపి, ఆయన అనుమతితో తన ఇంటికి తిరుగు ప్రయాణమై పోయాడు జనకుడు. వెళుతున్న రామచంద్రమూర్తి ఇంపైన-శ్రేష్ఠమైన సుకుమారత్వాన్ని, అందాన్ని, గొప్ప గాంభీర్య గుణాన్ని, శౌర్యాన్ని గమనించిన మిథిలా పుర స్త్రీలు ఒకరితో మరొకరు ఇలా చెప్పుకున్నారు: "అమ్మా, వీడా యుద్ధంలో తాటకను చంపిన విల్లుకాడు? వీడా విశ్వామిత్రుడి యాగాన్ని రక్షిస్తూ సుబాహుడిని చంపిన పౌరుషశాలి? వీడా అహల్యను శాప విముక్తురాలిని చేసి మరల స్త్రీగా చేసిన ఉపకారి, వీడా మన జనక రాజు దాచిపెట్టిన శివిడివిల్లు విరిచిన జగజ్జెట్టి, వీడా నిన్ననే మన సీతను పెళ్లిచేసుకొని కులుకుతున్న సుందరుడు. అమ్మా, మన రాజు జనకుడు ఎంత పుణ్యాత్ముడే? ఇంతటి వాడిని అల్లుడిగా సంపాదించాడు!" అని ముక్కుమీద వేలుంచుకుని ఆశ్చర్యపడ్డారు.

          "అమ్మా, రామచంద్రమూర్తిని తన కొడుకుగా కడుపారగాంచేటందుకు కౌసల్య ఏం నోమునోచిందోకదా? ఇతడిని భర్తగా పొందేందుకు మన సీత ఏ నిష్ఠలు సలిపిందోకదా? ఇతడు తన అల్లుడయేందుకు మనరాజు జనకుడు ఏ మంత్రం జపించాడోకదా? ఇతడు ప్రభువుగా తమను పాలించేందుకు అయోధ్యాపురవాసులు ఎన్ని తపస్సులు చేసారోకదా? నక్ష్తేత్ర తీర్థవాసఫలాన్ని అనుభవించి, ఇతడిని ప్రతిదినం దర్శనం చేసుకునేందుకు, అయోధ్య జనులు ఎటువంటి నియమాలు-వ్రతాలు జరిపారోకదా? సుందరీమణులారా, మన జీవితకాలంలో మరొక్కసారైనా ఈ అందగాడిని చూడగలమా? కమలాక్షులారా, మరొక్కమారైనా తామర పూలలాంటి కళ్లున్న ఇతడిని చూస్తామా? వెలదులారా, ఇంకొక్కసారి మనం ఈ కలువ కళ్ల అందగాడిని చూడగలమా? యువతులారా, స్త్రీల మనస్సులను ఆకర్షించే ఇతడిని ఒక్కసారైనా చూడగలమా? అక్కలారా, మనం ఏ జన్మలో-ఏ కొంచెం పుణ్యంచేసుకున్నామోగాని, దాని ఫలంగా నేడు ఇక్కడ కళ్లార శ్రీరామచంద్రమూర్తిని చూడగలిగాం" అని మాట్లాడుకోసాగారు పుర స్త్రీలు.


