Thursday, March 10, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-74 : అయోధ్యకు వెళుతున్న దశరథుడికి మార్గంలో అపశకునాలు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-74
అయోధ్యకు వెళుతున్న దశరథుడికి 
మార్గంలో అపశకునాలు
వనం జ్వాలా నరసింహారావు

            వివాహమైన మర్నాటి ఉదయం, నిద్రలేచిన అనంతరం, దశరథుడి సమ్మతితో, రాజకుమారులకు మంచిదీవెనలిచ్చి హిమాచలానికి వెళ్లిపోయాడు విశ్వామిత్రుడు. ఆయనలా వెళ్లగానే, అయోధ్యకు పోయేందుకు తమకు అనుమతినివ్వమని జనకుడిని కోరాడు దశరథుడు. కూతుళ్లంటే అమితమైన ప్రేమాతిశయం వున్న జనక మహారాజు, తన ముద్దుల కుమార్తెలకు ఒక్కొక్కరికి లక్ష గోవులు-మంచి మంచి రంగులతో అలంకరించిన కంబళ్లు-శుభ వస్త్రాలు-అలంకారయుతమైన దాసికలు-విశేషకాంతిగల రథాలు-ఏనుగులు-తీవ్ర వేగంతో పరిగెత్తగల గుర్రాలు-శూరులైన భటులు-మంచి శ్రేష్ఠమైన ఆణిముత్యాలు-బంగారు పగడాలు, అరణంగా ఆడబిడ్డలకిచ్చాడు. ఇలా బిడ్డలకు అరణం ఇచ్చింతర్వాత, దశరథ మహారాజుతో కలిసి, వారితో తాను కొంతదూరం ప్రయాణంచేసి-వారందరిని సాగనంపి, ఆయన అనుమతితో తన ఇంటికి తిరుగు ప్రయాణమై పోయాడు జనకుడు. వెళుతున్న రామచంద్రమూర్తి ఇంపైన-శ్రేష్ఠమైన సుకుమారత్వాన్ని, అందాన్ని, గొప్ప గాంభీర్య గుణాన్ని, శౌర్యాన్ని గమనించిన మిథిలా పుర స్త్రీలు ఒకరితో మరొకరు ఇలా చెప్పుకున్నారు: "అమ్మా, వీడా యుద్ధంలో తాటకను చంపిన విల్లుకాడు? వీడా విశ్వామిత్రుడి యాగాన్ని రక్షిస్తూ సుబాహుడిని చంపిన పౌరుషశాలి? వీడా అహల్యను శాప విముక్తురాలిని చేసి మరల స్త్రీగా చేసిన ఉపకారి, వీడా మన జనక రాజు దాచిపెట్టిన శివిడివిల్లు విరిచిన జగజ్జెట్టి, వీడా నిన్ననే మన సీతను పెళ్లిచేసుకొని కులుకుతున్న సుందరుడు. అమ్మా, మన రాజు జనకుడు ఎంత పుణ్యాత్ముడే? ఇంతటి వాడిని అల్లుడిగా సంపాదించాడు!" అని ముక్కుమీద వేలుంచుకుని ఆశ్చర్యపడ్డారు.

          "అమ్మా, రామచంద్రమూర్తిని తన కొడుకుగా కడుపారగాంచేటందుకు కౌసల్య ఏం నోమునోచిందోకదా? ఇతడిని భర్తగా పొందేందుకు మన సీత ఏ నిష్ఠలు సలిపిందోకదా? ఇతడు తన అల్లుడయేందుకు మనరాజు జనకుడు ఏ మంత్రం జపించాడోకదా? ఇతడు ప్రభువుగా తమను పాలించేందుకు అయోధ్యాపురవాసులు ఎన్ని తపస్సులు చేసారోకదా? నక్ష్తేత్ర తీర్థవాసఫలాన్ని అనుభవించి, ఇతడిని ప్రతిదినం దర్శనం చేసుకునేందుకు, అయోధ్య జనులు ఎటువంటి నియమాలు-వ్రతాలు జరిపారోకదా? సుందరీమణులారా, మన జీవితకాలంలో మరొక్కసారైనా ఈ అందగాడిని చూడగలమా? కమలాక్షులారా, మరొక్కమారైనా తామర పూలలాంటి కళ్లున్న ఇతడిని చూస్తామా? వెలదులారా, ఇంకొక్కసారి మనం ఈ కలువ కళ్ల అందగాడిని చూడగలమా? యువతులారా, స్త్రీల మనస్సులను ఆకర్షించే ఇతడిని ఒక్కసారైనా చూడగలమా? అక్కలారా, మనం ఏ జన్మలో-ఏ కొంచెం పుణ్యంచేసుకున్నామోగాని, దాని ఫలంగా నేడు ఇక్కడ కళ్లార శ్రీరామచంద్రమూర్తిని చూడగలిగాం" అని మాట్లాడుకోసాగారు పుర స్త్రీలు.


