బాలకాండ
మందరమకరందం
సర్గ-68
దశరథుడిని
కలిసిన జనకుడి దూతలు
వనం
జ్వాలా నరసింహారావు
జనక మహారాజు పంపిన దూతలు, అతివేగంగా గుర్రాలను పరిగెత్తించి, త్వరగా ప్రయాణం ముగించుకొని, మూడు రాత్రిళ్లు దారిలో గడిపి, నాలుగోరోజు పగలు అయోధ్యకు చేరుకున్నారు. రాజద్వారం దగ్గర కాపలా వున్న
ద్వారపాలకులతో, తాము జనక మహారాజు
దూతలమని-ఆయన పనుపున వచ్చామని-ద్వారం వద్ద వేచి వున్నామని, దశరథ మహారాజుకు తెలియచేయమని కోరారు. రాజుకు తెలియచేసి వచ్చిన
ద్వారపాలకులు, జనకుడి దూతలొచ్చారని
చెప్పగానే, త్వరగా పిలుచుకొని రమ్మని
తమ రాజు చెప్పారనీ, ఆలస్యం చేయకుండా రమ్మనీ
అంటారు. వారు లోపటికిపోయి, ముదుసలి-దేవతలతో సమానుడైన
దశరథుడిని కలిసారు. రాజుకు నమస్కరించి, విన సొంపైన మృదువైన మాటలతో, మొదలు, తమ రాజు అడిగినట్టుగా
క్షేమ సమాచారాలు అడిగారు. జనక మహారాజు, పురోహితులతో-మంత్రులతో-అగ్నులతో కూడిన దశరథ మహారాజు క్షేమం గురించి
అడిగాడని చెప్పి, ఇంకొక వార్తకూడా వుందని, విశ్వామిత్రుడి ఆజ్ఞ పొంది తమ రాజిట్లా మనవి చేయమన్నాడని, ఆయన మాటలుగా ఇలా చెప్పారు.
"రాజేంద్రా, వినుము. నా కూతురు సీత, వీర్యశుల్కని నేను ప్రతిజ్ఞ చేసాను. ఆ చంద్రముఖిని వరించాలని ఎందరో
వచ్చి బీరములేనివారై-వ్యర్థాశులై పోయారు. విశ్వామిత్రుడి వెంట నీ కుమారులు, నా అదృష్టం కొద్దీ ఆకస్మికంగా వచ్చి, రాజులందరి సమక్షంలో-నిండు సభలో, అందరుచూస్తుండగా శివుడు ధనస్సును రామచంద్రమూర్తి రెండుగా విరిచాడు.
నా పుత్రికను గెలిచాడలా. కాబట్టి ఆ మహాబలశాలికి నా సీతనిచ్చి వివాహం చేసి, నా కూతురు వీర్యశుల్క అని నేను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకోదలిచాను.
నా కోరిక తీర్చుకొనేటట్లు ఆజ్ఞ ఇవ్వమని అడుగుతున్నాను. రాజేంద్రా మీరిక్కడకొచ్చి
మీ కొడుకులను-కోడళ్లను చూడొచ్చు. వివాహం చూసి సంతోషించవచ్చు. నా కోరికా
నెరవేరినట్లవుతుంది. కాబట్టి, మంత్రులతో-పురోహితులతో-హితులతో
వచ్చి పుత్రులను చూడండి". ఇలా తమ రాజు చెప్పినట్లు చెప్పి, రాజుల వద్ద ఇంతకంటే ఎక్కువగా మాట్లాడడం సమంజసం కాదని వూరుకున్నారు.
దశరథ మహారాజు వెంటనే
వామదేవ-వశిష్ఠాదులను,మంత్రులనుపిలిపించి
సంతోషం ఉప్పొంగి పోతుంటే, వారితో ఇలా అంటాడు. "విశ్వామిత్రుడిరక్షణలో
కౌసల్యా కుమారుడు - మన రామచంద్రమూర్తి, లక్ష్మణుడితో కలిసి జనకుడి రాజధానైన మిథిలా నగరంలో వున్నాడట. మన
శ్రీరామచంద్రుడి బల పరాక్రమం చూసి-మెచ్చిన జనకుడు, తనకూతురునిచ్చి వివాహం చేయనున్నాడట. జనకుడు తలపెట్టిన కార్యం మీకు
సమ్మతమైతే, ఆలస్యం చేయకుండా పయనమై
పోదాం" అనగా మంత్రులందరు ఇది తగిన కార్యమేనని, మంచి సంబంధమేనని అన్నారు. వారి మాటలకు దశరథుడు సంతోషించి, ఉదయమే ప్రయాణమై పోవాలి కనుక, సర్వం సిద్ధం చేయమని మంత్రులను ఆదేశించి, శుభవార్త మోసుకొచ్చిన జనకుడు దూతలకు బహుమానాలిచ్చాడు. వారుకూడా ఆ
రాత్రి అక్కడే బస చేసారు.
No comments:
Post a Comment