          దశరథుడు పయనమై, కొడుకులు, మునులు, ఇతరులు తనకు ఇరు పక్కల వస్తుంటే కొంతదూరం పోయాడు. అలా పోతున్న ఆయనకు ఎదురుగా, పరుష ధ్వనులతో ఆకాశంలో పక్షులు భయంకరంగా కూసాయి. అప్పుడే కొన్ని మృగాలు ప్రదక్షిణగా పరుగెత్తసాగాయి. ఇలా, ఆకాశంలో అపశకునాలు-భూమిమీద శుభశకునాలు కనబడడంతో, దశరథుడు అదేంటని వశిశ్ఠుడిని అడిగాడు. పక్షి కూతలవల్ల భయంకరమైన కీడు కలిగే అవకాశం వున్నప్పటికీ, అడవిమృగాలు ప్రదక్షిణగా పోతున్నందున, భయపడాల్సిన అవసరం లేదని వశిష్ఠుడు దశరథుడికి ధైర్యం చెప్పాడు. ఇంతలో, చూసేవారి గుండెలు ఝల్లుమనేలా గాలి సుళ్లుపెట్తూ వీరిని తాకింది. భూమి వణికి చెట్లు నేల కూలాయి. విస్తారంగా చీకట్లు సూర్యుడిని కమ్ముకున్నాయి. దిక్కులు తెలవకుండా, దుమ్ము విశేషంగా లేచి, దశరథుడి సైన్యాన్ని కప్పేసింది. ఇదంతా జరుగుతుంటే, ఏంచేయాల్నో తోచక ఎక్కడివారక్కడే నిలబడి పోయారు. ఆ సమయంలో-ఆ జన సమూహంలో, దశరథుడు-రాజకుమారులు-ఋషులు తప్ప మిగిలినవారిలో ఎవరు కూడ భయంతో తెలివితప్పనివారు లేరు. 

శ్రీరాముడిని చూసేందుకొచ్చిన పరశురాముడు


            భయంకరమైన ఆకారంతో-దిగులు పుట్టించే తేజంతో, రాజుల పాలిటి మృత్యువైన వాడు-ఇతరులెవరు జయించలేనివాడు - వెండి కొండను పోలినవాడు - కోపాతిశయంలో ప్రళయకాలాగ్ని లాంటివాడు -జనానికి కనీసం కన్నెత్తైనా చూడ సాధ్యపడనివాడు-కోదండం చేతిలో ధరించి వచ్చినవాడు-త్రిపుర హరుడితో సమానమైన వాడు-భృగువంశంలో పుట్టినవాడు-భుజంమీద ప్రకాశవంతమైన గండ్రగొడ్డలిని ధరించి తన కాంతితో ఇతరులకు భయం కలిగించేవాడు-తనను చూస్తున్నవారిని గుడ్డివారిగా చేయగలవాడైన జమదగ్ని కుమారుడు-పరశురాముడు, ఏనుగులా వేగంగా అడుగులు వేసుకుంటూ భూమిపై దద్దరిల్లే ధ్వనులు పుట్టించుకుంటూ అక్కడికొచ్చాడు. ఇలా వస్తున్న ఆయనను దూరంనుండే చూసిన మునులు, తన తండ్రిని చంపాడన్న కోపంతో రాజులందరినీ హతమార్చిన ఈ సాధుచరిత్రుడు ఎందుకొస్తున్నాడానని ఆలోచించ సాగారు. ఇంతలో, అక్కడకు చేరుకున్న పరశురాముడికి, ముని సమూహం అర్ఘ్యం ఇచ్చి పూజించిన తర్వాత, వారిని దాటిపోయి శ్రీరాముడితో సంభాషించాడు పరశురాముడు.

Wednesday, March 9, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-73 : దశరథుడిని చూసేందుకొచ్చిన యుధాజిత్తు - సీతా కల్యాణ ఘట్టం : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-73
దశరథుడిని చూసేందుకొచ్చిన యుధాజిత్తు
సీతా కల్యాణ ఘట్టం
వనం జ్వాలా నరసింహారావు