          దశరథుడు పయనమై, కొడుకులు, మునులు, ఇతరులు తనకు ఇరు పక్కల వస్తుంటే కొంతదూరం పోయాడు. అలా పోతున్న ఆయనకు ఎదురుగా, పరుష ధ్వనులతో ఆకాశంలో పక్షులు భయంకరంగా కూసాయి. అప్పుడే కొన్ని మృగాలు ప్రదక్షిణగా పరుగెత్తసాగాయి. ఇలా, ఆకాశంలో అపశకునాలు-భూమిమీద శుభశకునాలు కనబడడంతో, దశరథుడు అదేంటని వశిశ్ఠుడిని అడిగాడు. పక్షి కూతలవల్ల భయంకరమైన కీడు కలిగే అవకాశం వున్నప్పటికీ, అడవిమృగాలు ప్రదక్షిణగా పోతున్నందున, భయపడాల్సిన అవసరం లేదని వశిష్ఠుడు దశరథుడికి ధైర్యం చెప్పాడు. ఇంతలో, చూసేవారి గుండెలు ఝల్లుమనేలా గాలి సుళ్లుపెట్తూ వీరిని తాకింది. భూమి వణికి చెట్లు నేల కూలాయి. విస్తారంగా చీకట్లు సూర్యుడిని కమ్ముకున్నాయి. దిక్కులు తెలవకుండా, దుమ్ము విశేషంగా లేచి, దశరథుడి సైన్యాన్ని కప్పేసింది. ఇదంతా జరుగుతుంటే, ఏంచేయాల్నో తోచక ఎక్కడివారక్కడే నిలబడి పోయారు. ఆ సమయంలో-ఆ జన సమూహంలో, దశరథుడు-రాజకుమారులు-ఋషులు తప్ప మిగిలినవారిలో ఎవరు కూడ భయంతో తెలివితప్పనివారు లేరు. 

శ్రీరాముడిని చూసేందుకొచ్చిన పరశురాముడు


            భయంకరమైన ఆకారంతో-దిగులు పుట్టించే తేజంతో, రాజుల పాలిటి మృత్యువైన వాడు-ఇతరులెవరు జయించలేనివాడు - వెండి కొండను పోలినవాడు - కోపాతిశయంలో ప్రళయకాలాగ్ని లాంటివాడు -జనానికి కనీసం కన్నెత్తైనా చూడ సాధ్యపడనివాడు-కోదండం చేతిలో ధరించి వచ్చినవాడు-త్రిపుర హరుడితో సమానమైన వాడు-భృగువంశంలో పుట్టినవాడు-భుజంమీద ప్రకాశవంతమైన గండ్రగొడ్డలిని ధరించి తన కాంతితో ఇతరులకు భయం కలిగించేవాడు-తనను చూస్తున్నవారిని గుడ్డివారిగా చేయగలవాడైన జమదగ్ని కుమారుడు-పరశురాముడు, ఏనుగులా వేగంగా అడుగులు వేసుకుంటూ భూమిపై దద్దరిల్లే ధ్వనులు పుట్టించుకుంటూ అక్కడికొచ్చాడు. ఇలా వస్తున్న ఆయనను దూరంనుండే చూసిన మునులు, తన తండ్రిని చంపాడన్న కోపంతో రాజులందరినీ హతమార్చిన ఈ సాధుచరిత్రుడు ఎందుకొస్తున్నాడానని ఆలోచించ సాగారు. ఇంతలో, అక్కడకు చేరుకున్న పరశురాముడికి, ముని సమూహం అర్ఘ్యం ఇచ్చి పూజించిన తర్వాత, వారిని దాటిపోయి శ్రీరాముడితో సంభాషించాడు పరశురాముడు.

No comments:

Post a Comment