            గోదానం జరిగిన రోజునే, కేకయ రాజకుమారుడు మేనల్లుడు భరతుడిని, బావగారు దశరథుడినీ చూడడానికొచ్చాడు. తండ్రి పంపగా వచ్చిన కేకయ రాజకుమారుడు యుధాజిత్తు, భరతుడిని తీసుకుపోయేందుకు తాను అయోధ్యకు పోయానని, వారంతా పెళ్లికై మిథిలకొచ్చారని విని, ఇక్కడకొచ్చానని, ఉభయ కుశలోపరి దశరథుడితో అంటాడు. సంతోషించిన దశరథుడు బావగారిని తగిన మర్యాదలతో గౌరవించాడు. ఆ రాత్రి కొడుకులతో వినోదంగా గడిపి దశరథుడు, మర్నాడు ఉదయం తూర్పు తెల్లవారుతుండగానే, కాల కృత్యాలు తీర్చుకొని యజ్ఞ భూమికి చేరుకున్నాడు. అందమైన ఆభరణాలను ధరించి, కంకణం కట్టుకొని, రామచంద్రమూర్తి మంచి ముహూర్తంలో తమ్ములతో కలిసి వచ్చాడక్కడకు. వశిష్ఠుడు-ఇతర మునీంద్రులు ముందుండి తమ వెంట వస్తుంటే యజ్ఞ భూమి (యజ్ఞ భూమి అంటే, సమీపంలో పెళ్లిజరిపించేందుకై ఏర్పాటుచేసిన ఉత్సవశాల అని అర్థం) ప్రవేశించాడు దశరథుడు. అలా ప్రవేశిస్తుండగానే వశిష్ఠుడు జనక రాజును చూసి, దాత కొరకు దశరథుడు వేచి వున్నాడని చెప్పాడు. ఇచ్చేవాడు-పుచ్చుకునేవాడు ఒకచోట వున్నప్పుడే తదుపరి తతంగం జరుగుతుందని అంటూ, ఆయన స్వధర్మమైన-దాత చేయాల్సిన కార్యమైన పెళ్లి జరిపించమని వశిష్ఠుడు జనకుడికి తెలియచేశాడు.

          జవాబుగా " మునీంద్రా, ఇక్కడ కొత్తవారెవ్వరు? ఎందుకంత ఆలస్యం చేసారు? ఇంతకు ముందే కార్యం ఆరంభం చేయకుండా మీకెవరైనా అడ్డమొచ్చారా? కార్యం జరిపించేందుకు ఎవరి ఆజ్ఞకొరకు వేచి వున్నారు? నా రాజ్యమంతా మీదేనని ముందే చెప్పానుకదా. అలాంటప్పుడు ఈ ఇల్లు కూడా మీదేకదా. అలంకరించుకొని పెళ్లికూతుళ్ల వేషాల్లో, నా నలుగురు కుమార్తెలు సంతోషంగా వేదిలోని అగ్నివలె వెలుగుతూ, మండపం దగ్గరే వున్నారు. సర్వం సిద్ధంగా వుంది. మీరింకా రాలేదని మీరాక కొరకే ఎదురు చూస్తున్నాను. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? నేను చేయాల్సిన కార్యమంతా చేసాను. మిగిలిన కార్యం చేయాల్సినవారు మీరే" అని జనకుడు వశిష్ఠుడికి చెప్పగానే, ఆ విషయాన్నే దశరథుడికి చెప్పేందుకు దూతలను పంపాడాయన. అది విన్న దశరథుడు, తన కొడుకులను, మహర్షులను యజ్ఞశాలకు పంపాడు.

వశిష్ఠుడితో జనకుడు, ఇతర ఋశీష్వరులతో కలిసి త్రిలోకాభిరాముడైన రామచంద్రమూర్తికి శీఘ్రంగా-సంతోషంగా వివాహ సంబంధమైన కార్యాలన్నీ జరిపించమని అన్నాడు. అలానే జరిపిస్తానన్న వశిష్ఠుడు, తనకు సహాయంగా విశ్వామిత్రుడు, శతానందుడు తోడుండగా వివాహ సంబంధమైన కార్యక్రమం చేపట్టాడు. చలువ పందిరిలో శాస్త్ర ప్రకారం వేదిని తీర్చి, పూలతో-పరిమళ ద్రవ్యాలతో దానిని అలంకరించి, మెరుస్తున్న బంగారు పాలికలతో-మొలకలెత్తిన శుభకరమైన అడుగులేని పాత్రలతో-జిగుళ్లుగల మూకుళ్లతో-ధూపమున్న ధూప పాత్రలతో-స్రుక్కులు, స్రువాలు, అర్ఘ్యం పేలాలతో నిండిన స్వచ్ఛ పాత్రలతో-పచ్చని అక్షతలతో వేదిని నింపాడు వశిష్ఠుడు. మంత్రాలు పఠిస్తూ, పరిశుద్ధమైన దర్భలను పరిచి, శాస్త్రోక్తంగా వేదిలో అగ్నిని వుంచి, వశిష్ఠుడు హోమం చేశాడు.

సీతా కల్యాణ ఘట్టం

" సీతను సర్వాభరణోపేతను  దా నిలిపి నగ్ని  కెదురుగ గౌస
ల్యా తనయున  కభిముఖముగక్ష్మాతలనాథుండు రామచంద్రున కనియెన్ "
          అన్ని విధాలైన అలంకారాలతో ప్రకాశిస్తున్న సీతను, అగ్నికి ఎదురుగా-శ్రీరామచంద్రమూర్తికి అభిముఖంగా, నిలువబెట్టి, జనక మహారాజు శ్రీరామచంద్రమూర్తితో:
ఈ సీత నాదుకూతురు, నీ సహధర్మచరి దీని నిం గై కొనుమా
కౌసల్యాసుత, నీకును భాసురశుభ మగు గ్రహింపు పాణిం బాణిన్ "

" కౌసల్యా కుమారా, ఈ సీత నా కూతురు. నీ సహధర్మచారిణి. ఈమెను పాణి గ్రహణం చేసుకో. నీకు జగత్ ప్రసిద్ధమైన మేలు కలుగుతుంది. నీకు శుభం కలుగుతుంది. మంత్రపూర్వకంగా ఈమె చేతిని నీ చేత్తో పట్టుకో. రామచంద్రా, పతివ్రత-మహా భాగ్యవతి అయిన నీ సీత, నీ నీడలా ఒక్కసారైనా నిన్ను విడిచి వుండదు" అని అంటూ, మంత్రోచ్ఛారణతో పవిత్రవంతములైన జలధారలను రామచంద్రమూర్తి చేతుల్లో జనక మహారాజు ధారపోశాడు. దేవతలు, ఋషులు మేలు-మేలనీ, భళీ అనీ శ్లాఘించారు. సంతోషాతిషయంతో దేవతలు పూలవాన కురిపించారు. దేవదుందుబులను చాలా సేపు మోగించారు. వాసవుడు మొదలైన పలువురు,తమ శోకత్వాన్ని-దీనత్వాన్ని తమ మనస్సులనుండి తొలగించుకున్నారు.

ఈవిధంగా మంత్రించిన జలాలను ధారపోసి భూపుత్రి సీతను శ్రీరామచంద్రమూర్తికిచ్చి వివాహం చేసానని జనక మహారాజు సంతోషిస్తూ లక్ష్మణుడివైపు చూసి, "లక్ష్మణా ఇటు రా. దానంగా ఊర్మిళను స్వీకరించు. ప్రీతిపూర్వకంగా ఇస్తున్నాను. ఈమె చేతిని ప్రేమతో గ్రహించు" మని కోరాడు. ఊర్మిళను లక్ష్మణుడికిచ్చిన తర్వాత, భరతుడిని మాండవి చేతిని, శత్రుఘ్నుడిని శ్రుతకీర్తి చేతిని గ్రహించమని ప్రేమతో పలికాడు జనకుడు. ఇలా నలుగురు కన్యలను దశరథుడి నలుగురు కొడుకులకు ధారపోసి, జనకుడు రాజకుమారులతో, దోష రహితమైన మనసున్న వారందరు సుందరులైన భార్యలతో కలిసి, సౌమ్య గుణంగలవారిగానూ-సదాచార సంపన్నులుగానూ కమ్మని అంటాడు. జనక మహారాజు మాటలను విన్న దశరథుడి కుమారులు-రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, తండ్రి అనుమతితో భార్యల చేతులను తమ చేతుల్లో వుంచుకొని, సంతోషాతిషయంతో, మలినంలేని భక్తితో, అగ్నికి-వేదికి-మౌనీశ్వరులందరికి-రాజులకు భార్యలతో కలిసి ప్రదక్షిణ చేసారు. వివాహం శాస్త్ర ప్రకారం ప్రసిద్ధంగా జరిగింది. పూలవాన కురిసింది. ఆకాశంలో దేవ దుందుభులు ధ్వనించాయి. దేవతా స్త్రీలు నాట్యం చేసారు. గంధర్వ కాంతలు పాడారు. రావణాసురుడి భయం వీడి, సందుల్లో-గొందుల్లో దాక్కున్న వారందరు నిర్భయంగా-గుంపులు, గుంపులుగా ఆకాశంలో నిలిచారు. మంగళ వాద్యాలు మోగుతుంటే, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అగ్నికి మూడుసార్లు ప్రదక్షిణ చేయడంతో పెళ్లి తంతు ముగిసింది. తమ భార్యలతో దశరథ కుమారులు విడిది ఇళ్లకు పోవడంతో, వారివెంట దశరథుడు, వశిష్ఠ విశ్వామిత్రాది మునీశ్వరులతో, బందువులతో విడిదికి పోయారు.


          (సీతా కల్యాణ ఘట్టం చదివినవారికి శ్రీ సీతా వివాహ విషయ చర్చకు సంబంధించి ఆసక్తి కలగడం సహజం. కన్యాదానం చేస్తూ జనకుడు రాముడిని "కౌసల్యా సుత" అని సంబోధించాడు. ఎందుకు జనకుడు కౌసల్యా కుమారా అని పిలవాలి? స్త్రీ పేరుతో పిలవకుండా, వాడుక పేరైన "రామా" అని పిలవచ్చు కదా. దశరథ కుమారా అనకూడదా? ఆ రెండూ ఇప్పుడు సరిపోవని అర్థం చేసుకోవాలి. కేవలం రామా అని పిలిస్తే ఆ పేరుకలవారు మరొకరుండవచ్చు కదా. దశరథ కుమారా అని పిలవడానికి ఆయనకు నలుగురు కొడుకుల్లో వేరొకరు కావచ్చు కదా. కౌసల్యా కుమార అంటే ఏవిధమైన సందేహానికి తావుండదు. "ఈ సీత" అంటాడు రాముడితో. సీత, సిగ్గుతో తన చేయి పట్టుకొమ్మని, తనంతట తానే రాముడిని అడగదు. రామచంద్రమూర్తి తనకు తానే సీత చేయి పట్టుకుంటే, పెళ్లికాక ముందే ఎందుకలా స్వతంత్రించి కాముకుడిలా ప్రవర్తించాడని సీత అనుకోవచ్చు-లోకులూ భావించవచ్చు. అందుకే జనకుడు తానే సీతచేతిని రామచంద్రమూర్తికి చూపి "ఈ సీత" అని చెప్పాడు. అలంకరించబడిన కల్యాణమంటపంలో, నలు వైపులా నిలువుటద్దాలు వేసి వుండడంతో, అన్నిటిలోనూ సీత రూపమే కనిపించసాగింది. అద్దంలో సీతేదో-నిజమైన సీతేదో తెలుసుకోలేక నలుదిక్కులు చూస్తున్న రాముడి భ్రమపోయేట్లు, చేయి చూపి "ఈ సీత" అని చెప్పాడు జనకుడు.

"ఈ సీత" అంటే,అతి రూపవతైన సీతని, సౌందర్య-శౌకుమార్య-లావణ్యాదులలో స్త్రీలందరిని అతిశయించిందని అర్థంకూడా వస్తుంది. "ఈ సీత" అంటే, "ఈ యగు సీత" అనే అర్థం కూడా వుంది. రాముడెప్పుడైతే శివుడి విల్లు విరిచాడో, అప్పుడే అతడు శివుడికంటే గొప్పవాడైన విష్ణువని జనకుడు గ్రహించాడు. అలాంటి ఆమెకు సాక్షాత్తు లక్ష్మీదేవైన సీతను ఇస్తున్నాననే అర్థమొచ్చే విధంగా "ఈ సీత" అన్నాడు. రాముడెంత మహా సౌందర్య పురుషుడని పేరుందో, అంతకంటే తక్కువకాని సౌందర్యం ఆమె కుందని చెప్పదల్చుకున్నాడు జనకుడు. సీత అంటే కేవలం నాగటి చాలనే కాదని, నాగటి చాలు భూమిని ఛేదించుకొని రూపంకలదిగా ఎలా అవుతుందో, అలానే భూమిని ఛేదించుకొని రావడంవల్ల సీత అనే పేరు ఆమెకు ప్రఖ్యాతమయింది. దీనివల్ల ఆమె ఆభిజాత్యం తెలుస్తున్నది. సీత-నాగటి చాలు-అంటే కాపువాడి కృషి ఫలింపచేసి, వాడికి ఫలం కలిగించేది. అలానే రాముడు చేయబోయే కార్యాలన్నీ, సీత వలనే ఫలవంతమవుతాయనీ, ఆమె సహాయం లేకుండా రాముడి కృషి వ్యర్థమని, ప్రతిఫలాపేక్ష లేకుండా అతడికి సహాయపడుతుందని జనకుడి మనస్సులోని ఆలోచన.


ఆకాశ గంగానది శాఖైన సీత ఏవిధంగా ఒకసారి తనను సేవించినవారి పాపాలను ధ్వంసం చేస్తుందో, అలానే "ఈ సీత" తనకొక్కసారి నమస్కారం చేసిన వారి పాపాలను ధ్వంసంచేస్తుంది. కౌసల్యా సుతుడైన రాముడు యోనిజుడని, సీత అయోనిజని, కాబట్టి ఆభిజాత్యంలో రాముడికంటే తక్కువైందేమీ కాదని జనకుడి భావన. సీత నాగటి చాలులో దొరికినప్పటికీ జనకుడు సగర్వంగా, "నాదుకూతురు"-తన కూతురని చెప్పాడు. అలాంటి తనకూతురును, ఎలా ప్రేమించాలో అలానే ప్రేమించమని సూచించాడు. సీతంటే జన్మపరిశుద్ధి అనీ, "నాదుకూతురు" అంటే నానా సపరిశుద్ధి అనీ తెలుపబడింది. "నీ సహధర్మచరి" అనడమంటే, రాముడి విషయంలో ఎలా వుంటుందోనని ఆలోచించాల్సిన పనిలేదనే అర్థం స్ఫురిస్తుంది. రాముడేది ధర్మమని భావిస్తాడో, ఆ ధర్మంమందే ఆమె ఆయనకు తోడుగా వుండి ఆ కార్యాన్ని నిర్వహిస్తుంది. రాముడు తండ్రి వాక్యాన్ని ఎలా పాలించాడో, అలానే ఆయన వాక్యాన్ని సీత పాలిస్తుందని అర్థం. సీతే లక్ష్మీదేవి అయినందువల్ల, విష్ణువు అవతారమైన రాముడి కైంకర్యమే ఆమె స్వరూపం. సృష్టిలో, రక్షణలో, సంహారంలో ఆమె ఆయనకు సర్వకాల సర్వావస్థలందు తోడుగా వుంటుంది. వివాహ లీల కేవలం లోక విడంబనార్థమేనని, ఆయన సొత్తును ఆయనే తీసుకొమ్మని కూడా అర్థం).